మధ్యవర్తిత్వ కేంద్రానికి శ్రీకారం
‘‘ఇది హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా
నిలిచిపోయే చారిత్రిక దినం.
నేను ఎప్పుడూ అనుకోలేదు..
నా కల మూడు నెలల్లో సాకార మవుతుందని.
దీనికి కారణమైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హైకోర్టు చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీకి నా కృతజ్ఞతలు’’

హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక వివాదాలను పరిష్కరించే ‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’ (మధ్యవర్తిత్వ కేంద్రం) ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సందర్భంగా సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆనందంతో అన్న మాటలివి.
బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికార నివాసం అశోక్ విహార్ లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కరతాళధ్వనుల మధ్య జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ట్రస్ట్ డీడ్ పై వ్యవస్థాపకుడి హోదాలో ఎన్వీ రమణ సంతకం చేశారు. ట్రస్ట్ జీవితకాల సభ్యులుగా జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ రవీంద్రన్, ట్రస్టీలుగా హైకోర్టు సీజే హోదాలో జస్టిస్ హిమా కోహ్లీ , రాష్ట్ర న్యాయశాఖా మంత్రి హోదాలో ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, సాక్షులుగా ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ హోదాలో ఏ.వెంకటేశ్వర రెడ్డి కూడా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ‘‘నేను జూన్ నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇక్కడికి వచ్చాను. అప్పుడు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం కోసం ప్రతిపాదనలు పంపించవలసిందిగా కోరాను. ఎలాంటి సమయం తీసుకోకుండా జూన్ 30న ఆమె ప్రతిపాదనలు పంపారు. దీనిపై పరిశ్రమల ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు జస్టిస్ ఎల్. నాగేశ్వర రావుతో పలుమార్లు చర్చించారు. ముఖ్యమంత్రి ఈ కేంద్రం ఏర్పాటుకు కావల్సిన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహకారం అందిస్తామని తెలియజేశారు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు పితామహుడైన తెలంగాణ బిడ్డ , ఆనాటి ప్రధాని పి.వి.నరసింహా రావు నాయకత్వంలో 1995 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. నేను ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఇక్కడ పెట్టుబడి పెట్టమని అడిగితే, వారు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమే కానీ, ఇక్కడ లిటిగేషన్లు పరిష్కారం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని భయపడుతున్నామని అన్నారు. మనదేశంలో 1996లో ఆర్బిట్రేషన్ చట్టం చేయడం జరిగింది.దీనిద్వారా ఆర్బిట్రేషన్ ప్రక్రియ వేగవంతమయింది. ఆర్బిట్రేషన్ కేంద్రం మొట్టమొదట 1926లో పారిస్ లో ప్రారంభమయింది. తరువాత నాలుగు కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది. ఈమధ్యనే దుబాయ్ లో ప్రారంభమయింది. త్వరలో హైదరాబాద్ లో అమలులోకి వస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. హైదరాబాద్ లోని పరిస్థితులు ఈ కేంద్రం ఏర్పాటుకు చాలా అనుకూలమని, ఇక్కడ వాతావరణం, సంస్కృతి, సాంకేతికత లభ్యత, తదితర అంశాలు ఇందుకు దోహదపడతాయని ఆయన అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకొనే విధానం కొత్తదేమీ కాదని, భారతీయ కుటుంబ వ్యవస్థలోనే ఇది ఇమిడి వున్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
హైదరాబాద్ లో మధ్యవర్తిత్వ కేంద్రం స్థాపన పనులు వేగంగా జరగటంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సహకారం మరువలేనిదని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు.గత జూన్‌లో తాను సిజెఐ హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కేంద్రాన్ని నగరంలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగానే సి.ఎం. కె.సి.ఆర్ తక్షణం సానుకూలంగా స్పందిచారని తెలిపారు. అదే నెల 30న మధ్యవర్తిత్వ కేంద్రం కోసం లేఖ రాయడమే కాకుండా సి.ఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో కూడిన బృందాన్ని ఢల్లీికి పంపారని ఆయన గుర్తుచేశారు. మూడునెలల్లోనే ఆర్బిట్రేషన్ సెంటర్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో తన కల సాకారం అవుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు.
మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటువల్ల హైదరాబాద్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని, అబివృద్ధికి హైదరాబాద్ చిరునామాగా మారిపోతుందని ఎన్వీ రమణ చెప్పారు. మొదట తాను ఇక్కడ జడ్జిగా ఉన్నప్పుడే మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించగా, ఆనాటి ప్రభుత్వం షామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటీ సమీపంలో 10 ఎకరాలు భూమి కేటాయించిందని, అది ఇప్పటికీ హైకోర్టు వద్దనే ఉన్నదని, దానిని ప్రభుత్వం తీసుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భూమి కేటాయిస్తే సెంటర్ ఏర్పాటు వేగవంతం అవుతుందని మంత్రి కె.టి.రామారావు దృష్టికి సీజెఐ తీసుకెళ్ళారు.
హైదరాబాద్‌కు గర్వకారణం – కె.టి.ఆర్
ముగ్గురు తెలుగువారు సుప్రీంకోర్టులో కొలువుదీరిన వేళ హైదరాబాద్‌కు ఈ మహత్తర అవకాశం రావడం నిజంగా తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర ఐ.టి శాఖా మంత్రి కె.టి.రామరావు అన్నారు. దేశంలో ఎక్కడైనా వివాదాలు వచ్చినప్పుడు సత్వరమే పరిష్కారం కాకపోతే పెట్టుబడులు వెనక్కు పోయే ప్రమాదం ఉంటుందని, హైదరాబాద్‌లో మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. త్వరలో సెంటర్ ను ఏర్పాటుచేయాలి. దానిని జస్టిస్ రమణే ప్రారంభించాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని కె.టి.ఆర్ హామీ ఇచ్చారు.
ఆర్బిట్రేషన్ కోసం దేశంనుంచి చాలామంది సింగపూర్ కు వెళ్తుంటారని, హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం కొత్త అధ్యాయమని జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు.దీనివల్ల సత్వర న్యాయం జరుగు తుందని, జాప్యం లేకుండా తక్కువ ఖర్చుతో ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న సీజేఐ ప్రతిపాదనకు సి.ఎం కె.సి.ఆర్ సానుకూలంగా స్పందించడం హర్షణీయమని అన్నారు.
ఈ మధ్యవర్తిత్వ కేంద్రం తెలంగాణకు వరంగా మారు తుందని, హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు ఆలోచన గొప్ప విషయమని జస్టిస్ సుభాష్ రెడ్డి అన్నారు.