సమతుల అభివృద్ధి దిశగా…

శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కె. చంద్రశేఖర రావు ఎన్నికల హామీలను తూ.చ. తప్పకుండా, వాటికి కార్యరూపమిస్తూ, ప్రజారంజకమైన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను శాసన సభకు సమర్పించారు. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి 2019-20 ఆర్థిక సంవత్సరానికి 1,82,017 కోట్ల రూపాయల వార్షిక పద్దుతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక ప్రగతితో రాష్ట్రం దూసుకుపోతున్న తీరును ప్రతిబింబిస్తూ, ప్రాజెక్టులు, పింఛన్లు, రైతుబంధు, రుణమాఫీలకు పెద్దపీట వేశారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నెలకు రూ. 3,016 నిరుద్యోగ భృతిని ప్రకటించారు. దీనితో పాటుగా ఆసరా పథకం కింద ఇస్తున్న పెన్షన్లను పెంచడంతో పాటు, పెన్షన్‌ అర్హత వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలుగా తగ్గిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘జై జవాన్‌ – జై కిసాన్‌’ నినాదానికి అనుగుణంగా బడ్జెట్‌లో రైతుల రుణమాఫీకి రూ. 6,000 కోట్లు, రైతుబంధు పథకానికి రూ. 12,000 కోట్లు, రైతుబీమా పథకానికి రూ.650 కోట్లు కేటాయించి రైతన్నల ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యతనిస్తూనే, దేశరక్షణలో ప్రాణాలొదిలిన వీరజవానులను కూడా ప్రభుత్వం స్మరించుకుంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశం ప్రారంభంలోనే, పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీరజవాన్లకు రెండు నిముషాలు మౌనంపాటించి ఘనంగా నివాళులర్పించారు. అదేసమయంలో ఈ దాడిలో వీరమరణం పొందిన 40 మంది జవాన్లకు ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు సభ ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది.

“ఆసరా పింఛన్లు అందుకుంటున్నవారు నన్ను దేవుడిచ్చిన అన్న అని ఆదరించారు. తమను కాపాడుతున్న పెద్దకొడుకు అని వృద్ధులు ఆశీర్వదించారు. నా రాజకీయ జీవితానికి ఇది గొప్ప సార్ధకతగా భావిస్తున్నా” అని ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా చెప్పనివి ఎన్నో అమలు చేశాం. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ లేదనడం అతిశయోక్తి కాదని సి.ఎం చెప్పారు.

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకిత మవుతామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.