విజ్ఞాన గని సిటి కళాశాల గ్రంథాలయం
By: డా. రవి కుమార్
అదో వెయ్యి భావాల నిలయం, కోటి కళల వేదిక, నిత్య చైతన్య దీపిక, సర్వమతాల సమ్మేళన జ్ఞాన నిలయం, హైదరాబాద్ రాష్ట్రంలో విద్యార్థి కుసుమాలను ఈ జాతికి అందజేసిన మొట్ట మెదటి కళాశాల అదే ప్రభుత్వ సిటీ కళాశాల. తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి, అనేక విద్యా ఉద్యమాలకు ప్రేరణగా, సాక్షీ భూతంగా తెలుగు భాషా ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తరువాత ఆయువు పట్టు ప్రభుత్వ సిటీ కళాశాల అని గర్వంగా చెప్పవచ్చు.

హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగర ప్రజలకు విద్యను అందించాలనే తపనతో ఆరవ ఆసఫ్ జాహి నిజాం మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మొట్టమొదటి సిటీ పాఠశాలను 1865లో మదరసా దారుల్- ఉల్- ఉలూమ్‌ను స్థాపించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని విద్య (సిటి పాఠశాల), వైద్య (ఉస్మానియా దవాఖానా), న్యాయ రంగాలలో (హైకోర్టు) ముందుంచాలని విజ్ఞతతో మోడ్రన్ ఆర్కిటెక్ అఫ్ హైదరాబాద్ ఏడవ అసఫ్ జాహి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో 1919లో మూసీ నది పక్కనే ఉన్న 16 ఎకరాల స్థలంలో ఇండో సార్సెనిక్ పద్ధతులతో విశాల మైదానంలో 64 గదులతో హిందూ ముస్లిం వాస్తుకళ కళానిలయమైన చదువుల తల్లిని ప్రారంభించారు.
ఆనాడే ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మాణం జరిగినది. ఈ కళాశాలకు వాస్తు శిల్పిగా విన్సెంట్ హెచ్ రూపకల్పన చేశారు. తరువాత దాన్ని సిటీ హైస్కూల్‌గా, తదుపరి 1921లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతానికి తరలించడం జరిగింది. మదరసా ఈ ఫొఖానియ (పాఠశాల మరియు కళాశాల) దీనిలో ఇంటర్మీడియట్ 1921లో ఉర్దూ మీడియంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 30 మంది విద్యార్థులతో ప్రారంభించడం జరిగింది. తరువాత 1989 కాలంలో ఈ పాఠశాలను కాలేజీగా ఉన్నతీకరిస్తూ సిటీ కాలేజీగా నామకరణం చేయడం జరిగింది. 1956 కాలంలో ఇంటర్మీడియట్ కోర్సులను రద్దుచేసి పి.యుసి కోర్సులను ప్రారంభించారు. 1962 కాలంలో బియస్సి కోర్సు ఏర్పాటు చేసి ఈ కళాశాలను సిటీ సైన్స్ కళాశాలగా నామకరణం చేయడం జరిగింది. 1965లో ప్రభుత్వం పరిధిలోకి తీసు కొని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ కళాశాలను నడపడం జరిగింది. తదుపరి కళాశాలను గవర్నమెంట్ సైన్స్ సిటీ కాలేజీగా నామకరణం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వాలు అవలంభిస్తున్న కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది నాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బీజం వేశారు. ఈ కళాశాల నాడు ప్రాథమిక పాఠశాలలో మాధ్యమిక పాఠశాల, జూనియర్ కళాశాలగా, డీగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలలుగా సేవలు అందిస్తున్నది.
1967 కాలంలో బిఏ, బికాం విభాగాలతో ఈ కళాశాలను గవర్నమెంట్ సిటీ కాలేజీగా నామకరణం చేయడం జరిగింది. తదుపరి 1986లో బిఎస్సి, 1997లో ఇండస్ట్రియల్ మైక్రో బయాలజీ, ఒకేషనల్ కోర్సులు, 1998 లో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్ సైన్స్, బిఏ టూరిజం, బిఎ ఆఫీస్ మేనేజ్మెంట్ వంటి వినూత్న కోర్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు 2000 సంవత్సరం నుండి పిజి విభాగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 60`60 సీట్లతో పీజీ విభాగం నడుస్తున్నది. మొత్తం 80 కోర్సులతో సేవలందిస్తున్నది.
ఈ కళాశాలను 2004-05 కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా గుర్తించింది. భారత ప్రభుత్వం కళాశాలలు అందించే సేవలు, విద్యార్థుల ప్రతిభాపాటవాలు, టీచర్ల ప్రతిభాపాటవాలను ఆధారంగా చేసుకొని ఈ కళాశాలకు న్యాక్’’ ఏ’’ గ్రేడ్ ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం ఈ కళాశాలలో 4500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ రెండు విభాగాలు, ఎన్సిసి విభాగాలు ఉన్నాయి. ఈ కళాశాల భవనం ఎరుపు రంగుతో కలిగి ఉండి, నాలుగు వందల చెట్లతో చక్కని గార్డెనింగ్ అహ్లాదకర వాతావరణంలో విద్యార్థులను విజ్ఞానాన్ని పొందేందుకు ఆకర్షిస్తోంది.
