ప్రకృతి శక్తి ఆరాధన బోనాల పండుగ

By: డా॥ భిన్నూరి మనోహరి

ఓం సర్వ స్వరూపే సర్వేశి సర్వ శక్తి సమన్వితే ।
ఓం భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ॥

సర్వ స్వరూపాల్లో, శక్తి స్వరూపిణి అయిన అమ్మ మనలోని భయాలను తొలగించి దుర్గరూపంలో మనందరినీ రక్షించమని ప్రార్థిస్తూ ఆషాఢమాసంలో జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో బోనాల పండుగను చాలా విశేషంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణాలో ముఖ్యంగా హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఆషాఢమాసం ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి ఆదివారం ఆయా ప్రాంతాలలో అమ్మవారి దేవాలయాలలో ప్రజలందరూ బోనం సమర్పించి తల్లి ఆశీస్సులు పొందుతారు. పోచమ్మ, పోలేరమ్మ, మారమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, మహంకాళి, ఎల్లమ్మ, అంకాలమ్మ ఇట్లా ఏ పేర్లతో పిలిచిన అమ్మకు నైవేద్యం (బోనం) సమర్పించడం ముఖ్య ఉద్దేశం.

బోనం అనేది భాషా పరంగా వికృతి. భోజనం ప్రకృతి. అమ్మకు నైవేద్యం (భోజనం) పెట్టడం బోనం. ఎందుకు ఆషాఢమాసంలోనే ఈ బోనం సమర్పించడం. ఏ మాసంలోనైనా, ఎప్పుడైనా పెట్టవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలు చేసుకున్నప్పుడు మొదట పోచమ్మకు వస్త్రాలు, బోనం సమర్పిస్తారు. అది వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆషాఢమాసంలో ప్రత్యేకంగా బోనం సమర్పించడం అనేది విశేషం. అది కూడా ఇంటికి ఆడపడుచులను పిలిచి భోజనం పెట్టిన రీతిగా అందరూ సామూహికంగా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పెద్ద ఉత్సవంగా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

అసలు బోనం ఎందుకు పెడతారు. ప్రకృతి పరంగా చూస్తే మూడు కాలాల్లో వర్షాకాలం మొదలయ్యే మాసం ఆషాఢం. సహజంగా ప్రకృతిలో సమతుల్యత లేక వర్షాలు పడే సమయంలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా, కలరా, మశూచి వంటి అంటువ్యాధులు చాలా త్వరగా ప్రబలుతాయి. అంటువ్యాధుల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, తమను కాపాడే బాధ్యత అమ్మతల్లిదే అని భావించి అందరూ అమ్మకు నైవేద్యంగా బోనం సమర్పిస్తారు. సాధారణంగా చికెన్‌పాక్స్‌ వస్తే అమ్మతల్లి వచ్చింది. అమ్మ పోసింది అంటాం. అప్పుడు కూడా ఆ వ్యాధి తగ్గిన తర్వాత అమ్మవారికి కల్లు పోయించడం, నైవేద్యం సమర్పించడం చేస్తారు. ప్రత్యేకంగా ఆషాఢమాసంలో బోనాలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, ప్రజలను, దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సమర్పిస్తారు.

బోనాలు అనేవి మన ప్రాంతంలో ఏవిధంగా ప్రారంభమైనాయి. వీటికి పూర్వ చరిత్ర ఏమైనా ఉందా, బోనాలు సమర్పించడంలో శాస్త్రీయ దృక్కోణం, సామాజిక నేపథ్యం వంటివి మనం అధ్యయనం చేస్తే ఈ పండుగ జరుపుకోవడంలోని పరమార్థం అర్థమవుతుంది.

1869లో హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌లలో ప్లేగువ్యాధి వచ్చి వేలాదిమంది ప్రజలు మరణించారు. ప్రకృతితల్లికి వచ్చిన కోపాన్ని తగ్గించి, ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు, జాతరలు నిర్వహించాలని పెద్దలందరూ భావించినారు. దానికే బోనాలు అని పేరు పెట్టుకొన్నారు. ఈ పండుగ జరుపుకోవడంలో ముఖ్య
ఉద్దేశం మానవులకు హాని కలిగించే ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించాలని కోరుకుంటూ బోనం సమర్పించడం ప్రారంభించారు. అదేవిధంగా నిజాం కాలంలో కూడా బోనాల పండుగను నిర్వహించబడినట్లు తెలుస్తుంది. దాదాపు 200 సంవత్సరాల నుండి ఈ బోనాల పండుగ జంటనగరాల్లో ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం విశేషం జరుపబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా శ్రావణమాసంలో బోనాలు సమర్పిస్తారు.

