|

రంగుల ప్రకాశం

colorసహజసిద్ధమైన ప్రకృతికి సైతం ప్రతికృతికాని సౌందర్యపూర్వకమైన చిత్రాలతో, మిలమిలా మెరిసిపోయే రంగులతో సూర్యప్రకాశ్‌ రచించే ప్రతిచిత్రం అందించే నిశ్శబ్ద సంగీతం కళాహృదయుడైన ప్రేక్షకుణ్ణి వినూత్న లోకాలలోకి చేరవేస్తుంది, ఆనందపు అనుభూతులలో విహరింపజేస్తుంది.

సుప్రసిద్ధ చిత్రకారుడు సూర్యప్రకాశ్‌ ఇటీవలికాలంలో వేస్తున్న ప్రకృతి చిత్రాలలోనైనా, లోగడ వేసిన పలు నైరూప్య తైలవర్ణ చిత్రాలలోనైనా వెలుగురేఖలు, రంగుల నర్తనం ప్రత్యేక ఆకర్షణలు. ఆయన చిత్రకళారంగంలో పాదం పెట్టిన తొలి రోజులలో, తన రచనకు వస్తువుగా తీసుకున్న చీమూ`నెత్తురులేని, శిథిలావస్థలోని మోటారుకార్లు, వాటి భాగాలు, వాటి రంగులు, వాటి హెడ్‌లైట్లు తన శైలిలో చిత్రించారు.

ఆ తర్వాత ఆకులను, గాలిలో ఎగిరిపోయే పత్రాలను వేశాడు. కొంతకాలం శీర్షికలేని నైరూప్యాలు చిత్రించాడు. పిదప లోయలు, నీలాల నీళ్ళు, లిల్లీలు, చెట్లు, చేమలు, రకరకాల రంగురంగుల వనాలు వేశాడు. దాదాపు దశాబ్ధంన్నర ప్రకృతి చిత్రాల పారవశ్యంలో మునిగిపోయిన సూర్యప్రకాశ్‌ తాజాగా వెనీస్‌నగరం వెళ్ళడంతో అక్కడి దృశ్యాలు ఆయనను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. వెనీస్‌ దృశ్యాలకే రూపమివ్వడం ఆరంభించాడు.

హైదరాబాద్‌లోని లలితకళలు, వాస్తు శిల్ప కళాశాలలో గురువు విద్యాభూషణ్‌, తన ప్రియశిష్యుడైన సూర్యప్రకాశ్‌కు అతనెప్పుడో గీసిన వెనీస్‌ నగర దృశ్యమొకటి బహూకరించాడు. కొన్ని దశాబ్దాల తర్వాత విద్యాభూషణ్‌ జీవితకాలంలో వేసిన చిత్రాల ప్రదర్శన ఏర్పాటుచేసే బాధ్యత సూర్యప్రకాశ్‌పై పడిరది. అప్పుడు ఆయన విద్యాభూషణ్‌ వేసిన వెనీస్‌ నగర చిత్రాలెన్నో తిలకించే అవకాశం కలిగింది. ఆ చిత్రాలు సూర్యప్రకాశ్‌ మనస్సుపై చెరగని ముద్రవేశాయి. ఇటీవల సూర్యప్రకాశ్‌, వెనీస్‌ నగరాన్ని సందర్శించే అవకాశం లభించడంతో ఆయనలోని చిత్రకారుడు విజృంభించి వెనీస్‌నగర చిత్రాలెన్నో తన బాణీలో గీశాడు. నీళ్ళ దారులలో తేలిపోయే నగరం వెనీస్‌. అక్కడి నీటిదారుల దరిలో నెలకొన్న భవనాలు, వాటి శిఖరాలు, చర్చ్‌లు, వంతెనలు`నీటిలో వాటి ప్రతిబింబాలు, అలంకరించిన రంగురంగుల పడవలు, సందర్శకులకు ముచ్చటగొల్పుతాయి. పర్యాటకుల స్వర్గమైన వెనీస్‌ నగరం చిత్రకారుల పాలిట కల్పతరువు.

