ఢిల్లీలో ఇందిరతో చెన్నారెడ్డి చర్చలు

దివంగత తెలంగాణ నేత కొండా వెంకటరంగారెడ్డి అస్తికలను గంగా నది (అలహాబాద్‌)లో నిమజ్జనం చేసి రెండు వారాలు డాక్టర్‌ చెన్నారెడ్డి ఢిల్లీలో గడిపినారు.

డాక్టర్‌ చెన్నారెడ్డి ఢిల్లీలో రెండు సార్లు ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీని, కాంగ్రెస్‌ అధ్యక్షులు జగ్జీవన్‌ రామ్‌ను, ఒకసారి కాసుబ్రహ్మాంద రెడ్డిని కలుసుకున్న తర్వాత ఆగస్టు 26న హైదరాబాద్‌కు తిరిగివచ్చి ప్రజాసమితి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఆగస్టు 27న ఒక ప్రకటన వ్రాత పూర్వకంగా ఇచ్చారు.

‘ప్రత్యేక తెలంగాణ ఇవ్వడమో లేక ప్రజాభిప్రాయ సేకరణ జరపడమో’ తాము సూచించిన పరిష్కార మార్గాలని డాక్టర్‌ చెన్నారెడ్డి స్పష్టం చేశారు.

ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలు, దానికి మంత్రులు జవాబుదారీగా వుండాలని కొందరు తెలంగాణ ఎంపిలు చేసిన ప్రతిపాదన చెన్నారెడ్డి సమ్మతితో చేసిందేనా అని ఒక విలేకరి ప్రశ్నించగా, తమతో వారు ముందు మాట్లాడారు గానీ, ఆ ప్రతిపాదన గురించి తాము ఇప్పుడు ఏమీ చెప్పబోమని చెన్నారెడ్డి అన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోరే పార్లమెంట్‌ సభ్యులు లోక్‌సభలో విడిగా కూర్చోవాలని ప్రజాసమితి ఆదేశిస్తే ఎవరూ ఖాతరు చేయ్యలేదని, అంతమాత్రం చేత తాము నిస్పహ చెందలేదని డాక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు. ”ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక గెల్చాక మాకు కొత్త బలం వచ్చింది. ప్రాంతీయ సంఘానికి అందరూ ప్రజా సమితి వారే ఎన్నికయ్యేట్లు చూచి ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తాం. పార్లమెంట్‌ సభ్యులు అధికార పార్టీకి రాజీనామా ఇచ్చివుంటే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం కొనసాగడం గురించి నేను పట్టించుకోను. ప్రజా సమితి, తనతో సహా కొందరు వ్యక్తుల మీద ఆధారపడి లేద”ని డా|| చెన్నారెడ్డి స్పష్టం చేశారు.

ప్రధానమంత్రిని గానీ, ముఖ్యమంత్రిని గానీ వారి కోరికపైనే తాము కలుసుకున్నామని డాక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు. తమను కలుసుకోవాలని కొన్ని మాసాలుగా ముఖ్యమంత్రి కబుర్లు పంపిస్తూ వచ్చారని, కలుసుకుంటానని అన్నా కలుసుకోవడం లేదనే నింద తప్పించుకోవడానికే తాము వస్తామని ఆయన పదే పదే కబురుపెట్టగా ఆయనను కలుసుకోవడానికి అంగీకరించామని డాక్టర్‌ చెన్నారెడ్డి తెలిపారు. ఒక మధ్యవర్తి ఇంట్లో తమ సమావేశం జరిగిందని అన్నారు. సమావేశ ఫలితం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ”ఎవరి వాదం వారిదిగానే వున్నద”ని డా|| చెన్నారెడ్డి అన్నారు.

ప్రధాని వైఖరిలో మార్పు :

”ఇంతకు పూర్వం వరకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల వాదం పై పూర్తిగా ఆధారపడుతూ వచ్చిన ప్రధానమంత్రి వైఖరిలో నాకు కొంత మార్పు కనిపించింది. ఆ మార్పు చాలా ముఖ్యమైనద”ని డా|| చెన్నారెడ్డి అన్నారు.

