ఉద్యమంపై తూటాల వర్షం..

ఉద్యమంపై-తూటాల-వర్షం..1969 జనవరి 19న జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత మరుసటి రోజు రాత్రి తెలంగాణ పీపుల్స్‌ కన్వెన్షన్‌ సభ్యులు నారాయణగూడలోని న్యాయవాది రామచంద్రారెడ్డి ఇంట్లో సమావేశమైనారు. ఎస్‌. వెంకట్రాంరెడ్డి (మేడ్చల్‌ సమితి ప్రెసిడెంట్‌), ఎం.ఎల్‌.ఎ. టి. పురుషోత్తమరావు, హన్మకొండ పంచాయితి సమితి ప్రెసిడెంట్‌ సంగంరెడ్డి సత్యనారాయణ (ముచ్చర్ల), మదన్‌మోహన్‌, బొగ్గారపు సీతారామయ్య, జి. నారాయణరావు, పాత్రికేయులైన ఆదిరాజు, రఘువీర్‌రావు, ప్రతాప్‌కిశోర్‌, దేవులపల్లి ప్రభాకర్‌రావు తదితరులు సుదీర్ఘంగా చర్చించి మార్చి 3న ‘‘తెలంగాణ బంద్‌’’కు పిలుపునిచ్చారు. స్టూడెంట్స్‌ యాక్షన్‌ కమిటీ నేత మల్లికార్జున్‌ అప్పటికే బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. మార్చి 8, 9 తేదీల్లో ఆబిడ్స్‌ రెడ్డి హాస్టల్‌ మైదానంలో సభ జరపాలని నిర్ణయించినారు. మదన్‌మోహన్‌నే కన్వీనర్‌గా కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది.

ఆంధ్రపాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌, తెలంగాణలోని పట్టణాల్లో గోడలపై వ్రాతలు, పోస్టర్లు వేయడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ ముందుకు రావడంతో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికే నిర్ణయించింది. 1969 జనవరి 20న శంషాబాద్‌లో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని గాయపర్చినారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినారు. పోలీసులు తుపాకీ కాల్చడం 1969 ఉద్యమంలో ఇదే తొలి సంఘటన. 24వ తేదీన మెదక్‌ జిల్లా సదాశివపేటలో జరిగిన కాల్పుల్లో 17 ఏళ్ళ మాస్టర్‌ శంకర్‌, కృష్ణ మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 1969 ఉద్యమంలో బహుశా వీరే తొలి అమరులు కావచ్చు.

జనవరి 29న తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉన్న ఏడు పట్టణాలకు మిలిటరీని తరలించింది ప్రభుత్వం. జనవరి 30న గజ్వేల్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా అనేకులు గాయపడ్డారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో శ్రీశైలం డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్న ఈగలపెంటలో ఫిబ్రవరి ఒకటిన జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. ఫిబ్రవరి 5న బెల్లంపల్లిలో కాల్పులు జరిగాయి. తెలంగాణ ఉద్యమం సింగరేణి ప్రాంతానికి వ్యాపించింది. మరోవైపు ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు పొందిన ఆంధ్ర ఉద్యోగులను ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఆంధ్రకు బదిలీ చేయాలని బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై కొందరు ఆంధ్రప్రాంత ఉద్యోగులు హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటీషన్లు దాఖలు చేసారు.

ఫిబ్రవరి 25న తాండూరులో పోలీసు కాల్పులు జరిగి ముగ్గురు గాయపడినారు. మార్చి 3న జరుప తలపెట్టిన ‘తెలంగాణ బంద్‌’కు ప్రజల నుండి పెద్దఎత్తున స్పందన రావడం చూసి మంత్రులు జి.వి. సుధాకర్‌రావు, రాజారాం తదితరులు పరోక్షంగా ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న మార్చి 3న జరిగే తెలంగాణ బంద్‌ విఫలం చేయడానికి ప్రభుత్వం, ఆంధ్రమంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు, వారి ఆధ్వర్యంలోని ట్రేడ్‌ యూనియన్లు, ఉభయ కమ్యూనిస్టుపార్టీలు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పెద్దఎత్తున సాయుధ పోలీసులను తెలంగాణ పట్టణాల్లో దింపి భయానక పరిస్థితులను సృష్టించింది ప్రభుత్వం. స్వయంగా మంత్రులే వాణిజ్య సంఘాల పెద్దలను పిలిచి బంద్‌కు సహకరించవద్దని బెదిరింపులకు దిగినారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. కనీవినీ ఎరుగని రీతిలో బంద్‌ విజయవంతమైంది. ఈ బంద్‌ విజయం చారిత్రిక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ప్రారంభానికి ప్రేరణగా చెప్పవచ్చును.