సూర్యప్రకాశ్‌ చిత్రించే ప్రకృతి చిత్రాలు ` ఆకులు రాలిన చెట్లు, కారడవులు, అడవిపూలు, గడ్డిగాదం, లోయలు, వర్షపు ధారలు, నీలాల ఆకాశం`ఏదైనా నూతనరీతిలో, కమనీయ భావాన్ని ద్యోతకం చేస్తాయి. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు క్లాడ్‌మోస్‌ వాటర్‌ లిల్లీస్‌ ప్రేరణతో కాంతిని, నిర్మల వాతావరణాన్ని తనదైన ధోరణిలో ప్రతిబింబించాడు. ఆ తర్వాత ‘ప్రతిబింబాలు’ శీర్షికన ఆయన వేసిన చిత్రాలు సైతం వైవిధ్యభరితమైనవే. పండితులైనా, పామరులైనా`చూపరులందరినీ ఆకర్షిస్తూ చిత్రాలన్నింటినీ ప్రమాణంలో తారాపథానికి చేరువగా నిలుపుతాడు. ఒక్కొక్క భావాన్ని చిత్రంలో మలచాలంటే ఆయన ఎంతో కృషి చేస్తాడు. మనస్సును మధిస్తాడు. సూర్యప్రకాశ్‌ చిత్రాల్లో రంగుల ‘ప్రకాశం’ కన్పించడం ఆయన సంతకంలా గుర్తించవచ్చు. ఆయన కోమలభావంలోనే సూర్యుడు కాపురం సాగిస్తున్నట్లు తోస్తుంది. అందుకే ఆయన వినూత్నమైన బాణీ విన్యాసంతో ‘రంగుల సూర్యుడు’గా రూపొందినవాడు సూర్యప్రకాశ్‌.

లోగడ ఈయన చిత్రాలు సామాన్య ప్రేక్షకుడికి సమగ్రంగా అర్థంకాక తికమకపడిన సందర్భాలు ఉండవచ్చు. ప్రస్తుతం ఆయన వేస్తున్న చిత్రాల్లో మాదిరిగా చెట్లు, చేమలు, పూలు, నీళ్ళు, భవనాలు, ప్రతిబింబాలు, నగరాలు ఉండేవికావు. కనీసం చిగురురేకులు, ఎండిన ఆకులు, మొగ్గలను పోలిన ఆకృతులు కూడా అంతగా కన్పించేవికావు. ఇప్పుడైతే స్వచ్ఛమైన జలాలలో సూర్యడి కిరణాలవల్ల ఉత్పన్నమయ్యే కాంతిధార కన్నుల మిరుమిట్లు గొల్పుతున్నది. నీలాలబిలాల్లో రంగుల ఇంధ్ర ధనుస్సులు తారసపడుతున్నాయి. పరుగెత్తే వాగులో పడిన కిరణం వెలుగు కన్నుల మిరమిట్లు గొల్పుతున్నది. వీటి ఆకర్షణనుంచి సమకాలీన ప్రపంచంలో పండితుడేకాదు, పామరుడుసైతం తప్పించుకోలేని స్థితి ఏర్పడిరది. ఇది సలక్షణమైన, ఆహ్వానించదగిన పరిణామమని సూర్యప్రకాశ్‌ అభిప్రాయం. జనసామాన్యానికి చిత్రకళ వేరుగా వెళ్ళవలసిన అవసరం ఉందని ఆయన అంటారు. జనం అభిరుచికి దగ్గరగా దిగి చిత్రకారుడు తన రచనలు చేయవలసిన అవసరం లేదని తన చిత్రాలలోని కళాత్మకతను రంజించేవిధంగా జన సామాన్యంలో చైతన్యం తేవాలనేది ఆయన కోరిక. ఇది ‘వన్‌వే’ ప తిన సాధ్యం కాకుంటే ‘టూవే’ పద్ధతిలోనైనా ప్రమాణాలకు భంగం కలుగకుండా ఎంతవరకు సాధ్యమో ప్రయోగం చేయాలంటారు. భూపాల్‌లోని భారత్‌ భవన్‌ పద్ధతిలో, ప్రతి రాష్ట్ర రాజధానిలో లలితకళలను ప్రోత్సహించే, వాటిపట్ల ప్రజల అభిరుచి పెంచే సంస్థలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు.

