|

సైబర్‌ నేరాల కట్టడికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి

  • సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి ఏర్పాటు.. డిజిపి మహేందర్‌ రెడ్డి

రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో  ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సి విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు  డిజిపి మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐ.టి సంస్థలు, IIT, IBM లాంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.

గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో సైబర్‌ సేఫ్టి, నేషనల్‌ సెక్యూరిటీ అనే  అంశంపై జరిగిన ఒక రోజు జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి డిజిపి ఎం. మహేందర్‌ రెడ్డి హాజరై ప్రసంగించారు.. ఐజీ రాజేష్‌ కుమార్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, కేంద్ర ప్రభుత్వ  హోమ్‌ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌  అధికారి పౌసమి బసులు ఈ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాల నిరోధం పై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను  డిజిపి మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. డిజిపి మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, సైబర్‌ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్‌ కీలక పాత్ర పోషిస్తోందని  దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800లకు పైగా పోలీస్‌ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్‌ ఆఫీసర్లను సైబర్‌ వారియర్లుగా నియమించామని తెలిపారు. జిల్లా, కమిషనరేట్‌, రాష్ట్ర స్థాయిలోనూ సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మరో మూడేళ్ళలో దేశంలో సెల్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్య ఒక బిలియన్‌కు చేరుకుంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరిదీ డిజిటల్‌ లైఫ్‌ అయిందని, ఇదే స్థాయిలో సైబర్‌ నేరాల గ్రాఫ్‌ కూడా గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ క్రైం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని డిజిపి పేర్కొన్నారు. ఈ సైబర్‌ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకుగాను మొత్తం పోలీస్‌ వ్యవస్థనే పటిష్ట పరుస్తున్నామని తెలిపారు. దీనిలోభాగంగా, ఇప్పటికే తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (T 4C)ను ప్రారంభించామని తెలియచేశారు. ఇది, నేర నిరోధంలో కీలక పాత్ర వహిస్తోందని అన్నారు.

దేశంలోని అన్ని ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ డిజిటలైజ్‌ చేసినందున, ఇదే స్థాయిలో సైబర్‌ నేరగాళ్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల నగరంలో ఒక బ్యాంక్‌ ద్వారా రూ.20 కోట్లు తరలించిన అంశాన్ని ఉదహరిస్తూ, మరో పదేళ్ళలో ఎదురయ్యే సైబర్‌  క్రైమ్‌లను గుర్తించి దాని కనుగుణంగా తగు నివారణ ను సూచించేందుకు ఈ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సి పనిచేస్తుందని అన్నారు. కాగా, నేడు ఉదయం ప్రారంభమైన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ హోమ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌లు పాల్గొన్నారు.