బయోగ్యాస్‌ – సిఎన్‌జి భారీ ప్రయోజనం

– By యం.రామాచారి

ఓ వైపు బయోగ్యాస్‌.. మరో వైపు సేంద్రియ ఎరువుల తయారీ
తడి చెత్త నిర్వహణలో జీరో ల్యాండ్‌ ఫిల్‌ పట్టణంగా సిద్ధిపేట మున్సిపాలిటీ ఆవిర్భావం
పర్యావరణ హితం.. తడి వ్యర్థాలతో సంపద సృష్టించి ఆర్థిక ప్రయోజన సత్ఫలితాలతో దేశానికే సిద్ధిపేట ఆదర్శం

చెత్తే కదా అని తేలిగ్గా తీసి పారేయలేదు. చెత్తను పునర్వినియోగం చేయొచ్చని నిరూపించింది. టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను పర్యావరణ హితం కోసం ఉపయోగించేలా వినూత్న మార్గాన్ని ఎంచుకున్నది. ఇప్పటికే స్వచ్ఛతలో రాష్ట్రానికే శుద్ధిపేటగా దిశానిర్దేశం చేసిన సిద్ధిపేట మున్సిపాలిటీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి సత్ఫలితాలను అందిస్తున్నది. గత కొన్ని నెలలుగా తడిచెత్తతో ఓ వైపు బయోగ్యాస్‌ భారీ ప్రయోజనం పొందుతూనే, మరో వైపు సేంద్రీయ జీవ ఎరువులు తయారీ చేస్తూ ఓ విప్లవాత్మకమైన మార్పు సాధిస్తున్న వైనం పై స్పెషల్‌ స్టోరీ.. 

వేగంగా జరుగుతున్న అభివృద్ధి, పట్టణీకరణ మారుతున్న ప్రజల అలవాట్లతో పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ క్లిష్టతరం అవుతున్నది. గతం కంటే ఏన్నో ఎక్కువ రెట్ల పరిమాణంలో వెలువడుతున్న వ్యర్థాలు పట్టణాలను పరిశుభ్రంగా నిలపడంలో పట్టణ స్థానిక సంస్థలకు పెద్ద సవాలుగా మారుతున్నది. ఇదే క్రమంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేట పట్టణంలో కూడా పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణ సంక్లిష్టమైన సవాలుగా పరిణమించింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థల నుంచి తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణ వ్యవస్థ చాలా పటిష్టంగా పని చేస్తున్న అతి కొద్ది పట్టణాల్లో సిద్ధిపేట అగ్రస్థానంలో ఉంటుంది అని సగర్వంగా చెప్పవచ్చు. 

పట్టణంలో ప్రతి నిత్యం 54 టన్నులు వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ దరిమిలా గత కొన్నేళ్లుగా సిద్దిపేట మున్సిపాలిటీ ఐటీసీ సంస్థ వారి సౌజన్యంతో పొడి వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేస్తున్నది. ఇదే తరహాలో సిద్ధిపేట మున్సిపాలిటీ చెత్త సేకరణలో వేస్ట్‌ టూ వెల్త్‌ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నది. తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నది. అయితే ఈ సేకరించిన తడి చెత్త వృథా కాకుండా ఇటు బయో సీఎన్జీ గ్యాస్‌, అటు సేంద్రియ జీవ ఎరువు తయారు చేసే కీలకమైన ఘట్టానికి రూపకల్పన చేసింది. బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డులో చెత్తగుట్ట సమస్య తగ్గి పర్యావరణ పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతున్నది. 

తడి వ్యర్థాల నిర్వహణకై పట్టణంలోని తడిచెత్త నుంచి బయో సీఎన్జీ ఇంధన తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసిన సిద్ధిపేట మున్సిపాలిటీ వివిధ పరీక్ష దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. రోజుకు 10 నుంచి 15 టన్నుల తడి వ్యర్థాలు, బయో సీఎన్జీ గ్యాస్‌ తయారీకి ఉపయోగం అవుతున్నాయి. అలాగే మరో 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలు సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 15వ తేది మార్చి 2022 నుంచి రోజుకు 200 కిలోల బయో సీఎన్జీ గ్యాస్‌ ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నది. 

ఇక జూలై  నెల 15 వ తారీఖు వరకూ 2522 మెట్రిక్‌ టన్నుల తడి చెత్త ద్వారా 7056 క్యూబిక్‌ మీటర్ల బయో-సీఎన్జీ ఇంధన ఉత్పత్తి చేయబడింది. అలాగే 579 టన్నుల తడిచెత్త జీవ ఎరువు తయారీకై వినియోగించబడుతుంది.