మన రాష్ట్రంలో సమకాలీన చిత్రకళాఖండాలను ప్రదర్శించే మ్యూజియం లేకపోవడం విచారకరమన్నారు. వాస్తవానికి సమకాలీన చిత్రకళా మ్యూజియం పేరున ఒకటి హైదరాబాద్‌లోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉన్నా, అందులో ప్రదర్శించేవన్నీ ముప్ఫై, నలభై అంతకు ఎక్కువ సంత్సరాల క్రితం గీసిన పాత చిత్రాలే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వస్తున్న వినూత్న ధోరణులను ప్రతిబింబించే చిత్రా ప్రదర్శనలో ఉంటే, జన సామాన్యానికి చిత్రకళారంగంలో వస్తున్న కొత్త పోకడలు తెలుస్తాయని ఆయన అంటారు.

ఆయన పరిధిలో ఆయన హైదరాబాద్‌లోని ఎల్‌.వి. ప్రసాద్‌ నేత్ర చికిత్సాలయంతో, సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయోలజీతో సంబంధాలు పెట్టుకుని చిత్రకళా వికాసానికి ఎంతో సేవ చేస్తున్నారు. ‘‘సొసైటీ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఆర్ట్‌’’ సంస్థ మూలస్తంభాలలో ఒకరుగా ఉన్నారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఒక గొప్ప సృజనాత్మక చిత్రకారుడు కూడా తయారు కాకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్‌లోని లలితకళల కళాశాలలో చదువుతున్న తరుణంలో తమకేకాదు, ఏదో నేర్పించి తమ శిష్యులను గొప్పవారిని చేయాలనే కాంక్ష అధ్యాపకులకు కూడా ఉండేదన్నారు. విద్యార్థులుగా తమ అధ్యాపకులతో కలిసి సుదూర ప్రాంతాలు కాకపోయినా, రాష్ట్రంలోని పలు కళాత్మకమైన ప్రాంతాలు సందర్శించి వాటినుంచి ప్రేరణపొంది ఎన్నెన్నో వైవిధ్యవంతమైన చిత్రాలను ఎవరి ప్రతిభ మేరకు వారు చిత్రించే వారని, ఆ కృషి ముందుముందు వారికి ఎంతో కలిసివచ్చేదన్నారు. అంతేకాదు జాతీయస్థాయిలో చెప్పుకోదగిన చిత్రకారుడుగా కనీసం అధ్యాపకుడుంటే, వారివలె తాముకూడా పెరగాలనీ, దేశంలోని వినూత్న పోకడలను పరిశీలించి, విద్యార్థులు అభ్యాసం చేస్తారు. కాని అదేమి దురదృష్టమోగానీ ప్రస్తుతం అలాంటి జాతీయస్థాయి లేదా ఉత్తమ చిత్రాకారులైన వారెవ్వరూ కూడా అధ్యాపకులుగా కళాశాలలో లేనందున విద్యార్థులలో సైతం కృషి, అభిరుచి కొరవడిరదన్నారు. తమలో చిన్న వయస్సులో చిత్రకళపట్ల కలిగిన శ్రద్ధాసక్తులు, పోటీ మనస్తత్వం కారణంగానే ఇవ్వాళ ఈ స్థాయిలో మనగలుగుతున్నట్లు సూర్యప్రకాశ్‌ పేర్కొన్నారు.