శాసనసభ సమావేశాలు కూడా అదే రోజు (మార్చి 3) ప్రారంభమవుతున్నందున విద్యార్థులు తమ శక్తిని శాసనసభ్యులకు చూపాలనుకున్నారు. డా॥ గోపాలకృష్ణ, ఆదిరాజు వెంకటేశ్వరరావుల మార్గదర్శకత్వంలో ఒక పోలీసు ఉన్నతాధికారి మద్ధతుతో 25మంది విద్యార్థులు ముందురోజు రాత్రి ఎవరి కంటబడకుండా శాసనసభ లాబీల్లోకి ప్రవేశించి సభ ప్రారంభంకాగానే అకస్మాత్తుగా మొదటి అంతస్తులోని లాబీలో ప్రత్యక్షం కావడం సంచలన వార్త అయ్యింది.
కొండా-లక్ష్మణ్‌-బాపూజీమార్చి 8, 9 తేదీల్లో జరిగిన ‘తెలంగాణ కన్వెన్షన్‌’ అంచనాలకు మించి విజయవంతమైంది. ఈ సభకు ఉస్మానియా వైస్‌ ఛాన్సెలర్‌ రావాడ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. శాసనసభ్యులు టి. పురుషోత్తమరావు జెండాను ఆవిష్కరించారు. ఏప్రిల్‌ 11లోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ ఆదిరాజు తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. ‘తెలంగాణ పీపుల్స్‌ కన్వెన్షన్‌’ నాయకత్వంలో పనిచేయాలని విద్యార్థులు నిర్ణయించినారు. తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థులు, మేధావులు, నాయకులు ఈ సభకు వచ్చి పాల్గొన్నారు. ప్రముఖ మహిళా దళిత నేత టి. సదాలక్ష్మితో సహా ముఖ్యనేతలంతా ప్రసంగించారు. ఈ సభ విజయవంతం కావడం రాజకీయ నాయకులకు, ఉద్యోగ సంఘాల నేతలకు తెలంగాణ ఉద్యమంపై విశ్వాసాన్ని కల్పించింది. కొద్ది వారాల్లోనే ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులు ఉద్యమంలో కె.ఆర్‌. ఆమోస్‌ సారథ్యంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆంధ్ర ఉద్యోగుల పిటీషన్లను విచారించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. 28 మార్చి 1969న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తెలంగాణవాదుల్లో మరింత కోపాన్ని పెంచింది. తెలంగాణకున్న రక్షణలను అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
కొండా లక్ష్మణ్‌ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణకోసం రాజీనామా చేసిన తొలి నేతగా బాపూజీ చరిత్రలో నిలిచారు.

మార్చి 25న ‘తెలంగాణ పీపుల్స్‌ కన్వెన్షన్‌’ను ‘తెలంగాణ ప్రజా సమితి’గా మార్చినారు. టి.పి.ఎస్‌. ఛైర్మన్‌గా మదన్‌మోహన్‌ వ్యవహరించారు.

మార్చి 28న జరిగిన ఒక సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను కంటతడి పెట్టించింది. ఆంధ్ర పాలకుల అణచివేతకు నిరసనగా జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌కు నిప్పుపెట్టిన ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆ మంటల్లో సజీవ దహనమైనారు. ఖమ్మం జిల్లాలోని గార్లకు చెందిన ధనిక వ్యాపారి ఒక్కగానొక్క కొడుకు ప్రకాశ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా చెంగన్‌పల్లికి చెందిన సర్వారెడ్డి. ఈ ఇద్దరూ ఇంజినీరింగ్‌ విద్యార్థులే చెంగన్‌పల్లి పేరును గ్రామస్తులు ‘సర్వారెడ్డి నగర్‌’గా మార్చినారు.

ఈ ఘటన ఒకవైపు, సుప్రీం కోర్టు తెలంగాణ వ్యతిరేక తీర్పు మరోవైపు తెలంగాణ వాదులను కలచివేసింది. తెలంగాణ అంతటా నిరసనలు మొదలైనవి. దాదాపు అన్ని రాజకీయపార్టీల అగ్రనాయకత్వం ఆంధ్రులదే. జనసంఘ్, ఆర్‌.ఎస్‌.ఎస్‌.ల నేతలు కూడా వారే. ఆయా పార్టీల్లోని తెలంగాణ నేతలు ఆంధ్ర నేతల మెప్పుకోసం నోరు తెరవలేదు.

