దళిత బంధు ఓ ఉద్యమం: అవగాహన సదస్సులో కె.సి.ఆర్‌.

‘‘తెలంగాణ దళిత బంధు పథకం’’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పు కోసం వచ్చే దిశగా దళితులు ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషిలో విద్యావంతులైన దళిత సమాజం కదిలిరావాలని సీఎం పిలుపునిచ్చారు.

దళితుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా దళిత బంధు పథకం అమలు సందర్భంగా మూడు దశలను పాటించాలన్నారు. అందులో భాగంగా దళితుల అసైన్డ్‌, గ్రామకంఠం తదితర భూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని, దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపరిచి, దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. హుజూరాబాద్‌ లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న తెలంగాణ దళిత బంధు పథకం విజయవంతం కోసం ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా పట్టు పట్టి పని చేయాలన్నారు. తద్వారా తెలంగాణతో పాటు దేశ దళిత సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడాలన్నారు. దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా, సామాజిక వివక్ష నుంచి కూడా దూరం చేసి వారి ఆత్మ గౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

‘‘తెలంగాణ దళిత బంధు పథకం’’పై ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీశ్‌ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.  

దళిత బంధు ఒక ఉద్యమం

ఈ సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ దళిత బంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు ఇదొక ఉద్యమం. హుజూరాబాద్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్‌ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి వుంటది. అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలి. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి విజయాన్ని సాధించి పెట్టింది. ప్రతి విషయంలో ప్రతీప శక్తులు ఎప్పుడూ వుంటాయి. మనం నమ్మిన ధర్మానికి కట్టుబడి మన ప్రయాణాన్ని మనం కొనసాగించినప్పుడే విజయం సాధిస్తం.’’ అన్నారు.

ఆర్థిక పటిష్టతతోనే వివక్షకు దూరం

‘‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించింది. మనిషిపై తోటి మనిషే వివక్ష చూపించే దుస్థితి మీద సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీ ద్వారా నేను కూడా అధ్యయనం చేశాను. మనలో కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోవాలె. పరస్పర విశ్వాసం పెరగాలె. ఒకరికొకరం సహకరించుకోవాలె. దళిత వాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను పోలీస్‌ స్టేషన్లలో వాపస్‌ తీసుకోవాలె. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలె. అప్పుడే మన విజయానికి బాటలు పడుతయి. దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరం అవుతారు. ఈ రోజు సదస్సులో పాల్గొన్న వాళ్లంతా, హుజూరాబాద్‌ లో విజయం సాధించి, ముందురోజుల్లో, తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలె. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే దళిత జాతి అభివృద్ధి జరుగుతది. దాంతోపాటే తెలంగాణ ఆర్థికాభివృద్ధికి కూడా దారులు వేస్తది. నైపుణ్యం, ప్రతిభ వున్న దళిత వర్గాన్ని, అంటరానితనం పేరుతో ఊరవతల వుంచి, ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్‌ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం కూడా దుర్మార్గం. ఇది తెలివి తక్కువ పనే.’’ అని సీఎం అన్నారు.

దళితులకు సర్కారు అండ

‘‘మనలో పులికి ఉండేంత శక్తి నిబిడీకృతమై వున్నది. ఆ శక్తిని గుర్తించి ముందుకు సాగాలి. విజయం సాధించాలంటే  దళారులు, ప్రతీప శక్తులను దూరం ఉంచాలి. దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో దోషులుగా తేలిన పోలీసులను ఉద్యోగంలోంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగించింది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నది.

తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. సర్కారే స్వయంగా అండగా వున్నప్పుడు విజయం సాధించేందుకు దళిత సమాజం పట్టుదలతో స్వీయ అభివృద్ధికి పూనుకోవాలి. ప్రభుత్వ వర్గాలతో పని తీసుకునే క్రమంలో ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు కాపలా వర్గంగా డేగ కన్నుతో పనిచేయాలి. దళిత బంధు పథకం పటిష్ట అమలుకు మమేకమై పనిచేయాలి’’ అని సీఎం అన్నారు.

