దళిత జనాభ్యుదయం
అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ‘దళితబంధు’ పేరిట మరో అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టారు. దారిద్యంతోపాటు, తరతరాలుగా సామాజిక వివక్షకు గురవుతున్న దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఈ దళితబంధు పథకం తొలిదశలోనే ప్రకంపనాలను సృష్టిస్తోంది. మిగిలిన పథకాల వలెనే ఇది కూడా దేశానికే ఆదర్శంగా అమలుపరచి తీరాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. దృఢ సంకల్పంతో ఉన్నారు.
దళితబంధు పథకాన్ని తొలిసారిగా తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో 76 మంది దళితులకు ముఖ్యమంత్రి చేతులు మీదుగా మంజూరుచేశారు. ఇందుకు అవసరమైన ఏడు కోట్ల 60 లక్షల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది దళితులను ఎంపికచేసి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలుత పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకుగాను మొత్తం 2,000 కోట్ల రూపాయలు వరకూ వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. దీనికి సంబంధించి ఇప్పటికే 2000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
దళితులు కూడా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ధనికులుగా మారాలని ఇప్పటికే పలు రాయితీలు అందిస్తున్న రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకం క్రింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తంతో లబ్ధిదారుడు ఉపాధి కల్పించే ఏదైనా వ్యాపారమో, ఆదాయం సమకూరే మరేదైనా కార్యక్రమమో స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. కొంతమంది లబ్ధిదారులు కలసి పెద్ద మొత్తం పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకొనే అవకాశం కూడా ఉంది.అవసరమైన వారికి ప్రభుత్వ అధికారులు కావలసిన సూచనలను, సలహాలను అందిస్తారు.ఇప్పటికే వీరు చేపట్టదగ్గ కొన్ని పథకాలను ప్రభుత్వం ప్రకటించింది.
కేవలం కుటుంబానికి 10 లక్షల రూపాయలు సమకూర్చడంతోనే ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం భవిష్యత్తులో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రక్షణ కవచంగా దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తోంది. లబ్ధిదారుని నుంచి సేకరించిన 10 వేల రూపాయలకు తోడు, ప్రభుత్వం మరో 10 వేల రూపాయలు కలిపి ఈ నిధిని ఏర్పాటుచేస్తోంది. ఈ పథకం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి సూచనలు కూడా స్వీకరించింది. దళితబంధు అమలు, దళిత రక్షణ నిధి నిర్వహణలను పర్యవేక్షించడంలో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పటిష్ట యంత్రాంగాన్ని కూడా రూపొందించింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మానస పుత్రికగా భావిస్తున్న దళితబంధు పథకంతో దళితులు సమాజంలో ఇక ధనికులుగా ఎదగాలన్న ఆయన ఆకాంక్ష త్వరితగతిన నెరవేరాలని ఆశిద్దాం.