తెలంగాణలో సాకారం కానున్న కల సమగ్ర భూ సర్వే

By: బండారు రామ్మోహనరావు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేస్తామని ప్రకటించడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సుమారు వందేళ్ల తర్వాత రాష్ట్రమంతా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సర్వేకు  పూనుకోవడం  ఒక విప్లవాత్మక చర్యగా  అభివర్ణించవచ్చు. ఏనాడో నిజాం పాలకుల హయాంలో జరిగిన సమగ్ర భూ సర్వే తర్వాత స్వాతంత్య్రానంతరం మన రాష్ట్రంలో ఇది మొదటి సర్వేగా చెప్పుకోవచ్చు. ఈ మంచి పని గురించి కొందరు పడనివారు, గిట్టనివారు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టారు. ఆ పనికిరాని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే వారు చేయని మంచి పనిని మరొకరు చేస్తే అభినందించే సంస్కారం వారికి లేదని అనిపిస్తుంది. అభినందించకుండా కనీసం మౌనంగా ఉన్నా సరిపోయేది. వారి గురించి ఇంతకంటే మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఎవరేమనుకున్నా తన దృఢమైన నిర్ణయానికి కేసీఆర్‌ తనదైన రీతిలో ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020లో మొదలు పెట్టాల్సిన సర్వే కరోనా మహమ్మారి విజృంభన వల్ల ఆగిపోయిందని, ఏదేమైనా  సంవత్సరాంతానికి సర్వే జరిపి సకల జనావళికి భూమికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సర్వే వల్ల ప్రజలకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాం!

ఆదిమ రాజ్యం నుండి ఆధునిక రాజ్యం వరకు…

ఆదిమ రాజ్యంలో భూమిమీద పన్నుల విధానం కోసమే రెవెన్యూ వ్యవస్థ ఏర్పడిరది. ఆదిమ రాజ్యం నుండి ఆధునిక రాజ్యం వరకు ప్రధాన ఉత్పత్తి వనరుగా ఉన్న భూమి మీద రాజులు, రాజ్యాలు పన్నులు విధించేవి. ప్రధానంగా భూమి మీద వచ్చే పన్నుల ఆదాయంతోనే రాజ్యాలు నడిచేవి. భూమి శిస్తు చెల్లించకపోతే రైతుల వీపుల మీద బండలు ఎత్తే అనాగరిక పాలన కాల కాలక్రమంలో రద్దయింది. రాజులు పోయినా రాజ్యాలు పోయినా స్వతంత్ర భారతంలో కూడా చాలా కాలం భూమిపై శిస్తు వసూలు చేశారు. వ్యవసాయ ఆధారిత దేశం నుండి పారిశ్రామిక, సర్వీస్‌ రంగాలు విస్తరించడం వల్ల ప్రత్యక్ష పన్నుల నుండి పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం సమకూరే మార్గాలు ఏర్పడ్డాయి. మెల్ల మెల్ల మెల్లగా భూమిశిస్తు రద్దు అయ్యింది. ఆ తర్వాత ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో రైతు నుండి వసూలు చేసే పన్నుల డబ్బు శూన్యం కాగా, రైతులకు రైతుబంధు పేరిట ఎకరానికి పంటకు ఐదు వేల చొప్పున రెండు పంటలకు గాను పదివేల రూపాయలు ఇచ్చే పథకం వచ్చింది. రైతు బీమా ద్వారా 60 సంవత్సరాలలోపు వయసు కలిగిన రైతులు తమకు ఉన్న భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా రైతు బీమాకు అర్హత లభించింది. రైతు సహజంగా మరణించినా కూడా ఐదు లక్షల రూపాయల రైతు బీమా పేరిట ఎదురు డబ్బులు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకునే సంక్షేమ రాజ్యం వచ్చింది. స్వరాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి గా రైతుకు లభించిన వరం ఇది.

సమగ్ర భూ సర్వే వల్ల లాభాలు ఏమిటి?

ఈ సమగ్ర భూ సర్వే కోసం రెవెన్యూ సంస్కరణల లో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. (1)కొత్త రెవెన్యూ చట్టం ఆమోదించి అమలు చేయడం.(2)రెవిన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళనలో భాగంగా అధికారుల విధినిర్వ హణలో వారి విధివిధానాలను నిర్ణయించి ఆ వ్యవస్థ పేరు మార్చడం(3) ఇప్పటి దాకా రెవెన్యూ వ్యవస్థ లో ఉన్న అవినీతిని నిర్మూలన చేయడం కోసం అన్ని స్థాయిల్లోని రెవెన్యూ అధికారులకు ప్రస్తుతం ఉన్న విచక్షణ అధికారాలు కుదించడం చేశారు.

