శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ…

శ్రీసీతారాముల-కల్యాణం-చూతము-రారండీ...ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన కలియుగ వైకుంఠం భద్రాచలం. రామాయణంలో పేర్కొనబడిన దండకారణ్య ప్రాంతమిది. భద్రగిరి శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటిసారిగా జరుగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. శ్రీజయనామ సంవత్సరం మార్చి 28వ తేది చైత్రశుద్ధ నవమి జయవారం అభిజిత్‌ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచల శ్రీసీతారాముల కల్యాణం భక్తుల జయజయ ధ్వానాల మధ్య అత్యంత వైభవంగా జరగనుంది. ధృవమూర్తులకు ప్రధాన ఆలయంలో కల్యాణ తంతు నిర్వహించిన అనంతరం ప్రధానాలయం నుండి శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను రాజవాహనంపై మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోఛ్చారణలమధ్య మిధిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కళ్యాణమండపానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. కళ్యాణశోభ ఉట్టిపడేలా అందంగా అలంకరించిన కల్యాణమండప ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది భక్తులు రానున్నట్లు అధికారుల అంచనా. మిథిóలా ప్రాంగణంలో భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచేకాక ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీశ్‌గఢ్‌, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారి కల్యాణం తిలకించేందుకు అధికసంఖ్యలో భద్రాచలం తరలి వస్తారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాచల రామాలయాన్ని నవాబుల కాలంలో క్రీ.శ 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న నిర్మించారు.

పాల్వంచ పరగణాకు తహశీల్దారుగా నియమితులైన కంచెర్ల గోపన్న రామ భక్తుడగుటచే భక్త రామదాసుగా గణతికెక్కాడు. భద్రాచచలానికి సమీపంలోని భద్రిరెడ్డిపాలెంలో నివశిస్తున్న పోకల దమ్మక్క అనే భక్తురాలు భద్రుని కొండపై ఓ పుట్టలో దాగి ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను వెలికితీసి పందిరి నిర్మించి నిత్యం స్వామివారికి నివేదన చేస్తూ ఉండేది. రామదాసు ఒకనాడు తన ఆరాధ్య దైవమైన శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులు సరియైన ఆచ్ఛాదన లేక పందిరి కింద ఉండటంతో చలించి నవాబులకు చెల్లించ వలసిన 6 లక్షల శిస్తు వసూళ్ళను ఖర్చుచేసి భద్రాచల రామునికి రాజ గోపురం, ప్రధానాలయం, ప్రాకారాలయాలు నిర్మించటమేకాక సీతమ్మకు చింతాకు పతకం, స్వామివారికి పచ్చలపతకం, బంగరు మొలత్రాడు, కలికితురాయి వంటి విలువైన ఆభరణాలు చేయించి అలంకరింప చేశాడు. నవాబుల ఖజానాకు చేరవలసిన సొమ్మును ఆలయ నిర్మాణానికి వెచ్చించినందుకు ఆగ్రహించిన నవాబు తానీషా రామదాసును గోల్కొండ ఖిల్లాలో 12 ఏళ్ల పాటు బంధించి చిత్రహింసలుపెట్టడం జరిగింది.

రామదాసు రామ భక్తుడేకాక ప్రముఖ వాగ్గేయకారుడు కూడా. నవాబులు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆర్తితో, ఆవేదనతో నాడు రామదాసు పాడిన పాటలే భక్త రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. తన భక్తుడు రామదాసును చెఱనుండి విడిపించేందుకు సాక్షాత్తు రామ, లక్ష్మణులే రామోజీ, లక్ష్మోజీలుగా నవాబుకు దర్శనమిచ్చి 6 లక్షల నాణాలకు బదులుగా, 6 లక్షల బంగారు రామ మాడలను చెల్లించినట్లుగా క్షేత్ర చరిత్ర చెపుతోంది. మూడు వందల ఏళ్ళనాటి చరిత్రకు సాక్ష్యాధారంగా నేటికీ శ్రీరామచంద్రునికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అప్పటి రామమాడలలో ఒకటైన రామమాడను ధరింపచేయటం ఆనవాయితీగా వస్తున్నది. అలాగే మంగళసూత్ర ధారణలో కూడా మూడు సూత్రాలను అలంకరింప చేస్తారు. ఒకటి అమ్మవారి తరఫునుంచి జనకమహారాజు, మరొకటి స్వామివారి తరఫునుంచి దశరధమహారాజు ధరింపచేసే సూత్రాలుకాక వేరొకటి భక్త రామదాసు సమర్పించినది కూడా ధరింప చేస్తారు.

