కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలి


ఆర్థిక సంఘానికి సి.ఎం. కేసీఆర్‌ సూచన

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. 15వ ఆర్థిక సంఘంతో సీఎం సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. గతంలో కేరళ, గుజరాత్‌ ఆదర్శంగా ఉండేవని ఇప్పుడు ఆ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందన్నారు. తెలంగాణ అందిస్తున్న రైతుబంధు లాంటి పథకాలు దేశంలోనే చర్చనీయాంశాలుగా మారాయన్నారు. సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే దిశానిర్ధేశం చేసిందన్నారు. కేంద్ర పథకాల కంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలే ఎంతో బాగున్నాయని సీఎం కేసీఆర్‌ ఆర్థిక సంఘం సభ్యులకు తెలియచేశారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కృషి చేయాలన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 50శాతంకు పెంచాలని, వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రజాకర్షక పథకాల పేరుతో నిధులు ఇవ్వకుండా ఉండడం సరికాదన్నారు. జీఎస్‌టీ మూలంగా రాష్ట్రాలు తమ పన్నుల వాటాను త్యాగం చేశాయన్నారు. జీఎస్‌టీలో కేంద్ర పన్నుల రాబడి 31 శాతం ఉండగా, రాష్ట్రాల సొంత రాబడుల్లో 50శాతం జీఎస్‌టీలో కలిసిపోయాయన్నారు. అందువల్ల గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు నిధుల పెరుగుదల ఉండేలా చూడాలని సీఎం వారిని కోరారు. కేంద్రానికి రాష్ట్రాల అంశాల్లో చొరబడడం పెరిగిందని, కేంద్రం సెస్‌లు, సర్‌చార్జీలు పెంచుతూ రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను తగ్గిస్తోందన్నారు. అలాకాకుండా వివిధ రంగాల్లో పనితీరు ఆధారంగా కేంద్రం ప్రోత్సహకాలు అందించే విధంగా కేంద్రానికి సూచించాలని సీఎం ఆర్థిక సంఘం సభ్యులను కోరారు. ఎఫ్‌.ఆర్‌.బి.ఎం. ద్వారా జీఎస్‌డీపీలో రుణ పరిమితిని 3 శాతం నుంచి 4శాతం రుణాలు తీసుకునేలా సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాతో పాటు, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఐదేళ్ళలో రూ. 40,170 కోట్ల గ్రాంటు ఇచ్చేలా సిఫార్సు చేయాలని, మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ. 12,722 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు, ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌, సభ్యులు అనూప్‌ సింగ్‌, అశోక్‌ లహరి, కార్యదర్శి రమేష్‌ చంద్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రూ.92,800 కోట్లు కేటాయించండి…

రాష్ట్రానికి రూ. 92,800 కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామ కృష్ణారావు నివేదిక అందించారు. శాఖల వారీగా విద్యకు రూ. 7,584 కోట్లు, విద్యుత్‌శాఖకు రూ. 4,442 కోట్లు, హోంశాఖకు రూ. 7,610 కోట్లు, వైద్య,ఆరోగ్య శాఖకు రూ. 1,085 కోట్లు, రోడ్లు, భవనాలశాఖకు రూ. 2,669 కోట్లు, సంక్షేమశాఖకు రూ. 5,763 కోట్లు, అడవుల పరిరక్షణకు రూ. 1,208 కోట్లు, విపత్తు నిర్వహణకు రూ. 381 కోట్లు, యువజన సేవలకు రూ. 357 కోట్లు, స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 8,816 కోట్లు కేటాయించాలని కోరారు.

చార్మినార్‌ సందర్శన

తమ పర్యటనలో భాగంగా నగరంలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ను 15వ ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించారు. అనంతరం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఇచ్చిన తేనేటి విందులో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ కార్యదీక్షకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనం

తెలంగాణ ప్రభుత్వ కార్యదీక్షకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని 15వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఇది రైతాంగానికి వరం లాంటిదన్నారు. అతి తక్కువ సమయంలో ఇంతపెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ పట్టుదలకు అద్దం పడుతుందన్నారు. పర్యటనలో భాగంగా సభ్యులు ముందుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అధికారులకు చూపడంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్‌ను చూపించారు. మ్యాపుల ద్వారా ప్రాజెక్టు నిర్మాణ తీరును, ప్రాజెక్టు వలన కలిగే లబ్ధిని వివరించారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాత్రింబవళ్ళు శ్రమించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు మంజూరీ చేయాలని, తోడ్పాటును అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషీ ఆర్థిక సంఘం సభ్యులను కోరారు.

ప్రాజెక్టు పనులు 80శాతం పైగా పూర్తయ్యాయని, మేడిగడ్డ బ్యారేజీలో 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వాడాల్సి ఉండగా ఇప్పటికే 16 లక్షల క్యూబిక్‌మీటర్లు వాడామని చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. 85 గేట్లకు గాను ఇప్పటికి 20 గేట్లు పూర్తిగా అమర్చడం జరిగిందన్నారు. మిగతా పనులు ఏప్రిల్‌ నెల చివరి వరకు పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నుంచి కన్నేపల్లి పంప్‌హౌజ్‌ ద్వారా ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని పంప్‌ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రూ. 80వేలకోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో 37.08 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన రెండున్నర సంవత్సరాల లోనే ప్రాజెక్టును పూర్తి చేయనున్నామని తెలిపారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించారు. తరువాత 6వ ప్యాకేజీ అండర్‌టన్నెల్‌ లోకి వెళ్ళారు. గోదావరి నదిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల నుంచి రోజు రెండు టీఎంసీల చొప్పున ఏడాదిలో 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసి సాగునీటిని అందించడం జరుగుతుందని అధికారులు, సంఘం సభ్యులకు వివరించారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చడం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 5,046 కోట్ల వ్యయంతో ఆరో ప్యాకేజీ పనులను ప్రారంభించి, 95 శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. జూన్‌ నాటికి వందశాతం పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రమేష్‌చంద్‌ మాట్లాడుతూ గత సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చినపుడు సంవత్సరంలోగా అన్నారం పూర్తి చేస్తామని తెలిపారని, అన్న ప్రకారమే పూర్తి చేశారని ప్రశంసించారు. నిరుపేద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న అద్వితీయ సంకల్పానికి తమ మద్దతు ఉంటుందని సంఘం సభ్యులు అనూప్‌ సింగ్‌, అశోక్‌లాహరి అన్నారు. పర్యాటక రంగానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆ విషయంలో కూడా అధికారులు దృష్టి పెట్టాలని వారు సూచించారు.

మిషన్‌భగీరథ పనుల పరిశీలన

రాజన్న-సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలో మిషన్‌ భగీరథ పనులను 15వ ఆర్థిక సంఘం సభ్యులు పరిశీలించారు. ఆపరేషన్‌-కంట్రోల్‌, ఇన్‌టేక్‌వెల్‌ నుంచి నీరువచ్చే విధానం, శుద్ధి ప్రక్రియల పనితీరును చూశారు. భగీరథ పనులకు సంబంధించిన ఫోటోలను, మ్యాపులను చూశారు. నీటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చేర్చిన తరవాత ఎలా శుద్ధి చేస్తారో అధికారులు సంఘ సభ్యులకు వివరించారు. ఈ పథకానికి ఇప్పటి వరకు రూ. 44,979 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి నదులతో పాటు ఇతర జలాశయాల నుంచి 1.30 లక్షల కిలోమీటర్ల పైపులైన్‌ను నిర్మించినట్లు వివరించారు. 23,968 గ్రామాలు, 118 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరు అందించామని అధికారులు సంఘ సభ్యులకు తెలిపారు.