ఆత్మగౌరవానికి ప్రతీక ‘దళిత బంధు’
By:- మామిండ్ల దశరథం
నిన్న కూలీలు.. నేడు యజమానులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సంవత్సరం ‘దళిత బంధు’ పథకంలో భాగంగా వెటర్నరీ రంగంలో 49, పరిశ్రమల రంగంలో 46, ఇతర రంగాల్లో 110, మొత్తం 205 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాష్ట్ర మంత్రి కే. తారక రామారావు మార్గదర్శనం మేరకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలోని అధికారుల బృందం ప్రతి లబ్ధిదారునితో ప్రత్యేకంగా సమావేశమై ఫ్లోర్ మిల్, మొబైల్ రైస్ మిల్, దాల్ మిల్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్రోల్ బంక్, ఫిష్ కల్చర్, కాంక్రీట్ మిల్లర్, సిమెంట్ బ్రిక్స్, రైస్ మిల్, రైస్ డిపో, మెడికల్ షాప్, ఎలక్ట్రానిక్ గూడ్స్ షోరూం, సూపర్ మార్కెట్ వంటి లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకునేలా మార్గదర్శనం చేసింది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు పథకాల గ్రౌండింగ్ పూర్తి చేశారు. మిగతా లబ్ధిదారులకు పథకాల గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ దళిత బంధు కార్యక్రమం దళిత వాడల్లో నెలకొన్న దారిద్య్రాన్ని సమూలంగా పారదోలబోతున్నది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మహాశయుడి ఆశయాలకు ప్రతిబింబమై, అణగారిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
ఎలక్ట్రానిక్ షాప్ తో జీవితం బాగువడ్తతి

నలభై ఏండ్లు కూలీనాలీ చేసుకుంటూ బతుకులు వెళ్లదీస్తున్నం. ఎలక్ట్రానిక్ షాప్ కు ఓనర్ అయితనని జన్మల కూడ అనుకోలే. మాటల్లో చెప్పలేకపోతున్న. కేసీఆర్ సారు ఇచ్చిన పైసలతో మహేంద్ర పేరుతో కొత్త ఎలక్ట్రానిక్ షాప్ పెట్టా. గిరాకీ బాగుంది. మా లేమికి దళిత బంధు మందులా పని చేస్తుంది.
- కడకుంట్ల దుర్గవ్వ, వర్దవెల్లి గ్రామం, బోయినీపల్లి మండలం
కొత్త జీవితం మొదలెడతాం

నేను చిన్నప్పటి నుంచి కూలీకి పోతున్న. దళిత బంధు పైసలతో కుటుంబానికీ సెంట్రింగ్ సామాను, కాంక్రీట్ మిక్సర్ యూనిట్ తీసుకున్న. కూలీలుగానే జీవితం వెళ్ళదీసిన మేము కేసీఆర్ దయతో యజమానులుగా మారాం. ఇప్పుడు నేనే పని ఇప్పిస్తున్న.
- బొద్దు రాజవ్వ, పదిర గ్రామం, ఎల్లారెడ్డి పేట మండలం
మా బతుకు ‘‘చిత్రం’’ మారింది.

ఫోటోగ్రఫీ రంగంతో పరిచయం ఉంది. డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. దళిత బంధు పైసలతో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాం. గిరాకీ మంచిగా ఉంది. మేమే స్టూడియో ఏర్పాటు చేసుకున్నాం అంటే మాకు నమ్మబుద్ధి కావడం లేదు. దళిత బంధుతో మా బతుకు చిత్రం మారింది. సీఎం కేసీఆర్ సార్కు, మంత్రి కేటీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
- రామంచ రజిత, వర్దవెల్లి గ్రామం, బోయినీపల్లి మండలం
ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నాం.

దళిత బంధు పథకంతో మా దశ మారింది. నిత్యం చిన్నచితకా పనులు చేస్తే తప్ప జీవితం గడవని పరిస్థితుల్లో ‘దళిత బంధు’ నిధులతో కనకదుర్గ పేరుతో రైస్ డిపో పెట్టుకున్నాం. మంచిగా నడుస్తోంది. అందరిలాగే మేము కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. కేసీఆర్ సార్ దయవల్లే ఇది సాధ్యమైంది.
- మ్యాకల కనుకవ్వ, గండి లచ్చపేట గ్రామం, తంగళ్ళపల్లి మండలం
వ్యాపారవేత్తలుగా మారాం.

నిత్యం కూలి పని చేసుకుంటూ పొట్ట పోసుకొని జీవించే మేము నేడు వ్యాపారవేత్తలుగా మారాం అంటే దళిత బంధు పథకం ఫలితమే ఇది. పెట్టుబడికి డబ్బులు లేక కూలి పనులు చేసుకుంటూ జీవించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పైసలతో సూపర్ మార్కెట్ పెట్టుకున్నాం. వ్యాపారవేత్తలుగా రాణించి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నమ్మకాన్ని నిలబెడతాం.
- దయ్యాల ప్రశాంత్, మర్రిగడ్డ గ్రామం, చందుర్తి మండలం
దళిత బంధుతో ఉన్నత స్థితికి

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలకు మెరుగైన, నిలకడైన, ఆదాయం లభించడం కోసం, అందుకు కావాల్సిన పెట్టుబడి అక్షరాలా పదిలక్షల రూపాయల భారీ మొత్తాన్ని ఈ పథకం ద్వారా ప్రభుత్వమే సమకూరుస్తోంది. పదిలక్షల రూపాయల పెట్టుబడి మొత్తం వంద శాతం గ్రాంట్ రూపంలో అందజేస్తుంది. లబ్ధిపొందే కుటుంబ మహిళ పేరున ఉన్న ఖాతాలో ఈ డబ్బు మొత్తం జమచేస్తున్నాం. గ్రాంట్ రూపంలో ఇస్తున్నారు కనుక తిరిగి చెల్లించవలసిన అవసరం ఉండదు. అప్పు కట్టాలనే బాధ ఆ కుటుంబాన్ని వెంటాడదు. జిల్లాలో మంత్రి కే. తారక రామారావు మార్గదర్శనం మేరకు లబ్ధిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకునేలా గైడ్ చేశాం. ఇప్పటికే యూనిట్లను స్థాపించిన లబ్ధిదారులు యూనిట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ జీవన అవసరాలకోసం వినియోగించుకుంటున్నారు. మిగిలింది పొదుపు చేసుకుంటున్నారు. దళితులందరికీ దశలవారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఈ పథకంతో క్రమేణా పేద షెడ్యూల్ కుటుంబాలు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు దళిత బంధు పథకం ఉపకరిస్తుంది.
- అనురాగ్ జయంతి, జిల్లా కలెక్టర్, రాజన్న సిరిసిల్ల