|

బౌద్ధ వారసత్వవనం బుద్ధవనం

By: శ్యామ్‌ సుందర్‌

తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి. థేరవాద, మహాయాన, వజ్రాయాన బౌద్ధ కేంద్రాలుగా గోదావరి నదీతీరం నుండి, కృష్ణా నదీ తీరం వరకు, అలాగే మంజీరా, మూసీ బిక్కేరు తదితర నదీతీరాల వెంబడి బౌద్ధ ప్రాభవ స్థలాలు నేటికీ వెలుగు చూస్తునే ఉన్నాయి. ఇంతటి చారిత్రక వారసత్వ బౌద్ధ ప్రదేశాలు ముఖ్యంగా కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌, ఫణిగిరి, నేలకొండపల్లి బౌద్ధ చారిత్రక స్థలాలలో లభ్యమైన శిల్పాలు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. బుద్ధుని జీవితకాలంలో గోదావరి తీరంలోని అస్మక జనపథంలో నివసించిన బావరి స్థావరం స్థూపాలు, కట్టడాలు బావాపూర్‌ కుర్రుగా పిలువబడుతున్న ద్వీపం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది నేటి నిర్మల్‌ జిల్లా, ఖానాపూర్‌ మండలంలో ఉంది.

అయితే ఇంతటి గొప్ప చారిత్రక వారసత్వ కేంద్రాలుగా విలసిల్లిన బౌద్ధ స్థావరాలు గత పాలకుల నిర్లక్ష్యంతో మరుగున పడ్డాయి. అయినా బౌద్ధంలోని అంశాలైన ప్రేమ, దయ, కరుణ, జాలి అంతర్లీనంగా తెలంగాణ ప్రజలతో బౌద్ధం అవిశ్రాంతంగా ప్రయాణిస్తూనే ఉందన్నది సత్యం. ఒకప్పుడు మహాయాన బౌద్ధ కేంద్రంగా క్రీ.శ. 2`3 శతాబ్దాలలో ఇక్ష్వాకుల రాజధానిగా విలసిల్లిన శ్రీ పర్వత విజయపురిగా పిలువబడ్డ, రెండవ బుద్ధునిగా ప్రఖ్యాతి గాంచిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో నాగార్జున సాగర్‌ ఎడమ గట్టున తెలంగాణ బౌద్ధ వారసత్వ కేంద్రంగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనాన్ని రూపకల్పన చేయడం, భౌగోళికంగా ఆ ప్రదేశం రావి ఆకును పోలి ఉండడం యాదృశ్చికంగానే జరిగినా బుద్ధుని కార్యకారణ వాదాన్ని నేటికి సంఘటితపరుస్తుందనేది నిర్వివాదాంశంగా చెప్పుకోవచ్చు. బావరి స్ఫూర్తితో, శాతవాహన రాజుల కాలంలో మొగ్గతొడిగిన బౌద్ధవారసత్వానికి అద్దం పట్టేలా, భావితరాలకు బౌద్ధం అన్ని విధాల మార్గదర్శనం చెయ్యాలనే తలంపుతో, ఆనాటి బౌద్ధాన్ని కళ్ళెదుట నిలిపేదే బుద్ధవనం.

బుద్ధుని త్రిరత్నాలను, చతురాద్య సత్యాలను, పంచశీలను, అష్టాంగ మార్గాలను అడుగడుగునా నేటి తరానికి అందించాలనే ఆశయం, అలాగే రాబోయే తరాలకు బౌద్ధం దిశా నిర్దేశం చేస్తుందనే నమ్మకం బుద్ధవనాన్ని ప్రారంభించడానికి కార్యకారణం అయిందనే చెప్పాలి.

బుద్ధవనం ప్రాజెక్టును ఆర్య అష్టాంగమార్గాలకు ప్రతీకలుగా 8 విభాగాలతో ప్రారంభించడం జరిగింది. 2003 సంవత్సరంలో మొదలైన పనులు ముందుగా ప్రవేశ ద్వారం, బుద్ధ చరితవనం, జాతక వనం, ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూప శిల్పవనం అనే అంశాలను ప్రధానంగా నిర్మించడం జరిగింది. ఇక ఒక్కో విభాగంలో….

స్వాగత వనం (ప్రవేశ ద్వారం)

ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మించిన ఈ స్వాగతవనంలో పర్యాటకులకు పార్కింగ్‌, ఫుడ్‌ కోర్టులు, వసతి సదూపాయాలతో కూడుకొన్న ప్రధాన స్వాగత ద్వారం దానికిరువైపులా భారీ ఏనుగు శిల్పాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. మొదటి మెట్టుగా చంద్రశిల, మన తెలుగు సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి తదితర శిల్ప ఫలకాలు, ఇక చతురస్రాకార శిల్పకుడ్యాలు, నాలుగు ద్వారాలుగా ఏర్పాటు చేసిన శిల్పాలలో పర్యాటకులకు ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా, థేరవాద, మహాయన శిల్ప ఫలకాలైన, అష్ఠమంగల చిహ్నాలు, బోధివృక్షం, బుద్ధపాదాలు, నాగముచిలింద, వివిధ జంతువులు, పక్షులు, దంపతీశిల్పాలు చూడముచ్చటగా పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. స్వాగత వనంలో అందరినీ ఆకర్షించే 14 అడుగుల ఎత్తైన ధర్మచక్ర స్థంభము, ఇతర శిల్ప ఫలకాలన్నీ కొత్తగా చెక్కినవే ఐనా ఆనాటి అమరావతీ, ఫణిగిరి శిల్పాలను చూసిన అనుభూతికలుగుతుంది. సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది విభాగాలుగా చేసిన వలయాకార రోడ్డు 3కి.మీ. చుట్టుకొని వస్తుంది. ఈ వలయంలోనే…

జాతక వనం (బోధిసత్వుని జాతక కథలు)

సిద్ధార్థ గౌతముని గత జన్మలకు సంబంధించిన కథలను హృద్యంగా చెక్కిన శిల్ప ఫలకాలు దశపారమతలైన దాన, శీల, క్షమ, వీర్య, ధ్యాన, ప్రజ్ఞ, త్యాగ, సత్య, కరుణ, సమతలను కళ్ళకు కట్టినట్లుగా మనకు వివరించే 40 శిల్ప ఫలకాల వనమే జాతక వనం. ఈ జాతక వనం మధ్యభాగంలో భారీ ఎత్తులో (14 అడుగులు) ఏర్పాటు చేసిన శిల్ప కుడ్యం రెండు వైపులా మన దృష్టిని, తిప్పుకోకుండా చూసేవిధంగా చెక్కిన శిల్ప స్థంభాలు, తామర రేకులు బుద్ధుని చిహ్నాలు, జాతక కథలు, జీవిత సన్నివేశాలు, పుష్ప వాహకులు తదితర దృశ్యాలన్నీ మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి.

ధ్యానవనం (మెడిటేషన్‌ పార్కు) :`

ఈ ధ్యానవనంలో శ్రీలంక ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 27 అడుగుల అవుకాన (సిమెంట్‌) శిల్పము, క్రీ.శ. 5వ శతాబ్దంలో అప్పటి సింహళ రాజైన ధాతుసేనుడు చెక్కించిన రాతి అవుకాన శిల్పానికి నమూనాతో శ్రీలంక ప్రాంతీయ శిల్పకళతో సింహాలు, పూర్ణ కుంబాలు, స్వాగత శిల్పాలు, అర్ధ చంద్రాకార శిల్ప ఫలకం ధ్యాన వనానికి ప్రత్యేక ఆకర్షణ. ధ్యానవనాన్ని సందర్శించే పర్యాటకులు ప్రశాంత చిత్తంతో ఎవరికి వారు ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వనమే ధ్యానవనం.

స్థూపవనం (సూక్ష్మ స్థూపాల నమూనాలు) :`

ఈ స్థూపవనంలో భారతదేశంలోని ప్రధాన స్థూపాలను మధ్య కేంద్రముగా దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలోని స్థూపాకృతుల వాటివాటి ప్రాంతీయ శైలి కట్టడాలు పర్యాటకులకు ఆయా స్థూపాలన్నీ ఒకే ప్రదేశంలో చూపించాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన స్థూప నమూనాలు, భారతదేశంలోని కార్లె, అజంతా, సాంచీ సారనాథ్‌ మాణిక్యాల ఇతర దేశాలలోని స్థూపాలనై అనురాధ పుర (శ్రీలంక), మీర్‌పూర్‌ఖాస్‌ (పాకిస్తాన్‌), బోధ్‌నాథ్‌ (నేపాల్‌), టాప్‌దొర (అఫ్ఘనిస్తాన్‌), చాహింద్‌ (థాయ్‌లాండ్‌), చోర్‌టెన్‌ (టిబెట్‌), షవాండ (మయన్మార్‌), పగోడ (సౌత్‌కొరియా) మొదలైన 13 రకాల స్థూపనమూనా కట్టడాల వనమే స్థూపవనం.

మహాస్థూప శిల్పవనం :`

బుద్ధవనం ప్రాజెక్టుకు హృదయ స్థానం అయిన మహాస్థూపం అమరావతి స్థూప కొలతలననుసరించి 70 అడుగుల ఎత్తు 140 అడుగుల వెడల్పుతో (విఆర్‌సిసి) డోమ్‌ (అండము) నిర్మాణం చేయబడిరది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆడిటోరియం బౌద్ధ వారసత్వ ప్రాంతీయ శిల్ప చిత్రాలతో ఒక ప్రదర్శన శాల ఆచార్య నాగార్జునుడి లోహ శిల్పం మొదలయినవి ఏర్పాటు చేయడం అలాగే నాలుగు వైపులా స్వాగత ద్వారాలు శిల్పఫలకాలతో అష్టమంగళ చిహ్నాలు, అజంతా శిల్పాలు, జాతక కథల సన్నివేశాలతో ఏర్పాటు చేయబడినవి.

ముఖ్యంగా ‘‘స్థూపం అత్యున్నతమ్‌ నానాశిల్ప సుచిత్రమ్‌’’ అన్నట్లు మొదటి ప్రదక్షణా పథంగా పిలవబడే వేదిక (డ్రమ్‌) విభాగము 5 అడుగుల ఎత్తు స్థూపం నాలుగు వైపులా ఆయక వేదిక స్థంభాలు (14 అడుగుల ఎత్తు) బుద్ధుని జీవితంలో ప్రధాన ఘట్టాలైన జననం, మహాభినిష్క్రమనం, జ్ఞానోదయం, మొదటి ప్రవచనం, మహాపరి నిర్వాణాన్ని సూచించే శిల్పాలు చిహ్నాలైన ఏనుగు, అశ్వము, బోధివృక్షం, ధర్మచక్రము స్థూపములను స్థంభం పైభాగంలో చూపరులను నలువైపులా ఆకట్టుకొంటాయి. ఇక వేదిక శిల్ప ఫలకాలన్నీ సిద్ధార్థుని జీవిత సన్నివేశాలు, స్థూప ఫలకాలు, స్థంభాల అమరిక, జాతక కథలు తదితర శిల్పాలన్నీ స్థూప వేదికకు వలయాకారంలో చెక్క అమర్చడం జరిగింది. డోమ్‌ (అండము)గా పిలువబడే రెండో ప్రదక్షణా పథంలో 12 అడుగుల ఎత్తుగల అండ ఫలకాలు క్రింద రాతికంచెతో చెక్కబడిన ఆధారశిల, దానిపై 3 భాగాల ఫలకం (3 టైర్డ్‌ పానెల్స్‌) సింహాల వరుస, త్రిరత్నాలు, పూర్ణకుంబాల వరుస, దానిపై చివరగా కప్పురాయి స్థూపానికి అండఫలకాలు అత్యద్భుత అమరావతి ఫణిగిరి శిల్పకళను మన కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తాయి. ఇక మూడు భాగాలుగా గల ఫలకాలతో బోధివృక్ష, బుద్ధుని సింహాసనం పాదాలు, స్థూపారాధన శిల్పాలు, సిద్ధార్థుని జననానికి ముందుగల దీపాకర శిల్పం, మాయా దేవి స్వప్నం, జననం బాల్యదశలో గల సన్నివేశాలు ఏరువాక, యుద్ధ విద్యలు నేర్చుకొన్న ఘట్టాలు, అన్ని ప్రాణులయందు భూతదయ, యశోధరతో వివాహం, సిద్ధార్థునికి తారసపడిన నిమిత్తాలు, మహాభినిష్క్రమణం, అప్పటి గురువులైన ఆలారకలామీ ఉద్దకరామ పుత్రులను కలిసే సన్నివేశాలు, కఠోర దీక్ష సాధనతో శరీరాన్ని శుష్కింపజేసుకొని మధ్యే మార్గాన్ని సుజాత అందించిన పాయసంతో సాధన చేయడం, అన్ని రకాల మానసిక సంఘర్షణలను బాహ్య అడ్డంకులను అధిగమించి వైశాఖ పున్నమి పర్వదినాన బోధి వృక్షం నీడన సమ్యక్‌ సంభోదిని పొందిన సన్నివేశము, మొదటి ప్రవచనం, బుద్ధం, ధర్మం, సంఘం నిర్మాణ మహపరి నిర్వాణం తర్వాత అశోకుడు బౌద్ధానికి ఆకర్షితుడై తాను తోడ్పాటునందించే సన్నివేశాలు ప్రపంచం నలువైపులా స్థూప నిర్మాణాలు, శాసనాలు వేయించిన ఘట్టాలు, బౌద్ధ సంగీతులు, బౌద్ధ ఆచార్యులు వారు బౌద్ధాన్ని ప్రచారం చేసిన విధముగా, క్రీ.శ. 6వ శతాబ్దం నుండి క్రీ.శ. 8వ శతాబ్దం వరకు బౌద్ధం అత్యున్నత స్థాయిలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఫరిఢవిల్లి, తదనంతరం ఉనికిని మార్చుకొన్నా, బౌద్ధం మళ్ళీ పునర్జీవనం చెందిన దృశ్యాలు, భారత ప్రభుత్వం జాతీయ జండాలో ధర్మచక్రాన్ని, అధికారిక చిహ్నంగా నాలుగు సింహాల (లయన్‌ కాపిటల్‌) శిల్పాలను తీసుకోవడం, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ బౌద్ధాన్ని ప్రేరణగా తీసుకొని రాజ్యాంగాన్ని రచించడం, నాగ్‌పూర్‌లో లక్షలాది మందితో బౌద్ధాన్ని స్వీకరించి నవయాన బౌద్ధాన్ని ఈ శతాబ్దానికి ఈ తరానికి అందించిన సన్నివేశాలన్నీ మనల్ని బౌద్ధ వారసత్వ శిల్ప వనంలో విహరింపజేస్తాయి. ఈ శిల్పాలన్నీ సుమారు వెయ్యికి పైగా ఫలకాలు, లక్షకుపైగా బొమ్మలతో 1700 సంవత్సరాల తర్వాత మళ్ళీ 21వ శతాబ్దపు అద్భుత శిల్ప కళా కేంద్రంగా ప్రముఖ ఆళ్ళగడ్డ శిల్పులు దురుగడ్డ హరిప్రసాద్‌, హర్షవర్ధన్‌ సుమారు 200 మంది శిల్పులతో 8 సంవత్సరాలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శిల్పకళా శోభితంగా తీర్చిదిద్దారు.

మహాస్థూపానికి నాలుగు వైపులా పై భాగంలో అండఫలకాల మధ్యలో టేకు కర్రతో చెక్కిన ద్వారాలు మహా స్థూపానికి మరో ప్రత్యేకత. 9 అడుగుల ఎత్తు 19 అడుగుల వెడల్పుగల ద్వారాలను ఫణిగిరి శిల్పాలను అనుకరిస్తూ ప్రభావళి, ధర్మచక్రంను సింహాలు మోస్తున్నట్లు లతలు, హంసలు, తామర పుష్పాలు వివిధ వరుసలుగా, ఇక ద్వారాలకు రెండువైపులా ఆచార్య నాగార్జునిడిని చెక్కడం దాని క్రింద భాగాన అద్భుతమైన లతలను పట్టుకున్న మాలవాహకులు కన్పిస్తారు. ఈ ద్వారాలను మహాబలిపురం దారు శిల్పులు అనురాధా టింబర్స్‌ వారి ఆధ్వర్యంలో చెక్కడం జరిగింది. మహాస్థూపం పై అంతస్థులో ద్వారాలను దాటగానే లోపలి భాగం మధ్య స్థానంలో 28 అడుగుల సువర్ణమయ శిల్ప స్థూపం బుద్ధవనాన్ని సందర్శించే వారికి మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.

అద్భుతమైన లతలతో ఏర్పాటు చేసిన వలయాకార పీఠంపై క్రింద భాగం చతురస్రాకార పాద భాగానికి నాలుగువైపులా మూలలందు 8 వృత్తాకార స్థంభాలు ప్రధాన ద్వారాలకు ఎదురుగా 4 వైపులా 9 అడుగుల బుద్ధుని విగ్రహాలు, ధర్మచక్ర ప్రవర్తనా ముద్రలో మనకు దర్శనమిస్తాయి. ఇక నాలుగు వైపులా మూలలందు 4 అడుగుల బుద్ధుని విగ్రహాలు మొత్తం 8 విగ్రహాలు పంచద్యాని బుద్ధులుగా పిలువబడే అమితాబ్‌ (ధ్యానముద్ర), అక్షోభ్య (భూమి స్పర్శముద్ర), రత్న సంభవ (వరదముద్ర), అమోఘసిద్ది (అభయ చిన్ముద), వైరోచన (ధర్మ చక్రప్రవర్తనా ముద్ర) ఎనిమిది దిక్కులందు సందర్శకులను తమవైపుకు తిప్పుకుంటాయి. స్థంభాలపై భాగము ప్రస్తరముపై అండాకారంలో కూడిన స్థూపము, దానిపై చతురస్రాకార చాత్ర మష్ఠి, మధ్య భాగంలో మూడు తలములతో కూడిన చత్రము (స్థూపి)తో కేంద్ర స్థానంలో ఉన్న స్థూపమే బుద్ధవన మహాస్థూపానికి అద్భుతమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చును.

మహాస్థూపం డోమ్‌ లోపలి స్లాక్‌ ఉపరితలాన్ని అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి మధ్య స్థూపం పై చుట్టూ ఉన్న భాగాన్ని ద్వారాల పైభాగం నుండి డోమ్‌ లోపలి భాగంలో 16 చతురస్రాకార స్థంభాలు, వాటిపై వలయాకారం దూలం (రింగ్‌ బీమ్‌) మీద నుండి 30 అడుగుల ఎత్తును 16 వరుసలతో 528 తామర రేకులను ఆకాశంపైనుండి మధ్య గల స్థూపాన్ని తామర రేకులతో వర్షిస్తు ఆరాధిస్తున్నామనే భావనను కల్గించే విధంగా అమర్చిన తీరు బౌద్ధ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా ఆల్యూమినియం ఫలకాలతో జర్మనీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన తీరు ప్రపంచం నలుమూల నుండి జాతీయ, అంతర్జాతీయ ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక తామర రేకుల పై నుండి మరో 30 అడుగుల అర్థ చంద్రాకార ఉపరితలం ఆకాశం, మేఘాలు ఎప్పటికప్పుడూ మారుతున్నట్లునిపించే డైనమిక్‌ రంగులను (పర్యావరణహిత) డిజిటల్‌గా ముద్రించిన అల్యూమినియం ఫలకాలు, తామర రేకులన్ని శబ్ద తరంగాలను గ్రహించే పర్యావరణహితంతో బాహ్య ప్రపంచంతో సందర్శకులను అద్వితీయమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. మొత్తంగా బుద్ధవనం కేంద్ర స్థానమైన మహాస్థూపలోపలి భాగాన్ని సందర్శించిన పర్యాటకులను బంగారు వర్ణంలో, పంచద్యాన బుద్ధులతో ఉన్న స్థూపం తామర రేకులు, ఆకాశ అద్భుతాన్ని తలపించే అమరికలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌, క్రిస్టల్‌ తామర పూవుల వరుస తదితర నైపుణ్యాలన్నీ పర్యాటకులను బౌద్ధ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళి వారివారి మానసిక ప్రశాంతతను ద్విగుణీకృతం చేస్తాయనడంలో సందేహం లేదు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2003 సం॥లో ప్రారంభించిన బుద్ధవనం 274 ఎకరాల విస్తీర్ణం, నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎడమ గట్టున, బుద్ధుని అష్టాంగ మార్గాలకు అనుగుణంగా, జాతీయ, అంతర్జాతీయ బౌద్ధ సంస్థలు, ఆయా సంస్కృతులను ప్రతిబింబించే విధంగా రూపకల్పన జరగడం ఎన్నో యాదృశ్చిక సంఘటనలు, ఎన్నెన్నో కార్యకారణాలతో బుద్ధవనం తెలంగాణా బౌద్ధ వారసత్వ వనంగా రూపు దిద్దుకుంటున్న సందర్భంలో 2011 తర్వాత అప్పటికే ప్రారంభించిన పనులు కొన్ని తుది వరకు చేరుకున్నా మొత్తంగా బుద్ధవనం అర్ధాంతరంగా, అసంపూర్తిగా ఉన్న సందర్భంలో అప్పుడప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ తనను తాను మళ్ళీ పునర్నిర్మించుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తొట్టతొలి రాజకీయ పునశ్చరణ తరగతులను (ప్లీనరీ సమావేశాలు) 2015 ఏప్రిల్‌ 30 నుండి మే 4 వరకు నాగార్జునసాగర్‌లోని చారిత్రక ప్రదేశం నందు విజయ విహార్‌లో నిర్వహించ తలపెట్టడం, మే 4 నాడు 2559వ బుద్ధ జయంతి జరగనుండటం యాదృశ్చికమే అయినా కార్యకారణమేనని అనిపిస్తుంది. ఇక ఆ ప్రత్యేక సందర్భంలో ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మల్లేపల్లి లక్ష్మయ్య కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, వివిధ మంత్రులు, రాష్ట్ర అధికార ప్రజాప్రతినిధులందరూ మే 4, 2015 బుద్ధ జయంతి ఉత్సవాలను బుద్ధవనంలో ప్రత్యక్షంగా సందర్శించి నిర్వహించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించి, బోధి వృక్షాన్ని నాటడం, ఈ నేలకు బౌద్ధ వారసత్వ అనుబంధాన్ని గుర్తుచేసుకొన్న సమయంలో బుద్ధ వనాన్ని దాని ఆవశ్యకతను, భవిష్యత్తు తరాలకు బుద్ధుని శాంతి సందేశాన్ని అందించాలనే సదాశయంతో వెంటనే అక్కడికక్కడే బుద్ధవనాన్ని ఒక ప్రత్యేక అథారిటీని, అధికారిని ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టును అన్ని విధాల పూర్తి చేయడానికి నిధులను ఇస్తామని, తెలంగాణా బౌద్ధ వారసత్వ ప్రతీకగా బుద్ధ వనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తదనుగుణంగా మల్లేపల్లి లక్ష్మయ్యని ప్రత్యేకాధికారిగా నియమించడం, అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి నిధులనుండి 25 కోట్లను విడుదల చేయడం జరిగింది.

బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా నియమితులైన మల్లేపల్లి లక్ష్మయ్య ప్రముఖ బౌద్ధ అధ్యయనకారులు, ఆర్కిటెక్టులు, ప్రభుత్వ అధికారులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలతో, అన్ని విభాగాలలో వివిధ మార్పులు, చేర్పులతో ఆగిపోయిన పనులన్నింటిని తిరిగి చేపట్టడం జరిగింది. అవి అన్ని విభాగాలలో బెంగుళూరు రాతి బండలను పరచడం సెంట్రల్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, ప్రవేశ ద్వారాలు, పర్యాటకులకు వసతులు, మహా స్థూపం బయటలోపల సుమారుగా అన్ని సివిల్‌ శిల్పాల పనులను పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రముఖ బౌద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆహ్వానం మేరకు, బోధ్‌గయ, నేపాల్‌, మలేషియా, తైవాన్‌ దేశాలను సందర్శించిన ప్రత్యేకాధికారి వారిని ఇక్కడకు ఆహ్వానించారు. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణలో ప్రవేశించిన బౌద్ధం దాని చారిత్రక అంశాలను ఇతర బౌద్ధ స్థలాలలో పరిశోధనలు జరిపించారు. తదనుగుణంగా 2017లో తెలంగాణలో అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనం, 2019లో తెలంగాణ బౌద్ధ సంగీతిని పలు ప్రపంచ దేశాల బౌద్ధ అధ్యయనకారులతో నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రోద్భలంతో పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ బుద్ధ వనాన్ని పలుమార్లు సందర్శించి, సమీక్షలు జరిపారు. బుద్ధవనం అధికారులు, పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు, వివిధ పనులను చేపట్టి పూర్తిచేసిన కాంట్రాక్టర్లు, శిల్పులు, ఒకరేమిటి సెక్యూరిటీ, తోటపనివారు మొదలుకొని అత్యున్నత స్థాయి అధికారులందరి కృషితో నేడు బుద్ధ వనం బౌద్ధ ఆధ్యాత్మిక వారసత్వ వనంగా రూపుదిద్దుకున్నది.

బుద్ధ చరిత వనం :`

సిద్ధార్థుని జననం నుండి మహాపరి నిర్యాణం వరకు కళ్ళకు కట్టినట్టుగా లోహ శిల్పాలను మనం చూడవచ్చును.

