రైతు లోగిలిలో సంబరాలు!

తెలంగాణ రైతాంగం ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఎక్కడాలేని సరికొత్త పండుగను జరుపుకున్నారు. గ్రామగ్రామానా రైతుల ఉత్సాహం నింగికి తాకింది.

కొత్త సంవత్సరంలో తొలిసారిగా వచ్చిన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. పంటలు సమృద్ధిగా పండి, గాదెలు నిండి, రైతుల ఇళ్ళు కళకళలాడుతూ ఉంటాయి.. ఇది మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. ముఖ్యంగా కనుమనాడు రైతులు పశువులను పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే దీనిని పశువుల పండగ అనికూడా అంటారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిరచటంలో తమకు వ్యవసాయంలో సహాయపడిన ఆవులు, పశువులను రైతులు భక్తి శ్రద్ధలతో పూజించి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కానీ, ఈ ఏడాది తెలంగాణ రైతన్నలు సంక్రాంతితో పాటు మరో సరికొత్త పండుగను తొలిసారిగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అదే రైతుబంధు మహోత్సవం. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం గత ఏడేళ్లలో అందించిన సహాయం మొత్తం అర లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ గ్రామానా రైతులు పండుగ చేసుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరులేక, పెట్టుబడి పుట్టక, పంటలు పండక తెలంగాణ ప్రాంత రైతాంగం పడిన అష్టకష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబం గడవక, పొట్ట చేతబట్టుకొని కొందరు వలసదారిపడితే, మరికొందరు గుండెపగిలి అసువులు బాసిన విషయం మనకు తెలియంది కాదు. ఇప్పుడు తెలంగాణలో అదంతా ఓ పీడకల.

తెలంగాణ స్వరాష్ట్ర సాధనతోనే మన రైతన్నల గోస తీరుతుందని నమ్మిన తెలంగాణ సాధన నేత, మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చీరాగానే రైతు సమస్యలపై దృష్టి నిలిపారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాలని ప్రతిన బూనారు. దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించి అమలుచేస్తున్నారు. వీటి ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా అవతరించింది. బంగరు పంటలు పండిస్తున్న రైతు మోములో చిరునవ్వులు సందడి చేస్తున్నాయి. వలసలు వెళ్ళిన వారుకూడా తిరిగి స్వగ్రామాలకు తిరిగి రావడం శుభ పరిణామం.

రాష్ట్ర అవతరణ సమయంలో 2014లో కేవలం 131,34 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2021 నాటికి 203.80 లక్షల ఎకరాలకు పెరిగింది. రైతుబంధు పథకం కింద ఈ యాసంగిలో పంపిణీచేసిన మొత్తంతో 50 వేల కోట్ల రూపాయల రికార్డును అధిగమించింది. దీనికితోడు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువుల మరమ్మతులు, రైతుబీమా, రుణ మాఫీ, పంట నష్ట పరిహారం, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌, సకాలంలో రైతుకు విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికల నిర్మాణం, లక్ష రైతు కల్లాల నిర్మాణం, ఉద్యానవన, ఆయిల్‌ పామ్‌, తదితర పంటలకు కోట్లాది రూపాయల సబ్సిడీలు వంటి అనేక పథకాలు మన రాష్ట్ర వ్యవసాయ రంగం రూపురేఖలనే మార్చివేశాయి. రైతుల సంక్షేమం కోసం, రైతు మేలు కోసం తెగించి కొట్లాడి, ఎంతటి ఖర్చుకైనా వెనుకాడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సారథ్యంలో రాష్ట్ర రైతాంగం మరింత ప్రగతిని సాధిస్తారనడంలో సందేహం లేదు.