|

బుద్ధుడు – గాంధీ

By: డా. నాగసూరి వేణుగోపాల్‌

1893 ఏప్రిల్‌ 9న ఉత్తరప్రదేశ్‌ ప్రాంతం అజాంఘర్‌ జిల్లా కనైల చక్రఫన్‌పూర్‌లో జన్మించిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ తన 50 సంవత్సరాల జీవితంలో 45 సంవత్సరాలు పర్యటనలలో గడిపారు. బుద్ధుని సిద్ధాంతాలతో మమేకమై తన పేరు రాహుల్‌గా మార్చుకున్న ఈ మహా పండితుడికి హిందీ, సంస్కృతం, పాళీ, భోజ్‌పురి, ఉర్దూ, పర్షియన్‌, మిగహి, అరబిక్‌, టిబెటన్‌, సింహళం, ఫ్రెంచి, రష్యన్‌, తమిళం, కన్నడం, ఇలా చాలా భాషలు తెలుసు. ఆయన రచనలు సామాజికం, చరిత్ర, తత్వం, బౌద్ధం, టిబెటాలజి, లెక్సికోగ్రఫి, వ్యాకరణం, సైన్స్‌, జానపద విజ్ఞానం, రాజకీయాలు ఇలా పలు అంశాలమీద వంద దాకా రచనలు రాశారు. ‘ఓల్గా సే గంగా’ బాగా ప్రఖ్యాతమైన రచన. 1863లో ‘పద్మభూషణ్‌’ గౌరవం పొందిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ శ్రీలంక విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ వృత్తిని స్వీకరించారు. డయాబెటిస్‌, రక్తపోటు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో సతమతమై 1863 ఏప్రిల్‌ 14న డార్జిలింగ్‌లో కన్నుమూశారు.

1942లో హజారీ భాగ్‌ సెంట్రల్‌ జైలులో రాజకీయ ఖైదిగా ఉన్నప్పుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ ‘వైజ్ఞానిక భౌతికవాది’ అనే హిందీ రచన చేశాడు. ఈ పుస్తకం 2015లో తెలుగులో తర్జుమా అయ్యింది. ఈ గ్రంథంలో గాంధీజీ తాత్విక దృక్పథం పై రాహుల్‌ సాంకృత్యాయన్‌ తీవ్ర విమర్శ చేశారు. అయితే స్వాతంత్రం వచ్చాక గాంధీజీ సజీవులుగా ఉన్నపుడే (1947-48 ప్రాంతంలో) ‘బుద్ధుడు`గాంధీ’ అనే ఆంగ్ల వ్యాసాన్ని రచించారు. గాంధీ మీదున్న ప్రతికూల ధోరణిని పూర్తిగా మార్చుకున్న వాదన ఇందులో కనబడుతుంది. గాంధీజీ మరణానంతరం ఈ ఆంగ్ల వ్యాసపు హిందీ అనువాదం ‘ఆజ్‌కల్‌’ అనే ఢిల్లీ పత్రికలో వెలువడింది. ఈ వ్యాసాన్ని గానీ, రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్వీయ చరిత్రలో పేర్కొన్న విషయాలను గానీ ప్రస్తావించకుంటే గాంధీ పట్ల వ్యతిరేకధోరణి వాదం ప్రబలడం ఒక ముఖ్యమైన పోకడ.

బాపట్ల నివాసులు టి. రవిచంద్‌ ఆధారం లేని ధోరణిని కొంతయినా మార్చాలని అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి ద్వారా ఈ హిందీ వ్యాసాన్ని తెలుగులోకి అనువాదం చేయించారు. జె.ఎల్‌.రెడ్డి చేసిన తెలుగు అనువాదం 2005 జూలై సంచిక ‘మిసిమి’లో ప్రచురితమైంది. ఈ వ్యాసం హిందీతో పాటు తెలుగు అనువాదం, రాహుల్‌ స్వీయ చరిత్రలో గాంధీ గురించి ప్రస్తావించిన విషయాలు కలిపి టి. రవిచంద్‌ 2017లో మిళింద ప్రచురణలు ద్వారా 24 పుటల చిరు పుస్తకాన్ని ప్రచురించారు.

గాంధీజీ గురించి రాహుల్‌ సాంకృత్యాయన్‌ 1947-48 కాలంలో రచించిన వ్యాసం తెలుగు అనువాదం ఈ మాసం ‘గాంధీయే మార్గం’ శీర్షికలో అందిస్తున్నాం. మరో విలువయిన రచనతో మళ్లీ తర్వాత మాసం ఈ శీర్షిక అలంకరింపబడుతుంది.

