తెలంగాణ నేతకే సి.ఎం. పదవి

By: వి. ప్రకాశ్‌

కాసు బ్రహ్మానంద రెడ్డిని సిఎం పదవి నుండి తప్పించింది తెలంగాణ నేతకు సి.ఎం. పదవి కట్టబెట్టాలనే యోచనతోనే అని, ఆ రకంగా తెలంగాణ ప్రజల మెప్పు పొందాలని ఇందిరా గాంధీ భావించారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. జె.వి. నర్సింగారావు వంటి తెలంగాణా సీనియర్‌ మంత్రులు డిల్లీకి వెళ్ళి ప్రధానిని, జాతీయ నాయకులను కలిసారు. ఎవరికి వీలైన పద్ధతిలో వారు సి.ఎం. పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర సమైక్యతకు భంగం కలగకుండా ఉండాలంటే తెలంగాణ వ్యక్తికే సిఎం పదవి ఇవ్వాలని ఆంధ్రప్రాంత మంత్రులు, నాయకులు బహిరంగంగానే ప్రధానిని కోరుతూ ప్రకటనలు చేస్తున్నారు.

తెలంగాణీయునికే సిఎం ఇవ్వాలన్న మంత్రి వాసుదేవరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి ఎ. వాసుదేవరావు సెప్టెంబర్‌ 18న (1971) ఒక ప్రకటన చేస్తూ ‘‘ముఖ్యమంత్రి పదవికి తెలంగాణా ప్రాంత వ్యక్తి ఎన్నిక కాకుండా చేసే ఎలాంటి ప్రయత్నమైనా సమైక్య రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మార్గాన్ని సుగమం చేయవచ్చు’’నని హెచ్చరించారు. ‘‘అలా చేయని పక్షంలో బ్రహ్మానంద రెడ్డి చేసిన పదవీ త్యాగం వ్యర్థం కాగలద’’ని అన్నారు.

అధికార కాంగ్రెస్‌లో విలీనం కావాలని ప్రజా సమితి రాష్ట్ర కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి వాసుదేవ రావు హర్షం వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్ర సమైక్యతను సవాలు చేసిన వివాదం ప్రజాసమితి అధికార కాంగ్రెసులో విలీనంతో సమసిపోయింద’’ని ఆయన తెలిపారు.

‘‘తెలంగాణ వ్యక్తిని శాసన సభ నూతన నాయకునిగా ఎంపిక చేసేందుకు వీలుగా ప్రధానికి మద్దతునివ్వాల’’ని ఆయన శాసనసభ్యులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘తెలంగాణ ప్రాంతీయుణ్ణి సిఎం పదవికి ఎంపిక చేసుకునేందుకు ఇది మహదవ కాశం. కేవలం ఈ స్వల్ప కాలానికే కాక 1972 ప్రారంభంలో జరుగనున్న సాధారణ ఎన్నికల తర్వాత మరో ఐదేళ్ళు తెలంగాణ ప్రాంత వ్యక్తికి నాయకత్వాన్ని అప్పగించడం ద్వారా ప్రజలను సంతృప్తి పర్చాల’’ని మంత్రి వాసుదేవరావు ఆ ప్రకటనలో తెలిపారు.

లెజిస్లేటర్ల ఫోరం విజ్ఞప్తి

‘‘తెలంగాణ ప్రాంతం వారికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల’’ని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ యువ లెజిస్లేటర్ల ఫోరం ఒక తీర్మానం ఆమోదించింది. ఈ ఫోరం సెప్టెంబర్‌ 19న నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు పి. నరసారెడ్డి పాల్గొన్నారు. ఈ ఫోరం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో ‘‘తెలంగాణ ప్రాంత నాయకునికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి వీలుగా బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేశారు. అందువల్ల ప్రధాని ఇందిరా గాంధీ, ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్న బ్రహ్మానందరెడ్డి తెలంగాణా ప్రాంతీయునికి రాష్ట్ర నాయకత్వం లభించేలా చేయాలని అభ్యర్థించినది.

ఈ తీర్మానం ప్రతులు ప్రధానికి, బ్రహానంద రెడ్డికి, పి.సి.సి. అధ్యక్షనికి అందజేసారు. నలభై సంవత్సరాలలోపు వయస్సు గల కాంగ్రెస్‌ శాసన సభ్యులు ఈ ఫోరంలో ఉన్నారు.

