మహిళలపై నేరాలకు సైబర్‌ ల్యాబ్‌తో చెక్‌

రాష్ట్రంలో మహిళలు, పిల్లల పట్ల జరిగే నేరాలను నివారించేందుకుగానూ రాష్ట్ర పోలీసు శాఖ ‘సైబర్‌ ల్యాబ్‌’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్‌ ల్యాబ్‌పై మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డిజీ స్వాతి లక్రా, సైబర్‌ ఇంటెలిజన్స్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా కేంద్రం (సిఆర్‌సిఐడిఎఫ్‌)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై డిజిపి డా॥ ఎం. మహేందర్‌రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు.

రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డీజీపి తెలిపారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, సైబర్‌ నేరాలను పరిష్కరించేందుకు, ఈ సైబర్‌ ల్యాబ్‌ దోహదపడుతుందని తెలియజేశారు.

కోవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంతో మహిళలు, పిల్లలపై నమోదైన ప్రతీ కేసులో సైబర్‌ పాత్ర ఉన్నట్టు వెల్లడైందని, నైపుణ్యంగల ఐటి ప్రొఫెషనల్స్‌తో ఏర్పాటు చేసిన ఈ సైబర్‌ ల్యాబ్‌తో సైబర్‌ సంబంధిత నేరాలను నియంత్రించే అవకాశం ఉందన్నారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, నేర పరిశోధన కోసం దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ఈ కార్యక్రమంలో సిఆర్‌సిఐడిఎఫ్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల, సలహాదారు వాజపేయాజుల శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఎస్‌.పి. రామచంద్రమూర్తి, డిఐజి సుమతి పాల్గొన్నారు.