మనది సుదీర్ఘ చరిత్ర గల దేశం. ఇక్కడ ఎందరో మహాపురుషులు జన్మించారు. వీరందరిలో బుద్ధుడు నిస్సందేహంగా గొప్పవాడు. ఆయనది సర్వాంగీణ వ్యక్తిత్వం, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తన పరివర్తన వాదం (క్షణికవాదం)లో జగత్తూక్షణ – క్షణం పరివర్తన చెందే ప్రవాహ ధార లాంటిదని చెప్పాడు. అనాత్మవాదం, ప్రతీత్య సముత్పాదంలో – ఒక పదార్ధం నశించిన తర్వాత మరొకదాని ఉత్పత్తి జరుగుతుందని చెప్పాడు. ఇలాంటి వాటిలో ప్రతి ఒక్కటి ఆయన సృజనాత్మక ఆలోచనా సరళికి ఉజ్వల ఉదాహరణ. కాని ప్రస్తుతం నేను మానవుని ఆలోచనా సరళికి ఆయన ఏ ఏ సిద్ధాంతాలు ప్రసాదించారు అనే అంశాన్ని గురించి చర్చించడం లేదు. రండి ఆయన బోధనలైన మానవత్వం, ప్రేమ, విశ్వ బంధుత్వం, ఉదారత, వీటి పైన దృష్టి సారిద్దాం. మహాత్ముడైన బుద్ధుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయినవారు కొందరు ఆయన వ్యక్తివాది అయిన మహాపురుషుడని, వైయక్తిక నిర్వాణమే ఆయన లక్ష్యమని భావిస్తారు. కాని అది సత్యం కాదు. ఆయన వ్యక్తివాది కాదు. ఆయన జీవితంలోని సంఘటనను ఇందుకు ఋజువుగా చూపించవచ్చు. ఒకసారి ఆయన సవతి తల్లి ప్రజాపతి గౌతమి తను స్వయంగా వడికినేసిన గుడ్డ ఆయనకు కానుకగా ఇచ్చింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, ‘‘ఈ గుడ్డ   బౌద్ధ సంఘానికి ఇవ్వు, దానివల్ల నీకు మరింత ఔన్నత్యం కలుగుతుంది. ఎందుచేతనంటే వ్యక్తికంటే సంఘం గొప్పది. ఉన్నతమైనదీను.’’ ఇంతేకాక ‘‘ఇతరులను ఉద్ధరించడం కోసం ఆత్మత్యాగం చేస్తూ మీరు అసంఖ్య జన్మలెత్తవలసి ఉంటుంది’’ అని శిష్యులకు బోధించే ఆయన సిద్ధాంతం వ్యక్తివాదానికి చెందిన సిద్ధాంతం కాజాలదు.

ఆయన అన్ని ప్రాణుల శ్రేయస్సు కోరేవారు. ‘‘సబ్బే సత్తా భవంతు సుఖీ సత్తా.’’ అలా అని ఆయనను నిష్క్రియాపరుడైన స్వప్నదర్శిగా భావించకూడదు. ఆయన యథార్థవాది. అందువల్ల తన శిష్యమండలిని కార్యక్షేత్రంలో దిగమని, బౌద్ధ ధర్మ ప్రచారం చేయమని ఆదేశించినప్పుడు ఆయన సమస్త ప్రాణుల శ్రేయస్సు కోసం శ్రమించమని చెప్పలేదు. బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం (బహుజన హితాయ బహుజన సుఖాయ) సంచరించండి అని చెప్పాడు. బహుజనుల హితము, బహుజనుల సుఖము ఒక్కొక్కప్పుడు కొందరి హితానికి, సుఖానికి విరుద్ధంగా ఉంటుందని ఆయనకు తెలుసు. సమాజం పరస్పర విరుద్ధమైన విభిన్న వర్గాల హితాలతో కూడి ఉంటుంది.

ఆయన అభిప్రాయం ప్రకారం ఆదిమానవులు ఏ పద్ధతిలో సృష్టిలోని సంపదలను వినియోగించుకునేవారో, అదే ఆదర్శమైన పద్ధతి. ఆనాటి సమానత్వాన్ని రూపుమాపి స్వీయ సంపత్తి సేకరణకు జన్మనిచ్చిన లోభం మానవుని మౌలిక అపరాధం. దీని కారణంగా మానవ సమాజం ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చింది.    మున్ముందు కూడా అనుభవిస్తూ ఉంటుంది. బుద్ధుని అభిప్రాయం ప్రకారం స్వీయ సంపత్తికి సంబంధించిన ఆ లోభం నుండే చౌర్యగుణం పుట్టింది. ఆ తర్వాత కలహాలు, హత్యలు పుట్టుకొచ్చాయి. ఈ దుర్నీతుల నుండి తప్పించు కొనేందుకే మానవుడు రాజును ఏర్పరచుకున్నాడు. మానవ సమాజంలోని జబ్బుకు వేరే మందు అతనికి దుర్లభమైంది.

