సిద్ధిపేట ఉప ఎన్నిక చెన్నారెడ్డిపై కొండా లక్ష్మణ్‌ విమర్శలు

సిద్ధిపేట శాసనసభ్యుడు వి.బి.రాజు రాజీనామా కారణంగా ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబరు 21 నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజు. కొద్దినెలల క్రితం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి తెలంగాణలో ఎన్నికలంటేనే చెమటలు పడుతున్నవి. హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలను జరపకుండా ప్రత్యేకాధికారిని నియమించిన విషయం తెలిసిందే. సిద్ధిపేటలో ఓటమిని తప్పించుకోవడానికి ఆ స్థానాన్ని కమ్యునిస్టులకు వదిలివేయాలని ముఖ్యమంత్రి భావించారు. ఈ మేరకు కమ్యునిస్టుపార్టీ నేతలకు హామీ ఇచ్చారు. సిద్ధిపేటలో మాజీ శాసనసభ్యుడు గురువారెడ్డికి మంచి పలుకుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి భావించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో వి.బి.రాజుపై పోటీచేసిన గురువారెడ్డికి 13వేల ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ మద్దతు గురువారెడ్డికి ఇస్తే ప్రజాసమితి గెలుపుకు అడ్డుకట్ట వేయవచ్చునని ముఖ్యమంత్రి భావించారు. తన సిట్టింగ్‌ స్థానాన్ని కూడా కమ్యునిస్టులకు వదిలి వేయాలని ముఖ్యమంత్రి భావించారంటే ప్రజాసమితికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్‌ చెన్నారెడ్డిపై కొండా లక్ష్మణ్‌ విమర్శ
సిద్ధిపేట ఉప ఎన్నికల గూర్చి అక్టోబర్‌ 13న కొండా లక్ష్మణ్‌ ఒక ప్రకటనను పత్రికలకు విడుదల చేస్తూ ‘ప్రత్యేక రాష్ట్ర వాదులకు అంగీకార యోగ్యమైన అభ్యర్థిని నిలబెట్టడానికి బదులుగా రాజకీయపక్షంగా మారిన సమితి అభ్యర్థిని నిలబెట్టడానికే డాక్టర్‌ చెన్నారెడ్డి పట్టుబడుతున్నారని’ అన్నారు. తెలంగాణ సమస్యలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఒక్కటే పరిష్కారమార్గం. మొదట అంతర్గతంగా ఉన్న శత్రువులను నిర్మూలించక పోతే గమ్యస్థానం వైపు మనం పయనించలేమని కొండాలక్ష్మణ్‌ బాపూజీ అన్నారు.

తెలంగాణ ఉద్యమం విషయంలో తెలంగాణా ప్రజలకు ప్రజాసమితి అధ్యక్షుడు చెన్నారెడ్డి ద్రోహం తలపెట్టాడని బాపూజీ చెన్నారెడ్డిపై తీవ్రమైన ఆరోపణ చేశారు. మెదక్‌జిల్లా పంచాయతీ ఎన్నికల్లో డాక్టర్‌ చెన్నారెడ్డి ప్రవర్తన పైన, ఆయన ముఠా తత్వ వైఖరికి, వ్యక్తి ఆరాధనకు, స్వార్థ పూరిత విధానాలకు సంబంధించిన ఇతర ఆరోపణల పైన బహిరంగ విచారణ జరపడానికిక సంసిద్దులు కావలసిందిగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ సవాల్‌ విసిరారు. ప్రజా సమితి నుంచి రాజీనామా చేసిన మెదక్‌జిల్లా ప్రజాసమితి నేతలకు డాక్టర్‌ చెన్నారెడ్డి కొన్ని దురుద్దేశాలు అంటగడుతున్నారని వెలువడ్డ ఆరోపణగూర్చి ప్రస్తావిస్తూ కొండా లక్ష్మణ్‌ పై విమర్శలు చేసారు.

ఏడుగురి నామినేషన్‌
సిద్ధిపేట ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన అక్టోబరు 21 నాటికి వివిధ పార్టీల నుంచి మొత్తం 7 నామినేషన్లు దాఖలైనాయి. కాంగ్రెస్‌ నుంచి పి.వి. రాజేశ్వర్‌రావు, కమ్యునిస్టుపార్టీ నుంచి గురువారెడ్డి, ప్రజా సమితి నుంచి మదన్‌మోహన్‌లు అధికార అభ్యర్థులు కాగా మిగిలిన నలుగురు ఇండిపెండెంట్లు.

