సేద్యానికి ఊతమిచ్చిన దార్శనికుడు

By: సందీప్‌ రెడ్డి కొత్తపల్లి, కరుణాకర్‌ రావు సాయినేని

జనాభాలో దాదాపు 60 శాతం ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన రంగం వ్యవసాయరంగం.  క్రీ.శ 1083 నుంచి క్రీ.శ. 1323 వరకు కాకతీయుల పాలనలో తెలంగాణ ప్రాంతంలో 20 వేలకు పైగా చెరువులు, అనేక వేల బావులను తవ్వించారు. హైదరాబాద్‌ రాష్ట్రం 1956లో ఆంధ్రలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌ గా ఏర్పడే నాటికి నిజాంసాగర్‌ వంటి ప్రాజెక్టులతో  తెలంగాణ వ్యవసాయరంగం ఎంతో సుభిక్షంగా వర్ధిల్లుతున్నది. దాదాపు 46 వేల చెరువులు, కుంటలతో గ్రామీణ వ్యవసాయ రంగం అలరారుతుండేది. తెలంగాణ రాష్ట్రం విలీనం అయినప్పటి నుండి అన్ని రంగాలతో సహా తెలంగాణ వ్యవసాయరంగం మీద కూడా వివక్ష మొదలయింది. తెలంగాణ చెరువులు, కుంటల నిర్వహణపై అలక్ష్యం చేస్తూ, క్యాచ్‌ మెంట్‌ విస్తీర్ణం తగ్గి, చెరువులు వట్టిపోయేలా చేస్తూ వచ్చారు. దీంతో చెరువులు, కుంటలు దెబ్బతింటూ వచ్చాయి. వీటితో పాటు అడవులను, చెట్ల పెంపకాన్ని ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోవడం మానేశారు. పేరుకు తెలంగాణ ప్రాజెక్టులను ప్రతిపాదించి కాగితాలకు పరిమితం చేశారు. ప్రజల వత్తిడితో అక్కడక్కడా ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను చేపట్టినా నిధులు కేటాయించకుండా దశాబ్దాలపాటు నిర్మాణాలను సాగదీస్తూ తీరని అన్యాయం చేస్తూ వచ్చారు. 

పాలకుల నిర్లక్ష్యం, మూలంగా క్రమంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. చెరువులు, కుంటలు నిర్వహణలేక తెగిపోవడం, కుచించుకుపోవడం జరిగింది. దానికితోడు ప్రకృతిప్రకోపం కారణంగా వర్షపాతం తగ్గిపోవడంతో తెలంగాణ సాగునీటి రంగానికి ఆయువుపట్టు అయిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయాయి. అడవులలో ఆహారం లేక క్రమంగా కోతులు, నెమళ్లు, అడవిపందులు ఊర్ల మీదకు వచ్చేశాయి. చెరువులు, బావుల నుండి వ్యవసాయం బోరు బావుల మీదకు మళ్లింది. బోరు బావులకు కరంటు సదుపాయం లేక, కరంటు సదుపాయం ఉన్నా సరఫరా లేక వ్యవసాయం నష్టాల వైపు మళ్లింది. కనీసం పశుగ్రాసం అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ పశువులు, బర్రెలు, గొర్రెలు, మేకలను అమ్మకానికి పెట్టారు.  క్రమంగా రైతులు, వ్యవసాయ కూలీలు సమీప పట్టణాలు, నగరాలలో ప్రత్యామ్నాయ ఉపాధి పనులకు మళ్లారు. అక్కడా అరకొర వేతనాలతో పూట గడవడం కష్టంగా ఉండడంతో తమకున్న వ్యవసాయ కమతాలను అత్యవసర అవసరాల కోసం అడ్డికి పావుశేరు కింద అమ్ముకున్నారు. చిన్న, సన్నకారు రైతుల నుండి పెద్ద, పెద్ద కమతాలు ఉన్న రైతులు కూడా తమ పొలాలను బీళ్లు పెట్టుకోవడం లేదా విక్రయించడం చేశారు. 