1. సిద్ధార్థుని జననం మాయాదేవి సాలవృక్షాన్ని పట్టుకొన్నట్లు, అప్పుడే పుట్టిన సిద్ధార్థుడు ఏడు అడుగులు నడిచే సన్నివేశం.

2. కపిలవస్తు నగరంలో సిద్ధార్థునికి తారసపడ్డ దృశ్యాలైన రోగి, వృద్ధుడు చనిపోయిన శరీరము, రోహిణీ నదీ జలాల ముద్ద నివారణ సన్నివేశం, భిక్షువు శిల్పాలన్ని మనల్నీ ఆలోచింపజేస్తాయి.

3. మహభినిష్క్రమణ ద్వార శిల్పంలో, రాజభోగాల సన్నివేశాలు, సింహాసనము, రాజకిరీటము, ఖడ్గము, శయ్యాగృహంలో యశోధర రాహులుడి శిల్పము సిద్ధార్థుని మదిలో జరిగే సంఘర్షణ, మరో వైపు మనిషి పుట్టుక నుండి మరణం వరకు జరిగే పరిణామక్రమము తదితర సంఘటనలు, ఆలోచనా ముద్రలో ఉన్న సిద్ధార్థుడి శిల్పం రాజప్రసాదాన్ని పరిత్యజించడానికి ప్రేరేపించిన కారణాలు, విచారవదనంతో తిరిగొచ్చిన కంటకాశ్వము (కంటక అనే గుఱ్ఱము) తదితర దృశ్యమాలిక మనల్ని సిద్ధార్థుని జీవితకాలానికి తీసుకవెళ్తుంది.

4. సిద్ధార్థుని కఠోర సాధన ద్వారా బోధ్‌గయ (బీహార్‌ రాష్ట్రం)లోని రావివృక్షం క్రింద సమ్యక్‌ సంబోదిని పొంది ధ్యానముద్రలో వున్న బుద్ధుని ప్రశాంత వదనం మనకు శాంతి సందేశాన్నిస్తుంది.

5. బుద్ధత్వాన్ని సంతరించుకొన్న గౌతముడు ఇసి పట్టణంలో సారనాథ్‌లోని జింకల వనం (ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం)లో మొదటి ధర్మచక్ర ప్రవర్తనంగా పిలువబడే సన్నివేశంలో పంచ వగ్గీయ బిక్కులైన కొండన్న, మహానామ, వప్ప, అస్సాజీ, బద్దియలకు ధర్మ ప్రబోధాన్ని అందించిన సన్నివేశం.

6. బుద్ధుడు కుశి నగరం (ఉత్తర ప్రదేశ్‌)లో కుడి చేతిని తలక్రింద పెట్టుకొని ప్రశాంత వదనంతో మహాపరి నిర్వాణము చెందిన శిల్పం ఆ శిల్ప పీఠానికి నాలుగు వైపులా బుద్ధుని చివరి ఘట్టం తర్వాత జరిగే అతని ధాతువుల పంపక దృశ్యాలన్ని మన కళ్ళని చెమ్మగిల్లిస్తాయి.

7. బుద్ధ పాద శిల్పం పల్నాడు సున్నపురాతిలో అష్టమంగళ వస్తు చిహ్నాలతో చెక్కబడిన (అమరావతీ శిల్పనమూనా) పాదాలకు బుద్ధపాద వందనం చేసేందుకు వీలుగా తామర నీటి కొలను మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ బుద్ధ చరితవనంలో జ్ఞానోదయ శిల్పం వెనక భాగంలో ప్రముఖ బౌద్ధ గురువు 2006 కాల చక్ర (అమరావతిలో జరిగిన) మహా సమ్మేళనానికి నాగార్జున సాగర్‌ మీదుగా వెళ్ళినప్పుడు దలైలామా నాటిన (బోధ్‌ గయలోని బోధి వృక్షం నుండి సేకరించిన) రావి చెట్టు మొలక నేడు మహావృక్షమై బౌద్ధ ఆధ్యాత్మికతను పర్యాటకులకు అందిస్తుంది. అలాగే శ్రీలంక ప్రభుత్వము ప్రత్యేకంగా తయారు చేసి అందించిన లోహ ధర్మగంట బుద్ధ చరిత వన మధ్య భాగంలో చూపరులను ఆకట్టుకుంటుంది.