1200 కోట్లతో దళిత సాధికారత

‘‘దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతీ ఒక్కరినీ కలచి వేసే విషయం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. ఐనా ఇంకా దారిద్య్రరేఖకు దిగువన, బాటమ్‌ లైన్లో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన నడిపించడమే ప్రధాన ధ్యేయంగా 1200 కోట్ల రూపాయలతో ‘సీఎం దళిత సాధికారత పథకం’ ప్రవేశపెడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.

సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అనీ, నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయనీ, అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులేనని ఆయన అన్నారు. ఈ బాధలు పోవాలని సీఎం ఆకాంక్షించారు. 

ప్రగతిభవన్‌ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశం పై దళిత ప్రజాప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పలు పార్టీలకు చెందిన పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 

‘‘దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలిగి పోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ‘‘మేము కూడా ముందుకు పోగలం’’ అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్షం సూచనలు చేయాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలుపరుద్దాం. నిధుల బాధ్యత నాది. పార్టీలు రాజకీయలకు అతీతంగా సమష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనమందరం తీసుకుందాం’’ అని సీఎం అఖిలపక్షానికి సూచించారు. 

‘‘రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా చేయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలను మొట్టమొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసైన్డ్‌ ల్యాండ్స్‌ ఎన్ని ఎకరాలున్నాయి? ఇందులో ఉన్నదెంత? పోయిందెంత? లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎస్సీ భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. రాష్ట్రమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదే సిద్ధం చేసుకోవాలి. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం గా వుంది. ఇందుకు సంబందించిన సమష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలె..’’ అని సీఎం స్పష్టం చేశారు. 

కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం అభివృద్ది చెందడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూమిమీద ఆధారపడి జీవనోపాధి రోజు రోజుకు పెరుగుతున్నదని సీఎం అన్నారు. పట్టణాల్లో మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి కోసం అన్వేషించాలని సూచించారు. గోరేటి వెంకన్న ‘గల్లీ చిన్నది..’ పాట ను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని సీఎం అన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలనీ, దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమష్టి కృషితో సమాధానాలు సాధించాలని సీఎం సూచించారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్‌ ఎంపవర్‌ మెంట్‌ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలను కుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. 

రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల  మాదిరి నేరుగా లబ్దిదారులకు ఆర్థిక సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను సీఎం కోరారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలన్నారు. అట్టడుగున వున్న వారి నుంచి సహాయం ప్రారంభించి, వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సీఎం తెలిపారు.  

‘‘ఈ బడ్జెట్‌లో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకానికి రూ.1200 కోట్లు కేటాయించాం. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ కేటాయింపులు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కు అదనం. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్‌ మోడ్‌ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నది. మీరందరూ కలిసి రావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి, సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే నా దృఢ సంకల్పం’’ అని అఖిలపక్షాన్ని ఉద్దేశించి సీఎం అన్నారు. 

‘‘సఫాయన్న నీకు సలాం అన్న’’ అనే నినాదం నాది.  సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్‌ చేయకున్నా ప్రతీసారీ వాళ్ళ జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామని అఖిల పక్షంలో వచ్చిన అభ్యర్థన మేరకు సీఎం తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కూడా ఇదే సందర్భంలో సీఎం అన్నారు. 

‘‘అద్దాల అంగడి మాయా లోకం మోపైంది. ఈ పోటీ ప్రపంచం, కరోనా నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎటువంటి బ్యాంకు గ్యారంటీల జంఝాటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం ద్వారా కడునిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తాం’’ అని సీఎం హామీ ఇచ్చారు.  

రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలుగా విడదీసి గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటికి పరిష్కార మార్గాలను చూడాలన్నారు. ఇప్పుడు అమలులోవున్న స్కీమ్‌ లను కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని వర్తింప జేయనున్నట్టు సీఎం తెలిపారు. గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రవేశపెట్టాల్సిన స్కీంలను వాటి వివరాలను లబ్ధిదారుల గైడెన్స్‌ కోసం తయారుచేసి అందించాలన్నారు.