అక్టోబరు 24న నామినేషన్ల ఉపసంహరణ రోజు నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించు కోవడంతో సిద్ధిపేట ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరగనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలపడం ముఖ్యమంత్రికి ఇష్టం లేకపోయిన త్రిముఖ పోటీలో కమ్యునిస్టులు ప్రజాసమితి ఓట్లు చీలుస్తారని, కాంగ్రెస్‌ అభ్యర్థికి, లేదా కమ్యునిస్టు అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అయనకు నచ్చచెప్పారు. ప్రజాసమితిని మాత్రం గెలవనీయ వద్దనేది ముఖ్యమంత్రి పట్టుదల.

ఉప ఎన్నికల్లో గెలుపు కై సి.ఎం.”అభివృద్ధి జపం” నిపుణుల కమిటీ ఏర్పాటు
సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ఎలాగైన ప్రజాసమితి గెలుపును ఆపడానికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి చేయని వ్రయత్నమంటూ లేదు. ఇన్నాళ్ళు 8 సూత్రాల పథకం ద్వారా తెలంగాణ సకల రంగాల్లో అభివృద్ధి చెందగలదని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల మనస్సులను పక్కదోవ పట్టించడానికి అక్టోబరు 30న నిపుణుల కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధికి బృహత్‌ పథకాన్ని రచించే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్లానింగ్‌, సహాకార శాఖల కార్యదర్శి ఛైర్మన్‌గా, ప్లానింగ్‌ శాఖ ఛైర్మన్‌ మెంబర్‌ సెక్రటరీగా, డాక్టర్‌ గౌతం మాథుర్‌ (ఉస్మానియా విశ్వ విద్యాలయ ఆర్థికశాస్త్ర శాఖాధిపతి), డాక్టర్‌ మంజూర్‌ ఆలం (ఉస్మానియా విశ్వవిద్యాలయ భూగోళ శాస్త్ర శాఖాధిపతి), ప్రొఫెసర్‌ ఖుస్రో, డాక్టర్‌ సీహెచ్‌ హన్మంతరావు(ఆర్థికాభివృద్ధి సంఘం, ఢిల్లీ), విఎల్‌ఎన్‌ రావు(ఢిల్లీ విశ్వవిద్యాలయ భూగోళశాస్గ్ర ప్రధానోపాధ్యాయుడు), డాక్టర్‌ వి.కె. చబ్బీమ్‌(ఎస్‌.ఐ.ఇ.టి. యూసూఫ్‌గూడ) సభ్యులుగా నిపుణుల కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ ప్రాంత ఆర్థిక స్థితిగతులను పరిశీలించి, అభివృద్ధికి ప్రాధాన్యతలను నిర్ణయించి, పథకాలను సిద్ధం చేయడానికి విధానాలు, పద్దతులను సూచించాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.కమిటీ నివేదిక పూర్తిచేయడా నికి గడువు నిర్ణయించలేదు. కానీ ఆరుమాసాల నుంచి ఏడాది కాలంలోపు పనిపూర్తి కాగలదని ముఖ్యమంత్రి ఆశాభావం ప్రకటించారు.

ఆంధ్రా తెలంగాణ వేర్పాటు అనివార్యం తెలంగాణ ప్రజా పరిషత్‌
నిపుణుల కమిటీ సూచించే అభివృద్ధి పథకాలతో తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేరని, ఆంధ్ర, తెలంగాణలు విడిపోవడమే ఉభయ ప్రాంతాలకు శ్రేయస్కరమని తెలంగాణ ప్రజా పరిషత్‌ నాయకులు సంతపురి. రఘువీర్‌రావు, ఎం.జగన్మోహన్‌ రెడ్డి, జి.పి.సక్సేనా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘పది సంవత్సరాల పాటు ఒకే పరిపాలనలో రాజకీయ నాయకత్వం కింద ఉండడం మూలాన ఉమ్మడి రాష్ట్రం రాకముందు ఉన్న స్నేహ సద్బావాలు పోయి పరస్పర విద్వేషాలు, అనుమానాలు రేకెత్తి రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా పెద్ద అగాథాలు ఏర్పడి పోయాయి. అని వారు పేర్కొన్నారు.

విడిపోవడం అనివార్యమైనపుడు త్వరగా విడిపోవడం ఉభయులకు మంచిదని అందుకు ఉభయ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని విడిపోవడం పట్ల రూపొందించడం అవసరమన్నారు. ఈ ఉద్దేశ్యంతో తాము ఆంధ్ర జిల్లాల్లో పర్యటన చేస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని పరిశీలించి తెలంగాణకు ఆంధ్ర నాయకత్వం వల్ల కలుగుతున్న అన్యాయం మూలంగా తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడమే వారికి క్షేమమని ఆంధ్రులకు నచ్చచెప్పాలని తమ ఉద్ధేశ్యమని వారు తెలిపారు.

