ధరణీ సేవల ఫలితం దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం
– By ఎండి .యాకుబ్ పాషా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణీ పోర్టల్ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. దీనికి ఉదాహరణ ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామరైతులకు ఇటీవలే నూతన పాస్ పుస్తకాలు అందించడమే.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో సర్వేనెం. 58లో 1977వ సంవత్సరంలో భూదాన్ భూమి 313 ఎకరాలను 75 మంది రైతులకు అందించడం జరిగింది. అట్టి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేసియుండగా 2018వ సంవత్సరంలో జరిగిన భూ రికార్డుల నవీకరణలో అట్టి రైతుల భూములు నిషేధిత జాబితాలోకి చేర్చడం వలన పాస్ పుస్తకాల జారీ నిలుపుదల చేయబడ్డాయి. అప్పటి నుండి ఆ రైతులు పాస్ పుస్తకాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ భూదాన్ యజ్ఞ బోర్డు నుండి అప్పటి ఉత్వర్వుల ప్రతులను తెప్పించి పాతపుస్తకాలు కలిగిన రైతులకు, చనిపోయిన రైతుల వారసులకు రికార్డుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగంతో పరిశీలన చేయించి 197 ఎకరాలకు గాను ఎస్సీ, ఎస్టీ, బి.సి అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 86 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందించారు. దాదాపు మూడున్నర సంవత్సరాల కాలంగా అపరిష్కృతంగా వున్న భూ సమస్యలను ధరణీ ద్వారా పరిష్కారం లభించింది.

ధరణీ పోర్టల్ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 15,947 క్లెయిములకుగాను 15,583 క్లెయిము లను పరిష్కరించడం జరిగింది. వాటిలో దాదాపు 10వేల పెండింగ్ మ్యూటేషన్లను, అదే విధంగా 646 ఎల్-ఫారంలు, 4,135 గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్, 205 సక్సెషన్ విత్ అవుట్ పి.పి. బి, 103 ఆధార్ సీడింగ్స్, 57 కోర్టు కేసులకు సంబంధించిన పి.పి. బిల జారీ, 7,416 పి.ఓ.వి దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది.
సుమోటోగా స్వీకరించిన 68,361 సర్వే నెంబర్లకు సంబంధించిన 89,600 ఎకరాల విస్తీర్ణంకుగాను 52,267 సర్వే నెంబర్ల యొక్క 67,637 ఎకరాల విస్తీర్ణాన్ని జిల్లా కలెక్టర్ ఆమోదించడం జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన ధరణీ పోర్టల్ సేవలు, నూతన రెవెన్యూ చట్టం అమలు ద్వారా జిల్లాలో వ్యవసాయ భూ క్రయ విక్రయాలు పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి, తహశీల్దార్లు సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ జిల్లాలో ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ అయిన 16,426 సేల్ రిజిస్ట్రేషన్స్, 9,606 గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, 11 వందలు నాలా కన్వర్షన్స్ ధరఖాస్తులను పరిష్కరించి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసి డాక్యుమెంట్లను సంబంధిత యజమానులకు ఆందించడం జరిగింది.
జిల్లా ప్రజలు ధరణీ పోర్టల్ ద్వారా పొందనున్న సేవలకు సంబంధించిన సమాచారం, సలహాలు, సూచనలు అందించుటకుగాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ధరణీ భూ సమస్యల విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారం, సలహాలు, సూచనలు అందించడం జరుగుతున్నది.