– గ్రామీణ ప్రాంతాలలో చేయదగిన స్కీమ్‌ లు, డెయిరీ, తదితర స్వయం ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్‌ ఇచ్చే మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు. 

– లబ్ధిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన స్కీమ్‌ లను ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలి. దీని కోసం మండలస్థాయిలో ఒక అధికారి ఉండాలి. ఇందుకు సంబంధించి ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలె. అధునాతన సాంకేతిక విధానాలను అవలంభించి ప్రతీ లబ్ధిదారునికి ఒ కార్డును అందజేయాలె. బార్‌ కోడ్‌ ను కేటాయించి లబ్ధిదారుని పూర్తి వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ఆన్‌ లైన్‌లో అందుబాటులో ఉంచాలి. అని సీఎం అన్నారు. 

– ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్‌ తయారుచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ను సీఎం ఆదేశించారు. 

– సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీతో, దళిత విధ్యార్థుల కోసం, హై క్వాలిటీ స్టడీ సర్కిల్స్‌ను ఎన్ని సెంటర్‌లలో పెట్టగలమో పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీటిని రూపొందించాలనీ, ఖర్చు ఎంతయినా ఫరవాలేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సెంటర్ల ద్వారా సివిల్‌ సర్వీసెస్‌ తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలని సీఎం ఆదేశించారు.

– దళిత రైతుబంధు లబ్ధిదారుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు

– బాటమ్‌ లైన్‌లో ఉన్న దళితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

– గ్రామీణ దళితులు, పట్టణ దళితుల అభివృద్ధి, దళిత యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు స్టడీ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం.

– పెండింగులో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి.

– గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా వర్తిస్తుందని సీఎం తెలిపారు. 

– భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకి కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చెప్పారు.

– దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన సభా సంఘం బాధ్యత తీసుకోవాలి.

– దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

– సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి కలిగించాలి.

– ఇక నుండి దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం ఆమోదం తెలిపారు. 

– సమగ్ర దృక్పథంతో తెలంగాణ దళిత సమాజ సమగ్రాభివృద్ధి కోసం అఖిల పక్షం కీలక నిర్ణయాలు తీసుకున్నది. 

– సీఎంఓలో దళిత సాధి కారత విషయంలో ప్రత్యేక అధికారిని నియమిస్తామని సీఎం తెలిపారు.

– ఇదే అంశం మీద ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి పదిరోజుల పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలని సీఎం ఆదేశించారు.  

– దళితులకు వందశాతం డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల కేటాయింపు అనే అంశం మీద ఒక వ్యాహం రూపొందిస్తామని సీఎం తెలిపారు.

– దళితసాధికరత అమలు కోసం రిటైర్డు దళిత ఉద్యోగులు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు.

కుటుంబానికి 10 లక్షలు

స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ధి దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్‌ గా, యూనిట్‌ ఒక్కింటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయడం ద్వారా, అందజేయాలని అఖిలపక్ష సమావేశం సమష్టి నిర్ణయం తీసుకున్నది. 

మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు గాను 1200 కోట్లతో ‘‘సీఎం దళిత సాధికారత పథకం’’ ప్రారంభం చేయాలని, ఎంపిక చేయబడిన బాటమ్‌ లైన్‌లో వున్న కడుపేద దళిత కుటుంబానికి (రైతు బంధు పథకం మాదిరి) నేరుగా అందచేయాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచ బోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’ దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేయనున్నదనీ, దళిత జనోద్ధరణకు సీఎం ఆలోచనలు, ఇప్పటికే అమలుపరుస్తున్న కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, దళిత సాధికారత పథ కంతో మరింత గొప్పగా దళితుల జీవితాలు మారు తాయనీ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడిరది.

తెలంగాణ సమాజం మొత్తంగా దళిత సమాజం వెన్నుదన్నుగా నిలబడి దళితుల ఆత్మన్యూనతను పోగొట్టి, ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారి ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పులకు దోహదపడాలనీ, అందులో భాగస్వామ్యం పంచుకోవాలనే సదుద్దేశంతో అన్ని పార్టీలను పిలిచి, రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని సీఎం అన్నారు.