బోధన్‌ మహానగరం

డా॥ సంగనభట్ల నరసయ్య

ఉత్తర తెలంగాణలో గోదావరినది పరీవాహక ప్రాంతం మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర గలది. యావదాంధ్రదేశమేకాదు, యావద్భారతంలో అతి ప్రాచీన ప్రాంతం. నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రాంతాలు, బౌద్ధం కాలానికి ముందునుండే అనగా క్రీ.పూ. 6వ శతాబ్దానికి ముందే నాగరికతతో విలసిల్లిన ప్రాంతాలు.

ఈ ప్రాంతాలు అశ్మక దేశం అని పిలువబడిన ప్రాంతాలు. చరిత్రలో ఉత్తర భారతంలోని మగధ, కోశాంబి, పాటలీపుత్రం, వారణాసి, హస్తినాపురి వంటి ప్రాచీన నగరాలకు ముందునుండే ఉన్న ప్రాంతాలు. ప్రాచీన తెలంగాణ మహానగరమైన బోధన్‌ వీటితోపాటు సమంగా అధ్యయనం చేయవలసిన చారిత్రక స్థలం.
ఈ నగరం 3వేల సంవత్సరాల నుండి ఉండడమే కాదు, అనేక నామాలు సంతరించుకోవడం చారిత్రక స్వాభావికాంశం. కృతయుగంలో వసుమతి పురమని, త్రేతాయుగంలో పద్మనగరమని, ద్వాపరంలో ఏకచక్ర పురమని, కలియుగంలో బహుధాన్య పురమని పేర్లు కల్గి ఉంది. జైన సాహిత్యంలో పోదనమని, భారతంలో పౌదన్యమని మహిషాసురకాలంలో పోతన అని పేరుకల్గి ఉండేది. భవభూతి (7వ శ.), పంప మహాకవి (10వ శ.) తాము పద్మపురి నివాసులమని ఈ నగరవాసులుగా తమను పేర్కొన్నారు.

అశ్మకుడనే రాజు ఈ నగర నిర్మాణం చేసినట్టు మహాభారతం చెప్పింది. ఈ రాజు పాండవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. పాణిని అష్టాధ్యాయిలో అశ్మక రాజ్యం గూర్చి, సప్త గోదావరీ తీరంగూర్చి ప్రస్తావన ఉండటంవల్ల నాటికీ ప్రాంతాలు ఉత్తర భారతాన ఉన్నవారికి బాగా ప్రసిద్ధాలుగా చెప్పవచ్చు. నేటి ఉత్తర తెలంగాణలోని ప్రాచీన మహానగరాల్లో అతి ప్రాచీన నగరం నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ నగరం. ఈ నగర రాజు సుజాతుడు బుద్ధుని సమకాలికుడైన మహా కాత్యాయనుని నుండి బౌద్దం స్వీకరించాడు. ఈ నగరానికి లభిస్తున్న చారిత్రకాధారాలనుబట్టి 3వేల సంవత్సరాల కిందటి నగరం ఇది.

