నగర అభివృద్ధికి సమిష్టి కృషి : ముఖ్యమంత్రి కేసీఆర్‌

KCRహైదరాబాద్‌ నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషి జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నవంబర్‌ 9వ తేదీన నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని నగరంలోని చెత్తను తీసుకువెళ్ళే ఆటోట్రాలీలు, చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ను మురికివాడలు లేని స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ మహత్కార్యంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయపార్టీల నాయకులు కలిసిరావాలన్నారు. నగరంలోని సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే కొన్ని భాగాలుగా విభజించి వాటికి తనతో లుపుకుని గవర్నరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులను బాధ్యులుగా చేయడం జరిగిందన్నారు.

నగరంలోని అన్ని ఇండ్లకు పక్షంరోజుల్లో తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేస్తామన్నారు. చెత్తను రోడ్లపై వేసే సంస్కృతికి స్వస్తి పలకాలన్నారు. ఇంట్లో ఉండే చెత్తను చెత్త బుట్టల్లో వేసి మున్సిపల్‌ కార్మికులకు అందచేయాలన్నారు. ఈ చెత్తను తరలించడానికి 1,005 ఆటో ట్రాలీలను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. 23 లక్షల చెత్త డబ్బాలను కూడా ఇంటింటికీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నెల పదిహేనురోజుల కాలంలో నగరంలోని రహదారులను చక్కగా తయారుచేస్తామన్నారు. రూ. 337 కోట్లతో 912 రహదారుల పనులు చేపడుతున్నట్లు కేసీఆర్‌ వివరించారు. గతంలో తానే ”సఫాయి అన్నా-సలాం అన్నా” అని అన్నానని అందుకే ఇప్పుడు తొలగించిన మున్సిపల్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తున్నానని అన్నారు. త్వరలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణం చేపడతామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు, భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఇక తాగునీటి సమస్యను పరిష్కరించడానికి గోదావరి నది నుంచి, కృష్ణా నదినుంచి నగరానికి నీరు తీసుకువస్తున్నట్లు తెలిపారు. వీటిని నిలువ చేయడం కోసం ఒక్కోటి 15 టీఎంసీల సామర్థ్యం గల రెండు రిజర్వాయర్లను నగర సమీపంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు..

నగరం చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఈ టౌన్‌ షిప్‌ల నిర్మాణం వల్ల నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందన్నారు. నగరం చుట్టు ఉన్న భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, షాద్‌నగర్‌, చౌటుప్పల్‌, ఘట్కేసర్‌, తూప్రాన్‌లలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నగరంలో ప్రస్థుతం ఉన్న ఎలుకల్లాంటి ఫ్లై ఓవర్‌లు ఏమాత్రం సరిపోవన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టు మెట్రోరైలు కోసం కొంత కారిడార్‌ ఉందని దాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ‘బ్రిక్స్‌’ బ్యాంక్‌ నుంచి రూ. 25 వేలకోట్ల రుణం తీసుకుని ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు తిగుళ్ళ పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నాయిని నర్సింహ్మారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.