అధికశాతం జనాభా ఆధారపడిన వ్యవసాయరంగాన్ని పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయం దండగ అని రైతుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీశారు. అన్ని కష్టాలకు ఓర్చి వ్యవసాయంలో ముందుకు సాగిన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతే రాజు అన్నది కేవలం పాలకుల నినాదంగా మారింది తప్పితే ఎన్నడూ దానిని ఒక విధానంగా తీసుకుని వ్యవసాయ అనుకూల విధానాలను చేపట్టి రైతులలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నాలు గానీ, దాఖలాలు గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కనిపించవు. అసలే సర్కారు సహకారం లేక కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగం పట్ల సానుకూల విధానాలకు భిన్నంగా 2001లో టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం గోరుచుట్టు మీద రోకటిపోటులా మారింది. దీంతో అప్పటి డిప్యూటీ స్పీకర్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2001లో తన పదవులకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 

14 ఏళ్లు ప్రజలను సమీకరించి ఉద్యమంలో భాగస్వాములను చేసి, అవిశ్రాంతంగా పోరాడి, దేశంలోని 36 పార్టీల మద్దతును కూడగట్టి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారు. 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి వ్యవసాయరంగం నిరాశజనకంగా మారింది. సాగునీరు, కరంటు అందుబాటులో లేక రైతులు ఆత్మస్థయిర్యం కోల్పోయారు. తెలంగాణలో అప్పటికి సాగుకు యోగ్యమైన భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలు. 2014-15 లో వరి ధాన్యం సాగు విస్తీర్ణం 34.96 లక్షల ఎకరాలు. వరి ధాన్యం దిగుబడి 68.17 లక్షల టన్నులు మాత్రమే ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో ఏటా రూ. 2 లేదా రూ.3 వేల కోట్లకు మించి కేటాయింపులు ఉండేవి కాదు. తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ వ్యవసాయరంగం స్థూల ముఖచిత్రం ఇది. ఇది ఎవరూ కాదనలేని పచ్చినిజం. 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం మూడేళ్లలో ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు, పెండింగ్‌ ప్రాజెక్టులను, సాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడంతో భూగర్భ జలమట్టం పెరిగింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 25 లక్షల ఎకరాలకు సాగు నీరందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. 

సాగునీటితో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరంటు, విత్తనాలు, ఎరువుల మీద  దృష్టిసారించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు రాస్తారోకోలు చేసి లైన్లలో నిలబడి, లాఠీదెబ్బలు తినే దుస్థితిని తప్పించారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లో విద్యుత్‌ రంగాన్ని సమీక్షించి రైతులకు నాణ్యమైన 9 గంటల కరంటును అందుబాటులోకి తీసుకువచ్చారు. 2018 జనవరి 1 నుండి వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరంటు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చి విజయవంతంగా సరఫరా చేస్తున్నారు. తెలంగాణ వస్తే కరంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, తెలంగాణ వస్తే చీకటిమయమే అన్న వారి నోళ్లు మూయించారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా రైతులకు 24 గంటల ఉచిత కరంటు పథకం అమలులో లేదు. సాగునీరు, కరంటుతో పాటు రైతు ధైర్యంగా వ్యవసాయం చేసేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ కసరత్తు చేసి ఆ ఫలాలను రైతులకు అందించిన తిరుగులేని ప్రజానాయకుడు అనిపించుకున్నారు. 

రైతులకు తోడ్పాటునివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్‌ ఎకరానికి ఏటా రూ.10 వేలు అందించే రైతుబంధు, రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందేలా రైతుబీమా పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా రైతులకు ఈ తరహా పథకాలు అమలులో లేవు. గత నాలుగేళ్లుగా ఎనిమిది విడతలలో 63,25,695 మంది రైతులకు రూ.50,448.15 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. రైతుబీమా పథకం కింద ఇప్పటి వరకు 79,881 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3994.05 కోట్లు వారి ఖాతాలలో జమచేయడం జరిగింది. రైతుబంధు పథకం అమలుచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి చెందిన మిగతా పథకాలన్నీ ఎత్తివేశారని కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి కేటాయించే బడ్జెట్‌. మూడేళ్లకో, నాలుగేళ్లకో రైతులకు ఇన్‌ ఫుట్‌ సబ్సిడీ, వివిధ పథకాల పేరుతో మండలానికి ఆరేడు వందలమంది రైతులకు అందించి మమ అనిపించేవారు. అది కూడా రైతు చేతికి చేరేది తక్కువ మొత్తమే. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా ప్రతి సీజనుకు ముందే నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తున్నారు. ఈ విషయం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