డా|| చెన్నారెడ్డి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ సి.ఎం. కాసు బ్రహ్మానందరెడ్డిని కలవడాన్ని పలు తెలంగాణ సంఘాలు తప్పు పట్టినాయి. కొందరు సీనియర్‌ నేతలు ఈ భేటీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేశారు. దీనిపై ఒక విలేకరి డాక్టర్‌ చెన్నారెడ్డిని ప్రశ్నిస్తూ ”ఏదో యిదమిద్దమైన ప్రతిపాదన వుంటే గాని ‘అసలు కలుసుకోను’ అని ప్రతిజ్ఞ పూనిన తాము ప్రతిపాదన ఏదీ లేకుండానే బ్రహ్మానందరెడ్డిని ఎందుకు కలిసినారు?” అని అడిగారు. దీనికి స్పందిస్తూ ”వారి ఇంటికి గానీ, కార్యాలయానికి గానీ వెళ్ళనని అన్నాను. పదేపదే కబురు పెడుతుంటే నేను కలుసుకోలేదని ఢిల్లీలో పెద్దలు వేయగలనిందను తప్పించుకోవడానికే కలుసుకున్నాను. ‘ఎందరినో కలుసుకున్నట్లుగానే నన్నుకూడా కలుసుకున్నానని’ సమావేశం తర్వాత ఆయన అనడం సవ్యంగాలేదు. ముఖ్యమంత్రి శాసన సభలోని తన గదిలో లక్ష్మణ్‌ను (కొండా లక్ష్మణ్‌ బాపూజీ) కలుసుకున్నారట. వీడు లక్ష్మణుడు కాదు, రాముడు” అని డాక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు.

తెలంగాణ ఫ్రంట్‌ సభ్యులు కొత్త కాంగ్రెస్‌లోకి…

రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణా యునైటెడ్‌ ఫ్రంట్‌ సభ్యుడు, తెలంగాణా ప్రాంతీయ సంఘం ఉపాధ్యక్షుడు కె. రాజమల్లు మరోముగ్గురితో ఇందిరాగాంధీ, జగ్జీవన్‌రామ్‌ల కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆగస్టు 28న ప్రకటించారు. ”తెలంగాణ ప్రజాసమితిని ఒక రాజకీయ పార్టీగా మార్చడం ప్రజలను స్వంత లాభానికి వినియోగించడానికి ఉద్దేశించిన కుయుక్తితో కూడిన నాజూకు పద్ధతి”గా వారు ఆరోపించారు.

‘తెలంగాణ సమస్యతో సహా మొత్తం సమస్యలు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ద్వారా మాత్రమే పరిష్కరించడం సాధ్యమన్న విశ్వాసాన్ని వారు తమ సంయుక్త ప్రకటనలో వ్యక్తం చేశారు. సంయుక్త ప్రకటనపై కె. రాజమల్లుతో బాటు ఫ్రంట్‌ మాజీ నేత కె. రామచంద్రారెడ్డి, ఎల్‌.నారాయణ, సికిందరాబాద్‌ మాజీ మేయర్‌ ఎస్‌.ఆర్‌.వెంకటేశం సంతకాలు చేశారు.

కె. రాజమల్లు ప్రకటనపై ప్రజా సమితి స్పందన :

అసెంబ్లీలో తెలంగాణ ఫ్రంట్‌ సభ్యుడు కె. రాజమల్లు కొత్త కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చేసిన ప్రకటన ఆశ్చర్యకరమైన పరిణామం ఏమీ కాదని తెలంగాణ ప్రజాసమితి కార్యదర్శి జి. రాజారామ్‌ (ఎం.ఎల్‌.ఎ.) ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. కె. రాజమల్లు మరియు అతనితో అధికార కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించిన మిగతా ముగ్గురు సమితి కార్యక్రమాల్లో గత జనవరి నుంచి పాల్గొనడం లేదని, అటువంటి వారు సమితిని విమర్శించడం అసంగతమైన విషయమని రాజారామ్‌ అన్నారు.