ప్రభుత్వం లైసెన్సులిచ్చే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు

ఎరువుల దుకాణాలు, మెడికల్‌ షాపులు, రైస్‌ మిల్లులు, వైన్‌ షాపులు తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వుండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం వుండే ఇతర రంగాలను కూడా గుర్తించాలని, వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

శాశ్వత ప్రాతిపదికన ‘‘దళిత రక్షణ నిధి’’

‘‘దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా, ప్రభుత్వ – లబ్ధిదారుని భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన ‘‘దళిత రక్షణ నిధి’’ని ఏర్పాటు చేస్తం. ఈ నిధిని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీలతో నిర్వహించబడుతుంది. ప్రతీ ఏటా కనీస డబ్బును జమ చేస్తూ, దళిత రక్షణ నిధిని నిరంతరంగా కొనసాగిస్తూ, ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా వినియోగించుకుంటాం. మీ దగ్గరినుంచి ప్రసరించే విజయపు వెలుతురు తెలంగాణవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రసరించాలన్నదే నా ఆకాంక్ష.’’ అని సీఎం ఆకాంక్షించారు.

తెలంగాణ దళిత బంధు సదస్సులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ దళిత సమాజం ఆర్థిక సాధికారత కోసం వారి సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రక నిర్ణయం దళిత బంధు పథకం అని అన్నారు. హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా పథకం అమలు పర్యవేక్షణను పటిష్టంగా అమలు చేసి పథకాన్ని విజయవంతం చేయడంలో మనసుపెట్టి కృషి చేయాలని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు  పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడారు. తెలంగాణ దళిత బంధు పథకం కోసం సీఎం  కేసీఆర్‌ నిర్ణయం చరిత్రాత్మకమని దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో పనిచేస్తుందని అన్ని పథకాలను విజయవంతం చేసినట్టే దళిత బంధు పథకాన్ని కూడా విజయవంతం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం సీఎం దృక్పథానికి అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

దళిత వాడల్లో సమస్యలకు పరిష్కారం

దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళితబంధు పథకం అమలుతోపాటు, దళిత వాడల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలో వున్న గ్రామ కంఠాల భూముల వివరాల జాబితా తయారు చేయాలని, దళితులకే హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

హుజూరాబాద్‌లో వారం, పదిరోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి, అసైన్డ్‌ భూముల సమస్యలు సహా దళితులకు సంబంధించిన అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని, దళిత ప్రజల డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండిరగ్‌ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్‌ ఆఫీసుకు పిలిపించుకొని పరిష్కరించాలని కరీంనగర్‌ కలెక్టర్‌ కర్ణన్‌ను సీఎం ఆదేశించారు. దళితవాడల స్థితిగతులను తెలియజేసే విధంగా ప్రొఫైల్‌ తయారు చేయాలని ఆదేశించారు.

‘‘హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. వందకు వందశాతం అందరికీ ఇళ్ల సమస్య పూర్తి కావాలి. హుజూరాబాద్‌ లో ఖాళీ జాగలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తది. తెలంగాణ వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దీన్ని అమలు చేస్తాం. హుజూరాబాద్‌ నియోజకవర్గ దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుంది. అలాగే, రేషన్‌ కార్డులు, పింఛన్లు సహా అన్నిరకాల సమస్యలను, గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలి’’ అని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు సీఎం సూచించారు.

తెలంగాణలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళిత బంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

దళిత బంధు పథకంలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులుంటే సూచించాలని ప్రతినిధులను కోరిన సీఎం వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని వారిని అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకంపై మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారు? అని ముఖ్యమంత్రి వారిని ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం తెలంగాణ దళితుల పాలిటి వరం.. అని సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

‘‘దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందే అర్హులకు గుర్తింపు కార్డులను అందిస్తాం. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్‌ కోడ్‌ తో కూడిన ఎలక్ట్రానిక్‌ చిప్‌ ను ఐడెంటిటీ కార్డుల్లో చేర్చి పథకం అమలు తీరు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తాం.  నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటం. లబ్ధిదారుడు తాను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప, ఎవరినీ జారి పడనివ్వం.’’ అని సీఎం భరోసానిచ్చారు. సదస్సులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలు తెలిపారు.

ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా :

– రూరల్‌ (గ్రామీణ) ప్రాంతాల్లో.. మినీ డెయిరీ యూనిట్‌, పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలతోపాటు పవర్‌ టిల్లర్‌, వేపనూనె, పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలున్నాయి.

రూరల్‌ (గ్రామీణ), ఉప పట్టణ (సబ్‌ అర్బన్‌) ప్రాంతాల్లో.. వ్యవసాయ సాగు కొరకు యంత్ర పరికరాల సేల్స్‌, మట్టి ఇటుకల తయారీతోపాటు ఆటో ట్రాలీ, ట్రాక్టర్‌ మరియు ట్రాలీ, కోళ్ల పెంపకంతో పాటు ఆటో ట్రాలీ (సుగుణ, వెంకోబ్‌ ఫ్రాంచైసీ) పథకాలున్నాయి.

–  రూరల్‌ (గ్రామీణ), సబ్‌ అర్బన్‌ (ఉప పట్టణ), అర్బన్‌ (పట్టణ) ప్రాంతాల్లో.. సెవన్‌ సీటర్‌ ఆటో, ప్యాసింజర్‌ ఆటో రిక్షా, త్రీ వీలర్‌ ఆటో ట్రాలీ, విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్‌ హౌస్‌ తో సహా డెకొరేషన్‌, లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ తోపాటు, ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం మరియు వ్యాపారం, ఆయిల్‌ మిల్‌, పసుపు, కారం, బియ్యం, పిండి గిర్నీల పథకాలున్నాయి.

– సబ్‌ అర్బన్‌ (ఉప పట్టణ), అర్బన్‌ (పట్టణ) ప్రాంతాల్లో.. ప్రయాణీకులు/సరుకుల రవాణాకు నాలుగు చక్రాల వాహనం, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ సేల్స్‌, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ మరియు మెడికల్‌ షాప్‌, ఎలక్ట్రికల్‌ షాప్‌, బ్యాటరీ సేల్స్‌ అండ్‌ సర్వీసెస్‌, హార్డ్‌ వేర్‌ సానిటరీ షాప్‌ తోపాటు ఆటో, సిమెంట్‌ ఇటుకలు/ రింగుల తయారీ ప్రీ కాస్టింగ్‌ స్ట్రక్చర్‌ తోపాటు ఆటో ట్రాలీ, సెంట్రింగ్‌/ఆర్‌.సి.సి. రూఫ్‌ మేకింగ్‌ (స్టీల్‌, వుడెన్‌), కాంక్రీట్‌ రెడీ మిక్స్‌ తయారీ యంత్రం, అక్రిలిక్‌ షీట్స్‌, టైల్స్‌ వ్యాపారంతోపాటు ఆటో ట్రాలీ పథకాలున్నాయి.

– హోటల్‌, క్యాటరింగ్‌ (ధాబా)తోపాటు ఆటో ట్రాలీ, ఐరన్‌ గేట్స్‌, గ్రిల్స్‌ తయారీ యూనిట్‌ తో పాటు ఆటో ట్రాలీ, మెడికల్‌ – జనరల్‌ స్టోర్స్‌ (ప్రభుత్వ అనుమతితో), మినీ సూపర్‌ బజార్‌, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్‌ లైన్‌ సర్వీస్‌, ఫొటో స్టుడియో, బిల్డింగ్‌ మెటీరియల్‌ స్టోర్స్‌/హార్డ్‌ వేర్‌, మార్బుల్‌, పాలిషింగ్‌ / గ్రానైట్‌ కటింగ్‌ / పీఓపీ, ఫుడ్‌ రెస్టారెంట్‌, సిమెంట్‌ / స్టీల్‌ దుకాణం (సబ్‌ డీలర్‌ షిప్‌), పశువులు, కోళ్ల దాణా తయారీ కేంద్రంతో పాటు ఆటో ట్రాలీ, చెప్పులు/లెదర్‌ గూడ్స్‌ షాపు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రోన్‌ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ అనుమతులతో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం 2 ఆటో ట్రాలీలను అందించే పథకాలున్నాయి.