బోనాల పండుగను క్రమపద్ధతిలో ఒక ఆచారంగా ఏవిధంగా నిర్వహిస్తారో వివరించుకుందాం
ప్రతి పండుగకు మనం ఇల్లు శుభ్రం చేసుకొని తోరణాలు కట్టుకున్న విధంగానే ఈ పండుగకు కూడా మామిడి, వేప తోరణాలు కట్టుకుంటారు. అమ్మవారికి శుచిగా అన్నం వండి అందులో పాలు బెల్లం వేసి నైవేద్యం వండుతారు. కొంతమంది ఉల్లిగడ్డలతో నైవేద్యం చేస్తారు. వండిన పదార్థాన్ని మట్టికుండ లేదా, ఇత్తడి, లేదా రాగి బిందెలో ఉంచుతారు. దానికి పసుపు రాసి వేప ఆకులను చుట్టుతారు. ఆ కుండపైన మరో చిన్న కుండను ఉంచుతారు. అందులో అమ్మవారికి సాక పోసి ఉంచుతారు. అంటే వండని పదార్థం. పసుపునీళ్ళు అమ్మవారికి సాకగా సమర్పిస్తారు. కొందరు అందులో కల్లు పోస్తారు. ఇక పాకం అంటే వండిన పదార్థం. అదే బోనంగా ప్రసిద్ధి చెందింది. ఆ కుండ చుట్టు పసుపురాసి ఎర్రటి, తెల్లటి బొట్లతో అలంకరిస్తారు. ఆధునిక కాలంలో కొందరు అమ్మవారి ముఖం పెట్టి చాలా అద్భుతంగా అలంకరిస్తున్నారు. ఆ తరువాత ఇంటిల్లిపాది పట్టు వస్త్రాలు కట్టుకొని డబ్బు బాజాలతో, పోతరాజులతో కలిసి ఇంటిలో ఒక మహిళ బోనం ఎత్తుకొని ఊరేగింపుగా అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళతారు.

బోనం సమర్పించే ప్రతిబృందం వారు సన్నటి పొడవాటి కర్రలు, రంగు రంగుల కాగితాలతో తొట్టెలను సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. బోనాల పండుగలో పోతరాజు పాత్ర చాలా ముఖ్యమైంది. ఇతడు అమ్మవారి సోదరుడైన పోతరాజు ప్రతిరూపంగా ఉంటాడు. ఇతడు ఆలయం దగ్గరికి వచ్చిన భక్తులకు దారి చూపిస్తూ నడుముకు వేపాకులు కట్టుకొని కొరడాతో కొట్టుకుంటూ, బోనం ఎత్తుకొచ్చిన మహిళలను ఆలయంలోకి తీసుకువెళతాడు. బోనం సమర్పించిన మరుసటిరోజు రంగం నిర్వహిస్తారు. ఇది భవిష్యవాణిగా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఆలయానికి బోనం సమర్పించే ఆడవారందరూ అమ్మవారి ప్రతిరూపాలుగానే ఉంటారు. వారిని అమ్మ ఆవహించి మంచి చెడు చెప్తుందని, ప్రకృతి వైపరీత్యాలు, దేశ సౌభాగ్యం, ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని, తనను తృప్తిపరిచే కార్యక్రమాలు చేయాలని భవిష్యవాణి చెబుతుంది. ఆయా ఆలయాల్లో ప్రతి సంవత్సరం రంగం చెప్పే కార్యక్రమం చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. బోనాల పండుగలో మరో ముఖ్యమైన ఆచారం ఘటం ఊరేగింపు. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘటం అంటారు. ఒంటికి పసుపు రంగు పూసుకొని ధోవతి ధరించి పూజారి ఘటాన్ని ఊరేగిస్తాడు. పండుగ మొదటిరోజు నుండి చివరి రోజు అయ్యేవరకు ఈ ఘటాన్ని మేళతాళాల మధ్య ఊరేగిస్తారు.

హైద్రాబాద్‌లోని అక్కన్న మాదన్న ఆలయం ఘటం ఏనుగు అంబారీలు, గుర్రాలు, అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు ప్రారంభమై నయాపూల్‌ వద్ద అన్ని ఘటాలు చేరుకున్న తర్వాత నిమజ్జనం చేస్తారు.
బోనాల సమయంలో పూర్వం దున్నపోతులను బలి ఇచ్చేవారు. ఆధునిక కాలంలో మేకలు, గొర్రెలు, కోళ్ళను బలిగా సమర్పిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత విందు భోజనం చేస్తారు. బోనాల పండుగలో మరో ముఖ్యమైన అంశం అమ్మవారి ఊరేగింపు. చాలా పెద్ద ఎత్తున రథాన్ని ఏర్పాటు చేసుకొని మేళతాళాలతో, పోతరాజుల విన్యాసాలతో, గుగ్గిలం, మైశాక్షి వంటి ధూపంతో అమ్మవారిని ఊరేగిస్తారు. యువకులు, ఆడవారు రథం ముందు నృత్యం చేస్తూ అమ్మవారి ఊరేగింపును ముందుకు తీసుకువెళ్తారు. బోనాల ఉత్సవ నిర్వహణ ఆయా ఆలయాలకు సంబంధించిన కమిటీలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా అనేక వసతులు ఏర్పాటు చేస్తారు.

ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవం రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం అనేక సౌకర్యాలను కలిపిస్తూ ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తుంది.

సంప్రదాయబద్ధంగా శ్రావణ, ఆశ్వీయుజ మాసాల్లో అమ్మవారికి చేసే శిష్ట పూజలకు ఎంత ప్రాధాన్యం ఉందో ఆషాఢమాసంలో చేసే బోనాలు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఏ రూపంలో కొలిచినా అమ్మ ఒక్కటే. ఆ అమ్మే ప్రకృతి. ప్రకృతి సంబంధమైన ఆరాధనే పండుగలు, ముఖ్యంగా ఈ బోనాల ఉత్సవం.