బ్రహ్మానందరెడ్డి కనుసన్నల్లో సికింద్రాబాద్‌కు చెందిన మంత్రి గురుమూర్తి, అతని అనుచరుడు పహిల్వాన్‌ కొండల్‌రెడ్డి తెలంగాణవాదులపై దాడులు చేసేవారు. తెలంగాణవాదంపై విషం చిమ్మేవారు. జంటనగరాల్లోని దాదాపు అన్ని పోలీసు స్టేషన్లలో ఉన్నతాధికారులంతా ఆంధ్రవారే.

సి.పి.ఐ. పార్టీ ఏప్రిల్‌ 4న సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి రోడ్‌ లోని బూర్గు మహదేవ్‌ హాల్లో విశాలాంధ్ర సభ జరుపగా వేలాదిమంది తెలంగాణ బిడ్డలు దాన్ని నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్ర పోలీసులు ఈ ప్రజలపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరుపగా ముగ్గురు విద్యార్థులు ప్రకాశ్‌రావు, రాములు మరొకవ్యక్తి ఈ కాల్పుల్లో చనిపోయారు. వీరి స్మారకార్థం 1977లో సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ దగ్గర ఒక స్థూపాన్ని నిర్మించారు తెలంగాణవాదులు. ఆనాటి సికింద్రాబాద్‌ స్టూడెంట్స్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు పి.జె. సూరి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏప్రిల్‌ 4న తెలంగాణవాదులు స్థూపం దగ్గర జమై నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.

ఏప్రిల్‌ 4న పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినాయి. అప్పటికే తెలంగాణలోని అన్ని ప్రముఖ్య పట్టణాల్లో వేలాదిమంది విద్యార్థులపై తప్పుడు కేసులుపెట్టి పోలీసులు అరెస్టు చేసి జైళ్ళో పెట్టినారు. తెలంగాణ లోని స్కూళ్ళను జైళ్ళుగా మార్చింది ప్రభుత్వం. టీఎన్జీవో అధ్యక్షుడు ఏ.ఆర్‌. ఆమోస్‌ను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం క్రింద నిర్భంధించింది ప్రభుత్వం. ముషీరాబాద్‌, చంచల్‌గూడా, వరంగల్‌ జైళ్ళు ఉద్యమ నేతలతో నిండిపోయినవి. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలు సదాలక్ష్మిని, ఎస్‌.బి. గిరిని, బద్రీ విశాల్‌పిట్టిని పి.డి. (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) చట్టం క్రింద నిర్భంధించారు.

ఈ నిర్భంధాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం కావడానికి ప్రేరణనిచ్చినవే తప్ప ఉద్యమకారులనేమాత్రం వెనుకంజవేసేలా చేయలేదు. పోలీసు కాల్పులు, అరెస్టులు నిత్యకృత్యమైనవి.

సరిగ్గా ఈ సమయంలోనే ఢిల్లీలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తెలంగాణ సమస్యపై దృష్టిపెట్టారు. లోక్‌సభలో 11-4-1969న ఒక ప్రకటన కూడా చేసినారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి 8 సూత్రాల పథకాన్ని ఈ ప్రకటనద్వారా వెల్లడించారు. తెలంగాణలో ఉద్యోగావకాశాలను పెంచడం, సమతుల్య అభివృద్ధి, జరిగిన అన్యాయాలను కొంత మేరకు సవరించడం, తెలంగాణ అభివృద్ధి కమిటీ ఏర్పాటు, పథకాలను సక్రమంగా అమలు చేయడానికో కమిటీ, రాజ్యాంగ రక్షణలు, ఆరు నెలలకోసారి తెలంగాణ అభివృద్ధి పనులను స్వయంగా ప్రధానే సమీక్షించడం. ఇలాంటివన్నీ ఈ ఎనిమిదిసూత్రాల పథకంలో చేర్చినారు.

లోకసభలో ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ప్రకటించిన అష్టసూత్ర పథకాన్ని తెలంగాణ ప్రజాసమితి, స్టూడెంట్స్‌ యాక్షన్‌ కమిటీ, తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.