ఎం.పి. రామగోపాల్‌ రెడ్డి ప్రకటన

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తినే ఎన్నిక చేయటం యుక్తమ’’ని అధికార కాంగ్రెస్‌కు చెందిన పార్లమెంట్‌ సభ్యుడు ఎమ్‌. రామగోపాల్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణా వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే నిర్ణయం తెలంగాణా ఆందోళనకు ముందు కూడా పెద్దమనుషుల ఒప్పందంలో ఉన్నదే’’నని ఆయన అన్నారు. ‘తెలంగాణ ప్రజా సమితి ప్రారంభమైన రెండు సంవత్సరాల కాలంలోనే అంతమై పోవడం రాష్ట్ర రాజకీయ చరిత్రలోని ఒక ముఖ్య ఘట్టం’ అని ఎం.పి. రామగోపాల్‌ రెడ్డి అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడైన దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం వున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రధానికి, సంజీవయ్య, కేంద్ర మంత్రులు సుబ్రహ్మణ్యం, ఉమాశంకర్‌ దీక్షిత్‌, జగ్జీవన్‌రాంలకు టెలిగ్రాంలు పంపారు. ‘ఆంధ్ర ప్రాంతీయున్ని ముఖ్యమంత్రిగా నిర్ణయించి ఆ నిర్ణయాన్ని బలవంతంగా అమలు పర్చదలుచు కున్నట్లయితే రెండు ప్రాంతాల్లోనూ తీవ్ర పరిణామాలు తప్పనిసరిగా ఏర్పడుతాయ’ని ఆయన హెచ్చరించారు.

తెలంగాణా మైనారిటీల సంఘం విజ్ఞప్తి

తెలంగాణా మైనారిటీల సంఘం కార్యవర్గం తాహిర్‌ అలీఖాన్‌ అధ్యక్షతన సమావేశమై ‘తెలంగాణా ప్రజలు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిపోయినందు వల్ల మాత్రమే సంతృప్తి పడజాలరు. తెలంగాణా ప్రాంతీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో సహా ప్రజా సమితి ప్రతిపాదించిన ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేయాల’ని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

సి.ఎం. ఎంపిక ప్రధానికే వదిలేశామన్న డా. చెన్నారెడ్డి, వి.బి. రాజు

డా॥ చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ ‘ప్రధాన మంత్రితో తమ చర్చలలో నాయకత్వానికి సంజీవయ్య పేరు కూడా ప్రస్తావనకు వచ్చింద’ని తెలిపారు. తెలంగాణకు చెంది, తెలంగాణా ప్రజలకు సంపూర్ణంగా సంతృప్తి కలిగించే విధంగా ఐదు సూత్రాలను అమలు జరిపే వ్యక్తి నాయకుడు కావాలని తాను ప్రధానమంత్రికి చెప్పినట్లు డా॥ చెన్నారెడ్డి ఈ ప్రకటనలో వివరించారు.

‘తెలంగాణా ప్రజల ఆశయాదర్శాలను సంతృప్తికరంగా నెరవేర్చవలసిన బాధ్యతను తీసుకొనవలసింది ప్రధాన మంత్రే గనుక ఆమెకు నాయకుని నిర్ణయ బాధ్యతలను వదిలేసామ’ని ప్రకటనలో పేర్కొన్నారు. వి.బి. రాజు ప్రజసమితి చేసిన కాంగ్రెస్‌లో విలీన తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజీవయ్యకు అందజేశారు.

వి.బి. రాజు పత్రికల వారితో మాట్లాడుతూ ‘తెలంగాణా ప్రజల ప్రయోజనాలను కాపాడే బాధ్యతను ప్రజాసమితి ప్రధాన మంత్రికి అప్పగించిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా తగిన కృషి చేయగలరని ప్రజాసమితి ఆశిస్తున్నద’’ని అన్నారు.

ఆరు సూత్రాల అమలుకు గడువు ` చెన్నారెడ్డి

ప్రజా సమితి కాంగ్రెస్‌లో విలీనం, ఆరు సూత్రాలపై ఆధారపడిన పరిష్కారం అమలుపై తన అభిప్రాయాన్ని పత్రికలకు డా॥ చెన్నారెడ్డి ఒక ప్రకటన ద్వారా వివరించారు. ‘ఆరు సూత్రాల అమలుకు మూడు నాలుగేళ్ళ గడువు ఇవ్వాలని’ ఆ ప్రకటనలో తెలిపారు.

ఏ పరిస్థితులలో ప్రధానితో తాను సంప్రదింపులు ప్రారంభించినదీ వివరిస్తూ…’ చర్చలు బహిరంగంగానే జరిగాయి. దీనిలో రహస్యమేమీ లేదు. తెలంగాణా సమస్యను పరిష్కరించాలనే నిర్దిష్ట లక్ష్యంతో సంప్రదింపులు సాగాయి. ససేమిరా అంగీకరించ కుండా మొండి పట్టుదలతో అధికారంలో కొనసాగుతూ అసహాయ వైఖరినవలం భిస్తున్న బ్రహ్మానందరెడ్డి రాజీనామా అత్యంత జటిలమైన సమస్య అయినప్పటికీ, ప్రధాని దానినే మొదట తీసుకోవడం అవసరమని భావించారు.

ముఖ్యమంత్రి రాజీనామా వల్ల పరిస్థితిలో కొత్త పరిణామాలు ఏర్పడ్డాయి. ఈ ఘట్టం కొద్దిరోజులలో ముగుస్తుంది. ఆ తర్వాత తక్కిన అంశాలు వస్తాయి. ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ సంఘం, తెలంగాణా అభివృద్ధి మొదలైన వాటిపై ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇదివరకే నిర్ణయాలు గైకొన్నాయి. ఇక పరిస్థితి పునఃపరి శీలన విషయం సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఎప్పుడు అనేది వివరాలు చర్చించి ప్రకటించవలసియున్నది. పరిస్థితి పునఃపరిశీలన విషయంలో రాజీ ప్రసక్తి ఏమాత్రం లేద’ని అన్నారు.

‘తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటు, ప్రాంత రాజకీయ వ్యక్తిత్వాన్ని నిలపడానికి వీలైన ఆచరణాత్మక సాధనంగా రూపొందించుకోవలసి వున్నది. నూతన మంత్రివర్గం ఏర్పడిన తర్వాత అధికార కాంగ్రెస్‌, ప్రజాసమితి కలిసి ఈ విషయాన్ని గురించి సమన్వయ పూర్వకంగా ఆలోచించుకోవలసి ఉంటుంద’ని ఆయన అన్నారు.

‘కొందరు మిత్రులు మధ్యలోనే తమని వదిలి జనసంఘం, ఎస్‌.ఎస్‌.పిలలో చేరిపోయారు. కొందరు టి.పి.ఎస్‌.ను వదిలి పోటీ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడే వారంతా ఇంతగా ఆందోళన ప్రకటించడం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. బహుశా తమ మార్గం వేరని వారు భావించి ఉంటార’ని ఆయన అన్నారు.

కొండా లక్ష్మణ్‌ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం

కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1969 జూన్‌ ఒకటిన ఏర్పాటు చేసిన తెలంగాణా కాంగ్రెస్‌ పార్టీని 1971 సెప్టెంబర్‌ 22న అధికార కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. అధికార కాంగ్రెస్‌లో విలీనం కావాలని తెలంగాణా కాంగ్రెస్‌ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాన్ని అదే రోజున జరిగిన సర్వసభ్య సమావేశం ఆమోదించింది.

1969 మార్చి 28న తెలంగాణ సమస్యపై మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ను స్థాపించారు. తన సంస్థనే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీగా తెలంగాణాలో గుర్తించా లని ఏఐసిసిని అభ్యర్థించారు. పార్టీ అంగీకరించక పోవడంతో తెలంగాణ కాంగ్రెస్‌నే రాజకీయ పార్టీగా మార్చారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ఆయన సహచరులు డిల్లీలో కేంద్ర నాయకులతో చర్చలు జరిపిన తర్వాత నగరానికి రాగానే తన పార్టీ కార్యవర్గాన్ని, సర్వసభ్య సమావేశాన్ని జరిపి విలీన నిర్ణయాన్ని తీసుకున్నారు.

పోటీ ప్రజాసమితి ఉద్యమ నిర్ణయం

ప్రజా సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘాలు నిరసించాయి. బి. సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన గల పోటీ ప్రజా సమితి కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం రోజున ఈ మంత్రులకు నల్ల జండాలతో స్వాగతమివ్వాలని నిర్ణయించింది.

‘ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని చెప్పి శాసన సభ్యులుగా, పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేక రాష్ట్రావతరణకు ఆటం కంగా వున్న అధికార కాంగ్రెస్‌లో చేరిన వారి ఇళ్ళ వద్ద పికెటింగ్‌ చేయాల’ని నిర్ణయించినట్లు బి.సత్యనారాయణ రెడ్డి పత్రికా విలేకర్లతో అన్నారు.

విద్యార్థుల నిరసనలు

తెలంగాణ ప్రజాసమితిని అధికార కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

జంట నగరాల్లోని చాలా కళాశాలలకు విద్యార్థులు హాజరు కాలేదు. మరికొన్ని కళాశాలల్లో విద్యార్థులు నల్ల జండాలు ఎగురవేశారు. వీధుల్లోకి వచ్చి విలీనాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నిజాం కళాశాల, వివేకవర్ధని తదితర కళాశాలల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. సికింద్రాబాద్‌ కళాశాల, సర్దార్‌ పటేల్‌ కళాశాలల్లో రెండు షిఫ్టుల విద్యార్థులు నల్ల జండాలు ధరించి నిరసన ప్రదర్శనలు జరిపారు. ఖమ్మం, వరంగల్‌ విద్యార్థులు విలీనానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. చెన్నారెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేశారు. కరీంనగర్‌లో విద్యార్థులు నిరసన ఊరేగింపు జరిపారు.

(వచ్చే సంచికలో… ప్రజాసమితి విలీనానికి

ఏ.ఐ.సి.సి. ఆమోదం)