తెలంగాణ ప్రజా పరిషత్‌ అంటే ఏమిటి ? అని ఒక విలేకరి ప్రశ్నించగా డాక్టర్‌ చెన్నారెడ్డిని మినహాయించిన తెలంగాణ ప్రజా సమితి అని వారు నిర్వచించారు. డాక్టర్‌ చెన్నారెడ్డి తెలంగాణ ప్రజల ప్రతినిధి కాదు, తెలంగాణ ప్రజలు ఆయన వెంట లేరు. ఆయన ఉద్యమాన్ని పెడదారి పట్టించి ప్రజలలో ఆంధ్రుల పట్ల విద్వేషాలు రేకెత్తించి విధ్వంస కార్యక్రమానికి దోహదం చేశారు. ఎన్నికల ద్వారా ప్రత్యేక తెలంగాణ ఏర్పడుతుందని మాకు నమ్మకం లేదు. ఆంధ్ర ప్రజలకు నచ్చచెప్పి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన సాగించి 1972 ఎన్నికలకు ముందుగానే ప్రత్యేక తెలంగాణ ఏర్పరచుకోవాలన్నది తమ ధ్యేయం అని వారు వివరించారు. అందుకు ఉభయ ప్రాంతాలలో విడిపోవడానికి కలిసి కట్టుగా స్నేహపూర్వకంగా ఆందోళన సాగించడం అవసరం అని వారు పేర్కొన్నారు.

సిద్ధిపేటలో కాంగ్రెస్‌ గెలుపుకై హోంమంత్రి జలగం ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇదిగో వస్తుంది. అదిగో వస్తుంది అని అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రజా సమితి నాయకుల మాటలకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మోసపోరని, సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌ లోనే అభివృద్ధి చెందగలమని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారని రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల శాఖామంత్రి జలగం వెంగళరావు అన్నారు. నవంబరు 1, 2 తేదీల్లో సిద్ధిపేట ఉప ఎన్నిక సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.

సిద్ధిపేట నియోజకవర్గంలోని 50 పంచాయతీల్లో నలభై పంచాయితీల సర్పంచ్‌లు కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి.రాజేశ్వర్‌రావును బలపరుస్తున్నారు. గాలివాటం తమకు ఎదురుతిరిగిందని గ్రహించిన తెలంగాణ ప్రజాసమితి నాయకులు తమ ప్రసంగాల్లో అదుపుతప్పి మాట్లాడుతున్నారు. నిరాశ, నిస్పృహ కలిగినప్పుడే దూషణ, ద్వేషము ప్రసంగాలలో వ్యక్తమవుతుందని వెంగళరావు అన్నారు.

సిద్ధిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ను బలపరుస్తున్న సుమారు 40 మంది సర్పంచ్‌లను ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు గెలిపించారని వెంగళరావు గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుకోసం ఎన్నికల ప్రచార సభల్లో పి.సి.సి. అధ్యక్షులు పి.నర్సారెడ్డి, మంత్రులు జి.సంజీవరెడ్డి, రాజనర్సింహ, ప్రాంతీయ సంఘ అధ్యక్షులు జె.చొక్కారావు తదితరులు పాల్గన్నారు.

తెలంగాణ ప్రజాసమితి సిద్ధిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అభ్యర్థి మదన్‌మోహన్‌ను గెలిపించాలని డాక్టర్‌ చెన్నారెడ్డి, వి.బి.రాజు, మల్లికార్జున్‌ ఇతర తెలంగాణ వాదులు ప్రచారం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వ్యతిరేక దినం

1970 నవంబరు ఒకటిన హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాసమితి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వ్యతిరేకదినం పాటిస్తూ సభ నిర్వహించింది. ఈ సభలో డాక్టర్‌ చెన్నారెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. దాని ధాష్టీకాలు రజాకార్లని మించి పోయినవి. తెలంగాణ ప్రజాస్వామ్యం తిరిగి నెలకొనాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపన ఒక్కటే గత్యంతరం. ఎప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని మన్నించక తప్పదు. రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని అన్నారు. సిద్ధిపేట ఉప ఎన్నికలో ప్రజాసమితి గెలుస్తుందని డాక్టర్‌ చెన్నారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వివేకవర్థిని కళాశాల ఆవరణలో జరిగిన ఈ సభకు బి.రాందేవ్‌ అధ్యక్షత వహించారు. తెలంగాణ నేతలు మల్లికార్జున్‌, జలీల్‌పాషా, ఆరిఫుద్దీన్‌, ఎం.ఎం.హాషీం, శాంతాభాయి తదితరులు ఈ సభలో ప్రసంగించారు.

-వి.ప్రకాశ్‌
(వచ్చే సంచికలో.. సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజాసమితి విజయం)