టీకా వచ్చేసింది!

ఇది ప్రపంచానికే శుభవార్త. గత సంవత్సర కాలంగా ప్రపంచ మానవాళిని కలవరపరచి, లక్షలాదిమంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా మందు వచ్చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.మన రాష్ట్రంలో గాంధి ఆస్పత్రిలో తొలిటీకా కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు 3,352 మందికి టీకా మందు అందించారు. పారిశుద్ధ్య కార్మికురాలు కిష్టమ్మకు తొలిటీకా వేశారు. అందరికంటే ముందుగా టీకా వేసుకోవడం ఆనందంగా ఉందని, తాను ఏడాదిగా కరోనా వార్డులో రోగులకు సేవలందిస్తున్నట్టు ఆమె చెప్పారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను కాపాడేందుకు హెల్త్‌ కేర్‌ వర్కర్లు ఎంతో శ్రమించారని, అందుకే తొలిటీకా వారికే ఇచ్చామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు.

ఈ టీకా కార్యక్రమం విజయవంతం చేయడానికి, వ్యాక్సిన్‌ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఎదురయినా, తక్షణం చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో సకల చర్యలూ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో కేవిడ్‌ టీకా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. తొలిదశలో 139 కేంద్రాలలో 13,900 మందికి టీకా మందు అందించాలని నిర్ణయించారు. టీకా మందు అందించడానికి కేంద్రప్రభుత్వం కొన్ని ఆదేశిక సూత్రాలను జారీ చేసింది. దీని ప్రకారం ఖచ్చితంగా 18 ఏళ్ళ వయసుపైబడిన వారికి మాత్రమే టీకా ఇవ్వాలి. ఈ టీకా రెండుసార్లు వేయించుకోవలసి ఉంటుంది. మొదటిసారి ఏ కంపెనీ టీకా వేయించుకుంటే, రెండోసారి కూడా అదే కంపెనీ టీకా వేయించుకోవాలి. టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ, టీకా తీసుకున్నవారు కూడా కోవిడ్‌ నిబంధనలు పాటించక తప్పదు.

ప్రస్తుతం మన దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకా మందులు వినియోగిస్తున్నారు. ఈ రెండింటి వల్ల కూడా స్వల్ప దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. ఇంజక్షన్‌ చేయించుకున్నచోట నొప్పి, వాపు, తలనొప్పి, అలసట, ఒళ్ళునెప్పులు, జ్వరం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. అయితే, వీటివల్ల పెద్దగా భయపడనవసరంలేదని వైద్య నిపుణులు అంటున్నారు.

విస్తృత ఏర్పాట్లు

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను  ముందుగానే ఆదేశించారు. వ్యాక్సిన్‌ వేసిన తరువాత ఎవరికైనా రియాక్షన్‌ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభించడానికి ముందే మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి ముఖ్యమంత్రి తగు సూచనలు చేశారు. అనంతరం  టీకా కార్యక్రమం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

సీరం రూపొందించిన కోవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ ను సమర్థవంతమైన కోవిడ్‌ వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే మన రాష్ట్రంలో కూడా అందిస్తున్నారు. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్‌ వాడీ సిబ్బందితో సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత కోవిడ్‌ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బంది, తదితరులకు టీకాలు వేస్తారు. ఆ తర్వాత 50 ఏళ్ళు పైబడిన వారికి, ఆతర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకాలు అందించాలని నిర్ణయించారు.

వ్యాక్సిన్‌ ను అన్ని పి.హెచ్‌.సి ల పరిధిలో ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసింది. వ్యాక్సిన్‌ ను తరలించేందుకు కోల్డ్‌ చైన్‌ పాయింట్లు ఏర్పాటుచేశారు. రాష్ట్ర స్థాయిలో సి.ఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఈ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది.

ఇది ఇలా ఉండగా, రాష్ట్రంలో విద్యాసంస్థలను ఫిబ్రవరి నుంచి ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా తొమ్మిదవ తరగతి నుంచి ఆ పై తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు.