బోనాల వేడుకలు షురూ !

కాలచక్రం వడి వడిగా తిరుగుతోంది, ఈ భ్రమణంలో ఋతువులు మారుతుంటాయి. వసంతం వెళ్లి వర్ష ఋతువు వచ్చేసింది. ఋతు సంధి వేళలో వచ్చే వాతావరణ మార్పులకు సమాయత్తమయ్యే విధంగానే సమాజం సర్దుబాటు చేసుకుంటున్నది అనాదిగా. ఆషాఢం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు అనేకం అలుముకుంటాయి. వీటన్నింటిని ఎదుర్కొనే ఉద్దేశంతోనే ఆయా ఊరు, వాడల్లో వుండే గ్రామదేవతలను ప్రసన్నం చేసుకుంటే, ఆ తల్లి కరుణించి కటాక్షిస్తుందనే నమ్మకంతో దాదాపు దేశమంతా కూడా స్థానిక ఆచారాలకనుగుణంగా వేడుకలు చేస్తుంటారు.

మన తెలంగాణ ప్రాంతంలో ఈ వేడుక బోనాల పండుగగా ప్రసిద్ధి చెందిందన్న విషయం మనందరికి విదితమే. మన రాష్ట్రం సిద్ధించిన తరువాత ఈ వేడుకను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాము. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవ స్థాయిలో కాకుండా ఇళ్లల్లో వేడుకగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సారి మళ్ళీ యధావిధిగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాలకే కాకుండా సుమారుగా 3 వేల ప్రయివేట్‌ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందజేయనుండడం విశేషం. అలాగే వివిధ ఆలయాల వద్ద ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరించి అమ్మవారి ఊరేగింపు కోసం అంబారీలను ఏర్పాటు చేయనుండటం రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నది.

పల్లె – పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అటు గ్రామాలను, ఇటు పట్టణాలను కూడా ఆదర్శంగా తీర్చిదిద్దే సమగ్ర విధానంగా అమలు చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరిసేలా, మౌలిక వసతులన్నీ కల్పించేలా ప్రణాళికా బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. ఇక పట్టణాలలో స్థానిక జనసమ్మర్దంతో పాటు,నిత్యం వచ్చీ పోయే స్థానికేతరులు కూడా అనేకం వుంటారు. వీరందరికీ తగు విధంగా మౌలిక వసతులను మెరుగుపరిచి, ప్రణాళికా బద్ధంగా పరిశుభ్రత, పచ్చదనంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా జీవించే వాతావరణాన్ని పట్టణాలలో కల్పించాలనే సంకల్పంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. 

బోనాల వేడుకల నిర్వహణ అనేది శుచి శుభ్రతలను పాదుకొల్పేందుకే. పండుగ ముంగిటనే పల్లె – పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించుకోవడం పండగ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసినట్లయ్యింది. ఇదివరకే నాలుగు విడతల పల్లె – పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించుకోగా, ఆషాఢం ముంగిటనే ఐదో విడత పల్లె – పట్టణ ప్రగతిని పూర్తి చేసుకోవడం, పరిసరాల పరిశుభ్రతకు, మౌలిక వసతుల కల్పనకు మరింతగా దోహదం చేసింది.