భక్తి ప్రపత్తులతో అమ్మవార్లకు బోనాలు

వర్షా కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను నుంచి మమ్ములను కాపాడమని వేడుకొంటూ, తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునేవే  రాష్ట్ర ప్రధాన పండుగలలో ఒకటైన ఆషాఢ బోనాల ఉత్సవాలు.  నైజాం నవాబులు పాలించిన  గోల్కొండ కోట వేదికగా, కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి జేష్ఠ అమావాస్య తరువాత వచ్చిన ఆదివారం నాడు సమర్పించిన తొలి బోనంతో, బోనాల ఉత్సవాలు  ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా బోనాల ఉత్సవాలను వ్యక్తిగతంగా ఎవరి ఇళ్లల్లో వారే, ఎటువంటి హడావిడి లేకుండానే  నిర్వహించుకోవడం జరిగింది.

అయితే, ఈ సంవత్సరం కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లను చేయాలని, ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడంతో ఆ మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించు కోవడంలో భాగంగా, ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయాన్ని అందించే నిమిత్తం, ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇవి కాకుండా ఇతరత్రా ఏర్పాట్ల కోసం 60 కోట్ల రూపాయలను కేటాయించింది. బోనాలను నిర్వహించే ప్రతి ఆలయం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతోపాటు, ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రధాన ఆలయాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. బోనాల సందర్భంగా ఆయా దేవాలయాల వద్ద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి, సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయాల్లోని అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించగా, అలాగే నగరంలోని 26 దేవాలయాలలో కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

నగర వ్యాప్తంగా మూడు వారాలుగా అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందు గోల్కొండ, తరువాత  బల్కంపేట ఉత్సవాలు ఘనంగా జరుగగా.. ఆ తరువాత సికింద్రాబాద్‌ (లష్కర్‌) భక్తులు అత్యంత భక్తి పరవశాలతో అమ్మవారికి బోనమెత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో సికింద్రాబాద్‌ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొట్టెలు, ఫలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రులు, సీఎం సతీమణి శోభ పట్టు వస్త్రాలు, బోనం, ఒడిబియ్యం సమర్పించారు. మరో ప్రక్కన ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే పలువురు ప్రముఖులు అమ్మ వారిని దర్శించుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమష్టి కృషితో చర్యలు చేపట్టారు. ఈ భక్తి పరవశం మరికొన్నాళ్లు శ్రావణ మాసంలో కూడా కొనసాగుతుంది. నగరంలో అట్ట హాసంగా జరిగే లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు మరో ప్రధాన ఘట్టం. ఆ తరువాత హైదరాబాద్‌ జిల్లా పరిసర జిల్లాలో శ్రావణ మాసం వరకు కొనసాగుతాయి.