బుద్ధుడు తన పద్ధతిలో భిక్షువులు, భిక్షుణిల మధ్య సామ్యవాదాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ, అది చాలా కాలం నిలదొక్కుకోలేక పోయింది. కారణం ఏమిటంటే – రాజు, రివాజుల మద్దతు పొంది ఉన్న స్వీయ సంపత్తిని పెంచుకోవాలనే వ్యక్తిగత లోభ సముద్రంలో సామ్యవాదపు ద్వీపాన్ని నిలువరింప చేయడం సాధ్యం కాదు. ఆయన తన ఆఖరు ఉపదేశంలో ఇలా అన్నాడు. ‘‘వైరం ద్వారా వైరం శాంతించదు’’ (నహి వైరేణ వైరాణి శామ్యనీహ కదాచన – సంస్కృతం). క్లుప్తమైన ఈ కథనంలో మనకు బుద్ధుని మూలాధారమైన కొన్ని తాత్త్విక సామాజిక ఉపదేశాలు లభిస్తాయి.

ఇక బుద్దుని తర్వాత సంపూర్ణ మానవ సమాజానికి ఇంత గొప్ప సందేశం ఇచ్చిన మహాపురుషుడు గాంధీ ఒక్కడే. ఆయన తత్త్వదర్శనంలో బుద్ధునిలో ఉన్న మౌలికత లేదు.

తాత్వికనేపథ్యం నుండి వేరుచేసి చూసినపుడు గాంధీ మహాత్ముని సత్యము, అహింస ఒక వ్యక్తిలోని వ్యామోహం (టaస) గానే కనిపిస్తాయి. గాంధీజీ సమస్త మానవులకు చెందినవాడు. ఆయన జీవన పర్యంతం బహుజనుల హితం కోసం పోరాడారు. వారి శ్రేయస్సే కోరేవాడు కాబట్టి, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆయన బుద్ధుని కంటే కూడా ఎక్కువగా కష్టాలు సహించవలసి వచ్చింది, అని అనడానికి నేను సందేహించను. అంటే నా ఉద్దేశ్యం అలాంటి పరిస్థితుల్లో, ఆ వాతావరణంలో ఉండి ఉంటే బుద్ధుడు అలాంటి చర్యలు తీసుకోవడానికి జంకేవాడు అని చెప్పడం కాదు. బాటసారులపై ప్రాణాంతకంగా దాడిచేస్తూ ఉండిన అంగుళీమాలుణ్ణి తెలిసి – తెలిసి ఆయన ఎదిరించాడు కదా ! కాని, బుద్ధుని జీవితంలో అలాంటి సందర్భాలు చాలా తక్కువగా కనిపి స్తాయి. ఇతరులను రక్షించటం కోసం మహాత్మాగాంధీ కొన్ని వందలసార్లు తన ప్రాణాన్ని పణంగా పెట్టవలసి వచ్చింది. జాతి భేదాలను రూపుమాపడానికి, వేలాది ప్రజల ప్రాణాలు రక్షించడానికి గాంధీజీ దక్షిణాఫ్రికాలో తన ప్రాణాలను లెక్కచేయకుండా బోయర్లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. కలకత్తా, ఢల్లీి, తదితర చోట్ల మత సామరస్యాన్ని స్థాపించేందుకు ఆయన చేసిన అనేక ప్రయత్నాలు ఎవరికి తెలియవు ? ఆయన నిజంగా ఒక మహాత్ముడు అనడంలో ఎవరికైనా సందేహం ఉంటుందా ?

వ్యక్తిని, సంపూర్ణ సమాజాన్ని ప్రేమించే విషయంలో గాంధీజీ రెండవ తథాగతుడు. ఆయన అవైర భావం (అహింస)లో అకర్మణ్యతకు చోటు లేదు. అకర్మణ్యత దుర్భలత్వానికి, సోమరితనానికి చిహ్నం. లక్షలాది భారత వాసులను కర్మక్షేత్రంలోకి రమ్మని పిలుపునిచ్చిన ఆయన అహింస నిషేధాత్మక (Prohibitten) శక్తికాదు. తప్పనిసరిగా అది ఒక సునిశ్చితమైన, సుదృఢమైన శక్తే. ఈ విధంగా కూడా ఆయన కర్మను బోధించే గురువు.

