వెదజల్లే ‘వరి’ సాగు .. ఎంతో బాగు

  • సందీప్‌ రెడ్డి కొత్తపల్లి

తరాల తరబడి సాగునీటికి నోచుకోక వ్యవసాయాన్ని వదిలేసి ఉపాధి కోసం వలసవెళ్లిన తెలంగాణ రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రాకతో అత్యధిక శాతం వరి సాగుమీద దృష్టి సారించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి వానాకాలం, యాసంగి కలిపి 49.63 లక్షల ఎకరాల్లో ఉన్న వరిసాగు, 2021 నాటికి ఒక కోటీ 6 లక్షల ఎకరాలకు చేరుకున్నది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి ఏకంగా మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిరచడం చూస్తే తెలంగాణ రైతాంగం వరి సాగు మీద చూపుతున్న మక్కువ అర్ధమవుతుంది. 

ఈ వానాకాలం కూడా తెలంగాణ రైతాంగం ఇప్పటి వరకు 53.44 లక్షల ఎకరాలలో వరినిసాగు చేశారు. అయితే పేరుకుపోయిన ధాన్యం నిల్వల నేపథ్యంలో దొడ్డు వడ్లు కొనమని కేంద్రం స్పష్టం చేసింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వరి సాగు చేయాల్సి వస్తే సన్నరకాలను మాత్రమే సాగు చేయాలని, దొడ్డు రకాలను ఎట్టి పరిస్థితులలోనూ సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రైతులను కోరుతున్నది. సన్నరకాల పంటకాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి నారుమడి అవసరం లేకుండా పంటకాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలి. వరి సాగులో ముఖ్యంగా కూలీల కొరత రైతులను వేధిస్తున్నది. దానికి సరయిన ప్రత్యామ్నాయం వెదజల్లే పద్ధతి అని ప్రభుత్వం ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ పామ్‌, నూనెగింజలు, పప్పుగింజలను సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లుగా రైతులను కోరుతూ వస్తున్నది.

పొలం తయారీ

వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు నేలను కలియదున్నాలి. నాలుగు మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా చూసుకోవాలి. పొలాన్ని చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోవడానికి సులువుగా ఉంటుంది.

విత్తనం ఇలా వేసుకోవాలి

విత్తనం ఒకరోజు నానబెట్టిన తరువాత పొలంలో వెదజల్లుకోవాలి. ఎత్తుపల్లాలు ఉంటే నీరు నిలిచినచోట విత్తనం మొలకెత్తదు. అనంతరం 20 రోజుల వరకు నాలుగురోజులకోసారి నీరు పెట్టుకోవాలి. పొలం అంతటా విత్తనాలు మొలకెత్తిన అనంతరం మామూలుగా ఎప్పటి మాదిరిగా నీళ్లు పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో విత్తనం ఒకదానితో ఒకటి కలువకుండా దూరంగా పడటంతో మొక్క పిలకలు ఎక్కువగా వస్తాయి. వేర్లు బలంగా పెరుగుతాయి. చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది. పిలకలు బలంగా ఉండటంతో గాలివానలను తట్టుకుని నిలుస్తుంది.

డ్రమ్‌ సీడర్‌ పద్ధతి

డ్రమ్‌ సీడర్‌ ద్వారా విత్తనాలు విత్తినప్పుడు విత్తనాలు 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టిన గింజలను డ్రమ్‌ సీడర్లో వేసి విత్తుకోవాలి. డ్రమ్‌ సీడర్‌ కు 4 డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ములో 25 సెంటీమీటర్ల దూరంలో రెండు చివర్ల వరసకు 18 రంధ్రాలు ఉంటాయి. గింజలు నింపిన డ్రమ్‌ సీడర్‌ లాగినప్పుడు 8 వరసలలో వరస వరసకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి.

కలుపు యాజమాన్యం

వెదజల్లు పద్ధతిలో కలుపు యాజమాన్యం కీలకం. ఆరుతడి పద్ధతిలో నీటితడులు పెట్టడం మూలంగా కలుపు ఎక్కువగా పెరుగుతుంది. కలుపును నివారించడానికి విత్తనం వేసుకున్న మూడురోజుల్లో కలుపు మందును చల్లుకోవాలి. అనంతరం 25 రోజులకు మరొక్కసారి కలుపుమందు చల్లుకోవాలి. దీంతో కలుపు మొలకెత్తదు. కలుపుమందులు వేసుకోవడంతో కూలీల అవసరం రాదు. అయితే కలుపు నివారణ కోసం స్థానిక వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన మందులనే ఉపయోగించాలి. మార్కెట్లో వెదజల్లే పద్దతిలో కలుపు నివారణను అరికట్టే కలుపుమందులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. వెదజల్లే పద్ధతిలో ఏడు నుండి పది రోజులు ముందుగా కోతకు వస్తుంది. నాట్లు వేసే పని ఉండదు కాబట్టి ఎకరాకు రూ.2500 నుండి రూ.3000 పెట్టుబడి ఆదా అవుతుంది.

నారుమడి పద్ధతిలో ఎకరాకు 25-30 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. నారు పెరగడానికి 30 రోజుల సమయం పడుతుంది. నారు మడికి రూ. రెండువేలకు పైగా ఖర్చవుతుంది. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడానికి ఎకరాకు 12-15 కిలోల విత్తనం మాత్రమే అవసరమ వుతుంది. నాట్లకు, కలుపుతీతకు కూలీల ఖర్చు అసలే ఉండదు. వెదజల్లే పద్ధతిలో ప్రత్యేకంగా నారు పెంచే అవసరం ఉండదు కాబట్టి మామూలు సాధారణ సాగుకన్నా పంట త్వరగా కోతకు వస్తుంది. ఇది యాసంగిలో ఏప్రిల్‌, మే నెలలో వచ్చే వడగండ్లు, చెడగొట్టు గాలివానల నుండి పంట నష్టం జరగకుండా తప్పించుకోవచ్చు. సాధారణ రకాలు నారుమడితో కలుపుకుని 130 రోజులకు కోతకు వస్తే వెదజల్లే పద్ధతిలో 110 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. సాధారణంతో పోల్చితే 15 నుంచి 20 శాతం దిగుబడి పెరుగుతుంది. ముఖ్యంగా ఎకరానికి 8 నుంచి 10 వేల రూపాయల పెట్టుబడి ఖర్చులు మిగులుతాయి.