ఓటర్లజాబితా కంప్యూటీకరణ
ఎప్పటికప్పుడు ఓటర్లజాబితా సవరణల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఓటర్ల వివరాల నిర్వహణను చేపట్టాల్సి వస్తున్న దృష్ట్యా – ఓటర్ల జాబితాను కంప్యూటరీకరించడానికి జాతీయస్థాయిలో సమగ్రంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆగస్ట్, 1997లో ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఆరోజున పరిస్థితి ఏమిటంటే-62కోట్ల పైచిలుకు ఓటర్ల డేటా -అంటే అది చాలా పెద్ద మొత్తం. దానికి తోడు ఓటర్ల జాబితాలను ముద్రించాల్సింది పలు భారతీయ భాషల్లో. ఇక ఓటర్ల జాబితా కంప్యూటీకరణ ప్రారంభించే నాటికి -ఇన్ని భాషల్లో ఇంత పెద్ద మొత్తం డేటాను నిర్వహించడానికి తగిన సామర్ధ్యం
ఉన్న ప్రామాణిక ఐటి పరిష్కారం లేదు. ఎన్నికల ప్రధాన అధికారులు, ఐటి నిపుణులతో చర్చోపచర్చలు జరిపిన అనంతరం ఎన్నికల సంఘం ఒక ముసాయిదా ప్రామాణిక నమూనా సాఫ్ట్ వేర్ రూపొందించడానికి గుర్గావ్లోని హర్యానా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ (HARTRON)తో కలిసి కృషి ప్రారంభించింది.
పైన చెప్పినట్లు – భౌగోళికపరమైన, పాలనాపరమైన, భాషాపరమైన సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా డేటాను (వివరాలను) అందరూ ఇచ్చిపుచ్చుకోవడానికివీలుగా భారతీయ భాషల్లో అమలుచేయడానికి నిర్దిష్టమైన ప్రమాణాలు అభివృద్ధి చేయడం జరిగింది. దీనికోసం ఎన్నికల సంఘం భారత ప్రమాణాల బ్యూరో(BIS) వారి ISCII, INSCRIPT కీబోర్డులను మాత్రమే వాడాలని నిర్దేశించింది. రిలేషనల్ డేటాబేస్ నమూనాలో ఆపరేటింగ్ సిస్టమ్(OS)లో, డేటా స్టోరేజిలో ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రమాణాలను సూచించింది.
డేటాబేస్‌లో నింపడానికి అవసరమయిన సమాచారం, వివరాలు, గణాంకాల విషయానికొస్తే ఎన్నికల సంఘం దాని వద్దఉన్న ప్రామాణిక పత్రాలు, ఎన్ని రకాల సమాచారం ఉందో దానిని వివరంగా తెలిపే టేబుల్స్, జాబితాలను చాలా స్పష్టంగా నిర్వచించింది. దీనిని డేటాబేస్‌లో పొందుపర చడంలో విశేషంగా చెప్పుకోవలసింది-కోడింగ్ వ్యూహం. మారుమూల ప్రాంతాలనుంచీ దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో ఓటర్లజాబితాను ఇది ప్రభావితం చేస్తుంది. కనుక-పలు భౌగోళిక ప్రాంతాలకు, పలుపాలనా విభాగాలకు తగ్గట్టుగా సమగ్రంగా కోడింగ్ వ్యూహాన్ని రూపొందించడం.
ఈ కార్యక్రమం మొదలయిన రోజు నుంచీ కూడా – వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకుని అంటే జిల్లాల్లో వీటి నిర్వహణ స్వతంత్రంగా, సులువుగా చేపట్టడానికివీలుగా కంప్యూటీకరణను చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఓటర్లజాబితాను ఇవి నిర్వహించేవిధంగా లాన్ (LAN-Local Area Network) పద్ధతిని ప్రవేశపెట్టారు.
