అమర జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ సాయం

“గాల్వన్‌ లోయలో ఉగ్రవాదుల దాడిలో 20 మంది సైనికులతో పాటు, వారికి నేతృత్వం వహించిన మా తెలంగాణ వాసి కల్నల్‌ సంతోష్‌ బాబు కూడా అసువులు బాసారు. వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్‌ బాబుతో పాటు, నాడు ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సాయం చేసి, వారి కుటుంబాలను సన్మానిస్తామని అప్పుడే ప్రకటించాం. వీరు జార్ఖండ్‌, పంజాబ్‌ వంటి ఆరేడు రాష్ట్రాల్లో ఉన్నారు. వీర సైనికులకు ఆర్థిక సహాయం చేసే విషయాన్ని సోదరుడు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వద్ద ప్రస్తావిస్తే వారు దానికి సమ్మతించి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మేము చేయగలిగిన సహాయాన్ని చేశాం” అని జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

అన్నింటికంటే ముఖ్య విషయం… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని 2001 లో ప్రారంభించాం. ఆ సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా శిబు సోరెన్‌ హాజరయ్యారు. తెలంగాణ ప్రజల వెన్నంటి నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే ఉన్నారు. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకోవాల్సి వుంది. ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నాకు శిబు సోరెన్‌ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు అని కేసీఆర్‌ చెప్పారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. చైనా సరిహద్దులోని గాల్వన్‌ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఝార్ఖండ్ రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌తో కలిసి వారి అధికారిక నివాసంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను అందజేశారు.

ఇచ్చిన మాట ప్రకారం గాల్వన్‌ వ్యాలీలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. అమర సైనికుడు కుందన్‌ కుమార్‌ ఓజా భార్య నమ్రత కుమారికి, మరో వీర సైనికుడు గణేష్‌ కుటుంబ సభ్యులకు చెరో రూ.10 లక్షల చెక్కులను అందించారు. చైనాతో జరిగిన ఘర్షణలో మన రాష్ట్రానికే చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు వీర మరణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నది. అదే సందర్భంగా అమరులైన 19 మంది ఇతర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.