హైదరాబాద్‌ వేదికగా బయో ఆసియా సదస్సు

హైదరాబాద్‌ నగరంలో ఫిబ్రవరి నెలలో జీవశాస్త్రాలు, ఔషధ, బయోటెక్‌ రంగాలకు సంబంధించి ‘బయో ఆసియా’ సదస్సును నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సారి సదస్సును దృశ్యమా ధ్యమంలో నిర్వహిస్తున్నారు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సులకు గత 17 సంవత్సరాలుగా హైదరాబాద్‌ నగరం వేదికగా ఉండి సదస్సు నిర్వహించడం తెలంగాణకు గర్వకారణంగా మారింది. 93 దేశాల నుంచి ఏటా 20వేల మంది ఈ సదస్సుకు హాజరవుతుంటారు. 

జీవశాస్త్ర రంగంలోని సవాళ్ళకు పరిష్కారంతో పాటు అవకాశాల కల్పనకు ఇది ప్రపంచస్థాయి వేదికగా గుర్తింపు పొందింది. ఫిబ్రవరి 22, 23 తేదీలలో నిర్వహించే ఈ సదస్సులో కోవిడ్‌ కారణంగా వైరస్‌కు సంబంధించిన విషయాలు చర్చకు రానుండడంతో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. వైరస్‌ను ఎదుర్కోవడం, శాశ్వత పరిష్కారాలు, కోవిడ్‌ మహమ్మారి కారణంగా వచ్చిన సమస్యలు, ఆరోగ్య సంక్షోభ నివారణ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. ఈ సదస్సులో నోబెల్‌ పురస్కార గ్రహీతలు, శాస్త్రవేత్తలతో పాటు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇందులో 30వేల మంది వరకు పాల్గొంటారు. 

ఈ సందర్భంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సదస్సుకు సంబంధించిన నినాదం, వెబ్‌సైట్‌ను విడుదల చేశారు. ‘మూవ్‌ ది నీడిల్‌’ ను నినాదం (థీమ్‌) గా ఎంపిక చేశారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభంపై పోరుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. కరోనా తరువాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయని, అన్ని రంగాలపై అది ప్రభావం చూపిందని అన్నారు. వ్యాధి నివారణకు టీకాలు అందుబాటులోకి రావడం, అందులో తెలంగాణ కీలకపాత్ర పోషించడం విశేషం అన్నారు. 

పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జీవశాస్త్రాల సలహా కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఆసియా బయోటెక్‌ సంఘాల సమాఖ్య భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీవశాస్త్రాల సంచాలకులు, సీఈవో శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.