tst

శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు, జన్మతిధి చైత్రశుద్ద నవమి శుభ ఘడియల్లో అభిజిత్‌ లగ్నమందు మధ్యాహం 12గంటలకు అమ్మవారికి, స్వామివారికి శుభముహూర్తాన జీలకర్ర బెల్లం శిరస్సులపై ఉంచి కల్యాణ తంతు జరిపిస్తారు. అలాగే స్వామి, అమ్మవార్ల కల్యాణం సందర్భంగా నవాబుల కాలం నుంచి ఏనుగు అంబారీపై ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు కానుకగా సమర్పించే సాంప్రదాయం ఉన్నది. అదే సాంప్రదాయాన్ని నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించటం జరుగుతోంది. అలాగే తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి కూడా స్వామి అమ్మవార్లకు కానుకలు సమర్పించటం అనాదిగా వస్తోంది. సూర్యవంశీకుడైన శ్రీరామునికి ప్రీతి పాత్రమైనదగుటచే ఇక్కడి కల్యాణ తలంబ్రాలు కూడా ఎరుపు వర్ణంలో ఉండటం మరో ప్రత్యేకత.

భారతదేశంలో రామాలయం ఉండని గ్రామం ఉందనుట అతిశయోక్తికాదు. అయితే దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి రోజున జరుగు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతిఏట స్వామివారి కల్యాణం ఆరుబయట భక్తులమధ్యనే నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరికి కల్యాణం తిలకించే భాగ్యం కలగాలని రామదాసు ఈ విధంగా శాసనం చేశాడు.

గోపన్న మనవాడే!

స్థలమా భద్రుడు తపస్సుచేసిన భద్రగిరి. జలమా పవిత్ర గోదావరి. దైవమా శ్రీ సీతారామచంద్ర మూర్తి. ఇక ఈ భద్రాచల క్షేత్రాన్ని జనసామాన్యానికి అందజేసిన మహనీయుడు, భక్తజన వంద్యుడు శ్రీరామదాసు. కనుకనే భద్రాచల క్షేత్రానికి సహజంగానే ప్రాముఖ్యత లభించింది.

భద్రాచలం పేరువిన్నా, శ్రీరామచంద్ర మూర్తిని దర్శించిన భక్తకోటికి మొదటిసారిగా స్ఫురించేది భక్త రామదాసుగా కీర్తినందుకున్న కంచర్ల గోపన్న.

భద్రాద్రిలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన కంచర్ల గోపన్న జన్మస్థలం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. బాల్యం నుంచే నిరంతరం శ్రీరామ తారకమంత్రం జపించే గోపన్న తన మేనమామలైన అక్కన్న, మాదన్నల సహాయంతో గోల్కొండ నవాబు తానీషా కొలువులో చేరాడు. తానీషాకు ప్రధాన మంత్రిగా మాదన్న, సేనాపతిగా అక్కన్న పనిచేసేవారు. వారి ప్రోద్బలంతో నేటి ఖమ్మం జిల్లాలోగల పాల్వంచ పరగణాకి తహాశీల్‌ దారుగా నియమితుడయ్యాడు .తహశీలుదారు హోదాలో శిస్తు రూపంలో వసూలుచేసిన ఆరు లక్షల వరహాలను గోపన్న ఖజానాకు జమచేయకుండా, ఆ సొమ్ముతో శ్రీ సీతారామచంద్రస్వామి మందిరాన్ని నిర్మించాడు. మందిర నిర్మాణంతోపాటు స్వామికి, అమ్మవారికి అమూల్య ఆభరణాలు కూడా చేయించారు.

