సి.ఎం పదవికి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా

By: వి. ప్రకాశ్‌

తెలంగాణ సమస్య పరిష్కారానికై కాసు బ్రహ్మానంద రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్‌ 10న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవించారు. ఏడున్నరేళ్ళుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి సెప్టెంబర్‌ 11న రాజీనామా చేసారు. రాజీనామా నిర్ణయానికి రావడానికి పూర్వం ముఖ్యమంత్రి ఇందిరా గాంధీతో పదిహేను నిముషాలు చర్చలు జరిపారు. 1972 ప్రారంభంలో శాసనసభకు ఎన్నికలు జరుగనున్నందున తెలంగాణా సమస్య పరిష్కారానికై కాసు రాజీనామా ప్రభుత్వానికి వీలు కలిగిస్తుందని శ్రీమతి గాంధీ సూచించినట్లు పత్రికలు తెలిపాయి.

తెలంగాణ ప్రాంతాన్ని ఆంధప్రదేశ్‌లో కొనసాగించడానికి గాను బ్రహ్మానందరెడ్డి పదవి నుంచి వైదొలగాలని శ్రీమతి గాంధీ అభిప్రాయపడిందని పత్రికలు వెల్లడించాయి. బస్సురూట్ల జాతీయకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి 1964 ఫిబవరి 23 న రాజీనామా చేయడంతో బహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి 29న బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ నుండి ఫిబ్రవరి 12 న హైదరాబాద్‌కు వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ ‘‘కేంద్రంలో కొంత మంది నేను రాజీనామా చేస్తే రాష్ట్ర సమైక్యత నిలబడగలదని భావించారు. అందువల్లనే నేను రాజీనామా చేశాను’’ అని అన్నారు.

చెన్నారెడ్డి ప్రతిపాదించిన ఆరు కోర్కెల గురించి ప్రశ్నించగా ‘‘బుజ్జగింపు విధానానికి కూడా పరిమితులున్నాయి. గొంతెమ్మ కోర్కెలు కోరితే అవి అధిగమించజాలని చిక్కులను సృష్టించగలవ’’ని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసినట్లు సెప్టెంబర్‌ 11 రాత్రి ప్రధాని సచివాలయం అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రకటనకు ముందు మరోసారి బ్రహ్మానంద రెడ్డి ప్రధానిలో 95 నిముషాలు సమావేశమైనారు. ఈ చర్చలలో ప్లానింగ్‌ శాఖామంత్రి సుబ్రహ్మణ్యం, ఆరోగ్యశాఖా మంత్రి ఉమాశంకర్‌ దీక్షిత్‌ కూడా పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ఏకటనలో – ‘‘బ్రహ్మానంద రెడ్డి తన దేశానికి, కాంగ్రెసుకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌కు తన పరిపాలనా కాలంలో సమర్ధతతో, ప్రతిభతో సేవచేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాలలో సర్వతో ముఖాభివృద్ధిని ఆయన సాధించారు. రాష్ట్ర భవిష్యదభివృద్ధికి సుస్థిరమైన పునాది వేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ సమైక్యానికి దోహదం చేయాలన్న తన నిరంతర సేవాభావనకు అనుగుణంగానే ఆయన వైదొలగడానికి సంసిద్ధులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఐకమత్యాన్ని, రాష్ట్ర సమగ్రతను కాపాడడానికి, సామరస్య వాతావరణాన్ని సృష్టించడానికి ఆయన ఈ విధంగా పదవీ విరమణ చేస్తున్నారు.

ఈ చర్యను నేను అభినందిస్తున్నాను. రానున్న గడ్డు రోజులలో పార్టీకి, దేశానికి ఆయన సేవలు లభించగలవని కూడా ఆశిస్తున్నాను అని ప్రధాని మాటలను పత్రికా ప్రకటన ద్వారా ప్రధాని సచివాలయం ప్రజలకు తెలిపింది.

ముఖ్యమంత్రికి చెన్నారెడ్డి అభినందనలు
తెలంగాణా సమస్య పరిష్కారానికి సహాయకరంగా సి.యం. బ్రహ్మానంద రెడ్డి పదవి నుండి వైదొలగడానికి నిర్ణయించినందుకు ఆయనను తెలంగాణా ప్రజా సమితి నాయకుడు డా॥ చెన్నారెడ్డి అభినందించారు. ఈ విషయంలో చొరవ తీసుకున్నందుకు ఇందిరా గాంధీని ఆయన అభినందించారు.

శాశ్వత పరిష్కారం కాదు: పిట్టీ
‘‘ముఖ్యమంత్రి పదవి నుండి బ్రహ్మానంద రెడ్డి వైదొలగడం తెలంగాణా సమస్యకు శాశ్వత పరిష్కారం కాజాలద’’ని ఎస్‌.ఎస్‌.పి. నాయకుడు బద్రీవిశాల్‌ పిట్టీ అన్నారు. ‘‘ప్రస్తుతానికి తెలంగాణ సమస్య చల్లార వచ్చు, కానీ తిరిగి మరింత ఉధృత రూపంలో ఇది బయట పడుతుంద’’ని పిట్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధానితో చర్చలకు చెన్నారెడ్డి ఢిల్లీ ప్రయాణం
సెప్టెంబర్‌ 13న కేంద్ర ప్రణాళికా మంత్రి సుబ్రహ్మణ్యంతో హైదరాబాద్‌లో చర్చలు జరిపిన చెన్నారెడ్డి తదుపరిదశ చర్చలకై ప్రధానిని కలవడానికి ఆమె ఆహ్వానం పై ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణా సమస్య పరిష్కారానికి తాను సూచించిన ఆరు అంశాల పథకంలో భాగంగా వున్న మిగిలిన చర్యలను తీసికొనే విషయమై తాను కేంద్రమంత్రితో చర్చించినట్లు డా. చెన్నారెడ్డి చెప్పారు. ముల్కీ నిబంధనలు అమలు జరపడం, తెలంగాణా ప్రాంతీయ సంఘానికి చట్ట సమ్మతమైన అధికారాలు కల్పించడం, తెలంగాణా ఆర్థికాభివృద్ధిని సాధించడం తాము సూచించిన పధకంలోని ఇతర అంశాలని డా॥ చెన్నారెడ్డి తెలిపారు.

ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనం పై …చెన్నారెడ్డి
ప్రజాసమితిని కాంగ్రెస్‌ (కొత్త) పార్టీలో విలీనం చేసే సమస్యపై కార్యవర్గం చర్చించిందని, అయితే ఈ విషయమై ఎలాంటి నిర్ణయాన్ని గైకొన లేదని డా॥ చెన్నారెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 17న సమితి కార్యవర్గం తిరిగి సమావేశమై ఈ అంశం పై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఆంధ్ర-తెలంగాణ నేతలతో సుబ్రహ్మణ్యం చర్చలు
ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి రాజీనామా కారణంగా నూతన నాయకుని ఎన్నిక కోసం కేంద్ర ప్రణాళికా మంత్రి సి. సుబ్రహ్మణ్యం సెప్టెంబర్‌ 12 న హైదరాబాద్‌కు వచ్చి ఆంధ్ర, తెలంగాణ శాసన సభ్యులతో, మంత్రులతో, ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపారు. నూతన నాయకుని ఎన్నిక సామరస్యంగా జరగగలదని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులంతా ప్రధాని నిర్ణయానికి కట్టుబడి, ఉండడానికి అంగీకరించినట్లు తనతో అన్నారని మంత్రి తెలిపారు. బ్రహ్మానంద రెడ్డి రాజీనామా తర్వాత రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదన్నారు. సుబ్రహ్మణ్యంను కలిసిన తెలంగాణా నేతల్లో జె.వి. నర్సింగారావు, జె.సి. వెంకన్న, చొక్కారావు, వి.బి. రాజు వున్నారు. డా॥ చెన్నారెడ్డితో రెండు పర్యాయాలు సుబ్రహ్మణ్యం చర్చలు జరిపారు.

స్థానిక స్థాయిలో ప్రణాళికా సంఘాల ఆవశ్యకత
రాష్ట్ర పరిశ్రమల శాఖ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రితో బాటు పాల్గొన్న ప్రణాళికా మంత్రి సి. సుబ్రహ్మణ్యం ‘‘ప్రాంతీయ ఆర్థిక అసమానతలను తొలగించడానికి అవసరమైన సాంకేతిక నిపుణులతో స్థానిక ప్రణాళికా సంఘాలు ఈ లక్ష్య సాధనకు తోడ్పడతా’’యన్నారు.

‘‘సమతూకంలో ప్రాంతీయాభివృద్ధి’’ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సరైన పద్ధతుల ద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించకపోతే ఆ అవకాశాన్ని విచ్ఛిన్న శక్తులు ఉపయోగించుకుంటాయ’’ని ఆయన హెచ్చరించారు. ‘‘ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి మొదటి చర్యగా సమగ్రమైన సర్వే జరపడం, నిర్దిష్ట కార్యక్రమాలను చేపట్టడం అవసరం. ప్రాంతీయ అసమానతల తొలగింపుకు తెలంగాణా, విదర్భ, హర్యాణా, అస్సాంలోని కొండల ప్రాంతంలో బయలుదేరిన ఆందోళనలను ప్రస్తావించి, ఆ ఉద్యమాలను చిన్న చూపుతో చూడకూడదు. వాటి పట్ల సానుభూతితో వ్యవహరించవలసిన అవసరం ఉంద’’ని కేంద్ర మంత్రి అన్నారు.

మంత్రివర్గం రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం
సెప్టెంబర్‌ 15న బ్రహ్మనంద రెడ్డి తన మంత్రివర్గం రాజీనామా లేఖను గవర్నర్‌ ఖండూభాయ్‌ దేశాయ్‌కు సమర్పించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు అధికారంలో కొనసాగవలసిందిగా ఆయనను గవర్నర్‌ కోరినారు. బ్రహ్మానందరెడ్డితో వ్యవసాయ శాఖామంత్రి కాకాని వెంకటరత్నం కూడా గవర్నర్‌ను కలిసారు.

ప్రధానితో చెన్నారెడ్డి చర్చలు
సెప్టెంబర్‌ 15న ఢిల్లీతో తెలంగాణ సమస్యపై ప్రధానితో డా. చెన్నారెడ్డి అరగంటసేపు చర్చలు జరిపారు. తెలంగాణా ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనం గురించి, ప్రజా సమితి ప్రతిపాదించిన ఆరు సూత్రాల గురించి చర్చించినట్లు పత్రికలు వార్తలు వెలువరించాయి. తెలంగాణకు ప్రత్యేక పి.సి.సి కావాలని, కనీసం పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతం వారే ఉండాలని డా. చెన్నా రెడ్డి ప్రధానితో అన్నట్లు పత్రికలు పేర్కొన్నాయి.

ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీన నిర్ణయం
ఇందిరా గాంధీ నాయకత్వం వహిస్తున్న కొత్త కాంగ్రెస్‌ పార్టీలో తెలంగాణ ప్రజా సమితి విలీనం కావాలని సమితి కార్యవర్గం 1978 సెప్టెంబర్‌ 17న నిర్ణయించింది.

ప్రజా సమితి కార్యవర్గం తీర్మానాన్ని సమితి కౌన్సిల్‌ ధృవపర్చవలసి ఉంది. కొత్త కాంగ్రెస్‌లో విలీనం కావాలనే తమ తీర్మానాన్ని ఏఐసిసి ఆమోదించిన వెంటనే అన్ని స్థాయిల్లోనూ తెలంగాణ ప్రజా సమితి కొత్త కాంగ్రెస్‌లో విలీనం కావాలని ఆ తీర్మానంలో వివరించారు.