ఇప్పటిదాకా ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న భూమికి సంబంధించిన రికార్డు లలో అనేక తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను కేవలం కాగితాలమీద సరి చేస్తే లాభం లేదు. క్షేత్రస్థాయిలో వాటిని సర్వే చేసి కొత్తగా హద్దులు నిర్ణయించి, కొత్తగా హద్దు రాళ్ళు పాతి, సరికొత్తగా రెవెన్యూ రికార్డులను తయారుచేస్తారు. దానితో భూ యజమానికి పూర్తి  హక్కులతో పాసుబుక్కులు ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని అక్రమార్కులు క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కంటే రెవెన్యూ రికార్డులలో లక్షల ఎకరాలలో ఎక్కువ భూమి ఉన్నట్లు రికార్డు చేయించారు. బ్యాంకు రుణాల కోసం ఇతరత్రా అక్రమ లావాదేవీల కోసం ఇప్పటిదాకా వీరు దీన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు భూ సర్వే చేయడం వల్ల ఇలాంటి అక్రమాలకు చెక్‌ పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈ భూ సర్వే పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వ్యవసాయేతర భూములను ఒక్క ఇంచ్‌ కూడా వదలకుండా సర్వే చేస్తారు. ఇందులో ఒక్క పైసా కూడా రైతుల నుంచి, భూమి యజమానుల నుండి వసూలు చేయరు. రాష్ట్రంలో సర్వే పూర్తి అయినాక చివరికి ప్రభుత్వ అధికారిక ముద్రలతో చెక్కించిన హద్దు రాళ్లను భూమికి సంబంధించిన సర్వే నెంబర్ల సరిహద్దులలో పాతుతారు.

భూమి హక్కుల ‘‘టైటిల్‌ గ్యారెంటీ’’ చట్టానికి ఇది నాంది

అదీకాకుండా గ్రామానికి కొత్తగా భూముల హద్దులకు సంబంధించిన సర్వే పటం ‘‘నక్షా’’ తయారవుతుంది.దాన్ని ప్రజల ముందు బహిరంగంగా ఉంచి అందులో లోపాలు ఉంటే ఎప్పటికప్పుడు సవరిస్తారు. చివరగా లోపాలు లేని రెవెన్యూ రికార్డులను ప్రచురిస్తారు.అలాగే అభివృద్ధి చెందిన దేశాలలో లాగానే మన వద్ద భూమి హక్కుల గ్యారెంటీ చట్టాన్ని తీసుకు వస్తారు. దానివల్ల ఎవరైనా ప్రభుత్వ భూ రికార్డులలో జరిగిన పొరపాటు వల్ల యజమాని నష్టపోయిన సందర్భంలో వారికి ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. ఇది మన దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు.

శాస్త్రీయమైన సర్వేతో- సకారాత్మక పరిణామాలు

అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా అత్యాధునిక శాస్త్ర విజ్ఞానంతో డ్రోన్ల సహాయంతో ఈ భూమి సర్వే నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది సర్వేయర్‌లను ఉపయోగిస్తారు. సర్వేలో పొరపాట్లు జరగకుండా సర్వే కోసం రాష్ట్రాన్ని దశలుగా విభజించి సమగ్ర భూ సర్వే నిర్వహిస్తారు. చివరగా అత్యాధునికమైన అధికారికమైన ‘‘హోలోగ్రామ్‌’’ తో రైతులకు భూయజమానులకు సరికొత్త  పట్టాదారు పాసుబుక్కులు అందజేస్తారు.

అవగాహన కల్పించాలి అవరోధాలు అధిగమించాలి.

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం మనుషులుంటారు.ఈ సమగ్ర భూ సర్వే చట్టం తమకు మేలు చేస్తుందనే విషయం రైతులకు సమగ్రంగా తెలియకపోతే దీని మీద అపోహలు సృష్టించడానికి ప్రతిపక్షాలు, ఇతర సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తాయి. దీన్ని అరికట్టాలంటే ప్రజలకు ఈ చట్టం గురించి అవగాహన ముఖ్యం. అందుకే మొదట ఈ సమగ్ర భూ సర్వే ప్రజలకు అర్థం కావడానికి అవసరమైన బుక్‌లెట్‌లు ఇతర ప్రచార సామగ్రిని ప్రజలకు అందజేసి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే భూములు సర్వే చేసేటప్పుడు చిన్న చిన్న తగాదాలు రాకుండా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆ తర్వాతనే క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టాలి. అప్పుడే ఈ పథకం విజయవంతం అవు తుంది. దానివల్ల ధీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇల్లు అలకగానే పండగ కాదు. ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి ప్రజల మన్ననలు పొందాలి. సకారాత్మకంగా ఆలోచించే వారికి ఈ భూమి సర్వే యజమాన్య హక్కుల కల్పన, టైటిల్‌ గ్యారెంటీ ఇవ్వడం అనేది అద్భుతమైన మంచి ఆలోచనగా చెప్పుకోవచ్చు.