|

హార్వెస్టర్‌కు యజమానులైన తల్లీ, బిడ్డ… కూలీలను యజమానులుగా మార్చిన ‘దళిత బంధు’

By: యం. అబ్దుల్ కలీం

నిన్నటి వరకు వ్యవసాయ కూలీలుగా పనిచేసిన మన్యాల రాధమ్మ-అయిలయ్య, చిత్తారి సుమలత- రాజేందర్‌ దంపతులు నేడు ‘దళిత బంధు’ పథకం మంజూరుతో హార్వెస్టర్‌కు యజమానులుగా మారారు. హార్వెస్టర్‌ ద్వారా ఖర్చులు పోనూ రోజుకు 12 వేల ఆదాయం పొందుతున్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల రాధమ్మ-అయిలయ్య, చిత్తారి సుమలత- రాజేందర్‌ దంపతులు నిన్న మొన్నటి వరకు గ్రామంలో ఉన్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఇతరుల పొలాలలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవించేవారు. కడు పేదరికంలో ఉన్న వీరు జీవన పోరాటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాజంలో అత్యంత దుర్భరమైన జీవితం గడుపుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద లబ్దిదారులకు వారికి ఉన్న అనుభవం, అభిరుచి, నైపుణ్యత గుర్తించి వారు కోరుకున్న స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకొనుటకు దళిత బంధు పథకం కింద ఒక్కొక్క యూనిట్‌ కు  10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేసినారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద ఇంతవరకు 8,186 మంది లబ్దిదారులకు 7,202 యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్‌ చేశారు. ఇందులో 6574 మంది లబ్దిదారులకు వ్యక్తిగత యూనిట్లు, 129 మంది లబ్దిదారులకు రిటేల్‌ సెక్టార్‌లో గ్రూప్‌ యూనిట్లు, 1483 మంది లబ్దిదారులకు ట్రాన్స్‌ పోర్ట్‌ సెక్టార్‌ లో గ్రూప్‌ యూనిట్లు అందించారు.  1544 మినీ డైయిరీలు, 1326 గూడ్స్‌ వెహికిల్స్‌, 729 ట్రాక్టర్లు, ట్రాలీలు, 559 సెంట్రింగ్‌ యూనిట్లు, 485  ఫోర్‌ వీలర్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌, 353 మినీ సూపర్‌ బజార్లు, 267 హార్వెస్టర్లు, 108 జే.సి.బీ.లు, 113 డి.సి.యం. వాహనాలు, 238 టెంట్‌ హౌజ్‌, డెకరేషన్‌ షాపులు, 139 ఐరన్‌ షాపులు, 138 ఎలక్ట్రికల్‌ షాపులు, 125 ఫోటో స్టూడియోలు, 98 కిరాణం అండ్‌ జనరల్‌ స్టోర్లు, 150 బట్టల దుకాణాలు, 45 అల్యూమినియం షాపులు, 54 మీ సేవ కేంద్రాలు, 35 ఆటో మొబైల్‌ స్టోర్లు, 53 ఫుట్‌ వేర్‌ (చెప్పుల దుకాణం),  34 పేయింటింగ్‌ షాపులు, 71 ఫౌల్ట్రీ ఫారం, మొదలగు యూనిట్లను మంజూరు చేసి గ్రౌండింగ్‌ చేశారు.

 ఈ పథకం కింద సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల రాధమ్మ-అయిలయ్య, చిత్తారి సుమలత- రాజేందర్‌ దంపతులకు గత మార్చి నెలలో రెండు యూనిట్లకు గాను ఒక్క హార్వెస్టర్‌  మంజూరు అయింది. ప్రస్తుతం రబీ వరి పంటకోత సీజన్‌ అయినందున గత 20 రోజుల నుండి హార్వెస్టర్‌ రోజుకు 10 గంటల చొప్పున పనిచేస్తున్నది. వరికోత మిషన్‌ హార్వెస్టర్‌ కు ఒక గంటకు రూ. 1800 చొప్పున రోజుకు రూ. 18,000 నుండి  రూ. 20,000 వరకు ఆదాయం గడిస్తున్నారు. హార్వెస్టర్‌ పై నలుగురు పనిచేసే వారి కూలీ మరియు డీజిల్‌ ఖర్చులు రోజుకు రూ.8,000 పోగా రోజుకు రూ.10,000 నుండి రూ.12,000 వరకు ఆదాయం పొందుతున్నారు.

గతంలో ఒకరికి వ్యవసాయ కూలీలుగా పనిచేసిన వీరు ప్రస్తుతం దళిత బంధు పథకం కింద మంజూరైన హార్వెస్టర్‌ ను నడిపించుకుంటూ నలుగురికి ఉపాధి కల్పించుటతో పాటు హార్వెస్టర్‌కు యజమానులుగా మారారు. ఇంతవరకు  ఈ హార్వెస్టర్‌ ద్వారా ఖర్చులు పోనూ నెలకు రూ.4,00,000 ఆదాయం పొందినట్లు వారు తెలిపారు. ఈ హార్వెస్టర్‌ ఖరీఫ్‌, రబీ సీజన్‌లో 45 రోజుల చొప్పున పూర్తిస్థాయిలో వరికోతలకు పనిచేస్తుందని వారు తెలిపారు. వరికోత లేని సమయంలో హార్వెస్టర్‌ నుండి ట్రాక్టర్‌ ను వేరు చేసి భూములు చదును చేయుట, పొలం దున్నుట, ఇతర పనులకు కూడా ఉపయోగించుకుంటూ రోజూవారి ఆదాయం పొందుతామని వారు తెలిపారు.

‘‘మేము హుజురాబాద్‌ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వాళ్లం. నాకు ముగ్గురు ఆడపిల్లలు, మాకు ఉన్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోని ఇతరుల పొలాలకు వ్యవసాయ కూలీలుగా వెళ్లి పనులు చేసేవారం. ఎంతపనిచేసినా వచ్చే కూలీ డబ్బులతో అతికష్టంగా జీవనం గడిపే వారం. సమాజంలో అతిపేదరికంలో జీవిస్తున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపుటకు ఎంతో పెద్ద మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద మా కూతురు చిత్తారి సుమలతకు ఒక యూనిట్‌,  నాకు ఒక యూనిట్‌ రెండు యూనిట్లు కలిపి గ్రూప్‌ యూనిట్‌ కింద 20 లక్షలతో హార్వెస్టర్‌ కొనిచ్చారు. ఈ హార్వెస్టర్‌ వచ్చిన నాటి నుండి మా జీవితాలే మారిపోయాయి. ఎంతో దుర్భర జీవితం గడిపే మాకు ఎలాంటి పెట్టుబడు లేకుండా వచ్చిన హార్వెస్టర్‌ తో ప్రతిరొజు అధిక ఆదాయం పొందుతూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆలోచన విధానాలు అమలు చేస్తూ  దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘‘దళితుల పాలిట దేవుడు మా కే.సి.ఆర్‌.’’ ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌.కు మా కుటుంబ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉంటామని, అట్టి రుణాన్ని తీర్చుకోలేం’’.