coరంగుల మేళవింపుల్లో, మూర్తి కల్పనలో అసాధారణ రీతిని ప్రదర్శించే సూర్యప్రకాశ్‌ 1961లో హైదరాబాద్‌లో పెయింటింగ్‌ డిప్లొమా పొందారు. ఆ తర్వాత 1965లో న్యూఢల్లీిలో శ్రీరామ్‌కుమార్‌వద్ద శిక్షణ పొందారు. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా పూర్తి చేశారు. అప్పటి నుంచే వీరి చిత్ర రచన కొత్త మలుపు తిరిగింది. అంతకుముందు చిత్రించిన వాటికి భిన్నమైన వస్తువులను చేపట్టడం కూడా అప్పుడే జరిగింది. ఎలక్ట్రిక్‌ పోల్స్‌, వీధుల్లో అక్కడక్కడా కన్పించే పవర్‌లూమ్స్‌లు, మరికొన్ని తెలియని జంతువుల రూపాలు అప్పటి రచనల్లో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. తిరిగి హైదరాబాద్‌ వచ్చిన పిదప మరో మలుపు తిరిగిన సూర్యప్రకాశ్‌ చిత్ర రచనలో వస్తువు ఆటోమొబైల్స్‌కు సంబంధించింది. తాను అనుకున్న భావాన్ని కూర్చడానికి వర్ణ సమన్వయంలో, రేఖా లావణ్యంలో ఆయన అమోఘమైన వైవిధ్యాన్ని సాధించారు. ఏమైనా గత ఐదు దశాబ్దాలుగా తాను చూసిన, తాను నమ్మిన అంశాలను, తనకు నచ్చిన అంశాలనే తన చిత్రాలలో ప్రతిబింబించానంటాడు. ప్రకృతి, అంతరిక్షం, కాంతి, రంగులే ఆయన చిత్రాల్లో విశ్వరూపం ధరిస్తాయి. ఈయన రంగురంగుల బొమ్మలకు హృదయం కమ్మని ఊహాత్మక భావం. ఆ భావం అందమైన అమ్మాయి హృదయంలాంటిది. అది చాలా సున్నితమైంది, సుందరమైంది. అయితే చాలామందికి అట్టే అర్థం కానిది.

ప్రస్తుతం ఆక్రాలిక్స్‌తో అనుకున్న భావాన్ని పొందుపరుస్తున్న సూర్యప్రకాశ్‌ చిత్రాలలో సమత ఉంది, లయ ఉంది, ఉ ఉంది. దేశంలోని అన్ని మహానగరాల్లో మాత్రమేకాకుండా విదేశాల్లో యాభైకిపైగా ఏర్పాటు చేసిన వీరి వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు విశేష ఆదరణ పొందాయి. ఎందరో దేశ, విదేశీయులు, ప్రభుత్వ సంస్థలు, మ్యూజియంలు వీరి చిత్రాలను కొనుగోలు చేశాయి. ముఖ్యంగా వీరి చిత్రాలకు విదేశాలలో విశేషమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయి.

దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ సమాచారశాఖలో స్టాఫ్‌ ఆర్టిస్టుగా రెండేళ్లు పనిచేసి, ఆ తర్వాత ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్‌గా స్థిరపడిన సూర్యప్రకాశ్‌కు 1966లోనే ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర లలితకళా అకాడమీ అవార్డు లభించడమేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ స్వర్ణపతకాన్ని 1966లో, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ స్వర్ణపతకాన్ని 1963లో గెలుచుకున్నాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం 1999లో పొందారు. 2005లో ‘హంస అవార్డు’ గ్రహించి, యువ చిత్రకారులకు అవకాశం ఇవ్వాలనే దృష్టితో 1971నుంచి ఏ పోటీ చిత్రకళా ప్రదర్శనలో కూడా ఆయన పాల్గొనడంలేదు.