అప్పట్లో రామదాసు చేయించిన ఆభరణాలను నేటికీ మనం స్వామివారికి అలంకరించి ఆనందిస్తున్నాం. భక్త రామదాసు సీతామ్మవారికి చేయించిన చింతాకు పతకం, పచ్చల హారం, పూసలహారం, అమ్మవారి మంగళసూత్రాలు, రామటంకాలు, చంద్రపతకం, బంగారు మొలత్రాడు, తదితర ఆభరణాలు కల్యాణ మహోత్సవంనాడు శ్రీ సీతారామచంద్ర స్వామికి అలంకరిస్తారు.

haramప్రభుత్వ సొమ్మును ఖజానాకు జమచేయకుండా ఆలయం నిర్మించడం అప్పటి నిజాంప్రభువు తానీషాకు ఆగ్రహం తెప్పించింది. రామదాసును గోల్కొండ కోటలో బందీగా వుంచి , చిత్రహింసలకు గురిచేశాడు. ఆ సమయంలో తనను కాపాడమని రామదాసు శ్రీ రామచంద్రుని వేడుకున్నాడు. శ్రీరామ చంద్రునికి చెప్పి తనను రక్షించమని సీతాదేవినీ వేడుకున్నాడు. ఎంతకీ శ్రీరాముడు కరుణించక పరోవడంతో తాను నిత్యం కొలిచే శ్రీరామ చంద్రునే నిందించడం ప్రారంభించాడు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకంబు రామచంద్రా… అంటూ , ఎవరబ్బాసొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా ..అని నిందాపూర్వకంగా వేడుకుంటాడు. చివరకు శ్రీరామచంద్రులు తన సోదరుడు లక్ష్మణునితోసహా రామోజీ, లక్ష్మోజీల పేర్లతో తానీషాకు ప్రత్యక్షమై రామదాసు చెల్లించవలసిన ఆరులక్షల వరహాలను చెల్లించి కారాగారవాసం నుంచి రామదాసును విముక్తిన్ని చేశారు. గోల్కండ కోటలో శ్రీరామదాసుని బంధించిన కారాగారాన్ని ఇప్పటికీ మనం తిలకించవచ్చు.

భక్త రామదాసు భక్తిపారవశ్యానికి ముగ్దుడైన తానీషా అతను చేసిన తప్పిదాన్ని మన్నించడంతోపాటు, తానుకూడా శ్రీరాముని భక్తునిగా మారాడు. ఆనాటి నుంచే భద్రాచల క్షేత్రం హిందూ, ముస్లింలకు ఆరాధ్య దైవంగా మారి మతసామరస్యానికి ప్రతీకగా నిలచింది. అంతేకాదు, శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ప్రతియేటా ముత్యాల తలంబ్రాలను పంపే ఆనవాయితీకి 1726 సంవత్సరంలోనే నిజాం ప్రభువులు శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ సంప్రదాయం కొనసాగుతూనే వుంది.

శిల్పకళా శోభితం కల్యాణ మండపం

శ్రీసీతారామ కల్యాణోత్సవాన్ని ఆరుబయటే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకుగాను మిధిలా స్టేడియం పేరుతో శిల్పకళా శోభితమైన ఓ కల్యాణ వేదికను నిర్మించారు. నిజంగా ఇదొక అద్భుత నిర్మాణం. ఈ కల్యాణవేదిక చుట్టూ చెక్కిన రామాయణ ఘట్టాలు, ఏక శిలలో రూపుదిద్దుకున్న శిలాతోరణాలు , వేదికకు ఇరువైపులా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్టు వుండే రాతి ఏనుగులు , తదితర నిర్మాణాలు చూసితీరవలసిందే.