– పట్టణ (అర్బన్‌) ప్రాంతాల్లో.. మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ (4 వీలర్స్‌), క్లాత్‌ ఎంపోరియం – టెక్స్‌ టైల్‌, రెడీమేడ్‌ గార్మెంట్స్‌ షోరూం, పేపర్‌ ప్లేట్స్‌/గ్లాసెస్‌, బ్యాగ్స్‌, తయారీ యూనిట్‌ (ఆటో ట్రాలీతో కలిపి), కార్‌ టాక్సీ (క్యాబ్‌), ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, లేడీస్‌ ఎంపోరియం, కిచెన్‌ వేర్‌ – ఫర్నీచర్‌ షాప్‌ (సేల్స్‌, సర్వీస్‌), ఫ్లెక్సీ, వినైల్‌ డిజిటల్‌ ప్రింటింగ్‌ (ఆటో ట్రాలీతో కలిపి), డిజిటల్‌ ఫొటో స్టూడియో – ల్యాబ్‌, ఆటో మొబైల్‌ షాప్‌-సర్వీసింగ్‌ యూనిట్‌, డిస్పోజబుల్‌ పేపర్‌ ప్లేట్స్‌, గ్లాసెస్‌, పేపర్‌ న్యాప్కిన్స్‌ సేల్స్‌ షాపు మొదలైన పథకాలున్నాయి.

సదస్సులో ముఖ్యాంశాలు :

– దళితబంధు అవగాహన సదస్సు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా సాగింది.

– ఈ పథకం కింద ఏం పెట్టుకుంటే బాగుంటుందని పలువురు ప్రతినిధులు సదస్సుకు ముందే తమ కుటుంబాలతో చర్చించుకొని వచ్చినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పడంతో సీఎం సంతోషించారు.

– సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు పలు సందేహాలను సీఎం కేసీఆర్‌ను అడిగి నివృత్తి చేసుకున్నారు.

– భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి  కేసీఆర్‌.. సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

– ఘుమఘుమలాడే మాంసాహార, భోజనాలను సుమారు 500 మందికి వడ్డించారు.

– వారి వారి భవిష్యత్‌ రంగాల్లో చర్చించుకోవడం సీఎం కేసీఆర్‌ను ఆకర్షించింది.

– ప్రతి ఒక్కరిలో ఒక పులిలాంటి శక్తి దాగి ఉంటుందని, గొర్రెల మందలో పెరిగిన పులి కథను సీఎం చెప్పారు. ఈ సందర్భంగా సభలో నవ్వులు వెల్లి విరిశాయి.

– పైరవీకారుల మీద రామాయణం’ కథ చెప్పిన సీఎం.. వారిని దూరం పెట్టాలనడంతో సభలో నవ్వులు విరిశాయి.

– 17 వేల పొదుపు సంఘాలను తయారు చేసిన బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్‌ హాష్మీ విజయగాథ ను చెప్పినపుడు సభికులు ఎంతో స్ఫూర్తితో ఉత్తేజితులయ్యారు.

– సదస్సులో సీఎం సలహాలు, సూచనలతో ప్రతినిధులు, అధికారులు ఉత్తేజం పొందారు.

– పలు సమస్యలను ప్రతినిధులు ప్రస్తావించగా, వాటిని పరిష్కరించా లని సీఎం అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలిచ్చారు.

–  పైలట్‌ ప్రాజెక్టుగా దళిత బంధును హుజూరాబాద్‌లో విజయవంతం చేస్తామని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు విశ్వాసం ప్రకటించారు.