మైసూర్‌ చాముండి

By:- దాసరి దుర్గా ప్రసాద్‌

శక్తి రూపాలలో ఉగ్ర రూపంలో ఉన్న దేవత చాముండి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకటి. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో ముఖ్యమైన యోగిని చాముండి. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారివారి భర్తల శక్తి స్వరూపాలుగా కొలుస్తారు. కానీ ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు. సృష్టికర్త బ్రహ్మ దగ్గర నుంచి సకల జీవరాశులకు మాతృమూర్తి అమ్మవారేనని దేవీ భాగవతం చెబుతోంది. ఆమె ఇచ్చా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి, సర్వ శక్తి స్వరూపిణి. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ చాముండి దేవిగా అష్టాదశ శక్తి పీఠాలలో నాల్గవ పీఠంగా ఉన్న మైసూరు కూేజుత్రంలో కొలువై భక్తుల నీరాజనాలందుకుంటోంది.

కర్ణాటక రాష్ట్రంలోని  బెంగళూరుకు సుమారు 140 కి.మీ. దూరంలో ఆగ్నేయం వైపున మైసూరు పట్టణం వుంది. ఇది ఒడయార్‌ వంశీయులకు రాజధానిగా వుండేది. మైసూర్‌ పట్టణానికి  సుమారు 13 కి.మీ. దూరంలో చాముండీ పర్వతం వుంది. సతీదేవి దివ్యాభరణాలు, వెంట్రుకలు  పడిన ప్రదేశంగా ప్రసిద్ధి. మార్కండేయ పురాణంలో దేవి ప్రస్తావన గురించి ప్రముఖంగా  ప్రస్తావించడం జరిగింది. మాత మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించింది. ఆమె దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండ, ముండులను సంహరించి ’’చాముండి’’గా ప్రసిద్ధి పొందింది.

పురాణ కాలంలో మహిషాసురుడు పాలించిన పురమును మసూరుగా, మహిషాసురపురంగా పిలిచేవారు. కాలక్రమేణా ఇది మైసూరుగా మారిందని ప్రతీతి. అశోకుని పాలనలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలం అని పిలిచేవారని కూడా ప్రతీతి. మహిషాసురుడు మహాబలవంతుడు. స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణం లేకుండా  వరం పొందిన వాడు. అయితే ఆ వర ప్రభావంతో ముల్లోకాలను జయించి దేవతలను, ఋషులను బాధించాడు. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుణ్ణి అంతమొందించమని త్రిమూర్తులను ఇంద్రాది దేవతలు వేడుకోగా, వారు తమ ముగ్గురి శక్తితో ఓ మహా శక్తిని సృష్టించారు. ఆమె అష్ట భుజాలతో, సహస్ర కోటి మార్తాండుల తేజస్సుతో బ్రహ్మాండమంతా వ్యాపించి ప్రకాశించింది. ఆమెను చూసి సకల జగత్తు చేతులెత్తి మొక్కింది. యక్ష, కిన్నెర, కింపురుషులు అమ్మ కీర్తిని భక్తితో గానం చేశారు. దేవతలు తమ శక్తిని, ఆయుధాలను ఆ తల్లికి సమర్పించారు. ఈ క్రమంలో శంఖ, చక్ర, గద, పద్మ, ధనస్సు, బాణ, ఖడ్గ, ముసల, శూల, పాశ, అంకుశ, పరశువులను ధరించి ఆ తల్లి శత్రు సంహారాన్ని మొదలు పెట్టింది. పది రోజులు అసురులతో పోరాడి రోజుకో రూపంలో రాక్షసులను అంతమొందించింది. పదవ రోజు మహిషాసుర వధతో శత్రువులను నిశ్శేషం చేసి సర్వ లోకాల శోకాలను రూపుమాపి, మహిషాసుర మర్ధినిగా వెలుగొందింది. మహిషాసురుడి సేనాధిపతులైన చండ, ముండ రాక్షసులను వధించింది కనుక ఆ తల్లికి చాముండి అనే పేరు సార్ధకమైంది. 

మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ చాముండి మాతను  పూజిస్తూ, కుల దేవతగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ   దేవాలయ అభివృద్ధికి  ఎంతగానో సహకరించారు.

చాముండి కొండ మీదున్న అమ్మవారి ఆలయాన్ని  12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. ఈ దేవాలయ గోపురాన్ని  17 వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. అలాగే  1659లో 3,489  అడుగుల కొండ శిఖరానికి వెయ్యి మెట్లతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. 

1761-82 మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్‌ అలీ చాముండేశ్వరి అమ్మవారికి అనేక  ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్‌ కూడా కొనసాగించారు.  అలాగే,  నేటి చాముండేశ్వరాలయం 1827వ సంవత్సరంలో పునరుద్ధరింపబడింది. 

మహిషాసురుడనే రాక్షసుడ్ని  సంహరించడానికి సతీ శక్తి చాముండేశ్వరి అమ్మవారిగా వెలిసిందని దేవి భాగవతం చెబుతోంది. హరుని రుద్ర తాండవంలో అమ్మవారి  తలవెంట్రుకలు   ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతోంది.ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే చాముండేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఆ ఉత్సవ శోభను స్వయంగా చూడాలే కానీ వర్ణింప శక్యం కాదు.

నవరాత్రి ఏడవ రోజున చాముండీ దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు రాత్రి నుంచి  12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. చాముండీ దేవికి ధరింపజేసే ఆభరణాలలో కొన్ని శ్రీకంఠదత్‌ నరసింహరాజ ఒడయార్‌ తన వద్ద ఉంచుకొని, వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 

అయితే  ఆభరణాలను మూల విరాట్‌ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడటానికి అవకాశం ఉంటుంది.

కుల దేవత చాముండీ దేవి సకల ఆభరణాలను మైసూరు మహారాజులే ఇస్తూ వచ్చారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్‌ చాముండీ దేవికి పరమ భక్తులు. కుల దేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారు. నక్షత్ర మాలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు. 

సంవత్సరానికొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం తమ అదృష్టంగా భక్తులు భావిస్తారు. తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి  దసరా రోజులలో అలరారుతుంది.

గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. 

ద్రవిడ నిర్మాణానికి ప్రతీకగా  ఈ ఆలయం  చతురస్రాకార నిర్మాణాన్ని కలిగి ఉంది. నవరంగ హాల్‌, మంటపం  ఉన్నాయి.  గర్భగుడి ముందు గదిలో, మహారాజా కృష్ణరాజు వడయార్‌  విగ్రహం ఉంటుంది. అమ్మవారి వాహనం గుడ్లగూబగా చెబుతారు.. కొన్నిసార్లు శవ వాహనదారిగా కూడా  వర్ణిస్తారు. ఆమె స్మశాన నివాసి.. అందుకేనేమో ఈ అమ్మవారికి జంతుబలిని ఇచ్చి, మద్యంతో నైవేద్యాన్ని నివేదిస్తారు.. తాంత్రిక విద్యలు సిద్ధించేందుకు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక్కడ చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లే మార్గంలోనే మహిషాసురుడి విగ్రహం వుంది. ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం కన్పిస్తుంది.   చాముండేశ్వరీ దేవాలయం చుట్టూ విశాలమయిన ఖాళీస్థలం వుంది.  దేవాలయ గోపురం పదంతస్తులతో అలరారుతోంది. దేవాలయ ప్రాంగణంలో విశాలమైన  రావిచెట్టు కూడా  ఉంది. ఇది అత్యంత మహిమాన్వితమైనదిగా  చెబుతారు. 

క్రౌంచగిరిగా పేరుపొందిన ఈ పర్వతం మీదకి  మెట్ల మార్గంతోపాటు రోడ్డు మార్గం కూడా ఉంది.  మెట్ల మార్గంలో  16 అడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన నంది విగ్రహం  చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.  

పురాణ, ఇతిహాసకాలంలో  చాముండి పర్వతాన్ని  మహాబలాద్రి పర్వతంగా పిలిచేరు. దీనినే మహాబలగిరి అని కూడా సంబోధించేవారు. మహాబలాద్రి పర్వతాన స్వయంభువ లింగం రూపంలో వెలిసిన   మహాబలేశ్వర ఆలయం కూడా ఉంది.   చాముండేశ్వరి ఆలయానికి  కుడివైపున, కొంత దూరంలో  ఈ ఆలయం ఉంది.  మహాబలేశ్వర దర్శనం పుణ్యదాయకం. శివాలయం  వెనుక  భాగంలో  నారాయణ స్వామి కొలువుదీరాడు.  

చాముండి పర్వతాన, తూర్పువైపుగా ’’దేవకెరె’’ అనే తీర్థం ఉంది. దేవికెరెకు సంబంధించి పురాణ గాధ ఒకటి ప్రచారంలో ఉంది.  పాపహరిణియగు గంగానదిలో స్నానమాచరించిన భక్తులు పుణ్యం సంపాదించి, విష్ణులోకం చేరుకుంటున్నారు. వారి పాపాలను గంగామాత స్వీకరించి, తాను మాత్రం క్షీణిస్తుందట. అంతట ఒకనాడు గంగామాత బ్రహ్మతో తన బాధను మొరపెట్టుకుందట. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం  దక్షిణ భారతదేశాన, పవిత్రమైన కావేరినది ప్రాంతంలో  గల మహాబలాద్రి పర్వతాన  జన్మించి, మహాబలేశ్వర లింగాన్ని  ఆరాధించి, తిరిగి స్వచ్ఛత తెచ్చుకుందట. సూర్యుడు మేషరాశిలో వుండగా, శుక్లపక్ష సప్తమి దినాన  మహాబలాద్రి క్షేత్రంలో  గల మహాబలేశ్వర స్వామిని ఆరాధిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే,  ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో  రేవతి నక్షత్రం వున్న శుక్రవారం రోజున  చాముండేశ్వరి మాతను చంపకమాలతో ఆరాధిస్తే,  సకల బాధలు తొలగి,  కోర్కెలు తీరుతాయని స్థల పురాణా లు చెబుతున్నాయి. 

చాముండి మాత ఆలయాన్ని   ప్రతి రోజు  ఉదయం 6 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు,  సాయంత్రం 5 నుంచి  8 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం తెరచి ఉంచుతారు. 

ఎలా చేరుకోవాలి?

మైసూరు వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో చాముండి హిల్స్‌ కు సులువుగా చేరుకోవచ్చు. కర్ణాటక రోడ్డు రవాణ సంస్థ కూడా ప్రతి రోజూ అనేక బస్సులను ఈ క్షేత్రానికి నడుపుతోంది.