|

ఆయన ఇల్లే ఓ కళా నిలయం

ayana

ఆయనను చూడగానే – నల్లని ఫ్రేము సులోచనాలు, ఆ వెనక ఆలోచనాలోచనాలు, రెండు ప్రక్కల చెవులను, మెడను పూర్తిగా కప్పివేస్తూ తళతళ మెరిసే తెల్లని ఒత్తయిన పైకి దువ్విన జులపాలు, కళామర్మాన్ని ఇట్టే పసిగట్టే నిండైన ముక్కు, ఎదుటివారి స్పందనలకు వెంటనే ప్రతిస్పందిస్తుంటే వంతపాడే వదనం, ఎప్పుడూ ఎదో పని చేసే రెండు చురుకైన చేతులు మాత్రమే కన్పిస్తాయి.

– టి. ఉడయవర్లు

ఆయన కార్యాలయానికి వెళితే వెంట వెంటనే ఫైళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఆయన వ్రేళ్ళు, కళ్ళు చిత్రాలు గీయడంలోనో, శిల్పాలకు ప్రణాళికలు వేయడంలోనో మునిగిపోతాయి. ఆయన పని ఒత్తిడిని ఈ కళాతృష్ణ తగ్గిస్తుందట.

ఆయన ఇంటికి వెళితే కిందా – మీద, ఎక్కడ చూస్తే అక్కడ ముచ్చటగా మూడంతస్థులలోనూ చిత్రాలే, చిత్రాలు, శిల్పాలే శిల్పాలు. ఆయన శ్రీమతి రోహిణి కూడా ఆయనలాగే శిల్పి, చిత్రకారిణి, నిజంగా ఆయన ఇల్లు ఒక కళానికేతనం.

ఇంతకు ఆ సృజనాత్మకశిల్పి, ఆ అపురూప చిత్రకారుడు ఎవరో కాదు, బోళ్ళ శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ వాస్తు, లలితకళల విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌. అంతకుముందు ఆయన ఆ విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్‌. కాని ఈ పాల నాసంబంధ ఉద్యోగాల పట్ల అంతగా ఆసక్తి ఆ యనకు లేదు. ఎప్పుడు ఇక్కడి నుంచి విముక్తి లభించి తిరిగి శిల్పకళా విభాగంలో ప్రధాన ఆచార్యు నిగా ఒకవంక భోధన చేస్తూ, మరోవంక తనలో పొటమరించే కొంగ్రొత్త భావాలకు అనుగుణమైన కళాకృతులను రూపొందించాలని ఎంతగానో కుతూహలపడుతున్నాడు.

కళపట్ల అంత తపన, సాధన ఉన్నవాడు కాబట్టే ఇంతవరకు వేళ్ళపై లెక్కించే మందికి మాత్రమే లభించిన కేంద్ర లలితకళా అకాడమీ అవార్డు 2004లోనే శ్రీనివాసరెడ్డిని వరించింది. అంతకు ముందే ప్రతిష్టాత్మకమైన కామ్లిన్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌ అవార్డు ఆయన గీసిన చిత్రానికి 2002లో వచ్చింది. అంతేకాదు ఆయన రూపొందించిన శిల్పాలకు, చిత్రాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్వర్ణపతకం ప్రదానం చేశాయి. నాగపూర్‌ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ అఖిలభారత స్థాయి అవార్డు, తెలంగాణ రాష్ట్ర ఉగాది పురస్కారం, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ తదితర రాష్ట్ర స్థాయి అవార్డులెన్నో వారి కళాకృతులు గెలుచుకున్నాయి.

శ్రీనివాస రెడ్డి చిత్రకళా జీవితంలో ఆకృతులు దిద్దిన కోలలముఖాలు కొల్లలు. వాటిలో బుద్ధునిలాగా ధ్యానవదనాలు, అర్ధనిమీలిత నేత్రాల వదనాలతో పాటు హసిత వదనాలు, వేదనాభరిత వదనాలు, మానవీయత ఆధ్యాత్మికత తొంగిచూసే వదనాలు, ఇలా ఎన్నెన్నో రకాలు. వాటిలో కొన్ని శిలలు, దారువులు, మరికొన్ని కాంస్యపువి, టెర్రకోటావి, ఫైబర్‌ గ్లాస్‌వి ఉన్నాయి. ఇటీవల ఎన్నో తీరుల తలపులతో నిండిన తలలు, అలంకరణలతో ఆత్మావలోకన ప్రస్పుటించేలాగా పలు వర్ణాలతో నులకింపుగా తయారు చేశారు. అంతే కాదు ఆయన వేసే వివరాలతో కూడిన డ్రాయింగ్‌లలో, బిలవర్ణ చిత్రాలలో, అక్రాలిక్‌ చిత్రాలలోనూ, అన్నింట్లో విశ్వజనీనత, కళాహృదయంతోపాటు ప్రకృతికి మనిషికి మధ్యగల బంధాన్ని వ్యక్తం చేసే ఆయన ముద్ర కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. శ్రీనివాస రెడ్డి బాల్యంలో పెరిగిన పరిసరాలు, కార్మిక, కర్షక వర్గం జీవన యానంలో పడే యాతనలను, బడుగు వర్గాల కోరికలు, భయాలు, బాధల గాధల నిశ్శబ్ద సంగీతం ఆయన చిత్రాల్లో ప్రతిధ్వనిస్తుంది. సమకాలీన ప్రపంచం తీరుతెన్నులు కూడా ఆయన చిత్రాల్లో ద్యోతకమవుతాయి. ఆయన చిత్రాల్లో సంప్రదాయ సిద్దమైనవి, గ్రామీణం నుంచి నగరీకరణమైన ప్రతీకలుంటాయి. దీనికంతటికి ఆయన కృషి, నిబద్దతే కారణం.

నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర దాచారంలో స్వాతంత్య్ర సమరయోధుడు, వామపక్ష భావాలుగల వీరారెడ్డి – రంగమ్మ దంపతులకు యాభైనాలుగేండ్ల క్రితం జన్మించిన శ్రీనివారెడ్డికి చిన్నప్పటి నుంచి చదువుపట్ల, అంత శ్రద్ధ లేదు కాని తోచిన బొమ్మలు గీయడమంటేనే ప్రాణం. అందుకు అనుగుణంగా హై స్కూల్‌ చదువు ముగియగానే హైదరాబాద్‌కు వచ్చి జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయానికి చెందిన లలిత కళల కళాశాలలో చేరి ఐదేండ్ల డిప్లొమా పూర్తి చేయడమే కాదు, స్వర్ణ పతకం సాధించాడు. యువ చిత్రకారులలో గుర్తింపు పొందాడు.

బరోడా వెళ్లి స్నాతకోత్తర చదువు పూర్తి చేస్తే, ఇక్కడి కళాశాలలోనే బోధించవచ్చునని సీనియర్‌ చిత్రకారులిచ్చిన సలహా మేరకు ఆలస్యం చేయకుండా శ్రీనివాస రెడ్డి వెళ్లాడు. కాని ఆ ఏడాది అడ్మిషన్లు అప్పటికి పూర్తి కావడంతో యేడాది పాటు అహ్మదాబాద్‌లో కనోరియా కేంద్రంలో శిక్షణ పొందే సదవకాశం లభించింది. ఆ తర్వాత 1988లో బరోడా వెళ్ళి ఎం.ఎస్‌. విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డిప్లొమా పూర్తి చేశారు. కనోరియా శిక్షణలో రూపొందించిన శిల్పానికి హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ స్వర్ణపతకం ఆయనకు లభించింది. అంతే కాదు కనోరియా కేంద్రంలో శిక్షణ సందర్భంగా అక్కడ అప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రవీందర్‌ రెడ్డి, ప్రీతిపాల్‌ సింగ్‌లు ఆయననెంతగానో ప్రభావితం చేశారు. అయితే వారిలాగా కాకుండా తనకంటూ ఒకానొక ప్రత్యేక శైలిని ఆయన పుణికిపుచ్చుకున్నారు. అంతకు ముందే హైదరాబాద్‌లో చదువుకుంటున్నప్పుడు ఆయన అధ్యాపకుడు, వామపక్ష భావాలతో ఊరేగడం కాదు నీ కళా మాధ్యమంలో దీన్ని చూపించుమని ఇచ్చిన సలహాను, ఆ తర్వాత కనోరియాలో ఆయన గురువు రాఘవ, కనేరియా వర్షాకాలంలో ప్రకృతిని బాగా పరిశీలించు, అందులో నుంచే నీకు కావలసిన సరైన వస్తువు లభిస్తుందని ఇచ్చిన సలహాలను తు.చ. తప్పకుండా అమలు చేయడంతో కుక్క గొడుగుల పోలిన చిత్రాలు – శిల్పాల నుంచి, కొండరాళ్ళ పరిరక్షణ, తలపుల తలలు ఇత్యాది కళారూపాలు ఉద్భవించాయి. శ్రీనివాసరెడ్డి మార్క్‌ను ప్రస్ఫుటం చేశాయి.

లండన్‌లో, అమెరికాలో నాలుగు సార్లు సమష్టి కళా ప్రదర్శనలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి భారతదేశంలోని దాదాపు అన్ని నగరాల్లో ఏర్పాటు చేసిన యాభై కళాప్రదర్శనల్లోను పాల్గొని తన ఉనికిని చాటాడు. దేశం మొత్తం మీద ఇరవైఏడుసార్లు అంతర్జాతీయ స్థాయి సింపోసియంలలో పాల్గొని తన కళా ప్రతిభను వ్యక్తం చేశాడు.

2012లో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సందర్భంగా శిల్పుల శిబిరం ఏర్పాటు చేసి పనికిరాని లోహ సామాగ్రి వినియోగించి చూడముచ్చటైన శిల్పాలు రూపొందించడానికి దోహదం చేశారు. అయితే అప్పుడు రూపుదిద్దిన శిల్పాలలో కొన్నే నగరంలో అలంకరించారు. ఇంకా ఎన్నో శిల్పాలు జనానికి దూరంగానే ఉండిపోయాయి.

పూర్వ కాలంలో రాజుగారే కళాకారులకు సర్వ సౌకర్యాలు కల్పించి కళాఖండాలు తయారు చేయించేవారు. కాని ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి శిల్పులను, చిత్రకారులను ప్రభుత్వం ఉపయోగించుకోవలసి ఉంటుందని శ్రీనివాస రెడ్డి అంటారు. నగరాల్లోని ట్రాఫిక్‌ ఐల్యాండ్‌లలో, పార్కులలో అలంకరించడానికి తగిన శిల్పాలను రూపొందించడానికి ప్రభుత్వం పారిశ్రామికులను, కార్పోరేట్‌ సంస్థలను ఒప్పించి, శిల్పులకు కాలవసిన లోహాలను ఆయా కంపెనీల నుంచి, రాళ్ళను క్వారీల నుంచి ఉచితంగా ఇప్పిస్తే ఎంతో మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు.