|

ఛుపారుస్తుం

tsmagazine
పైకి రాజుబాటలాగానో, కాపు రాజయ్య బాటలాగానో అనిపించినా, లోలోన పరికించి చూస్తే-తనకంటూ పసందైన గీతగల హితగల లోతైన చిత్రకారుడు-మహ్మద్‌ రుస్తుం.నిజానికి రాజయ్య ప్రత్యక్ష శిశ్యులుగాని, ప్రశిశ్యులుగాని అందుకోలేని అసాధారణమైన, అపురూపమైన జానపదుల శ్రమైక జీవన సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుని రసరమ్య చిత్రాలు రుస్తుం వేశాడు. ఇంతకాలం సిద్ధిపేట కేంద్రంగా కృషి చేస్తున్నందున రుస్తుం, ఛుపారుస్తుంగానే మిగిలిపోయాడు.

‘వటుడు ఇంతింతై…’ అన్నట్టుగా ఆయ న సృజన జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి దాటి జాతీయస్థాయికి ఎదిగింది, జానపద చిత్ర వినీలాకాశంలో హరివిల్లులా విరిసింది. ‘దేశ దిమ్మరులు’ చిత్రం రీతి, రింభోళి-రుస్తుంను గొప్ప చిత్రకారుడన డానికి రూఢీగా నిలిచింది. ఆ చిత్ర నిర్మా ణం-అందులోని జీవాలు, వాతావరణం-సంచార జాతుల జీవన విధానం తెలిసినవారికి, మరీ ముఖ్యంగా చేయి తిరిగిన చిత్రకారుడి తూలికకే తేలిక.

ఆ తర్వాత ‘గొర్రెల కాపరి’ చిత్రంలోని వాస్తవికత, వర్ణ సమ్మేళనం, రేఖా లావణ్యం గమనించినవారుసైతం వహ్వారే అనకతపఊపదు.

పల్లెపట్టులలోని పడతులు-పజ్జొన్న చేనులోనో, పాలు పెరుగు అమ్ముతూనో, పాపకు పాలు పడుతూనో, పేలు చూస్తూనో, పని పాటలకు పోతూనో, వివిధ రకాలుగా, వైవిధ్యభరితమైన భంగిమలలో రుస్తుం చిత్రించిన తీరు తేటతెల్లమైంది. ఇంకా పూసలోళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, వడ్లు దంచేవాళ్ళు, బీడీలు చేసే భామలు, దంపతులు, ఏకాంత కాతుల ఏ చిత్రం చూసినా-ఇది రుస్తుం చిత్రమనే ముద్రాంకితమైందే. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన ‘ఓం’, ‘నూరేమదీన’, ‘బుద్ధుడు’లాంటి రుస్తుం చిత్రాలు చిత్ర కళారంగంలో మునాదిలాంటివి, మునాఫా లాంటివి. వాటిలో ఆయన చూపిన వైవిధ్యం, ప్రతీకాత్మకత ప్రస్తుతించదగింది. ‘ఉగాది’, ‘బతుకమ్మ’, ‘బోనాలు’, ‘సంక్రాంతి’, ‘గంగిరెద్దు’, ‘గాలిపటాలు’ చిత్రాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ఎత్తిన పతాకలు.tsmagazine

‘రాధాకృష్ణ’ శీర్షికన రుస్తుం గీసిన దాదాపు నలభై చిత్రాల్లో నిగమ గోచరుడి లీలలు నిగ్గు తేల్చినిగారిస్తూ నవనవలాడుతూ ఉన్నాయి. తన మతమేదైనా శ్రీకృష్ణతత్వాన్ని రుస్తుం రుచి చూపినరీతి ఆకర్షణీయమైంది. అంతేకాదు గ్రామ దేవతలకు కూడా ఆయన ఎంతో అధ్యయనంతో, అపురూపంగా చిత్రించాడు.

ఆరడుగుల ఎత్తు, ఐదడుగుల వెడల్పు క్యాన్వాసులపైనే కాకుండా అందులో సగం ప్రయాణంలో, అంతకు ఎంతో చిన్న క్యాన్వాసుపై ఏ చిత్రం వేసినా జనజీవనాన్ని, వారి శరీర సౌందర్యాన్ని, వారి కట్టూ-బొట్టూ, వారి పండుగలు-పబ్బాలు, కొలిచే దేవుళ్ళు-సమస్తానికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. పసందుగాచూపాడు.

బిజాన్‌ చోటిబీ-ఇబ్రహీం దంపతులకు యాభై ఎనిమిదేండ్ల క్రితం మిర్‌దొడ్డి మండలం ఆల్వాల్‌లో పుట్టిన మహ్మద్‌ రుస్తుంకు చిన్ననాటి నుంచి చిత్రకళపట్ల అత్యంత ఆసక్తి ఉండేది. దానికితోడు తండ్రి ప్రోత్సాహం ఉండేది. అయితే తీరొక్క రంగులు, తెల్లని డ్రాయింగ్‌ పేపర్లు కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి ఆయనది. అయినా ఆయన కళాసాధన ఆపకుండా కనిపించిన తెల్లని గోడలపై బొగ్గుతో బహుచక్కని బొమ్మలు గీసేవాడు. ఆయన గీత బాగుండడంవల్ల, గోడలపై రాతలు, గీతలు వారించే గ్రామీణులు రుస్తుంను రంజించే బొమ్మలు గీయమని కోరికోరి వేయించుకునేవారు.

ముత్యాల్లా అక్షరాలు వ్రాయడం, సైన్సు బొమ్మలు చక్కగా వేయడం, చదువులో శ్రద్ధ చూపడంవల్ల స్కాలర్‌షిప్‌ వచ్చింది.tsmagazine

తన తండ్రి ఇబ్రహీం కూడా లాటరీ బొమ్మలు వేసేవాడట. ఆయన వేసే నెమలి, గుర్రం చూసి ప్రేరణపొంది తొలి రోజుల్లో ఆ బొమ్మలు వేసేవాడు, సైన్‌ బోర్డులు వ్రాసేవాడు. అట్లా జీవనయాత్ర సాగుతుండగా ఎస్‌ఎస్‌సీలో కృతార్థుడైనాడు. ఆ తర్వాత డ్రాయింగ్‌ పరీక్ష వ్రాసి హయ్యర్‌లో జిల్లా మొత్తానికి ప్రప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత కర్నాటకనుంచి నాలుగేండ్ల బి.ఎఫ్‌.ఏ. పిదప-రెండేండ్ల ఎం.బి.ఏ పూర్తి చేశాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంనుంచి ఎంసీజే కరస్పాండెన్స్‌ కోర్సు పూర్తి చేశారు.tsmagazine

బొమ్మలు వేయడం, బీడీలు చుట్టడం, బట్టలు కుట్టడం, కిరాణా కొట్టు నడపడం, సైన్‌ బోర్డులు వ్రాయడంలో అనుభవం పొందిన రుస్తుంకు పాతికేండ్ల వయస్సులోనే తాను చదువుకున్న మిర్‌దొడ్డి పాఠశాలలోనే డ్రాయింగ్‌ మాష్టారుగా ఉద్యోగం రావడంతో కొంతవరకు తానుపడిన కష్టాలు గట్టెక్కాయి. రంగులు, కుంచెలు, క్యాన్వాసులు ఖరీదు చేశాడు. ఎంతోకాలంగా తన మనోఫలకంపై ముద్రవేసిన అనేకానేక దృశ్యాలను కమనీయంగా క్యాన్వాసుపైకి ఎక్కించడం ప్రారంభించాడు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు-కాపు రాజయ్య సిద్దిపేటకు చెందినవాడైనా, తాను ఇతోధికంగా సాధన చేస్తున్న కాలంలో ఆయనతోగాని, ఆయన చిత్రాలతోగాని రుస్తుంకు పరిచయం లేదు. ఇరువురు ఒకే ప్రాంతంవారు కావడం, ఇద్దరిదీ ఒకే వృత్తి-ప్రవృత్తి కావడంవల్ల అనంతరకాలంలో పరిచయం పెరిగిపోయింది. పరస్పరం ప్రమందరాలు పరిమళించాయి.
tsmagazine
ఇవ్వాళ యధాలాపంగా చూస్తే-కొన్ని చిత్రాలు రాజయ్య వేసినవా? రుస్తుం గీసినవా? సామాన్య ప్రేక్షకుడు పోల్చుకోలేడు. అయితే చిత్రకళా పరిజ్ఞానం ఉన్నవారు మాత్రం ఆయా చిత్రాల నిర్మాణంలో, గీసిన రేఖల్లో, వాడిన వర్ణాల్లో, చూపిన సృజనరీత్యా రుస్తుంను రాజయ్య వారసుడుగా అభివర్ణిస్తారు.

1996నుంచి రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో జరిగిన చిత్రకళా పోటీల్లో, ఆ తదుపరి సంవత్సరంనుంచి పలు సంస్థలు నిర్వహించిన చిత్రకళా శిబిరాలలో రుస్తుం పాల్గొని పలు చిత్రాలు గీశాడు, ప్రశంసలు పొందాడు.

1997లోనే ఆలిండియా ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ (న్యూఢిల్లీ) వారి చిత్రకళా పోటీలో పాల్గొని ప్రశంసాపత్రం పొందాడు. అదే సంవత్సరం అవంతిక ఇండియన్‌ కాంటెంపరరీ అవార్డు (న్యూఢిల్లీ) గెలుచుకున్నాడు. 1998లో కోనసీమ చిత్రకళాపరిషత్‌ (అమలాపురం)వారి జాతీయస్థాయి అవార్డు పొందాడు. 1999లో మెదక్‌ జిల్లాలో ఉత్తమ డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడి అవార్డు వచ్చింది. 2002లో సిద్దిపేట లలితకళా సమితి సేవా అవార్డు పొందాడు. 2003లో మళ్ళీ ఆలిండియా ఫైన్‌ ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ (న్యూఢిల్లీ)వారి ప్రశంసాపత్రం పొందాడు. 2014లో ఉత్తమ డ్రాయింగ్‌ టీచర్‌గా ముఖ్యమంత్రి చేత బహుమతి గ్రహించాడు.
tsmagazine
రుస్తుం ఆర్ట్స్‌ ఫౌండేషన్‌ను 1992లో ప్రారంభించి ప్రతి వేసవిలోయువ చిత్రకారులకు ఉచితంగా పదిహేను రోజులపాటు శిక్షణ ఇస్తు న్నాడు. సిద్దిపేటలోని తన ఇంటినే చిత్రకళా ప్రదర్శన శాలగా మార్చా డు. తన ఉనికిని చాటాడు. పలువురు సమకాలీన రచయితలు-కవుల గ్రం థాలకు అర్థవంతమైన ముఖచిత్రాలు వేశాడు. ఆయన చిత్రాలను ఎందరో దేశీయ, విదేశీయ కళాప్రియులు సేకరించారు. ఒక వంక చిత్రకళా సాధన సాగిస్తూ వందల చిత్రాల గీస్తూనే తన మదిలో మెదిలే ఆలోచనలను అలవోకగా ఆకర్షణీయంగా వ్రాస్తున్నాడు.

త్వరలో కొన్ని కొత్త చిత్రాలు వేసి వాటితోపాటు తన చిత్రాల సింహావలోకన ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రుస్తుం ఉన్నాడు. ఆయనే అన్నట్లు నిస్సందేహంగా రుస్తు చిత్రకళ సిద్ధాంతం-జన జాగృతి, చైతన్యం, అస్తిత్వ పతాక స్వరూపం.

టి. ఉడయవర్లు