‘‘అంగుత్థ నికాయ’’ బౌద్ధ గ్రంథం పేర్కొన్న నాటి భారతదేశ షోడశ మహాజన పదాల్లో అశ్మకం ఒకటి. ఇది బౌద్ధ గ్రంథాల్లో అస్సకగా పేర్కొనబడిరది. ఈ మహాజన పదాలు క్రీ.పూ. 1300 నుండి క్రీ.పూ. 600 వరకు ప్రసిద్ధి చెందినవి. మొత్తం భారతదేశంలో చిన్న చితక రాజ్యాలెన్ని ఉన్నా ఒక మహానగర నిర్మాణం జరిగి, దాని రాజధానిగా ఒక సువిశాల మహాసామ్రాజ్యం – ‘‘మహాజనపదాల’’ పేరుతో భారతదేశం అంతా ప్రసిద్ధమై, నాటి సమస్త భారతీయులకు పరిచయమైన సాహిత్యంలోకి ఎక్కినాయి. వాటిలో ఒకటి ఈ అశ్మకరాజ్యం. ఈ అశ్మక ప్రభువులు శాతవాహనులకు పూర్వమున్న ఆంధ్రులైన రాజవంశీకులు – ‘ఆంధ్రరాజులు’. వీరి రాజధాని అశ్మకానికి దగ్గరలో కోటి లింగాల రాజ్యం. వీరిని గెలిచి, వీరికి సామంతులుగా ఉండి, ‘‘ఆంధ్రభృత్యుల’’మని కంఠోక్తిగా చెప్పుకొన్న తరువాతి రాజవంశం శాతవాహనులది. వీరి తొలిరోజులు కోటిలింగాల రాజధానిగా ఏలినారు. ఈ మూడు ఆంధ్ర రాజవంశాలలో అశ్మకం తొలినాళ్లది. వారి రాజధాని బోధన్‌ నగరం. నాటి చారిత్రకాధారాలు, వివిధ గ్రంథాలనుబట్టి అశ్మక రాజ్యం నేటి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతోబాటు నాందేడ్‌, పర్బణి జిల్లాల ప్రాంతం, చుల్లవగ్గ జాతక కథ ప్రకారం కళింగదేశానికి సరిహద్దు దేశం.

అశ్మక రాజ్యానికి గోదావరి నది పరీవాహక ప్రాంతంతో ఆంధ్ర రాజ్యంతో సంబంధం ఉంది. కాని రాజధాని నదీతీరంలో లేకపోవడం విశేషం. బోధన్‌ నదీతీర పట్టణం కాదు. కాని అశ్మకులు గోదావరి తీరవాసులని బౌద్ధ గ్రంథాలు పేర్కొన్నాయి. క్రీ. పూ. 6వ శ. నాటి అశ్మక రాజ్యపు పౌరుడు బావరి అనే బ్రాహ్మణుని వివరాలు మనకు తెలిశాయి. ఇది కరీంనగర్‌ జిల్లాలోని బాదనకుర్తి ద్వీపం.

ఈ నగరాన్ని ఏలిన రాజులలో మనకు క్రీ.పూ. 1000 సంవత్సరాలనాటి రాజు పేరు తెలిసింది. అతడు ఋషభదత్తుడు. అతని రెండవ కుమారుడు బాహుబలి. వీరిద్దరు జైన మతం స్థాపించి, ప్రచారం చేసిన తొలి, మలి తీర్థంకరులు. ఈ రకంగా తెలుగువారి తొలి చారిత్రక నగరం బోధన్‌ జైనానికి భారతదేశంలో మూలస్తంభం అయింది. అంతేకాదు ఈ నగరం క్రీ.పూ. 10వ శతాబ్దినాటికి కూడా జైనాన్ని ఆదరిం చింది. అంటే సుమారు రెండువేల సంవత్సరాలు ఈ నగరం జైన మతానికి కేంద్రంగా భాసించింది. క్రీ.శ.10వ శ. నాటి పంపమహాకవి జైనుడై, శుభనంది పేరుతో సమాధి అయిన పూర్వప్రాంతం.

వివిధ కాలాలకు చెందిన అనేకులగు రాజులపేర్లు ఈ నగరాన్నేలినట్టు తెలుస్తున్నాయి

  • అశ్మకుడు క్రీ.పూ. 1200 (మహాభారత కాలం)
  • ఋషభ దత్తుడు క్రీ.పూ. 1000 (జైన వాఙ్మయం)
  • బాహుబలి క్రీ.పూ. 1000 (జైన వాఙ్మయం )
  • సుజాతుడు క్రీ.పూ. 7వ శ. (అంగుత్థనికాయ)
  • బ్రహ్మదత్తుడు క్రీ.పూ. 6వ శ. (బృహన్నారదీయం)
  • నరసింహుడు క్రీ.శ. 8వ శ. (పశ్చిమ చాళుక్యులు)
  • ఇమ్మడి అరికేసరి క్రీ.శ. 9వ శ. (పశ్చిమ చాళుక్యులు)

