లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

By: ఎం.డి.యాకూబ్‌ పాషా, ఖమ్మం

ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్‌ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల  పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.

దాదాపు 162 ఎకరాల విస్తీర్ణం కలిగి ఈ చెరువు  2014 సంవత్సరం కంటే ముందు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అనంతరం ఖమ్మం శాసనసభ్యులు,  రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌  ప్రత్యేక శ్రద్ధతో 2015 సంవత్సరంలో మిషన్‌ కాకతీయ మొదటి దశ కింద ముఖ్యమంత్రి హామీ నిధులు, నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులు సుమారు 24 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.  దశల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా 65 ఎకరాల విస్తీర్ణాన్ని ట్యాంక్‌ బండ్‌ గా, సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో వాటర్‌ బాడీగా అభివృద్ధి చేశారు.

ఖమ్మం నగర ప్రజలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు చిన్నారుల ఆహ్లాదం, వినోదానికై 8 లక్షల రూపాయలతో ఓపెన్‌ జిమ్‌, పిల్లల ఆటవిడుపు పరికరాలను ఏర్పాటు చేశారు. మరో 8 లక్షల ఖర్చుతో స్కై సైకిలింగును అందుబాటులోకి తెచ్చారు. సాయంకాల సమయంలో లకారం ట్యాంక్‌ బండ్‌ కు వచ్చే ప్రజలు, చిన్నారులకు కనువిందుగొలిపే విధంగా 2 కోట్ల రూపాయల వ్యయంతో మ్యూజికల్‌ ఫౌంటేన్‌ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల  లకారం ట్యాంక్‌ బండ్‌ రాత్రి వేళల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా తయారయింది.

దీనితో పాటు సంక్రాంతి, దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు స్కేటింగ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నగర ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల పర్యాటకులు ఈ లకారం ట్యాంక్‌ బండ్‌ ను సందర్శిస్తున్నారు. సుమారు 40 లక్షలతో 25 మంది పరిమితి గల పెద్ద బోటు, 5 గురు పరిమితి గల చిన్న బోటు సౌకర్యాన్ని ఇక్కడ ప్రజలకు అందుబాటులోఉంచారు. ప్రతిరోజు సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు బోటింగ్‌ సదుపాయం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ట్యాంక్‌ బండ్‌ కు వచ్చే సందర్శకులకు రుచికరమైన వివిధ రకాల ఆహార పదార్థాలను, శీతల పానీయాలను, చిన్నారులకు ఆట వస్తువులను అందించేందుకు గాను రూ. 9 లక్షలతో చూపరులకు కనువిందు చేసే విధంగా ఆకర్షణీయమైన ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. రూ. 8 కోట్లతో చేపట్టిన సస్పెన్షన్‌ బ్రిడ్జి త్వరలోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది.  

లకారం ట్యాంక్‌ బండ్‌ను అనుసంధానం చేస్తూ కేవలం వాకర్స్‌ కొరకు మినీ లకారం ట్యాంక్‌ బండ్‌ వాకర్స్‌ ప్యారడైజు అమృత్‌ పథకం కింద రూ.  1.50 కోట్లతో ఆధునీకరించారు. ఈ వాకర్‌ ప్యారడైజ్‌ లో కేవలం వాకర్స్‌ కొరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాలు కేటాయించి నెల , త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక చందా దారులుగా చేర్చి నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ సదుపాయాలను కల్పించారు.

 1946 ఫిబ్రవరి 5న జాతిపిత మహాత్మాగాంధీ ఖమ్మంలో గడిపిన మధురస్మృతులను నేటి, భావితరాలకు తెలిసే విధంగా లకారం ట్యాంక్‌ బండ్‌ పై ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీజీ ప్రతిమ  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 7 సంవత్సరాల క్రితం కళావిహీనంగా ఉన్న లకారం చెరువు నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌ కుమార్‌  ప్రత్యేక చొరవ, జిల్లా కలెక్టర్‌ నిరంతర పర్యవేక్షణ ద్వారా ఖమ్మం నగరానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా  ప్రత్యేకతను సంతరించుకున్నది.