ఈ కార్యక్రమం మొత్తంలో ఎన్నికల సంఘం దృక్పథంలోనే చాలా కీలకమైన మార్పు చోటుచేసుకున్నది. దీనిని కేవలం ఓటర్ల జాబితా ముద్రిత భాగాన్ని చూడడం కోసం కాకుండా, ఓటర్ల జాబితాలు మారినప్పడు తగినవిధంగా కొనసాగించుకోవడానికి వీలు కల్పిస్తూ, భద్రత, సమగ్రతలను కాపాడుతూ కంప్యూటర్ ఆధారిత పరిష్కారంద్వారా ఎప్పటికప్పుడు తాజాగా సవరించుకోగల డేటా బేస్‌గా ఉండాలని సంకల్పించింది. దానికి వీలుగా ఓటర్లజాబితాలో ఏం ఉండాలి, ఎలా ఉండాలన్నది స్పష్టంగా నిర్వచించింది. డేటాబేస్‌ను విశ్లేషించి ఓటర్లజాబితాను ముద్రించడానికి ఒక ప్రామాణిక ఫార్మాట్‌ను నిర్దేశించింది. అంటే ముద్రణ అయిన తరువాత ఓటర్లజాబితా కేవలం ఓటర్లపేరున్న ఒక జాబితాలాగా మాత్రమే కనిపించదు. కానీ అది మొత్తం ఓటర్ల సమాచారానికి సంబంధించిన ఒక సమగ్ర కంప్యూటర్ నివేదికలా కనిపిస్తుంది. శాసనసభ నియోజకవర్గ స్థాయి, పోలింగ్ కేంద్ర స్థాయిలో ఒక టైటిల్ పేజి, హెడర్ భాగం ఉంటాయి. శాసనసభస్థాయి, నియోజకవర్గ స్థాయి టైటిల్ పేజిలో మొత్తం ఆ నియోజకవర్గ సమాచారం సంక్షిప్తంగా ఉంటుంది. అంటే – సరిహద్దుల సవరణ తరువాత నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రాంతం, పాలనాపరమైన, భౌగోళిక పరమైన వివరాలు, స్త్రీ పురుష ఓటర్ల వివరాలు, నియోజకవర్గాలలో భాగాలు ఉంటాయి. మరో ముఖ్యమైన నవీకరణ ఏమిటంటే – తొలగించబడిన ఓటర్ల పేర్లను కంప్యూటర్ ద్వారా ఎక్కడా కనిపించనీయకుండా చూడడం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అనధికారికంగా అక్రమాలకు అవకాశం లేకుండా చేసే ఏర్పాటు ఇది.
ఓటర్లజాబితాను కంప్యూటరీకరించి కార్యక్రమం రూపకల్పన జరుగు తుండగానే ఎన్నికల సంఘం ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నది. ఓటర్ల జాబితాలోని ఎలక్ట్రానిక్ ఓటర్ల గుర్తింపు కార్డుల(ఎపిక్) వివరాలను ఓటర్లజాబితా నిర్వహణకు, ఫొటో గుర్తింపు కార్డుల జారీకి వాడుకోవాలని నిర్ణయించింది. ఇది మరో ముఖ్యమైన మలుపుకూడా తీసుకుంది. ఒక నియోజకవర్గంలో జారీచేసిన వార్డులు, ఓటరు ప్రస్తుత జాబితాలో ఉన్న మరో నియోజకవర్గంలో కూడా వాడవచ్చని స్పష్టమవుతుంది. దానితో దేశ వ్యాప్తంగా ఈ గుర్తింపు కార్డులు చెల్లుబాటయ్యే విధంగా అదికూడా ఓటరు జీవితాంతం ఒకే విశిష్టసంఖ్య పొందే విధంగా చర్యలు తీసుకున్నది.
ప్రస్తుత స్థితి : పైన చెప్పినట్లు మొదట్లో కంప్యూటరీకరించిన ఓటర్ల జాబితాను జిల్లాస్థాయిలో నిర్వహించడం జరిగింది. క్రమేణా రాష్ట్రస్థాయిలో అది అభివృద్ధిచెందింది. అయితే వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల డేటాబేస్‌ను పలురకాల ప్రామాణికతలతో, పలు ఫార్మాట్లతో నిర్వహిస్తుండడంతో కంప్యూటరీకరణ పూర్తి ప్రయోజనాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికీ ఇంకా పొందలేకపోతున్నది. ఓటర్ల జాబితా డేటా బేస్‌ను ప్రామాణీకరించాలని ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీచేస్తూనే ఉంది. చాలా రాష్ట్రాలు-రాష్ట్రస్థాయిలో ప్రామాణికతను సాధించ గలిగాయి. కానీ ఓటర్లజాబితా నిర్వహణ వ్యవస్థ (ERMS)ను సాధించడం అనేది ఇంకా అందని మానిపండుగానే మిగిలిపోతున్నది. భారత ఎన్నికల సంఘం (ECI) రూపొందించిన ERMS నమూనాను, ప్రస్తుతం 24 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు వాటి సొంత ERMS లు వాడుతున్నాయి. అదీగాక, పౌరులకు ఉద్దేశించిన సేవలను అలాగే మరింత మెరుగైన పద్ధతిలో ఓటర్లజాబితానిర్వహణను చేపట్టడానికి ఎన్నికల సంఘం కొన్ని IT ఆధారిత ఆధునికీకరణ చర్యలను చేపట్టింది. దీనికి సంబంధించి – నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP)ని, ERO-Net ను ప్రారంభించింది. ఒకటి – ఎన్నికల సంఘం, పౌరుల అనుసంధానానికి ఉద్దేశించికాగా, మరొకటి ఎన్నికల సంఘానికి రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణ సిబ్బందిని అనుసంధానానికి ఉద్దేశించింది.