వ్యవసాయంలో సాగుకోసం రైతులు అప్పులు చేస్తుండడం, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుండడం, ఎరువులు, విత్తనాల కోసం వ్యాపారుల వద్ద అప్పులు పెడుతుండడం వంటి వివిధ ఇబ్బందులను పరిశీలించిన కేసీఆర్‌ ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు సాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు. అదీ దళారీల సమస్య లేకుండా నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తున్నారు. దీంతో రైతులు దుక్కిదున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సాగునీటి రాక, కోతలు లేని 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు సాయంతో తెలంగాణ వ్యవసాయం దశ, దిశ మారిపోయింది. తెలంగాణ వచ్చేనాటికి 1 కోటి 31 లక్షల ఎకరాలలో సాగవుతున్న భూమి నేడు (2020-21 నాటికి ఉద్యానశాఖ తో కలిపి) 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు చేరుకున్నది. గత ఏడున్నరేళ్లలో కొత్తగా 84 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. 2014-15 లో వరి ధాన్యం సాగు విస్తీర్ణం 34.96 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి 197.48 శాతం పెరిగి 104.23 లక్షల ఎకరాలకు చేరుకున్నది.  2014-15 లో వరి ధాన్యం దిగుబడి 68.17 లక్షల టన్నులు ఉండగా, 2020-21 నాటికి దాదాపు మూడు కోట్ల టన్నులకు చేరుకున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో రైతు మరణిస్తే పట్టించుకునే నాధుడు లేడు. భూమిని నమ్ముకుని ప్రపంచానికి ఆహారం అందించే రైతన్న మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడాల్సిందే. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు రాత్రి పూట కరంటుతో పాము కాటుకు గురై, కరంటు షాక్‌లకు గురై, అప్పులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం వంటి అనేక కారణాలతో మరణించారు. కానీ వారికి  ప్రభుత్వం నుండి తగిన సహాయం అందిన దాఖలాలు లేవు. ఆపద్భందు పథకం కింద రూ.50 వేలు, కరంటు షాక్‌ కింద రూ.2 లక్షలు పేరుకు పథకాలు ఉన్నా అవి రైతు చేతికి వచ్చే దాకా అనుమానమే. దీనికి కమిటీలు, అధికారులు, దళారులు, ప్రజాప్రతినిధుల జోక్యానికి అవకాశం ఉండడమే ముఖ్యకారణం. వ్యవసాయం చేస్తున్న కుటుంబాల పెద్ద చనిపోతే ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేవి. అసలే ఆదాయం లేని వ్యవసాయరంగంలో ఇలా కుటుంబ పెద్దలు చనిపోయిన కుటుంబాలకు బంధువుల సహకారం కూడా లభించేది కాదు. ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ముందుచూపుతో రైతుబీమా పథకం చేపట్టారు. ఈ పథకానికి సంబంధించి ఒక కుంట భూమి ఉన్న రైతులకు కూడా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి బీమా పథకం అమలు చేస్తున్నది. రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల సాయం అందడం ఒక ఎత్తయితే, ఆ బీమా సొమ్ము అందడానికి ఎటువంటి కమిటీని ఆశ్రయించడం, ఏ అధికారిని సంప్రదించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. రైతు చనిపోయిన పది రోజుల లోపు రూ.5 లక్షలు వారి ఖాతాలలో నేరుగా జమ అవుతాయి. ఈ పథకం విలువ కుటుంబ యజమానిని కోల్పోయిన రైతు కుటుంబాలకు మాత్రమే అర్ధమవుతుంది. కానీ రాజకీయాలు చేసే నాయకులకు ఎన్నటికీ రైతుల కష్టాలు అర్థం కావు.

వ్యవసాయరంగంలో సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల కరంటు మాత్రమే కాకుండా రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, రైతుబంధు సమితుల ఏర్పాటు, ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌, రైతువేదిక నిర్మాణం, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, మార్కెట్‌ రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ ఏర్పాటు, డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహించడం, పంటల కొనుగోళ్లు, గోదాముల నిర్మాణం వంటి చర్యల ద్వారా రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 

ఉమ్మడి రాష్ట్రంలో అప్పులపాలైన రైతాంగం అప్పుల ఊబి నుండి బయటపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.లక్ష రుణమాఫీ ప్రకటించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు వంటి పథకాలతో పాటు రైతులు అప్పులు తొలగించుకుని ఆత్మవిశ్వాసంతో నిలబడాలని భావించారు. అందుకే  మొదటి దఫాలో 2014 మార్చి 31 వరకు ఉన్న రూ. లక్ష వరకు వ్యవసాయ రుణాలు రద్దు చేశారు. మొత్తం నాలుగు విడతల్లో రైతులకు రూ.16,144.10 కోట్ల రుణమాఫీ చేశారు. 35.32 లక్షల మంది రైతులకు దీని ద్వారా ప్రయోజనం కలిగింది. రెండో విడతలో 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు తీసుకున్న రూ.28,929.94 కోట్లు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటివరకు 5.11 లక్షల మంది రైతుల యొక్క రూ. 1171.57 కోట్ల రుణ మాఫీ చేయడం జరిగింది. కరోనా విపత్తు నేపథ్యంలో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. దీంతో రుణమాఫీకి ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదురుకుంటున్న నేపథ్యంలో మరో రూ.4428.83 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ అనుమతించింది. వచ్చే ఏడాది మార్చి బడ్జెట్‌ వరకు రూ.లక్ష వరకు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

వ్యవసాయానికి ఉచిత కరంటు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. దాదాపు 26 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత కరంటు సరఫరా కొనసాగుతున్నది. అంతేకాకుండా రూ.28,473 కోట్లతో  వ్యవసాయ విద్యుత్‌ మౌలిక సదుపాయాలు కల్పించింది. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేయడం కోసం  2017 లో రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సమితిలను ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో 15 మందితో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42 మంది సభ్యులతో మొత్తం లక్షా 61 వేల మంది రైతులు సభ్యులుగా రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు. రైతులు సంఘటితంగా ఉండి పంటల సాగు, పంటల మార్కెటింగ్‌ తమ చెప్పు చేతలలోకి తెచ్చుకోవాలని, పండిరచిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ కు వెళ్లడం కాకుండా రైతు పంట వద్దకే వచ్చి పంటలు కొనుక్కునే పరిస్థితి రావాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. రైతులకు వ్యవసాయ విజ్ఞానం అందుబాటులో ఉంచేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన 2,601 క్లస్టర్లలో రూ.22 లక్షల చొప్పున రూ.573 కోట్లు ఖర్చు చేసి 2601 రైతు వేదికల నిర్మాణం పూర్తిచేయడం జరిగింది. కేవలం ఇది సమాచార వేదికగా కాకుండా, తమ విజయగాథలను సాటిరైతులతో పంచుకోడానికి, పరస్పర జ్ఞాన వినిమయంతో మన వ్యవసాయం కొత్తపుంతలు తొక్కడానికి, మొత్తంగా రైతు సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలన్నది లక్ష్యం. రైతువేదికలను సమగ్రసమాచార కేంద్రంగా మార్చడానికి రైతులకు ఉన్న అన్ని అవసరాలు తీర్చే కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికను అమలు చేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తున్నది.

2013-14 లో తెలంగాణలో 4.17 లక్షల టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం ఉండగా, మార్కెటింగ్‌ శాఖ ద్వారా 2020-21 నాటికి 24.73 లక్షల టన్నులకు గోదాముల నిల్వ సామర్థ్యం పెంచడం జరిగింది. రూ.1024.50 కోట్ల వ్యయంతో 364 ప్రదేశాల్లో 18.30 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 534 నూతన గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. 2014-15 లో రాష్ట్రంలో అన్ని రకాల గోడౌన్ల సామర్థ్యం 39 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, ఈనాటికి సుమారు 69 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నది. 2013-14 లో 150 వ్యవసాయ మార్కెట్లు ఉండగా, ఈ నాటికి 42 కొత్త మార్కెట్లతో మొత్తం 192 వ్యవసాయ మార్కెట్లు రైతులకు సేవలందిస్తున్నవి. దేశంలో ఎక్కడా లేనివిధంగా 192 మార్కెట్‌ కమిటీలలో తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల ద్వారా పదవులు భర్తీచేస్తున్నది.

దేశంలోని మిగతా రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం పంటల కొనుగోళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) ద్వారా గత ఏడేళ్లలో రూ. 33,918 కోట్ల విలువైన 37.80 లక్షల టన్నుల పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నది. దీని ద్వారా 23.47 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.  2013-14 సమైక్య రాష్ట్రంలో 24.42 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించగా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014-15 సంవత్సరంలో 24.30 లక్షల టన్నుల వరిధాన్యం మాత్రమే సేకరించడమైనది. ఈ ఏడేళ్లలో కొనుగోళ్లు 367 శాతం పెరిగాయి. 2020-21 వానాకాలం మరియు యాసంగి లో ప్రభుత్వం 6,967 కేంద్రాల ద్వారా రైతుల కల్లాలవద్దే 1.41 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. ఇవే కాకుండా గత ఏడేళ్లలో మార్క్‌ ఫెడ్‌ ద్వారా రూ.8957 కోట్ల విలువైన, 37.48 లక్షల టన్నుల వివిధ రకాల పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నది. గత ఏడేళ్లలో అనూహ్యంగా పెరిగిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని దాదాపు రూ.5 వేల కోట్ల ఆర్థిక భారాన్నయినా భరించి  ఈ యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

సాంప్రదాయ పంటల సాగునుండి రైతులు బయటకు రావాలని, రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలనే సదుద్దేశ్యంతో, పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తూ మార్కెట్‌ డిమాండ్‌ ఉండే ప్రత్యామ్నాయ పంటలయిన వివిధ రకాల నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందులో భాగంగా రైతులకు దీర్ఘకాలంలో మేలు చేసే ఆయిల్‌ పామ్‌ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రాబోయే మూడేళ్లలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయడం, కాళేశ్వరం మూడున్నరేళ్లలో నిర్మించి సాగునీరు గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు, ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులలో స్పష్టమయిన మార్పు కనిపిస్తుంది. గ్రామాలలో ఉపాధిలేక పట్టణాల దారిపట్టిన రైతులు, రైతుకూలీలు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. ఏడాదికి రెండు, మూడు పంటలు చేతికి వస్తుండడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. నూతన ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యవసాయ రంగం స్థిరీకరణ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతున్నది. గత ఏడేళ్లుగా వ్యవసాయం, సాగునీటి రంగం, విద్యుత్‌ రంగం, సంక్షేమం, ఐటీ, సర్వీసులు, పరిశ్రమలు, ప్రజారోగ్యరంగం మీద దృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు విద్య, వైద్య రంగం అభివృద్ధికి నడుం బిగించింది. ఇటీవలె 8 మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నది. తొలివిడతలో  26,065 ప్రభుత్వ పాఠశాలలలో మన ఊరు – మన బడి పథకం కింద రూ.7,289 కోట్లతో పాఠశాలలలో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ వివిధ రంగాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే ఆయా రంగాలలో స్పష్టమయిన మార్పు కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఆయా రంగాలలో కేంద్రప్రభుత్వం నుండి అందుతున్న అవార్డులు, జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలే దీనికి సాక్ష్యం. ఇప్పటికే తెలంగాణ రైతుబంధు, మిషన్‌ భగీరధ పథకాలను వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా వివిధ పేర్లతో అమలు చేస్తున్నది.

గత ఏడున్నరేళ్లలో వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించడంతో పాటు కొత్త ఆశలను రేకెత్తించి ముందుకు సాగుతున్నప్పటికీ వ్యవసాయం మరింత లాభదాయకం చేయాలని, పెట్టుబడి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి? ఉత్పాదకతను ఎలా పెంచాలి? విధి లేని పరిస్థితులలో ఈ రంగాన్ని ఎంచుకోవడం కాకుండా ఆసక్తిగా ఈ రంగంలో రాణించడానికి, యువతను వ్యవసాయ రంగం వైపు ఎలా ఆకర్షించాలి? నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? వ్యవసాయంలో రైతు ఆదాయాన్ని ఎలా పెంచాలి? అన్న అంశాలపై అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రస్తుతం పై అంశాలపై కసరత్తు చేస్తున్నది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, ఆధునిక సాంకేతికత, మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించి ఈ కమిటీ సమగ్ర నివేదిక అందజేయడానికి అధ్యయనం చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలో తెలంగాణ వ్యవసాయం రంగం దేశానికి దిక్సూచిలా నిలుస్తుందనడంలో, తెలంగాణ రైతులు అందరికీ ఆదర్శంగా ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.