|

సినిమా షో

cinemaసాంస్కృతికంగా సామాజికంగా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణసినిమా ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగరేసింది తెలంగాణ సినిమానే. ఇది అందరూ ఒప్పుకునే సత్యం. తెలంగాణ సినిమా అంటే ఏమిటి, తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఎలా ఉండాలి? అనే అంశాలపైన ఒక స్పష్టమైన విజన్‌తో.. ముఖ్యమంత్రి.. ఎన్నో ప్రణాళికలు రూపొందించారు.

తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. సినిమా రంగం పట్ల అవగాహన ఉన్న సినిమాటోగ్రఫీ అమాత్యులు తలసాని శ్రీనివాసయాదవ్‌ నేతృత్వంలో కె.తారకరామారావు .. తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఏర్పడ్డ ఉపసంఘం సినిమా రంగంలోని అన్ని వర్గాల వారితో పలు దఫాలుగా చర్చలు జరిపింది.

చిన్న సినిమాలకు సినిమా థియేటర్లు దొరక్క పోవడం అనే ఒక ప్రధాన సమస్యను గుర్తించి, సినిమా ఆటలను నాలుగు నుంచి ఐదుకు పెంచింది ప్రభుత్వం.. అలాగే మినీ థియేటర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. రెండు వందల నుండి రెండు వందల యాభై సామర్థ్యం గల మినీ థియేటర్లు మూడు వందలకు పైగా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయనుంది. ఈ మినీ థియేటర్లు ఏర్పడిన తరువాత అన్ని థియేటర్లలో ఐదు షోలు అనుమతించిన నేపధ్యంలో తెలుగు సినిమాకు ముఖ్యంగా తెలంగాణ సినిమాకు ఒక స్వర్ణయుగం ప్రారంభమవుతుందనే చెప్పవచ్చు.

అంతే కాకుండా అత్యున్నత స్థాయిలో .. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లు నెలకొల్పే యోచనలో ఉంది ప్రభుత్వం. సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాలకు సంబంధించి శిక్షణ, ఉపాధి తెలంగాణ రాష్ట్ర యువతకు ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.. హైదారాబాద్‌లో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీ నిర్మాణం కూడా సినిమా రంగానికి చెందిన బృహత్‌ ప్రణాళికలో ఒక భాగం.

అన్ని భాషల చిత్రాల నిర్మాణానికి తెలంగాణ ప్రధాన కేంద్రం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వయంగా కవి, రచయిత, కళల పట్ల మంచి అభిరుచి ఉన్న సాంస్కృతిక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ సినిమా రంగం చేసుకున్న అదృష్టం. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడి పోవడం వల్ల అన్నిరంగాల్లో ఈ వ్యత్యాసం కనిపించినా సినిమా రంగం ఇందుకు భిన్నం అని చెప్పుకోవాలి. .ఎందుకంటే కళ, వ్యాపారం రెండు కలిస్తేనే సినిమా.. సినిమా పరిశ్రమ. ఏ పరిశ్రమ అయినా అభివృద్ధ్ది చెందాలంటే అది స్వయం పోషకంగా ఉండాలి. ఎంతో మందికి ఉపాధి కల్పించాలి. సమాజానికి ప్రయోజన కారిగా ఉండాలి. ఈ రకంగా ఆలోచించి నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమాకు అవరోధాలు లేకుండా అభివృద్ధిచెందితే .. దాని వల్ల సినిమా రంగంలో ఉన్న తెలంగాణ వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది.

తెలుగు సినిమా, తెలంగాణ సినిమా రెండు వేరు వేరా? ఒకటేనా అనే సందేహాలు కొంత మందికి వస్తాయి..భాష ఒకటే అయినప్పటికీ నిర్మాణ విధానం. వ్యయంతో పాటు ఆదాయం కూడా ఒకే పరిధిలో ఉన్నప్పటికీ సాంస్కృతిక పరంగా కొన్ని బేధాలు ఉండనే ఉంటాయి.. తెలంగాణ సినిమా తెలుగు సినిమా రంగంలో ఒక భాగం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత.. తెలంగాణ ప్రజానీకానికి సినిమా రంగం పట్ల కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఏర్పడ్డ మాట వాస్తవం. వాసిలో గొప్పగాను రాశిలో తక్కువగాను ఉన్న తెలంగాణ సినిమాలు ఉన్న పరిస్థితి నుంచి తెలంగాణ జీవితం ప్రతిబింబించే సినిమాలు, తెలంగాణ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎక్కువమంది పని చేయగల సినిమాలు విరివిగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రత్యేకమైన తెలంగాణ ఫిలిండెవలప్‌ మెంట్‌ విభాగం త్వరిత గతిన ఏర్పడనుంది. తెలంగాణ ప్రభుత్వంలో సినిమా రంగానికి పలు రకాల ప్రోత్సాహకాలు ఆచరణలోకి రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో సినిమా పరిశ్రమ అద్భుతంగా ఎదగడానికి, భారతదేశంలోనే సినిమా నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఒక ముఖ్యమైన కేంద్రంగా ఏర్పడటానికి ప్రభుత్వం కృషి చేస్తుందనే భావన సినిమా రంగంలో ఉన్న వారికి ఉంది. ‘ఉన్న మాట అంటాడు.. అందరిమాట వింటాడు.. అన్నమాట మీద ఉంటాడు.తను చెప్పింది చేసి చూపుతాడు’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై తెలంగాణ ప్రజలకు ఎలా ఉందో అదే నమ్మకం సినిమా పరిశ్రమ వారికి ఉంది. రానున్న కాలంలో సినిమా రంగం ఎన్నో అద్భుతాలు సాధిస్తుంది అనేది తథ్యం.