దేవుణ్ణి, అపరివర్తన శీలమైన జగత్తును స్వీకరించే తాత్త్విక దృష్టిని నమ్మిన వాడైనప్పటికీ, గాంధీజీ కార్యా చరణలో జడత్వం లేదు. ఆయన నరనరాల్లో నిండి 

ఉన్న బహుజనుల శ్రేయస్సు గురించిన ఆలోచన ఆయనకు తెలియకుండానే తన వ్యక్తిత్వంలో మార్పు చేసుకొనేందుకు ఆయనను మెల్లమెల్లగా సంసిద్ధుడిని చేస్తూ ఉంటుంది. ఆయన బుద్ధుని గతిశీల తత్త్వదృష్టిడిని తన లక్ష్యంగా స్వీకరించకపోవడం విచారకరమైన విషయం. చాలా రోజుల నుండి మనకు గాంధీజీ కొత్త రూపం ఒకటి కనపడుతుంది. ఆయన భారత ప్రజల రాజకీయ స్వాతంత్య్రంతోనే తృప్తి పడేట్టుగా కనిపించడం లేదు. ఆయన వారి ఆర్థిక స్వాతంత్య్రం గురించి కూడా ఆలో చించడం ఆరంభించాడు. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడే నిజమైన సామాజిక విప్లవం వస్తుంది. బుద్ధుని లాగానే ఆయన కూడా సమాజంపైన కొద్దిమంది పెత్తనం చెలాయించడం వల్ల సమాజంలో వ్యాపించిన అసమానత కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల తీవ్రతను బాగా అర్థిం చేసుకున్నాడు. దేశంలోని రాజుల నిరంకుశత్వాన్ని బాహాటంగా దూషిస్తున్నారు. దీని ద్వారా మన పెద్ద పెద్ద సమస్యల పట్ల ఆయన వైఖరి మనకు తెలుస్తూనే వుంది. ఆయన సమాజవాదాన్ని గురించి కూడా మాట్లాడుతారు. కాని సత్యం, అహింస వీటి పైననే ఆయనకు మక్కువ ఎక్కువ. సమాజవాది అయినవాడు ఎవడూ సత్యానికి శతృవు కాదు. అలాగే సమాజవాది అయినవాడు ఎవడూ హింస కోసమే హింసను కోరుకోడు. నిజానికి సమాజవాదులు కాని, సామ్యవాదులు కాని, హింసను ఆత్మరక్షణకు అవసరమైన సాధనంగా మాత్రమే స్వీకరిస్తారు. అది కూడా ఎప్పుడు? సమస్యకు శాంతియుతమైన పరిష్కారం సాధ్యపడనప్పుడు, దుండగులు హింసా మార్గాన్ని అవలంభించి బాహాటంగా దాడి జరిపినప్పుడు.

రానున్న కొద్ది కాలంలోనే పెట్టుబడిదారుల, నిరంకుశ వర్గాల భరింపరాని ప్రత్యేక హక్కులను అంత మొందించేందుకు గొప్ప పోరాటం ఆరంభం కాబోతూంది. తన అహింస యొక్క క్రియా శీలమైన శక్తి కారణంగా గాంధీజీ పీడక వర్గానికి చెందిన దుండగుల కంటే ఎంతో శక్తిమంతుడని నా నమ్మకం, నా ఆశ. ఆయన ఒక రక్త బిందువు కూడా చిందించకుండా జీర్ణించిన, వ్యర్ధమైన జమీందారీ పద్ధతిని నిర్మూలించి, సమాజంలో నుండి కొన్ని వర్గాల దోపిడీని, అత్యాచారాన్ని మరెన్నడూ కానరాకుండా పారద్రోలుతాడు. మనకున్న సమయం చాలా తక్కువ. మనమం దరం ఆయన దీర్ఘాయువు కోసం ప్రార్థిద్దాం. అయినా గాంధీజీ జీవితానికి కూడా ఒక హద్దు ఉంది కదా ! మహాత్మాజీ ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని, అహిం సాత్మక మైన ఆ గొప్ప విప్లవానికి నాయకత్వం వహించి, ఆర్థిక పరమైన వర్గభేదాన్ని రూపుమాపి నిజమైన దేశ యజమానులుగా ప్రజలను నిలుపుతారని భావించ వచ్చా? ఆయన నాయకత్వం దేశానికి రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది. ఈ నాయకత్వాన్ని చరిత్ర, మానవ సమాజం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాయి. ఒకవేళ ఈ వృద్ధాప్యంలో గాంధీజీ పరిపక్వత చెందిన తన అనుభవ బలంతో భారతదేశ ప్రజలకు ఆర్థిక బంధనాల నుండి, కొన్ని వర్గాల అత్యాచారాల నుండి విముక్తి కలిగించడంలో సఫలీ  కృతుడైతే అప్పుడు ఆయన తన సమస్త శ్రేయోభిలాషతో బుద్ధుడు కూడా చేయలేకపోయిన పని చేసిన వాడవుతాడు. ఇది జరిగి నప్పుడు మానవుల ఆనందాన్ని సాధించే విషయంలో మహాత్మా గాంధీ బుద్ధ భగవానుని అధిగమిస్తాడు. చరిత్ర ఆయనను ఈ రూపంలోనే గుర్తుంచుకుంటుంది కదా !