తెలంగాణ వాదులను మెప్పించడంలో విఫలమైన శ్రీమతి గాంధీ ఏంజేయాలో అర్థంకాక తలపట్టుకున్న సమయంలో ఆంధ్రప్రాంతానికి చెంది హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ ఉద్యమంపట్ల సానుకూలంగా ఉన్న పొత్తూరి వెంకటేశ్వరరావు (ఆంధ్రభూమి సంపాదకవర్గంలో ఉండే వారు) ఆమెకో లేఖ రాసినారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే ముందుగా ఉద్యమ నేతలతో ముఖ్యంగా విద్యార్థి నేతలతో సంప్రదింపులు జరిపితే బాగుంటుందని, తెలంగాణకు దారుణమైన అన్యాయం జరిగినది వాస్తవమేనని పొత్తూరి తన లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ చదివిన శ్రీమతి గాంధీ పొత్తూరి గురించి తన కేబినెట్‌లోని ఆంధ్ర మంత్రులతో (వి.బి.రాజు) తెలుసుకుని లేఖకు జవాబిచ్చారు. తెలంగాణ ఉద్యమ నేతలతో సంప్రదింపులకు తాను సిద్ధమేనని, సమన్వయం చేయడానికి సహకరించాలని పొత్తూరిని కోరినారు. ఉద్యమనేతలకు ఆహ్వానాలు పంపడానికి సిద్ధం కావాలని పొత్తూరి శ్రీమతి గాంధీని కోరినారు.

ఒకవైపు వేలాదిమందిని జైళ్ళల్లోపెట్టి విద్యార్థులను కాల్చి చంపిస్తున్న ప్రభుత్వాలతో చర్చల ప్రసక్తేలేదని తెలంగాణ ప్రజా సమితి నేతలు, విద్యార్థి నాయకులు శ్రీమతి గాంధీ ప్రతిపాదనను తిరస్కరించాలని నిర్ణయించినారు.
మే 6న శ్రీమతి గాంధీ తెలంగాణ నేతలకు ఆహ్వానాలు పంపినారు. ఆహ్వానాలు అందుకున్న వారిలో మదన్‌మోహన్‌, వెంకట్రాంరెడ్డి, ఎస్‌.బి. గిరి, జి. నారాయణరావు, రఘువీర్‌ రావులు ప్రజాసమితి నుండి ఉండగా, శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి, వజాహత్‌ విద్యార్థి నాయకులున్నారు. పొత్తూరిని కూడా చర్చలో పాల్గొనాలని శ్రీమతి గాంధీ ఆహ్వానించారు.

కానీ అప్పటికే పరిస్థితులు విషమించినాయి. మే ఒకటవ తేదీన చార్మినార్‌ నుండి రాజభవన్‌కు చేరిన విద్యార్థుల ర్యాలీపై రాజభవన్‌ ముందు పోలీసులు కాల్పులు జరిపి సికింద్రాబాద్‌ విద్యార్థి యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు ఉమేందర్‌రావుతోసహా నలుగురు విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. మే ఒకటిన చార్మినార్‌ వద్ద ర్యాలీని మాజీ ఉప ముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డి ప్రారంభించారు. ర్యాలీని ఉద్దేశిస్తూ ‘‘బానిసత్వంకన్నా చావు నయం’’ అంటూ ఎంతో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసారు. నెహ్రూ ఒత్తిళ్ళకు లోనై విధిలేని పరిస్థితిలో పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన వారిలో కె.వి. రంగారెడ్డి గారు ప్రముఖులు. తన కళ్ళముందే ఒప్పందంలోని షరతులను ఆంధ్ర పాలకులు బుట్టదాఖలు చేస్తుంటే చూసి సహించలేక వృద్ధాప్యాన్ని, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కె.వి. రంగారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతును తెలుపుతూ చార్మినార్‌ వద్ద చరిత్రాత్మకమైన ర్యాలీని ప్రారంభించారు.

రాజభవన్‌ వద్ద ర్యాలీ ముగింపు రక్తసిక్తం కావడం, నలుగురు విద్యార్థులు చనిపోవడం, మరెందరో విద్యార్థులు, ప్రజలు కాల్పుల్లో తీవ్రంగా గాయపడడం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత రగిలించాయి. మే 2న కాల్పులకు నిరసనగా తెలంగాణ బంద్‌ జరిగింది.

ఈ పరిస్థితుల్లో శ్రీమతి గాంధీ పంపిన ఆహ్వానాలను తెలంగాణ ఉద్యమనేతలు తిరస్కరించినారు. 1969 మే 7వ తేదీన మర్రి చెన్నారెడ్డి తొలిసారి తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తూ బహిరంగ ప్రకటన చేసినారు.

(సశేషం)