ఎం.పి.ల కృషికి వ్యతిరేకంగా…

ప్రధానికి మరో 20 మంది ఎం.పి.ల లేఖ:

తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అదనపు అధికారాలను మంజూరు చేస్తూ 1970 మార్చి నెలలో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వు ఫలితాలను తెలసుకోవడానికి రెండు మూడు సంవత్సరాలు అమలు జరిపి చూడాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర – తెలంగాణ ప్రాంతాలకు చెందిన 20 మంది పార్లమెంట్‌ సభ్యులు కోరినారు. వీరు 26న ప్రధానికి లేఖ రాస్తూ ప్రాంతీయ సంఘానికి స్వయం నిర్ణయాధికారం కల్పించే మూలాంశాలు, సంఘం అభీష్టాలను ప్రజల అవసరాలను తీర్చే ప్రతి ఒక్క అధికారం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా సమకూర్చబడినాయని అన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు ప్రాంతీయ సంఘం విచారణ పరిధిలోకి వచ్చే అంశాలపై సంఘం నిర్ణయాలను అమలు జరపడానికి చట్టబద్దమయిన కార్యనిర్వాహక యంత్రాంగం కోసం కొంతమంది తెలంగాణ ఎంపిలు చేస్తున్న కృషికి ప్రతికూలంగా ఈ లేఖను వ్రాయటం జరిగింది. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో తెన్నేటి విశ్వనాథం (ఇండిపెండెంట్‌), ఎం. శ్రీనివాసరెడ్డి, ఎం. ఆనందం, ఎం. హెన్రీ శామ్యూల్‌ (కొత్త కాంగ్రెస్‌) ఉన్నారు.

రాష్ట్ర శాసనసభకు జవాబుదారీ అయిన రాష్ట్ర మంత్రి వర్గంతో సమానంగా కార్యనిర్వాహక అధికారాలను పంచుకునే మరో వ్యవస్థ ఏర్పాటుకు తాము వ్యతిరేకులమని వీరు తెలిపారు.

సహచరులతో చెన్నారెడ్డి సమీక్ష :

తన ఢిల్లీ పర్యటనపై తెలంగాణ నేతల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తడంతో నిజానిజాలు వారికి వివరించడానికి, తెలంగాణ పై ఢిల్లీ ధోరణి, ఎంపిల ప్రయత్నాలు సమీక్షించడానికి డాక్టర్‌ చెన్నారెడ్డి ఆగస్టు 29న ప్రజాసమితి నేతలు, ప్రముఖ కార్యకర్తలతో సమావేశాన్ని బి. రామ్‌దేవ్‌ అధ్యక్షతన నిర్వహించారు.

ఢిల్లీలో తనకు తానుగా ప్రధానిని, సిఎంను కలవాలనుకోలేదనీ, తాను ఢిల్లీలో వున్న విషయం తెలిసి వారే కలవాలని కబురు చేస్తే కలిశానని, కొందరు కేంద్ర నాయకులతో కూడా కలవడం జరిగిందని డాక్టర్‌ చెన్నారెడ్డి నేతలకు తెలిపారు.

ఈ చర్చల గురించి ఆగస్టు 27న డాక్టర్‌ చెన్నారెడ్డి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలోని అంశాలనే ఈ సమావేశంలో వివరించారు. అవి :

”తమను దోచుకోవటానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపిన తెలంగాణా ప్రజలకు సంతృప్తికంగా తెలంగాణ ప్రాంతానికి ఏర్పాటు చేయదగు వ్యవస్థ గురించి మా చర్చలలో ప్రధానంగా పరిశీలన జరిగింది.

