|

భరత్‌’భూషణం’

bharathవర్థమాన చిత్రకారులు ఆయనను కళాత్మకమైన ‘కన్ను’ ఉన్న ఫొటోగ్రాఫర్‌ అంటారు. ఫొటోగ్రాఫర్లేమో ఆయనను సృజనాత్మక చిత్రకారుడంటారు.

ఈ పద్ధతిచూస్తే వెనకటికి అడవి బాపిరాజును రచయితలు అపురూపమైన చిత్రకారుడనీ, చిత్రకారులు – గొప్ప రచయిత అని కీర్తించిన విషయం గుర్తుకు వస్తుంది.

ఏమైనా ఆయన వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా కళాత్మకమైన చూపున్న ఫొటోగ్రాఫర్‌, సృజనాత్మక చిత్రకారుడు కూడా అన్నది నూటికి నూరుపాళ్ళు రూఢి అవుతున్నది.

ఇంతకు ఆయన ఎవరోకాదు గుడిమెల్ల భరత్‌భూషణ్‌. నిజానికి రెండు కళలలో తనదైన ముద్రవేసిన భరత్‌భూషణం ‘సాధనమున పనులు ససకూరు ధరలోన’ అని మరోమారు రుజువు చేసి చూపాడు. ఇటీవల కాలంలో మందంగా రంగులను అద్దుతూ ‘ఇంపాస్టో’ పద్ధతిలో రూపొందిస్తున్న చిత్రాలు ఆయనను ఉత్తమశ్రేణి చిత్రకారుల జాబితాలోకి తీసుకువెళ్ళాయి. ఈ ‘ఇంపాస్టో’ తరహా చిత్రాలు స్పర్శకు అందుతాయి, కళ్ళను మైమరిపిస్తాయి.

వరంగల్‌లో అనసూయ-లక్ష్మీనారాయణ దంపతులకు 1956లో జన్మించిన భరత్‌భూషణ్‌ చిన్నప్పటినుంచీ ఆయన అన్నదమ్ములకన్నా భిన్నమైనవాడు. నెలలు నిండకుండా పుట్టినందున ఎప్పుడూ ఏదో అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు. తండ్రికి డాక్టర్‌ను చేయాలని ఉంటే, కాదని చిత్రకళ-ఫొటోగ్రఫీ పట్ల భరత్‌భూషణ్‌ ఆసక్తి పెంచుకున్నాడు. ఏడో తరగతిలోనే చిత్రాలు గీయడం ప్రారంభించాడు. ఆధునిక భావాలతో చిత్రాలు గీసి ఇంటర్మీడియట్‌లో ఉండగానే తొలి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు.

అనంతరకాలంలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన భరత్‌ భూషణ్‌ ఫొటోగ్రఫీపట్ల ఆకర్షితుడై జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన లలితకళల కళాశాలలో ఫొటోగ్రఫీ డిప్లొమా పూర్తి చేశాడు, స్వర్ణపతకం సాధించాడు. ఒకవంక ఫొటోగ్రఫీ కోర్సు చదువుతూ పలు ప్రతీకాత్మక చిత్రాలు వేసి వ్యష్టి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు.

ఫొటోగ్రఫీ కోర్సు పూర్తవ్వగానే ఇక ఆగకుండా స్థానిక పత్రికలలో ఫొటో జర్నలిస్టుగా చేరి వృత్తి జీవితం ప్రారంభించాడు. తన ప్రత్యేకతను వ్యక్తం చేసే ఛాయాచిత్రాలు తీసి, తీసిన చిత్రాలను కళాత్మకంగా కంపోజ్‌చేసి చక్కని అభిరుచిని, కళాత్మక దృష్టిని, నిబద్దతను ప్రస్ఫుటం చేశాడు.

సహజంగా సంపన్నుడైన భరత్‌భూషణ్‌ తండ్రికి కుమారుడి వృత్తి జీవితంపట్ల అయిష్టత కొనసాగుతుండగా, తాను ప్రేమించిన అమ్మాయిని వర్ణాంతర వివాహం చేసుకుని కుటుంబపరంగానూ పూర్తిగా దూరమయ్యాడు. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు అక్కరలేదని తాను నమ్మిన జీవితం వ్యామోహంలోపడి ఆర్థికంగా అనేక ఒడిదుడుకులకు లోనయ్యాడు.

అయినా కూడా వృత్తి జీవితంలో ప్రెస్‌ ఫొటోగ్రాఫర్‌గానూ, సంస్కృతిపట్ల జీవనశైలిపట్ల నిబద్ధతతో తీసిన భరత్‌భూషణ్‌ మార్క్‌ ఫొటోలు ఈనాటికీ కళాభిమానుల కళ్ళల్లో పదిలంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో శిఖరప్రాయులైన కాళోజీ, శ్రీశ్రీ, గద్దర్‌, నార్లలాంటి ఎందరో ప్రముఖుల ప్రచారంలో ఉన్న ఫొటోలు ఆయన తీసినవే. అట్లాగే మన సాంస్కృతిక పెన్నిధులైన చిందు ఎల్లమ్మ, సరిదె మాణిక్యమ్మవంటివారి ఫొటోలు, స్థానిక బంజారాలు, మన ఆడబిడ్డలు శీర్షికన తీసిన ఫొటోలు, బతుకమ్మ, సమ్మక్క-సారలమ్మ జాతర ఫొటోలు ఛాయాచిత్రకారుడుగా భరత్‌భూషణ్‌ పరిణతకు పట్టిన అద్దాలు.

తెలంగాణ మట్టిలో పుట్టి ఈనాటికీ కులవృత్తులపైనే ఆధారపడి ఉన్న గీత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి ఇత్యాది వృత్తి కళాకారులందరి జీవనశైలిని ఆవిష్కరిస్తూ అందులోని కళాత్మకతను ద్యోతకంచేస్తూ తీసిన ఫొటోలు ఆయన అభిరుచికి, సాంఘిక కోణానికి ఆనవాళ్ళు.

తెలంగాణ ప్రాంతంలోని పల్లెపట్టులలో నానాటికి జీర్ణమైపోతున్న ఎన్నెన్నో ద్వారబంధాల రంగురంగుల ఛాయాచిత్రాలు తీసి ముందుతరాల వారికోసం ఆయన డాక్యుమెంట్‌ చేశాడు.

కొంతకాలం భరత్‌భూషణ్‌ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖులైన అరవిందన్‌, రవీంద్రన్‌వంటి దర్శకులకు సహాయకుడుగా, ‘హరిజన్‌’, ‘కాంచనసీత’, ‘రంగులకల’ వంటి అవార్డు చిత్రాల స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గానూ పనిచేసి తన సత్తా చూపాడు.

ఇలా ఆయన, నడివయస్సు దాటగానే దాదాపు దశాబ్దం క్రితం కన్నుకుట్టిన క్యాన్సర్‌ దాడిచేసి, ఆయనను శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీసింది. బయటికి వెళ్ళి ఫొటోగ్రఫీ చేయలేని స్థితిలో బతకడానికి బాల్యంలో తాను కలలుకన్న చిత్రకళా జీవితాన్ని పున:ప్రారంభించాడు. కనీసం పదేండ్ల కాలంలో ఉత్తమశ్రేణి చిత్రకారుడు కావాలని మళ్ళీ డ్రాయింగ్‌లతో సాధన ప్రారంభించాడు. ఇంట్లో కూర్చుని స్వయం కృషితో తనకంటూ ఒకానొక బాణీని రూపొందించుకుని ఇవ్వాళ్ళ అపురూపమైన చిత్రకారుడుగా ఒదిగిపోయాడు, ఎదిగిపోయాడు.