సీతారాములు విడిదిచేసిన పర్ణశాల

శిల్పకళా-శోభితం-కల్యాణ-మండపంభద్రాచల క్షేత్రానికి ఉత్తర దిశలో 35 కిలోమీటర్ల దూరంలో వుంది పర్ణశాల గ్రామం. ప్రక్కనే గలగలపారే గాదావరి తీరంలోని ఈ గ్రామం ప్రకృతి అందాలకు నిలయం. శ్రీరాముడు వనవాసకాలంలో చివరి రోజుల్లో ఇక్కడే గడిపినట్టు, రామాయణ కావ్యంలోని ప్రధానఘట్టాలు ఈ ప్రాంతంలోనే జరిగినట్టు ప్రతీతి. శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేస్తూ ఈ ప్రదేశంలోనే పర్ణశాల నిర్మించుకున్నాడు. మాయ లేడి రూపంలో మారీచుడు పర్ణశాల ప్రదేశాలలో సంచరించడం, మాయలేడి కోసం శ్రీరాముడు వెళ్ళిన తరుణంలో మాయారూపుడై వచ్చిన రావణుడు సీతాదేవిని అపహరించడం, లక్ష్మణుడు సీతాదేవికి రక్షణగా గీసిన లక్ష్మణరేఖలు, తదితర ఘట్టాలన్నీ ఈ పర్ణశాల వద్దే జరిగాయన్నది పౌరాణికుల మాట.

ఇప్పటికీ ఈ రామాయణ ఘట్టాలన్నింటినీ తెలియజేసే విధంగా పర్ణశాలలో నిర్మించిన పర్ణశాల, సిమెంటుతో తయారుచేసి ఏర్పాటుచేసిన రామాయణ దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

రామాయణ చరిత్రకు, పర్ణశాలకు గల అనుబంధాన్ని తెలియజెప్పే కొన్ని ఆధారాలు, అవశేషాలు ఇప్పటికీ పర్ణశాల ప్రాంతంలో మనకి దర్శనమిస్తాయి. అలనాడు శూర్పణఖ చెట్టు చాటునుంచి రాముడ్ని మోహించిందని, అక్కడి చెట్టును శూర్పణఖగా భావించి పర్ణశాలకు వచ్చే భక్తులు ఆ చెట్టును రాళ్ళతో కొడుతూ వుండేవారు. కాలక్రమంలో ఆ చెట్టు నేల కూలినా ఇప్పటికీ భక్తులు విసిరే రాళ్ళతో ఓ రాతిగుట్ట మనకి దర్శనమిస్తుంది. సీతాదేవిని అపహరించుకొని వెళ్తున్న రావణుని జటాయువు అనే పక్షి అడ్డగిస్తుంది. అది రావణునితో హోరాహోరీ పోరాడి చివరికి నేల కూలుతుంది. జటాయువు నేల కూలిన ప్రదేశాన్నే నేడు ఏటిపాకగా పిలుస్తున్నారు. యుద్ధంలో రావణుడు జటాయువు రెక్కలను నరికివేసిన ప్రదేశాన్ని రేచపల్లిగా నామకరణం చేశారు.

సీతమ్మవారు స్నానాలు చేసిన వాగును సీతవాగుగా, జటాయువు రావణునితో పారాడినప్పుడు దుమ్మురేగిన ప్రదేశాన్ని దుమ్ముగూడెంగా, రావణుని రథచక్రాలు తగిలిన గుట్టలను రథపుగుట్టలుగా, సీతాసమేతంగా శ్రీరాముడు కూర్చున్న శిలలు, సీతాదేవి నారవస్త్రాలు ఆరవేసిన శిలలు నేటికీ పౌరాణిక ఆధారాలుగా నిలచాయి.

భద్రాచలానికి 30 మైళ్ళ దూరంలో శబరి, గోదావరి సంగమించే ప్రాతంలో ప్రస్తుతం శ్రీరామగిరిగా వ్యవహరిస్తున్న కొండలనే వాలి, సుగ్రీవుల ఆవాసమైన గిరిశిఖరాలుగా భావిస్తారు. పావన భద్రాచల క్షేత్రం సమీపంలో ఇలా దర్శనీయ స్థాలాలు ఎన్నోవున్నాయి.