”మా చర్చలలో స్పష్టమైన పరిష్కారం ఏదీ సాధ్యం కాలేదని నేను ప్రజలకు స్పష్టం చేయదలిచాను. అయితే తెలంగాణ సమస్యపై కేంద్ర నాయకుల మనస్సులో ఇదివరకటి కంటే ఇప్పుడు ఆలోచన, సదవగాహన పెరగటమే కాకుండా తెలంగాణ ప్రజల కోర్కెలు తీర్చవలెనన్న ఆతృత, తొందరపాటు వారిలో పెరిగింది. ఇది ఎంతో

శుభసూచన. అయినప్పటికీ మార్గం సుగమంగా లేదు. దేశం దృష్టిని ఆకర్షించి పార్టమెంటులోని అన్ని పక్షాల నాయకులకు ఆందోళన కలిగించిన ఈ ఉద్యమాన్ని నడిపిన వారు అప్రమత్తతతోనే మెలగాలి. ఈ సమస్య పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పింది కాకుండా తాము స్వంతంగా ఈ సమస్యను గురించి ఆలోచించాలన్న భావం కేంద్ర నాయకులలో కలిగింది.

”హిమాచల్‌ప్రదేశ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కలిగించాలని ఇటీవల చేసిన నిర్ణయం, మణిపూర్‌కు కూడా ఇటువంటి ప్రతిపత్తి కలిగించాలన్న ప్రతిపాదనకు విస్తృతంగా వచ్చిన మద్దతు దృష్ట్యాను తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాదనలోని యదార్థాన్ని పార్టమెంట్‌ సభ్యులు గ్రహించారు.

”తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుతున్నారని ప్రధానితో నేను పునరుద్ఘాటించి చెప్పాను. అభిప్రాయ సేకరణ ద్వారా గానీ,

వరుసగా జరిగే ఉప ఎన్నికల ఫలితాల ద్వారా గానీ ప్రజల తీర్పునకు ప్రజా సమితి కట్టుబడి వుంటుందని కూడ నేను ప్రధానికి చెప్పాను. ప్రజల అభిప్రాయ సేకరణ జరిపితే, ఈ చర్య వలన దేశంలో ఇంకెక్కడో విపరీత పరిణామాలు సంభవించగలవన్న భయమే వుంటే హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపి ప్రజాభిప్రాయాన్ని గ్రహించి వుండవలసింది.

అయితే నగర పాలక సంస్థను ఏక పక్ష నిర్ణయం ద్వారా రద్దు చేశారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ప్రభుత్వం నిలబెట్టిన వ్యక్తి ప్రజా సమితి అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోవటం ఢిల్లీ పెద్దలు గుర్తించకపోలేదు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగితే తెలంగాణ ఉద్యమం వెనుక ప్రజా బలం లేదంటూ తాము చేస్తున్న ప్రచారం అబద్దమని తేలిపోతుందని ప్రభుత్వానికి తెలుసు.

”తెలంగాణ ప్రజల అభీష్టం తీర్చే ఎట్టి ప్రతిపాదన నైనా కేంద్రం చేస్తే దానిని తెలంగాణ ప్రజా సమితి గట్టిగా పరిశీలిస్తుంది.

”కొందరు పార్లమెంట్‌ సభ్యులు తాముగా కొన్ని ప్రతిపాదనలు చేసి మేఘాలయ పద్ధతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని ప్రచారం సాగిస్తున్నారనే వార్తలు నేను చూశాను. తెలంగాణ సమస్యపై ప్రజా సమితి వైఖరి తిరుగులేదని చెప్పటం తప్ప ఇంకే వ్యాఖ్యను నేను చేయదలచుకోలేదు.

”పోయిన వారం బ్రహ్మానంద రెడ్డితో ఢిల్లీలో జరిపిన చర్చలను గురించి మన మిత్రులు పెద్దగా పట్టించుకోనక్కరలేదని నేను చెప్పదలచుకున్నాను. ప్రాథమికాంశాలపై రాజీ లేనంతవరకు ఇటువంటి చర్యల వలన ఏమీ కాదు. అధిక ప్రచారం పొందిన ఈ సమావేశం గురించి ఇంతకంటే ఏమీ చెప్పనవసరం లేదు. యీ వివరణ వలన అపోహలు తొలగగలవని భావిస్తున్నాను” అంటూ చెన్నారెడ్డి తన పత్రికా ప్రకటన ముగించారు.

వచ్చే సంచికలో…

”అష్ట సూత్రాల అమలుతో

తెలంగాణ అభివృద్ధి”