కార్యవర్గం సమావేశం తర్వాత ప్రజా సమితి అధ్యక్షుడు డా॥ చెన్నారెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ 31 మంది కార్యవర్గ సభ్యులలో 29 మంది సమావేశానికి హాజరైనారని అన్నారు. విలీన తీర్మానానికి, ఏక గ్రీవామోదం లభించిందని, నూకల రామచంద్రారెడ్డ్డి, మాచర్ల రామారావులు ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలిపారు.
‘ప్రత్యేక తెలంగాణ సాధించాలనే సమితి పథకానికి, కొత్త కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి ఏ విధంగా పొత్తు కుదురుతుంద’ని, ‘‘కొత్త కాంగ్రెస్‌ సమైక్య రాష్ట్రాన్నే కొనసాగించే విధానాన్ని అవలంబిస్తుంద’’న్న ఒక విలేకరి ప్రశ్నకు సుదీర్ఘంగా జవాబిచ్చారు డా.చెన్నారెడ్డి. ‘‘ప్రత్యేక తెలంగాణ కంటే ప్రజలకు జరిగే ప్రయోజనాలే’ అత్యంత ముఖ్యం. కొత్త ప్రయోగం ద్వారా అట్టి ప్రయోజనాలను సాధించడానికి సమైక్య రాష్ట్రం యంత్రాంగం ద్వారా ముందుకు పోవడమంటే తమ లక్ష్యం వైపుగా పయనించడమే’’నని చెన్నా రెడ్డి అన్నారు. ఈ ప్రయోగం విఫలమైతే మొత్తం పరిస్థితిని పునఃసమీక్షించాలనే షరతు వుంది. ఈ సమీక్షను ప్రధాని స్వయంగా చేయగలరు. ‘‘సమితి ఆరు అంశాల కార్యక్రమంలో ఒక అంశాన్ని మాత్రమే (సి.ఎం. రాజీనామా) ఆమోదించారు. మిగిలిన అంశాలపై నిర్ణయం గైకొనవలసి వుంది. మేము అప్రమత్తంతో, జాగరూకతతో వుంటాము. ఈ ప్రయోగం సఫలీకృతం కావడానికి ఈ చర్యలు అవసరం. ప్రధాని, కాంగ్రెస్‌ అధ్యక్షులు, అదిష్టానం ఆహ్వనం మేరకు ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నది. ప్రధానిలో పూర్తి విశ్వాసం వుంది. సమగ్ర రాష్ట్రం లోనే నూతన ప్రయోగం అమలుకు నాలుగు సంవత్సరాలు పనిచేస్తాము. ప్రధానిపై ప్రజలకున్న విశ్వాసం దృష్ట్యా, ఆమె అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాల దృష్యా కొత్త కాంగ్రెస్‌లో విలీనీకరణ అవసరమైంద’’ని చెన్నారెడ్డి అన్నారు.

ప్రధాని నిర్ణయాల పట్ల ప్రజాసమితి సంతృప్తి
సెప్టెంబర్‌ 17 న ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన డా. చెన్నారెడ్డిని విలేకర్లు పలు ప్రశ్నలతో ముంచెత్తారు.

ఆయన సమాధానాలు:
‘‘ప్రధానితో చర్చల్లో నూతన సి.ఎం కోసం పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ప్రధాని నిర్ణయానికే వదిలేశాను. ‘

‘తెలంగాణా ప్రజా సమితి సూచించిన ఆరు అంశాల ప్రతిపాదనలు కేవలం ఒకే ఒక అంశంగా దిగజారి పోయినవనే వాదన ‘కవ్వింపు చర్య’. ఇట్టి వాదన విని రెచ్చిపోబోము. ఇవి అవివేకి చెప్పే మాటలు.

‘‘ప్రధానితో జరిపిన చర్చలలో ఆరు అంశాలలోని మిగిలిన విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే కొత్త నాయకుని గురించే ప్రధానంగా చర్చించాం. ఆరు అంశాల్లోని ఇతర అంశాలూ ముఖ్యమైనవే. ప్రధాని ఈ అంశాలను పరిశీలించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారనే విశ్వాసంతో వున్నాం. ‘‘తెలంగాణా ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనం కావడానికి నిర్ణయం తీసుకున్న మరుక్షణంలోనే తన ‘‘షాప్‌ (దుకాణం)’’ మూత పడుతుంద’’ని డా. చెన్నారెడ్డి చమత్కరించారు.

తెలంగాణ ప్రజా సమితి రద్దు-పార్టీ కౌన్సిల్‌ ధృవీకరణ
1971 సెప్టెంబర్‌ 18న తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సమావేశమై గత రాత్రి కార్యవర్గం ఆమోదించిన ‘‘కాంగ్రెస్‌లో టి.పి.ఎస్‌ విలీనం’’ తీర్మానాన్ని ధృవీకరించారు. కొత్త కాంగ్రెస్‌లో బేషరతుగా విలీనం కావాలన్న ప్రజాసమితి కార్యవర్గం తీర్మానాన్ని నాలుగు గంటల సమావేశానంతరం రాష్ట్ర కౌన్సిల్‌ ఆమోదించింది.
తెలంగాణా ప్రజా సమితి సభ్యులు శాసన సభలో 28 మంది, పార్లమెంట్‌లో 10 మంది వున్నారు. ప్రజాసమితి రాష్ట్ర కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానంలో ప్రధానిపట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

వచ్చె సంచికలో …..
‘‘ ప్రజాసమితి రద్దు పట్ల తీవ్ర నిరసనలు’’