అశ్మకం అనే ఈ దేశం రాళ్లదేశం అని అర్థం. అశ్మకం అంటే రాయి. ఈ నేల అంతా శ్రేష్టమైన ఇనుప ఖనిజపురాయి. దీనిని కొలిమిలో వేసి, ఇతర మిశ్రమాలతో కల్పి ఉక్కు తయారు చేసే ఈ పరిశ్రమ నేటి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నాడు క్రీ.పూ. 1వ శ. నాటి నుండి చాలా ప్రసిద్ధం. నాటి ఈ మహాజనపదాల ఆర్థికపుష్టికి కారణం అయింది.

మహాభారతం ఆదిపర్వం ప్రకారం ఇక్ష్వాక వంశపు కల్మాషపాదుని కుమారుడు అశ్మకుడు ఈ రాజ్య స్థాపకుడు. అశ్మకరాజు కుమారుడు మూలకుడు. ఇతడు ములక రాజ్యాన్ని ఏలినాడు. ఇది నేటి కరీంనగర్‌ జిల్లా గోదావరి తీరం. ఈ తండ్రి కొడుకుల వివరాలు బృహన్నారదీయ పురాణంలో ఉన్నాయి. ములకనూరు, ములకల్ల, మూలశాల వంటి పేర్లతో నేటికీ కరీంనగర్‌ జిల్లా ప్రాంతాల్లో గ్రామ నామాలున్నాయి. వీరు క్రీ.శ. 7వ శ. నాటికి కృష్ణా ప్రాంతాలకు వలస వెళ్లినారు. అలాగే పైకి దక్షిణ మహారాష్ట్రకు వలస వెళ్లినారు. దీనికి కారణం బౌద్ధమతం.
మహిషాసురుడు ఏలిన నేల ఇది. దీన్ని మహిష్మతి రాజ్యం అనేవారు. మహిష్మతి గోదావరి నదీ ప్రాంతం. మహాభారతం కర్ణపర్వం ‘‘గోదావరి-మహిష్మతి నదుల మధ్యదేశం అశ్మకం’ అని పేర్కొంది. ఆ రాజు కారణంగా దక్షిణ మహారాష్ట్రలోని ఒక నదికి మహిష్మతి నదిగా పేరువచ్చింది. ఈ మహిషాసుర రాజు ఏలిన అశ్మకంలో రావణాసురుడు పుష్పకంలో తన లంకా నగరానికి వెళుతూ విశ్రాంతి తీసికొన్నాడని రామాయణం రాసింది. ఆ రాజ్యం కారణంగా దక్షిణ మహారాష్ట్రలోని ఒక నదికి మహిష్మతి నది అని పేరు వచ్చింది.

ఆ రాజు కారణంగా ఇక్కడ నిజామాబాద్‌ ఆదిలాబాద్‌, బస్తరు ప్రాంతాల్లో భైంసా, భైంసాసురపూర్‌, పోతన వంటి నగరాల పేర్లున్నాయి. ఈ సంస్కృతి జైన మతానికి ముందుంది. ఈ ప్రాంతాల్లో వైదికేతర మతాలకు ఆదరణ ఎక్కువ. ఈ రాజు కారణంగా ఈ నగరానికి పోతన, పోతలి అని ప్రాచీన నామాలు. పోతన పోతరాజు. తెలంగాణలో ఈ మహిషాసురుని పేరు పురుషులకు స్త్రీలకు పెట్టుకొనే ఆచారం ఉంది. మహిష + అమ్మ = మైసమ్మ. ఈ రాజును వధించిన యోధురాలు (దుర్గామాత) పేరిట ఒక్క తెలంగాణలో మాత్రం నవరాత్రులు బతుకమ్మ పండుగ గుర్తుగా చేస్తారు. పోతన నగరం పోతలి అని మాత్రమేగాక, పోదన, పౌదన్య నగరమని (నేటి బోధన్‌ పోదన నుండే వచ్చిందని) భావించవచ్చు.

