సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతలకు సీ.ఎం శంకుస్థాపన

తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత మయింది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యసాధనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. 4,427కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్‌, నారాయణ్‌ ఖేడ్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ, వలస పాలనను బద్దలు కొట్టి స్వరాష్ట్రం సాధించామని, అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నామని అన్నారు. నేడు తెలంగాణ అన్నిరంగాలలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందని చెపుతూ, ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అన్నిరంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆసరా పెన్షన్‌ 2,000 రూపాయలు, ఆడపిల్లల పెళ్ళికి లక్షా నూటపదహారు రూపాయలు, విదేశాలలో చదువుకొనే పేద విద్యార్థుల కోసం అంబేద్కర్‌, జ్యోతిబాపూలే పేరిట 20 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మనది మాత్రమే అన్నారు.

తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అడిగి తెలుసుకున్నారని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు 4,000 కోట్ల రూపాయలు వ్యయం కాగల సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసుకున్నామని, వీటిని ఏడాదిన్నర కాలంలో పూర్తిచేయించి పొలాలకు నీరు చేరేలా చూడాలని మంత్రి హరీష్‌రావుకు సీ.ఎం సూచించారు. వీటివల్ల ఒక్క ఆందోల్‌ నియోజకవర్గంలోనే 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు కోరికమేరకు సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున, జిల్లాలోని మిగిలిన 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు, జిల్లాలోని 699 పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున రూ.140 కోట్లు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్‌ రావు, ఎం.పి.లు బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, శాసన సభ్యులు క్రాంతి కిరణ్‌, మాణిక్‌రావు, మదన్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, పద్మా దేవేందర్‌ రెడ్డి, శాసన మండలి సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.