చందధ్రర సాగరం

By: శ్రీ వనపట్ల సుబ్బయ్య

నీటితిత్తికి
భూములనిచ్చిన చేతులకు
నాగలి కర్రు కాడెడ్లకు పాదాబివందనాలు
నీళ్లకోసం తావు నిచ్చిన చెట్టు పుట్టకు
నీడనిచ్చిన నట్టు గుట్టలకు వందనాలు
వందల ఊళ్లకు వేలవేల మట్టిమనుషులకు
శిరస్సువంచి నమస్కరిస్తున్న నేల

దూపంటే దూప.. దూప…నీళ్ళ దూప….
మనిషికేగాదు… భూమికిగూడ దూపనే…
భూమి బండపెంకయ్యింది
గొడ్డు గోవుల కాల్జేతులాడలే
పొయ్యికూలింది సేతానం పడావుపడ్డది
బతుకు బర్దాసయింది
బతుకుదెరువు బొంబాయి బీవండి పాలైంది

ఒడ్డున గడ్డిమొలువలే
పిట్ట గుడ్డుపెట్టలే నెత్తిమీద బిందెతో
గుక్కెడు నీళ్లకై పెళపెళ ఎండల్లోఅవస్థలు
పిల్లనీయలే పిల్లను చేసుకోలే
బిడ్డలకు లగ్గాలుకాని బాధలు
జీవగంజికెల్లని కాలం
ధాతకరువునింపిన వలసపాలన
అరవైఏళ్ళ స్వర్ణాంధ్ర కుపరిపాలన

నెర్రెలుబారిన నేల
చారెడు నీళ్లకోసం
దేవదేవుళ్ళకు చేతులెత్తి మొక్కింది
వాగు,కుంట,చెరువుల కడుపు నిండా కంపతారు వయ్యారిభామలు సీమకంపలై పరుచుకున్నవి
శంఖుస్థాపన శిలాపలకలు చెట్లుమొలిచి ఎక్కిరిస్తుంటే ఏడ్వడానికి కన్నీళ్లింకిన కళ్ళు
మహానదులను సమాధిచేసిన చరిత్రలెన్నో…

గుండెవిప్పిన గోదావరి
కాళేశ్వరం జలేశ్వరమై
కొండపోచమ్మకు జలబోనమై
వెములాడ రాజన్నకు జలజల సాకమొక్కులై
కొమురెల్లిమల్లన్న కాళ్లను కడిగి
సంగమేశ్వర బసవేశ్వరుల జలధారలకు పురుడులై
వసంతరాగాలై పూస్తున్న మంజీరా జలాలు
తెలంగాణకు జలసిరుల సాగరం మల్లన్నసాగర్‌

సూర్యచంద్రుల్ని భూమిపైకి దించలేం
నక్షత్రాల్ని పండించలేం కానీ
బీడునేలని ఆకుపచ్చని ఆకాశంగా మార్చగల మనసముద్రం మల్లన్నసాగర్‌

బంగారు వజ్రవైడ్యుర్యాలు కాసే
వరాల సిరుల రాసులను దోచుకున్న చరిత్రను ఓడిరచి గెలిచిన సమరమే మల్లన్నసాగర్‌

ఆకాశగంగ నేలకు
పాతాళగంగ పైకి
మెతుకులేని మెదక్‌ ఆనాడు
మెతుకు నీళ్ల సీమ ఈనాడు

నీటికల సపలమైంది
అలుగులు మత్తడులు గలగల
అశ్వికదళాల పరుగుల ఆనంద డోలలు
చంద్రధర సాగరమై తలెత్తుకున్న తెలంగాణ
జయజయజయహో రాష్ట్ర విధాత కేసీఆర్‌
నేలకళ్ళలో నెలపొడుపు జలపొడుపు
జలవిధాత కేసీఆర్‌ జయహో!