చలి – స్వైన్‌ఫ్లూ పులి!

hydరాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్న తరుణంలో ఈ చల్లదనాన్ని ఆశ్రయించి జీవించే ‘స్వైన్‌ఫ్లూ’ పులి రాష్ట్రంపై పంజా విసిరింది.

స్వైన్‌ఫ్లూ అనేది ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కారణంగా వస్తుంది. చలి వాతావరణంలో ఇది ఎక్కువకాలం జీవించగలుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ వైరస్‌ జీవించజాలదు.

రోజురోజుకు స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని, అనేకమంది దీనికి గురవుతున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టింది. స్వైన్‌ఫ్లూపై సమరశంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగి, ఉన్నతస్థాయి సమావేశం జరిపి ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు, ఇప్పటికే వ్యాధిబారిన పడినవారికి తక్షణ చికిత్స అందించేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి మోదీతోను, ఇతర కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సంప్రదించి, వెనువెంటనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించే ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ మందులు అన్ని జిల్లా ఆస్పత్రులకు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు. దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు, సదుపాయాలు, ప్రత్యేక క్యాంపుల ఏర్పాటువంటి చర్యలు చేపట్టారు. కరపత్రాలు, పోస్టర్లద్వారా ప్రజలలో అవగాహన పెంచుతోంది.

ప్రతి జిల్లాకు ఓ ఐ.ఏ.ఎస్‌. అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సి.ఎం. తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్వైన్‌ఫ్లూకి గురైనవారికి ఆరోగ్యశ్రీ పథకంక్రింద ఉచితంగా చికిత్స అందించే ఏర్పాటు చేశారు.

స్వైన్‌ఫ్లూ ప్రాణాంతక వైరస్‌కాదని, అయితే నిర్లక్ష్యంచేస్తే ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలు, వయోవృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంవల్ల ఈ వైరస్‌ వారిపై తేలికగా దాడి చేస్తుంది. జ్వరం, జలుబు, ముక్కుదిబ్బడ, తలనొప్పి, గొంతు, ఒళ్ళునొప్పులు, దగ్గు తదితర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

దీనితోపాటు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సాధ్యమైనంతవరకూ జన సామర్ధ్యం ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటి చర్యల ద్వారా స్వైన్‌ఫ్లూ బారినపడకుండా చూసుకోవచ్చు.

ఈ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం సమర్థవంతంగా అన్నిచర్యలు చేపట్టినందున ప్రజలు ఆందోళన చెందనవసరంలేదు.అయితే, ఇక్కడ మనం ఓ విషయం గ్రహించాలి. ఏదైనా వ్యాధి సోకినప్పుడో, వైరస్‌ విజృంభించినప్పుడో కాక, ఎల్లప్పుడూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పడెయ్యడం, బహిరంగ మూత్ర విసర్జన వంటి చర్యలు అరికట్టడం ఆరోగ్యకర సమాజానికి ఎంతో అవసరం.

‘Prevention is better than cure’ అన్న విషయం అందరం గుర్తుంచుకోవాలి.