ఈ రాజ్యాల రాజులు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. అశ్మకుడు పాండవ పక్షాన పోరినాడు. ‘‘అశ్మకో నామ రాజర్షి: సపౌదన్యం న్యవేశయత్‌’’ అని సభాపర్వం పేర్కొంది. అశ్మకుని కుమారుడైన రాజు మాత్రం అభిమన్యునితో పోరాడినాడు. మహాభారతం ద్రోణపర్వంలో ఈ విషయం ఉంది.

ఈ బోధన్‌ రాజులు ఎంత బలాఢ్యులో, ఎంత యోధులో అంత శాంత స్వభావులు, విరాగులు. సుజాతుడు అనే బోధన్‌ రాజు బౌద్ధాన్ని స్వీకరించాడు. అంతకుముందు ఋషభదత్త, బాహుబలి రాజులు జైనాన్ని ప్రారంభించారు. బుద్ధుని సన్నిహితుడైన మరొక అశ్మకరాజు తన భార్య చనిపోగా దుఃఖితుడై బుద్ధుని కారణంగా వీతరాగుడైనట్టు మోహాన్ని తెంచుకున్నట్టు జాతక కథ చెబుతోంది. మరో అశ్మకోపాఖ్యానం ధర్మరాజుకు వైరాగ్య బోధనకై మహాభారతంలో వ్యాసునిచే పేర్కొనబడింది.

ఈ బోధన్‌ (అశ్మక) దేశ ప్రజలు వీరులు, వీతరాగులు మాత్రమే కాదు, విజ్ఞాన శాస్త్రవేత్తలు. గణితశాస్త్రవేత్త భాస్కరాచార్యుడు అశ్మకదేశీయుడు. మహాభాస్కరుడు, ఆర్యభట్టువంటి వారి గణితాలకు వ్యాఖ్యాత. ఆర్యభట్టు సుప్రసిద్ధ గణితశాస్త్రవేత్త అశ్మకుడని చారిత్రకులు చెబుతారు. ఇతని శోధనలను అశ్మక సంప్రదాయం అంటారు. పాణిని ఈ అశ్మకులను తన అష్టాధ్యాయిలో పేర్కొన్నాడు. వీరు తెలంగాణ మూలాలు కల్గి ఉండటం,
ఉత్తర తెలంగాణలోని బోధన్‌ రాజధాని కల్గి ఉండటం తెలుగు జాతికి గర్వకారణం.

జైనమత ప్రవక్త మహావీరుడు క్రీ.పూ. 483లో తన 84వ జన్మదినం జరుపుకొన్నాడు. క్రీ.పూ. 5వ శ. నాటి బద్లీ శాసనంలో ‘‘వీరాయ భగవతే చతుశ్శీతి వాసే’’ (భగవంతుడైన మహావీరుని 84వ ఏట అని అర్థం) అని రాసి ఉంది. అంటే మహావీరుడు క్రీ.శ. 599లో మార్చి 19న శనివారం చైత్ర శు॥ త్రయోదశి జన్మించినాడు. ఈతడు 24వ తీర్థంకరుడు. మొదటి 23 తీర్థంకరులు I 25 సంవత్సరములు (ఒక్కో తరానికి 25 ఏండ్లు) లెక్కిస్తూ పోతే, 575 సంవత్సరముల వెనుకకు వెళ్లితే క్రీ.పూ. 1174 సంవత్సరం ఋషభనాథుడు (తొలి తీర్థంకరుని) కాలం అవుతుంది. ఈతని కాలం క్రీ.పూ. 12వ శ. అవుతుంది. బుద్ధునికి 6 శతాబ్దుల ముందువాడు. ఇతడు బోధన్‌ రాజు కనుక బోధన్‌ నగరం క్రీ.పూ. 12వ శ.కే నగరంగా అనగా నేటికి 3200 సంవత్సరాలకు పూర్వము ఉందన్నమాట. ఇది బోధన్‌ చరిత్రలో బలమైన చారిత్రకాధారం.

మూడువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరాన్ని అనేకులగు రాజులు రాజవంశాలు పాలించారు. అందువల్ల వివిధ కాలాల్లో, అనేక నామాలున్నాయి. పోతన, పోదన, పోతలి, పౌదన్య, పద్మపుర, బహుధాన్యపుర, బోధన వంటి పేర్లు గ్రంథస్థాలు. మధ్యయుగాల్లో క్రీ.శ. 7వ శతాబ్దిలో ఈ నగరంలో సంస్కృత మహాకవి భవభూతి ఉన్నాడు. ఈతడు తాను పద్మపుర వాసినని చెప్పుకున్నాడు. అతడు తన నాటకాలను దీనికి 100 కి.మీ. దూరంలోని కంధార (రాష్ట్ర కూటుల సైనిక స్థావరం)లోని కాళప్రియ నాథుని కోవెలలోని సత్రశాలలో ఆడించినట్టు చెప్పుకున్నాడు. అరికేసరి మహారాజు ఆస్థానంలో పంపమహాకవి ఈ నగరంలో నివసించినాడు. ‘పద్మకవి’నని చెప్పుకొన్నాడు. ఈ నగరపు తొలినాళ్ల రాజు జైనమత ప్రవర్తకుడు ఋషభనాథుని జీవితంపై ఆది (వృషభనాథ) పురాణం పేరుతో కన్నడంలో జైనమత గ్రంథం పంపడు రాసినాడు. ఇది కావ్యరూపంలో ఉంది. జిన సేనుని పూర్వపురాణం (సంస్కృత భాషలోనిది) ఈ కావ్యానికి మాతృక. దీంట్లో బోధన్‌ రాజు బాహుబలి జీవితం కూడా వర్ణించబడింది. ఈ బాహుబలి నేటి శ్రావణ బెళగొళలోని ఎత్తైన బాహుబలి విగ్రహ రూపంలో పూజలందుకొంటున్న బోధన్‌ నగర రాజు. పంపమహాకవి జైన మతానుయాయి కనుక జైనుల పవిత్ర స్థలమైన బోధన్‌ లోనే శుభనంది పేరుతో సమాధి ఐనాడు. కోట గోడలు కూలినపుడు పంపని సమాధి శిలాశాసనాలు బయటపడినాయి. ఈ మట్టికోట ఈ నగరం చుట్టూరా ఇప్పటికీ అక్కడక్కడా కనబడుతోంది.

ఇమ్మడి అరికేసరి మహారాజు పశ్చిమ చాళుక్య చక్రవర్తి. ఇతడు వేములవాడనేలినాడు (కరీంనగర్‌ జిల్లా). ఇతని తండ్రి నరసింహుడు బోధన్‌ రాజు. ఇతని కాలంలో ఈ నగరం అతి సుందరమైన సుసంపన్నమైన నగరం. ఈ ప్రభువులు నూనెతో నింపిన కొలనులలో ఏనుగులను స్నానమాడించినట్లు అరికేసరి పర్భణి తామ్ర శాసనం చెపుతోంది.

ఈ నగరం శాతవాహనుల కాలంలో కూడా ఉచ్చదశలో వుండేది. శాతవాహనుల కాలపు ఆవాసస్థలాలు బయటపడినాయి. విజయనగర రాజుల కాలపు బంగారు నాణెములు దొరికినాయి. ఐతే ఈ నగరం మీదే నగరం నిర్మాణం కావడం వల్ల శిథిలాల్లోని చరిత్ర భూస్థాపితంగానే ఆధునిక నిర్మాణాలు జరిగి, చరిత్ర మరుగున ఉండిపోయింది నగరం.

