మూడేళ్లలో సి.ఎస్‌.టి. చెల్లింపులు

cmkcrకొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 4747 కోట్ల రూపాయల అమ్మకంపన్ను వాటాను (సి.ఎస్‌.టి.) రాగల మూడేళ్ళలో మూడు విడతలుగా చెల్లించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 7న కేంద్ర ఆర్థికశాఖామంత్రిని కలుసుకున్నారు. జైట్లీ నివాసంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, కేంద్రంనుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, తదితర అంశాలపై చర్చించారు.

కేంద్రంనుండి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి కూడా కేంద్రమంత్రి జైట్లీతో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 13వ ఆర్థిక సంఘం గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వంనుంచి తెలంగాణ రాష్ట్రానికి సుమారు 2300 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థికశాఖామంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలో హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌ బోర్డు తదితర సంస్థలకు ఆదాయం పన్నునుంచి మినహాయింపు నివ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కోరగా, అందుకు జైట్లీ సానుకూలంగా స్పందించారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కొత్తగా టెక్స్‌టైల్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి సంబంధిత మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపినందున వచ్చే బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థికశాఖామంత్రిని కె.సి.ఆర్‌. కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలను జైట్లీ ప్రశంసించారు.