బాలలకు నిజమైన బహుమతి!

భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ జన్మదినం నవంబర్‌ 14న మనం బాలల దినోత్సవం పేరుతో పిల్లల పండుగ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వేడుకలు జరపడం, పిల్లలకు ఆటలతోసహా పలు పోటీలు నిర్వహించడం, బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం. అంతటితో పిల్లల పట్ల మన బాధ్యత తీరిపోతుందా!

నేటి బాలలే రేపటి పౌరులు. బాలల బంగారు భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి వీరిభవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఎవరిది? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులది. విద్యాబుద్ధులు నేర్పే గురువులది. కానీ, తెలంగాణ ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్యంగా పిల్లల బంగారు భవితకోసం నిర్వహిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవలసింది కె.సి.ఆర్‌ కిట్‌, అమ్మ ఒడి కార్యక్రమాలు. తల్లి ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుంది. అందుకే, ఈ కార్యక్రమం కింద గర్భిణీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతోపాటు, మంచి వైద్యం, మందులు, పోషకాహారం అందించడమేగాక ప్రభుత్వ దవాఖానాలలో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. నవజాత శిశువుల రక్షణకోసం రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కేర్‌ యూనిట్లు, స్టెబిలైజేషన్‌ యూనిట్లు, నవజాత శిశురక్షణా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగింది. దీనివల్ల శిశు మరణాలు తగ్గించగలుగుతున్నాం. కె.సి.ఆర్‌ కిట్‌ పేరుతో నవజాత శిశువులకు అవసరమైన అనేకరకాల వస్తువులను అందజేయడం వల్ల వారు ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరుగుతున్నారు.

చిన్న పిల్లలకు పోలియో, తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేయడంతోపాటు, అంగన్‌ వాడీ కేంద్రాలలో పోషకాహారం అందిస్తుండటంతో పిల్లల్లో పోషకాహారలోపం తగ్గుతోంది. ఇక పాఠశాలల్లో, వసతి గృహాలలో గతంలో దొడ్డుబియ్యంతో భోజనం పెడుతుండటంతో చాలామంది పిల్లలు ఆ ఆహారం తీసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఫలితంగా పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండటంతోపాటు, మధ్యలోనే చదువు మానివేసేవారి సంఖ్య అధికంగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పరిస్థితి మారిపోయింది. పాఠశాల్లో మధ్యాహ్నభోజనానికి, వసతి గృహాల అవసరాలకి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరాచేస్తూ, సంపూర్ణ ఆహారం అందిస్తోంది. దీంతో పాఠశాలలకు హాజరయ్యేవారి సంఖ్య పెరగటంతోపాటు, మధ్యలోనే చదువుమానేసేవారి సంఖ్య తగ్గింది. పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందించడంతో పిల్లల విద్యాభ్యాసం సాఫీగా సాగుతోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు, పరిశుభ్రమైన మంచినీరు అందించడం, కంటివెలుగు కార్యక్రమం కింద విద్యార్థులకు వైద్యపరీక్షలు కూడా నిర్వహించి, అవసరమైనవారికి కళ్ళద్దాలు, చికిత్సలు అందించడం వంటి చర్యలు ప్రభుత్వ మానవతా కోణానికి నిదర్శనం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పేదలను ఆదుకోవడంతోపాటు బాల్యవివాహాలను ప్రభుత్వం కట్టడి చేయగలుగుతోంది. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు కూడా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకొంటోంది. పోలీసు శాఖ వారు అనేక ప్రాంతాలలో జరిపిన దాడులలో వందలాది మంది బాలకార్మికులకు విముక్తి లభించింది.

పిల్లలు తల్లిగర్భంలో ఉన్నప్పటి నుంచీ, పుట్టిన ప్రతిబిడ్డా ఆరోగ్యంగా ఎదగడానికి, మంచి వాతావరణంలో పెరిగి, విద్యాభ్యాసం కొనసాగించడానికి ఇవన్నీ బాలలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మంచి బహుమానాలే!