కుందకుందాచార్యులు జైనమహాకవి 1/2 శతాబ్ది క్రీశ. దసభత్తి ప్రాకృత గ్రంథంలో మధుర, వారణాసి, శ్రీపురం, హస్తినాపురం, పోదనపురం మొదలగునవి పవిత్ర తీర్థ స్నానాలని రాశాడు.

జంబూద్దీపమ్నత్తి ఋషభదేవుడు తొలి జైన తీర్థంకరుడు అతడు శ్రమణ దీక్ష తీసికొంటూ తన పెద్ద కొడుకు భరతునికి అయోధ్య, చిన్నకొడుకు బాహుబలికి పోదన పురం పట్టాభిషేకం చేశాడని రాసి వుంది. మహాభారత కాలంలోని తీర్థంకరుడు నేమినాథుడు 22వ వాడు. అతనికి ముందే ఋషభదేవుడు బాహుబలి ఉన్నారు. కనుక బోధన్‌ మహాభారత కాలంకు ముందుదే. భారతం క్రీ.పూ. 1000 సంవత్సరాలదిగా దీనితో గుర్తించవచ్చు. పోతన నగరానికి బహుధాన్య, పౌదన్య, పోదనగా మారిందని కొందరు చెప్పినా ఇది మహిషాసుర సంస్కృతి లోని పేరు. గోదావరి మహిష్మతి నదుల మధ్య ప్రాంతం అశ్మకం రాజ్యం.

గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి నాసికలో వేయించిన శాసనంలో అశ్మకదేశం ఈతని ఏలుబడిలో ఉన్నట్లు చెప్పబడిరది. అంటే పోతన నగరం శాతవాహనుల ఏలుబడిలోనిదిగా కూడా గుర్తించాలి.

విష్ణుకుండినుల పాలనలో ఇంద్రపురం (ఇందూరు=నిజామాబాద్‌) రాజధానిగా ఉన్నప్పుడు బోధన్‌ దాంట్లో ఉంది.

సపాదలక్ష క్షితి లక్షా 25 వేల గ్రామాల దేశం అని లక్షా 25 వేల రూ. ఆదాయం గల దేశం అని ఈ ప్రాంతానికీ తర్వాతికాలంలో మరోపేరు వచ్చింది.

సపాదలక్ష క్షతి భూమిభర్తా
తైల వాప్యాం సపోదనే
అవగాహోత్సవం ఛక్రే

శక్రశ్రీ, ర్మదదంతినాం’’ అని శాసన విషయం స్పష్టపరుస్తోంది. బోధన్‌ చాళుక్యులు రాష్ట్రకోట సామంతులు. దంతి దుర్గానికి సమకాలికుడు సామంతుడు వినయాదిత్యుడు బోధన్‌ పాలకుడు. చివరివాడు మూడవ అరికేసరి కాలంలో ఇతని రాజధాని గంగాధరకు మారింది.

మూడవ అరికేసరి కాలంలో వేములవాడ రాజధాని. పర్బణి శాసనంలో ‘‘వేంబుళ నాటక నామధేయ నిజరాజధాన్యాం’’ ఇతడు అన్నాడు.

బోధన్‌ రాజు రెండవ అరికేసరి తన ఆస్థాన తంత్రపాలుడైన పెద్దనార్యుని అభ్యర్థనపై దేవతా నందనం కోసం వేములవాడ వచ్చి భూదానం చేశాడు.

రెండవ అరికేసరి కొలువులో పెద్దన, జినవల్లభుడు, పంపడు, రేచన వంటి కవులుండేవారు. వారు రాజుతో బాటు బోధన్‌లోనే ఉండేవారు.

రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రవల్లభుడు బోధన్‌లో ఇంద్రనారాయణ దేవాలయం నిర్మించాడు. అప్పా ప్రెగ్గడ జోగప్పయ్య దీంట్లో శాసనం వేయించాడు. ఈ ఆలయం నేడు దేవల్‌ మసీదు ఇందు వల్లభుడు తన సోదరి జాకవ్వకుమారుడైన (మేనల్లుడు) ఇమ్మడి అరికేసరి. తన కూతురు ‘‘దేవక నిర్మడి’’ని అరికేసరికిచ్చినాడు. అతని (రాష్ట్రకూట) రాజధాని మాన్య భేటక నగరం. ‘రాజధాని పొదనదల్లి మాడిసిద’ అని జోగప్పయ్య రాసినది శాసనంలోనిది ఇంద్రవల్ల భునిది అని కాక (చాళుక్యుల) రాజధాని అని అర్థం చేసికోవాలి. మాన్యఖేటక నేడు మాల్ఖేడ్‌గా పేరు మారింది.

బోధన్‌ నగరం మీదే తిరిగి నూతన నగర నిర్మాణం వల్ల ప్రాచీనాంశాలు భూగర్భితమయ్యాయి. తవ్వకాలకు వీలు లేదు. హరప్పా, మొహెంజదారోల్లో భూమి ఉపరితలంపై నిర్మాణాలు లేకపోవడం వల్ల తవ్వకాలకు వీలు కల్గింది. చరిత్ర బయటపడింది. పాడుబడ్డట్టుంటే తవ్వకాలకు వీలు ఉంటుంది. అక్కడే ఉపరితలంలో ఆధునిక నగరాలు వెలిస్తే జనావాసాలు కూలగొట్టి తవ్వకాలు జరపలేం. పైగా జనాలు ప్రాచీనత్వాన్ని పాడు చేస్తూ పోతుంటారు. ఇది బోధన్‌ విషయంలో అక్షరాలా నిజం.

మౌర్యుల కాలం నుండి, వరుసగా శాతవాహన, వాకాటక, విష్ణుకుండిన, రాష్ట్రకూట, బోధన్‌ చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ, బహుమనీ సుల్తానులు, విజయనగర రాజులు, కుతుబ్‌ షాహీలు ఈ బోధన్‌ను పాలించారు. ఈ నగరంలో వీరి చారిత్రక అవశేషాలు లభించాయి. విజయనగర రాజుల బంగారు నాణెములు లభించడం ఇక్కడేకాదు తెలంగాణలోనే విశేషం.

కళ్యాణి చాళుక్య కన్నడ శిలా శాసనాలు, పర్బణి తామ్ర శాసనం, దేవల్‌ మసీద్‌ శాసనాలు, ఇంద్రనారాయణాలయ శాసనం ఈ నగర చరిత్రను, విశిష్టతను వివరిస్తాయి. విదేశీ దాడులను వర్ణిస్తాయి.
బోధన్‌ మహానగరం అతి ప్రాచీన నగరం అనడానికి మరొక గాథ చిన్న ఆధారంగా నిలిచింది. బోధన్‌ మహాభారతానికంటే ప్రాచీనమని చెప్పుకున్నాం. మహాభారతంలో ఏకచక్రపురం, బకాసురుని ప్రస్తావన ప్రసిద్ధం. అక్కడ ఏకచక్రగాథలోని భౌగోళిక ఆధారాలుగా హరిద్రా, మంజీరలు తత్సమీపంగా పాండవులు స్నానమాచరించిన పాండుతీర్థం, చక్రతీర్థం ఇవి ఇక్కడ ఉన్నాయి. చక్రతీర్థం చక్రి చెరువుగా పిలువబడుతోంది. స్కందపురాణాంతర్గత గాథగా బకాసురుని నుండి ఈ నగరం రక్షింపబడాలని శాండిల్యముని ఇక్కడి రామలింగేశ్వరుణ్ణి పూజించేవాడు.

మహమ్మదీయుల నుండి దేవాలయం రక్షించడానికి ఇసుక పూడ్చివేయబడ్డ ఈ ఆలయం 1959 ఫిబ్రవరిలో బయల్పడిరది. దీన్నిప్పుడు చక్రేశ్వరాలయం అని పిలుస్తున్నారు. ఇక్కడ విచిత్రంగా రాకాసిపేట అనే గ్రామం నేడు బోధన్‌లో అంతర్భాగంగా ఉంది. రాక్షసుని పేర గ్రామం లేదా వీధి ఉండడం వింతే. ఐతే మహాభారత కాలం నాటి బకాసురుడు గాని లేదా ఈ పురాన్నేలిన మహిషాసురుడు (అసుర రాక్షస రాకాసి) గాని ఈ పేరును కారణం అయి ఉంటారు.

కుందకుందాచార్యుని ‘దసభత్తి’ లో మోక్షకారణంగా పోదనను పేర్కొనినాడు. పంప మహాకవి విక్రమార్జున విజయం, ఆయన తమ్ముడు జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనం, సోమదేవసూరి యశస్తిలక చంపవు, పర్భణి తామ్ర శాసనం, దేవల్‌ మసీదు (బోధన్‌) శాసనం, పంపని సమాధి శాసనం, ఇమ్మడి అరికేసరి వేములవాడ శాసనం, బోధన్‌ చరిత్ర నిర్మాణానికి ఉపకరించే శాసనాలు. దేవల్‌ మసీదు ఒకనాటి ఇంద్రనారాయణ స్వామి దేవాలయం కావచ్చు. ఈ శాసనం అప్పాప్రెగ్గడ జోగప్ప వేయించినాడు. అప్పటికి చాళుక్యులకు బోధనే రాజధాని. తరువాత 2వ అరికేసరి అవసాన కాలంలో బోధన్‌ నుండి వేములవాడకు రాజధానిని మార్చినారు. స్థూలంగా ఇది మధ్యయుగాల్లో బోధన్‌ చాళుక్యుల చరిత్ర. దీని తరువాత బోధన్‌ రాజధానిగా లేదు. నాటి మట్టికోట బోధన్‌లో నేటికీ శిథిలావస్థలో చూడవచ్చు.

మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌, మాలిక్‌ కాఫర్‌, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ వంటి మహమ్మదీయు సర్దార్లు లేదా ప్రభువుల దాడులు ఎదుర్కొన్న నగరం ఇది. దేవల్‌ మసీదు ఆలయాన్ని ధ్వంసం చేసి తుగ్లక్‌ మసీదుగా మార్చినాడు. ఈ ఆలయం రాష్ట్రకూట 3వ ఇంద్ర వల్లభుడు నిర్మించిన ఇంద్ర నారాయణాలయం. ఇమ్మడి అరికేసరి మహారాజు పశ్చిమ చాళుక్య చక్రవర్తి. ఈతడు వేములవాడ (కరీంనగర్‌ జిల్లా) నేలినాడు. ఇతని తండ్రి నరసింహుడు బోధన్‌ రాజు. ఇతని కాలంలో ఈ నగరం అతి సుందరమైన సుసంపన్నమైన నగరం. ఈ ప్రభువులు నూనెతో నింపిన కొలనులలో ఏనుగులను స్నానమాడిరచినట్లు అరికేసరి పర్భణి తామ్రశాసనం చెబుతోంది. ఈ నగరం శాతవాహనుల కాలంలో కూడా ఉచ్చదశలో ఉండేది. శాతవానుల కాలపు ఆవాస స్థలాలు బయటపడినాయి. విజయనగర రాజుల కాలపు బంగారు నాణెములు దొరికినాయి. అయితే ఈ నగరం మీదే నగరం నిర్మాణం కావడంవల్ల శిథిలాల్లోని చరిత్ర భూస్థాపితంగానే ఆధునిక నిర్మాణాలు జరిగి, చరిత్ర మరుగున ఉండిపోయింది. ఈ నగరం చరిత్రే ఈ జిల్లా చరిత్రకాగలదంటే అతిశయోక్తి కాదు. ఈ జిల్లా చరిత్రే ఉత్తర తెలంగాణలో గొప్ప ప్రాచీన చరిత్ర కాగలదు.

(వచ్చే సంచికలో కోటిలింగాల మహానగరం)