గ్రంథాలయం: ఈ కళాశాలకు ప్రధానమైన బలం ఈ కళాశాల గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో 80 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 70 జర్నల్స్ వివిధ విషయాలకు సంబంధించినవి. ముఖ్యంగా పొటీ పరిక్షలకు సంబంధించిన జర్నల్స్, సబ్జెక్ట్‌కు సంబంధించిన జర్నల్స్, 15 రకాల దిన పత్రికలు హిందీ, అంగ్లము, తెలుగు, ఉర్దూ భాషలలో అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఈ కళాశాలకు 200 పై చిలుకు విద్యార్థులు, 20 నుంచి 30 మంది కళాశాల అధ్యాపకులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు గ్రంథాలయం కోసమే కళాశాలకు విచ్చేస్తారు అంటే అతిశయోక్తి కాదు. వీరే గాక పి.జీ. మరియు పరిశోధక విద్యార్దులు ఈ గ్రంథాలయాన్ని పదుల సంఖ్యలో సందర్శిస్తారు. ఈ కళాశాలలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయం లో ప్రత్యేక విభాగం కలదు.
ఉర్దూ భాష ఐదు వేల పుస్తకాలు, తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలు 20 వేలు, ఇంగ్లీషు 22 వేల పుస్తకాలు ఉన్నాయి. రామాయణం, మాహాభారతం, భగవద్గీత, ఖురాన్, బౌద్ధం వంటి ఆధ్యాత్మిక పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, రాజకీయ నాయకుల, సంఘ సంస్కర్తల జీవిత చరిత్రల పుస్తకాలు ఉన్నాయి.
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, భూసార శాస్త్రము, మొక్కలు, నాచురల్ హిస్టరీ అఫ్ అనిమల్స్, 1908లో ప్రచురించబడ్డ సైన్స్ ఇన్ మోటర్ లైఫ్ లాంటి చాలా ఎక్కడా దొరకని విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ భాషకు సంబంధించిన షేక్స్పియర్, డి కేన్స్, సార్ వాటర్ స్కాట్, లార్డ్ చార్లెస్ హాలిఫాక్స్ వంటి విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే గాక 40 విజ్ఞాన సర్వస్వాలు, డిక్షనరీలు, ఎన్సైక్లోపీడియా అఫ్ బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా అమెరికానా, ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, పెయిం టింగ్, యాక్టింగ్, ఫిలిం మేకింగ్, వంటి విలువైన మరియు ఎక్కడ దొరకని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ గ్రంథాలయంలో ఒకేసారి రెండు వందల మంది కూర్చుని చదువుకోవడానికి వీలుగా చక్కటి రీడిరగ్ రూమ్ ఉంది. రిఫరెన్సు, జర్నల్స్, కంప్యుటర్ లాబ్ వంటి విభాగాలు కలవు. నిత్యం విద్యార్థులతో కిటకిటలాడుతూ విద్యా సుగంధాలు వెదజల్లుతున్న ఈ గ్రంథాలయం తెలంగాణ విద్యా గ్రంథాలయాలలో ఎవరెస్ట్ లాంటిది. ఈ గ్రంథాల యం మొత్తం యు జి సి అనుబంధ సాప్ట్వేర్ ఇంఫ్లిబ్ నేట్ చే నడుపుతున్న ‘‘సోల్’’ చే ఆటోమేషన్ చేయబడిరది.
ఇవే కాకుండా మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల అవసరాలకనుగుణంగా ఆన్లైన్ ఎలక్ట్రానిక్ పుస్తకాలు, జర్నల్స్ (ఏన్ లిస్టు), డాటా బేస్‌లు అందుబాటులో ఉన్నా యి. అదే విధంగా 15 కంప్యూటర్లతో విద్యార్థులకు ఉచి తంగా అంతర్జాల సేవలు అందిస్తున్నారు.
కాలంతో పోటీ పడి మరీ ఈ కళాశాల మారుతున్న కాలానుగుణంగా నూతన కోర్సులను అందిస్తున్నది. వాటిలో బీకాం రెగ్యులర్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ మ్యాథ మెటిక్స్, బి.ఎస్సీ బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. ఉపాధి అవకాశం కలిగించేటు వంటి కోర్సులు ట్రాన్స్లేషన్ స్టడీస్, ట్రావెల్ ఏజెన్సీ అండ్ టూరిజం ఆపరేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూని కేషన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నిక్స్, ఇన్సూరెన్స్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, ఇన్సూరెన్స్, అకౌంటింగ్ ప్యాకేజెస్, వెబ్ టెక్నాలజీస్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి నూతన కోర్సులు అందిస్తూ నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్యను పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందిస్తూ కార్పోరేట్ విద్యా సంస్థలకు సవాల్ విసురుతోంది ఈ కళాశాల.
ఈ కళాశాల భవనాన్ని గ్రేడ్-2 హెరిటేజ్ బిల్డింగుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కళాశాల గ్రంథాలయాన్ని పరిశోధన కేంద్ర గ్రంథాలయంగా మార్చితే భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడుతుంది. ఈ విజ్ఞాన కోవెల వయసు పెరిగిపోతున్నా నిత్యం విజ్ఞాన కుసుమాలను ఈ సమాజానికి వెదజల్లుతూనే ఉన్నది. ఈ కళాశాల గ్రంథాలయ అభివృద్ధికి కళాశాలల కమీషనర్ నవిన్ మిట్టల్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి.