ఇక కొలువుల జాతర!

ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసన సభ బడ్జెట్‌ సమావేశాలలో ప్రభుత్వం అనేక శుభవార్తలను అందించింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన నిరుద్యోగులలో ఆనందోత్సాహాలు నింపింది. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే అంశాలే ప్రాధాన్యంగా ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు అవరోధాలను అధిగమించి నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగాలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరిస్తున్నామని, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలలో కొత్తవారిని నియమిస్తున్నట్టు సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం చేసిన కృషి వల్ల మొట్టమొదటిసారిగా స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు లభించనున్నాయి అటెండరు నుంచి ఆర్డీఓ దాకా ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. అంతేగాక ఉద్యోగార్థుల వయో పరిమితిని మరో 10 సంవత్సరాలు పెంచుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఆలాగే, సెర్ప్‌, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని, ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించడం పట్ల ఆయా వర్గాల వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌ రావు శాసన సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెడుతూ, 2,56,958.51 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో 1,89,274.81 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయంగాను, 29,728.44 కోట్ల రూపాయలు క్యాపిటల్‌ వ్యయంగాను పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికోసం కొత్తగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి ఈ బడ్జెట్‌ లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం.
సాగు, విద్య, వైద్యం, తదితర రంగాలకు బడ్జెట్‌ లో ప్రాధాన్యత కల్పిస్తూనే, అనేక సరి కొత్త పథకాలు, కార్యక్రమాలకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌ లో శ్రీకారం చుట్టింది. పేదలకు ఇంటిస్థలం ఉంటే రెండు పడక గదుల ఇంటినిర్మాణానికి రూ.3 లక్షల సాయం, రైతులకు ఇస్తున్న తరహాలో నేతన్నలకు రూ. 5 లక్షల బీమా, వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించి ఆసరా పెన్షన్ల అమలు, లక్షమంది భవన నిర్మాణ కార్మికులకు తొలిదశలో మోటారు సైకిళ్ళ పంపిణీ, బాలింతల్లో రక్త హీనతను తగ్గించేందుకు కేసీఆర్‌ పోషకాల కిట్‌ పంపిణీ, 7 నుంచి 12వ తరగతి వరకు చదివే 7 లక్షల మంది విద్యార్థినులకు ఆరోగ్య సంరక్షణ కిట్‌, రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం, అటవీ యూనివర్సిటీ ఏర్పాటు, గీత కార్మికులకు సాయం చేసేందుకు రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం, తదితర పథకాలను ఈ బడ్జెట్‌ లో ప్రభుత్వం ప్రకటించింది.

ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన ఈ బడ్జెట్‌ బడుగుల జీవితాలలో వెలుగు నింపుతుందనడంలో సందేహం లేదు.