వరద బాధితులను అక్కున చేర్చుకుని, అండగా నిలిచిన ముఖ్యమంత్రి

  • పర్యటనలో బాధితులకు భరోసా, శాశ్వత నివారణ చర్యలకు ఆదేశం

గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రళయతాండవం చేయడంతో నీటమునిగి అల్లాడుతున్న గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను ఆదుకొని, అక్కున చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా కదిలారు. పర్యటనకు ఒకరోజు ముందే హన్మకొండకు చేరుకున్న సీఎం అక్కడ అధికారులతో సమీక్షించారు. తెల్లవారి వరదముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దీనితో బాధితులకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ వరద వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడమే కాకుండా, వరదలు వచ్చిన గ్రామాలు, కాలనీలు తిరిగి ముంపునకు గురికాకుండా ఎత్తైన ప్రాంతాలలో ఆవాసాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి గుడి ముంపునకు గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

హన్మకొండ నుంచి భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్‌ ముందుగా సారపాక వద్ద గోదావరి తల్లికి శాంతిపూజలు జరిపారు. గోదావరిలో పసుపు, కుంకుమ చల్లి సారె సమర్పించారు. అక్కడి నుంచి కరకట్ట వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దాన్ని నిశితంగా పరిశీలించారు. కరకట్ట పటిష్టత కోసం చేపట్టవలసిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం భద్రాచలం చేరుకుని ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి సమీక్ష జరిపారు. అక్కడి నుంచి ఏటూరు నాగారం వరకు సీఎం కేసీఆర్‌ హెలీకాప్టర్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అక్కడ కూడా వరద బాధితులను పరామర్శించి, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏటూరునాగారం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ తిరిగి హన్మకొండకు చేరుకున్నారు. 

భద్రాచలంలో..

భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల వివరాలు, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని సీఎంకు బాధితులు వివరించారు. 

భద్రాచలంలో ముంపు సమస్యల శాశ్వత పరిష్కరానికి రూ.1,000 కోట్లు:

భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలెవరూ భయపడవద్దని, ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని వారికి భరోసానిచ్చారు. భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణాలతో సహా, భద్రాచలం సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులు, ముంపు సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, వారి రక్షణకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వారికి భరోసానిచ్చారు. తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్‌ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ అనుదీప్‌ ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన ఊరట దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. 

సీఎం కేసీఆర్‌ సమీక్ష 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధితులను పరామర్శించిన అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తత వల్ల ప్రాణ నష్టం జరగలేదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రశంసనీయమని కేసీఆర్‌ కితాబునిచ్చారు. భద్రాచలంలో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తామన్నారు. ఎత్తైన స్థలాల్లో శాశ్వత కాలనీలను నిర్మించడానికి స్థలాలను పరిశీలించాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్‌ను పరిగణనలోకి తీసుకొని, కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను తరలించాలని, బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని అన్నారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్‌ చేయాలని హెల్త్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావును సీఎం ఆదేశించారు..  ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తామని తెలిపారు. రాముల వారి ఆలయం ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపడతామని, భద్రాచలం సీతారాముల పుణ్య క్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామని, సీతమ్మ పర్ణశాలను కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తానని తెలిపారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్‌ బరస్ట్‌లు జరుగుతున్నాయని అనుమానంగా వుందని అన్నారు.  పర్యవసానంగా వరద ముంపు అనూహ్యంగా పెరుగుతున్నదన్నారు. నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి నిదర్శనమే ఈ వరదలని అన్నారు. ఇంతటి వరద బీభత్సంలో కూడా కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడింది. ఈ ప్రాజెక్టుకు నీటి వరద 5 లక్షల క్యూసెక్కులకు మించిపోయినా ప్రాజెక్టు నిలబడిందన్నారు.

భద్రాచలం, బూర్గంపాడు, పినపాక నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వరద సమస్యలు ఉత్పన్నమయ్యాయని, రైతుల పంటలు నీట మునిగాయని, వాటిని సమీక్షించి తగు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 25 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయించాలి.  ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తామని సీఎం చెప్పారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. 

రామన్న గూడెంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలను పరిశీలించి, వరద నివారణకు శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరి కాకుండా ఈ ప్రాంతానికి వరద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వతంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.. వరదల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులందరూ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, చర్యలు తీసుకుంటారని బాధితులకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. రామన్న గూడెం పునరావాస కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ముఖ్యమంత్రి తిలకించారు. 

గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, కానీ, ఇపుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్‌ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదతో చాలా చోట్ల మిషన్‌ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

 వరద ప్రభావిత జిల్లాలకు నిధులు  

వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సహాయం కింద ప్రత్యేకంగా నిధులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాచలం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్‌ కు రూ. 1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్‌ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. కరంటు సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్‌ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నాం. శ్యాంపల్లి ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలని, వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ హన్మకొండకు చేరుకున్నారు.

ఈ పర్యటనల్లో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు టి.హరీశ్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, పూర్వ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ హన్మంతరావు, భద్రాచలం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి, సింగరేణి సీఎండీ శ్రీధర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

అనంతరం భారీ వర్షాలు అలాగే కొనసాగుతుండటంతో సీఎం కేసీఆర్‌ మరోమారు అధికారులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

భద్రాచలం నుండి ఏటూరునాగారం వరకు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

భద్రాచలం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్‌ హెలీకాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమ యమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికిరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం ఏటూరునాగారంలోని రామన్న గూడెం చేరుకున్నారు. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సీఎం కేసీఆర్‌ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐటీడీఏ గెస్ట్‌ హౌజ్‌ కు వెళ్లిన ముఖ్యమంత్రి మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరి తల్లికి సీఎం కేసీఆర్‌ సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి పునరావాస కేంద్రానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కడి ముంపు బాధితులను పరామర్శించారు. భవనంలోని ప్రతి బాధితుడినీ కలుస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లు, భోజన వసతులపై సీఎం ఆరా తీశారు. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌ లో వరద ముంపుతో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత నిర్మాణాలు చేపడతామని సీఎం కేసీఆర్‌ బాధితులకు హామీ ఇచ్చారు.