కేవలం ఎనిమిదేండ్ల స్వల్ప కాలంలో చిత్రకారుడుగా గుర్తింపు పొందాలంటే తన ప్రతిభావ్యుత్పత్తులను ప్రదర్శించడమేకాదు ఎంతో సాధన, శోధనతోపాటు కళాహృదయముంటే కాని సాధ్యంకాదు.

ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని బతకాలని ప్రారంభించిన చిత్రకళాసాధన భరత్‌భూషణ్‌ను చిత్రకళారంగంలో కలకాలం బతికేలాగా రూపొందించింది. నీలం రంగును ఇష్టపడే భరత్‌భూషణ్‌ ‘బ్లూ స్టూడియో’లో ఉద్భవించిన ఈ చిత్రాల శ్రేణి పరిలోకిస్తే ఫ్రెంచి చిత్రకారుడు మోడిగిలాని కృషి మదిలో మెదులుతుంది. మోడిగిలానికి పుట్టుకతో క్షయ ఉండేదట. అయినా ఆయన నిరంతరం చిత్రాలువేసి, చిత్రకళా ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

అట్లాగే ఒకవంక ‘క్యాన్సర్‌’తో మరోవంక ఆర్థికపరంగానూ అనేక ఇబ్బందులు పడుతూ భరత్‌భూషణ్‌ తనచుట్టూ ఉన్న ప్రపంచానికి కళామర్మాన్ని జోడించి క్యాన్వాస్‌పైకి ఎక్కించాడు.

ఫొటోలాగా కాకుండా, వాస్తవరూపంలాగా కాకుండా చిత్రకారుడి దృష్టినుంచి గీయాలనే భరత్‌భూషణ్‌ తొలిరోజులలో రకరకాలుగా గణేషుని చిత్రాలు, వివిధ తరహాల ఆంజనేయుని చిత్రాలు వేశాడు. గ్రామదేవతల చిత్రాలు, పక్షుల చిత్రాలు, పెంపుడు జంతువుల చిత్రాలు రూపొందించాడు. జానపదులైన స్త్రీ-పురుష చిత్రాలు గీయడంలో ఎంతో కౌశల్యాన్ని ప్రదర్శించాడు.

ఇటీవల ఎనిమిది తొమ్మిది మాసాలనుంచి కలం లేకుండా, కుంచె లేకుండా ‘ఇంపాస్టో’ పద్ధతిన వందకుపైగా మూర్తి చిత్రణలు చేశాడు. ఇందులో ఎక్కువగా వైవిధ్యానికి మారుపేరైన భారతదేశం నలుమూలలకు చెందిన మహిళల కట్టుబొట్టును ప్రతిబింబించే చిత్రాలదే ఎక్కువ సంఖ్య. ఈ పద్ధతిలో దేశంలోని వివిధ రాష్ట్రాలలోని స్త్రీలు, అందులోనూ వివిధ మతాలకు, వర్గాలకు చెందిన మహిళల ముఖచిత్రాలువేశాడు. జానపద బాణీ తీసుకున్నా వాటిలో భరత్‌భూషణ్‌ అదృశ్యహస్తం కన్పిస్తుంది. ఈ శ్రేణిలో కేవలం ఆడపిల్లల చిత్రాలేకాకుండా, పలు సందర్భాలలో, రకరకాల భంగిమల్లో ‘పిల్లుల’ చిత్రాలు చూడచక్కగా వేశాడు.

నిజంగానే అలనాటి మహానటుడు భరత్‌భూషణ్‌ అభిమాని అయిన మన చిత్రకారుడు భరత్‌భూషణ్‌ తండ్రి లక్ష్మీనారాయణ, తన కుమారునికి ముద్దుగా భరత్‌’భూషణం’ అని నామకరణం చేసుకున్నాడు. ఆ పేరును సార్థకం చేస్తూ కళాలోకంలో ఇవ్వాళ్ళ ఆయన ‘భరత్‌భూషణం’ అయ్యాడు.

టి. ఉడయవర్లు