ఉత్పత్తి అయిన బయో సీఎన్జీ గ్యాస్‌ సిద్ధిపేట పట్టణంలోని అక్షయ, హరిత టూరిజం హోటల్‌, ప్రముఖ హోటళ్ళు రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. జీవ ఎరువును పట్టణ చుట్టుపక్కల ప్రాంత రైతులకు సరసమైన ధరలకు విక్రయి స్తున్నారు. బయో సీఎన్జీ గ్యాస్‌ తయారీ, ఎరువుల తయారీతో సిద్ధిపేట మున్సిపాలిటీ తడి చెత్త నిర్వహణలో జీరో ల్యాండ్‌ ఫిల్‌ పట్టణంగా ఆవిర్భవించిందని చెప్పవచ్చు. పర్యావరణహిత పట్టణ దిశగా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సిద్ధిపేట మున్సి పాలిటీ వినియోగించుకుంటున్నది. పట్టణంలోని పలు వార్డుల్లో తడిచెత్తతో ఇప్పటికే సేంద్రీయ ఎరువులను తయారు చేస్తూ కేవలం 5 నుంచి 10 శాతం చెత్తకే పరిమితమవుతున్నది. మిగతా చెత్తను డంపుయార్డుకే తరలిస్తున్నది. ఇక ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లు కలగలిపిన హానికర చెత్త, పొడి చెత్తను విద్యుత్‌ తయారీ, ఇటుకల తయారీకి వినియోగిస్తున్నది.

నిత్యం 30 టన్నుల తడిచెత్త సేకరణ

పట్టణంలోని 40 వేల కుటుంబాల నుంచి నిత్యం 30 టన్నుల వరకూ తడిచెత్త సేకరిస్తున్నారు. దీనిని క్రషింగ్‌ చేసి పైపుద్వారా ఫ్రీ డైజెష్టర్‌ అనే ట్యాంకులోకి పంపిస్తారు. మూడు రోజులు నిల్వ ఉంచి ద్రావణంగా మారుస్తారు. అక్కడి నుంచి మరో ట్యాంకులోకి ఈ ద్రావణాన్ని సరఫరా చేసి ప్రత్యేక సూక్ష్మజీవ మిశ్రమాన్ని  కలుపుతారు. ఈ సమయంలో విడుదలయ్యే మిథేన్‌ గ్యాస్‌ నుంచి సీఎన్జీ గ్యాస్‌ ను వేరు చేసి సిలిండర్లలో నింపుతారు.

తడిచెత్త పూర్తిస్థాయిలో వినియోగించడమే లక్ష్యం.

తడిచెత్తను పూర్తిస్థాయిలో విని యోగించడమే లక్ష్యంగా మున్సి పాలిటీ ఉన్నది. సేకరించిన తడి చెత్తతో బయో సీఎన్జీ గ్యాస్‌ తయా రు చేసే ప్లాంట్‌ సిద్ధిపేట పట్టణ శివారు బుస్సాపూర్‌ డంపు యార్డులో ఏర్పాటు కావడం మంత్రి హరీశ్‌ రావు చొరవే. తొలి స్వచ్ఛ బడిని సిద్ధిపేటలో ఏర్పాటు చేసి విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పర్యావరణ పరిరక్షణకై తడిచెత్తతో బయోగ్యాస్‌ తయారీ యూనిట్‌ ప్రారంభమై సత్ఫలితాలు పొందుతున్నది. లక్ష పై చిలుకు జనాభా కలిగిన పట్టణాలలో దేశంలోనే వేస్ట్‌ ల్యాండ్‌ ఫిల్‌ నుంచి బయో సీఎన్జీ గ్యాస్‌ ఉత్పత్తి చేసే కేంద్రంగా సిద్ధిపేట మున్సిపాలిటీ నిలవడం గర్వకారణంగా చెప్పవచ్చు. 

– సిద్ధిపేట మున్సిపాలిటీ కమిషనర్‌ రవీందర్‌ రెడ్డి

ప్రతీ అడుగులో ప్రజల భాగస్వామ్యం

ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త నిరుపయోగం కావొద్దు అనేది నా ఆలోచన.

స్వచ్చత, పచ్చదనం, పారిశుద్ధ్యంలో సిద్ధిపేట పట్టణం రోల్‌ మోడల్‌. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయిలో 21 అవార్డులను గెల్చుకున్న పట్టణం మున్సిపల్‌ కౌన్సిల్‌ కృషి, ప్రజల భాగ స్వామ్యంతో ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేకంగా వేర్వేరుగా తడిచెత్తను ఇస్తూ అనూహ్య స్థాయిలో సహకరిస్తున్న ప్రజల ఆలోచనకు ప్రతిరూపంగా ఈ బయో సీఎన్జీ గ్యాస్‌ ప్లాంట్‌ ప్రత్యేకతను సంతరించుకుంది. సిద్ధిపేట ప్రజల భాగస్వా మ్యం వల్లే ఈ సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రతీ అవార్డు వెనుక ప్రజల చైతన్యం ఉంది. స్వచ్చత, పారిశుద్ధ్యం గురించి మున్సిపాలిటీ ఇచ్చే సూచనలు తూ.చా.తప్పకుండా ప్రజలు పాటించడమే ఇందుకు కారణం. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త నిరుపయోగం కావొద్దు అనేది నా ఆలోచన. ఇందుకు అనుగుణంగా తడి చెత్త వృథాగా కాకుండా ఓ వైపు బయో సీఎన్జీ గ్యాస్‌, మరో వైపు సేంద్రీయ ఎరువులు తయారీ చేయడం సంతోషం.

– రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు