మహోద్యమంగా దళితబంధు

  • హుజూరాబాద్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌కు 200 కోట్లు

దళితబంధు కార్యక్రమం మహోద్యమంగా ముందుకు సాగాలని, అందుకు దళిత మేధావులు, రచయితలు, కవులు, విద్యార్థులు నడుం బిగించి కార్యరంగంలోకి దూకాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు విరజిమ్మాలంటే, వారు ఆర్థిక స్వావలంబన దిశగా  ముందుకు సాగాలంటే ఈ పథకం నూటికి నూరుపాళ్ళు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘దళితబంధు’ పథకాన్ని ఆయన కరీంనగర్‌జిల్లా హూజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లి ఇందిరానగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ముందుగా వేదికపై ఉన్న అంబేద్కర్‌, జగ్‌జ్జీవన్‌రాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

సమాజంలో అణగారిన వర్గాలైన దళితులను ఆర్థికంగా, సామాజికంగా పైకితెచ్చి వారు తలెత్తుకుని తిరిగే విధంగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. దళితవాడలు బంగారు మేడలవ్వాలి, దళితజాతి రత్నాలను, దళితుల శక్తిని బయటకు తీయాలన్నది తమ సంకల్పమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంవత్సరం ముందే ఈ పథకం అమలు జరగాల్సిందని, కరోనా కారణంగా వాయిదా పడిందని సీఎం పేర్కొన్నారు. ఉన్నవారు, లేనివారు, ఉద్యోగస్థులు, వ్యాపారస్తులు అనే తేడా లేకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ఇందులో లబ్ధిదారుల ఎంపిక అంటూ ఉండదని స్పష్టం చేశారు. మొదట హుజూరాబాద్‌లో అమలు చేసి అంచెలంచెలుగా నాలుగైదు సంవత్సరాల్లో రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. రైతుబంధు పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామన్నారు. అది ఎంతో విజయవంతమైందన్నారు. రైతుబీమాను కరీంనగర్‌లో ప్రారంభించామన్నారు. కరీంనగర్‌ జిల్లా సెంటిమెంటుగా కలిసి వస్తుందనే ఇక్కడ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. 

సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడే దళితపథం ఆలోచించా..

ఈ  పథకాన్ని తాను ఇప్పుడే ఆలోచించలేదని, తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుంచి కూడా దళితులను అభివృద్ధిలోకి తేవాలని సంకల్పంతో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. తన మిత్రుడు దళితుడైన దానయ్యను సిద్ధిపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా చేసినట్లు తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, విజయవంతం చేస్తామన్నారు. కాంట్రాక్టుల్లోను, వ్యాపార లైసెన్సుల్లోను, పరిశ్రమల మంజూరీలోను దళితులకు రిజర్వేషన్లు పెడతామన్నారు. ఎరువుల షాపులు, మెడికల్‌ షాపులు, బార్‌ షాపులు, వైన్‌ షాపులు, రైస్‌ మిల్లులు, దాల్‌ మిల్లులు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే ఇలాంటి వ్యాపార, పారిశ్రామిక లైసెన్సులల్లో దళితులకు ఇంత కోటా ఇవ్వాలని, రిజర్వేషన్లు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనివల్ల వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో దళితులు దూసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఒకే వ్యాపారాన్ని అందరూ పెడితే లాభసాటిగా ఉండదని, వివిధ వ్యాపారాలను ఎంచుకుని మంచిగా వ్యాపారం చేసుకోవాలని కోరారు. ఒక గ్రామంలో అందరూ ట్రాక్టర్లనే కొన్నారనుకోండి, ట్రాక్టర్లు ఎక్కువైపోయి కిరాయలు దొరకడం కష్టంగా మారుతుంది అలా కాకుండా ఒకరు హార్వెస్టర్‌, లేదా ఆయిల్‌ మిల్‌, దాల్‌ మిల్‌, రైస్‌మిల్‌ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. తమకు తాము ఆలోచించుకోగలిగితే వారి ఇష్టప్రకారం వ్యాపారాలు పెట్టుకోవచ్చని, ఆలోచనలు రాని వారికి కలెక్టర్‌ సలహాలు, సూచనలు ఇస్తూ మార్గం చూపిస్తారన్నారు. ఎలాగైనా ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలను వ్యాపారం చేసి ఏడాది నాటికి రూ. 20 లక్షలు చేసి చూపించాలన్నారు. అలా జరిగినప్పుడే దళితబంధు విజయవంతమైనట్లు లెక్క అన్నారు. 

రసమయి తయారుచేసిన క్యాసెట్‌లో గోరేటి ఎంకన్న పాట రాసిండు. అందులో ‘మట్టి నుండి సిరులదీసే మహిమ నీకు ఉన్నది’  ‘పెట్టుబడియే నిను వరిస్తే నీకు ఎదురేమున్నది’ అని రాసాడు. మరో పాటలో సుక్కల ముగ్గేసినట్టు సెల్లెలా.. నువ్వు సక్కంగా కూడబెట్టు సెల్లెలా.. అని రాసారు. మీరు అట్లా కూడబెట్టాలె. అని పిలుపునిచ్చారు. 15 బర్రెలను కొనుక్కొని పాల వ్యాపారం పెట్టుకుంటే రోజుకు 50 లీటర్ల పాలు పోసినా రోజు రూ. 2 వేలు సంపాదించవచ్చని తెలిపారు. ఇలా నెలకు రూ. 60వేలు, సంవత్సరానికి రూ. 7.20 లక్షలు వస్తాయని సీఎం లెక్కలతో సహా వివరించారు.  తమకు సంపాదించే సత్తా ఉందని నిరూపించాలన్నారు. దళితులం దరిద్రులం కాదు.. మేముకూడా ధనవంతులమే.. మాకు ఇన్ని రోజులు అవకాశాలు లేక వెనకబడి ఉన్నాం..ఇప్పుడు మా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వందశాతం గెలిచి చూపిస్తాం అని రుజువు చేయాలని సీఎం దళితులను కోరారు. 

ఇతర కులాల వారికి చేపల పెంపకం, గొర్రెల పెంపకం లాంటి పథకాలు అమలు చేస్తుంటే తమకు ఏవైనా పథకాలు అమలు చేయాలని దళితులు కోరారే తప్ప ఇతరుల సంక్షేమ పథకాలకు వారు ఏనాడు అడ్డు చెప్పలేదని సీఎం అన్నారు. అందుకే తాము దళితులకు ఇస్తున్న రూ. 10 లక్షల విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. వారికి తోచిన పథకాలు ఎంచుకో వచ్చని అన్నారు. అయితే అవి లాభసాటిగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. హైదరాబాద్‌లో ఓజా అనే కులం ఉందని, ఆ కులంలో అంతా కోటీశ్వరులేనని సీఎం తెలిపారు. వారు పరస్పరం సహకరించుకుని ముందుకు సాగారన్నారు. వారి బాటలో దళితులు కూడా ముందుకు సాగాలని, వారికి ఇచ్చిన రూ. 10 లక్షల రూపాయలను ఏడాదిలోగా రూ. 20 లక్షలు చేయాలన్నారు. తాము పెడతామన్న కంపెనీకి డబ్బులు సరిపోకపోతే నలుగురు, అయిదుగురు కలిసి వారి వద్ద ఉన్న పది, పది లక్షలను ఒకచోట వేసి రైస్‌ మిల్లులు, దాల్‌ మిల్లులు పెట్టుకోవచ్చని సూచించారు. ఏ విధంగా అయినా ఆర్థికంగా బాగుపడాలని ఆయన దళితులకు హితవు పలికారు.

ఇక సమాజంలోని ఇతర వర్గాల వారు కూడా దళితులకు చేయూతనిచ్చి వారు అభివృద్ధిలో పయనించే విధంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేను మీకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా దళితులను బాగు చేయడంలో మీరంతా భాగస్వాములు కండి అంటూ, పిలుపు నిచ్చారు. రాష్ట్రం మొత్తంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. వీరందరికీ కూడా దశలవారీగా దళితబంధు అమలు చేస్తామన్నారు. తొలుత నిరుపేదలకు ఇచ్చి అనంతరం మిగతా వారికి కూడా అమలు చేస్తామన్నారు. దళిత      ఉద్యోగస్తులు ఉన్న కుటుంబాలకు చివరన అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందచేశామని, 15 రోజుల్లో 2వేల కోట్లు లబ్ధిదారులకు అందచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ డబ్బులను కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో జమచేస్తామని సీఎం చెప్పారు. దళితులకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల విద్యా, ఉపాధి రంగాల్లో కొన్ని అవకాశాలు కలసివచ్చా యన్నారు. అయినా 95శాతం మంది దళితులు పేదరికం లోనే మగ్గుతున్నారని అన్నారు. అందుకే దళితబంధు పథకం తెచ్చామన్నారు. ఈ పథకం అమలైన కుటుంబాలకు ఇతర పథకాలు కూడా కొనసాగుతాయని, ఏవీ తీసివేయడం జరగదని సీఎం స్పష్టం చేశారు. 

పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు

దళితబంధు అమలు కోసం ప్రత్యేకంగా కమిటీలను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. గ్రామస్థాయిలో వార్డు సభ్యుల నుంచి మంత్రుల వరకు 25వేల మందికి పైగా ప్రజా ప్రతినిధులు ఈ పథకం అమలును పర్యవేక్షిస్తారన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. రాహూల్‌ బొజ్జా అని ఐఏఎస్‌ అధికారి బొజ్జా తారకం కుమారుడని, అతన్ని ఈ పథకం విజయవంతంగా అమలు చేయడానికి నియమిస్తున్నట్లు తెలిపారు. తాను, చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ హెలి కాప్టర్‌లో వచ్చేటప్పుడు ఈ విషయమై చర్చించుకున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకాన్ని అడుగడుగునా పర్యవేక్షిస్తు సరైన అమలు దిశగా ముందుకు సాగుతామన్నారు. 

ఇది ఒక ఉద్యమం

దీనిని ప్రభుత్వ పథకంగా భావించవద్దని ఇది ఒక మహోద్యమమని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ఇది తప్పకుండా విజయం సాధించి తీరుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో కూడా ఎన్నో అనుమానాలు, అపోహలు కల్పించారన్నారు. ప్రజల దీవెనతో ఉద్యమం ఉధృతంగా సాగి తెలంగాణ స్వప్నం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పలు రంగాల్లో అద్బుతమైన విజయాలను సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించే సమయంలో తన మిత్రుడు ఒకరితో మాట్లాడానని, అప్పుడు ఆ మిత్రుడు తనను ఇప్పుడు తెలంగాణ పంచాయతీ ఏం పెట్టుకుంటవన్నాడు, అప్పుడు ఆ మిత్రుడితో తెలంగాణ వస్తె ఎట్లా ఉంటదని అడిగితే బ్రహ్మాండంగా ఉంటదన్నాడు. ఇగ గంతకే ఉండు అని చెప్పిన అన్నారు. ఇప్పుడు కూడా ఈ దళితబంధు పెడుతుంటే పేపర్ల సదివి నాకు ఫోన్‌ చేసిండు నీకు తిన్నదరుగదారా.. మల్లొకటి మొదలు పెట్టినవు అన్నడు. పథకం బాగుందా అని అడిగిన బాగుంది అన్నడు. ఈ పథకం చాలా విజయవంతం అవుతది, భారతదేశానికే కాదు ప్రపంచానికే ఒక మార్గం చూపెడుతది ఈ పథకం నాలుగు సంవత్సరాల్లో ఎలా  ఉండబోతుందో చూద్దువు గానీ నాలుగేండ్లు నువ్వు బతుకు, నేను బతకాలని మొక్కు అన్న అని కేసీఆర్‌ సభకు తెలిపారు. 

చిత్తశుద్ధి ఉంటే విజయవంతమవుతాయి

నాయకుడనే వాడికి వాక్‌శుద్ధి, లక్ష్య శుద్ధి, చిత్తశుద్ధి కావాలన్నారు. ఒక పని సాధించాలంటే ఉడుంపట్టు పట్టాలన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత 24 గంటలు కరంటు ఇస్తమంటే ఎవ్వరూ నమ్మలే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నరన్నాడు. నాడు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి 24 గంటలు కరంట్‌ ఇస్తే మెడలో గులాబికండువా కప్పుకుంటానన్నాడు. కరంటు ఇచ్చినం జానారెడ్డి గులాబి కండువా వేసుకోలేదని అన్నారు. మిషన్‌ భగీరథ మొదలు పెట్టిన నాడు, కాళేశ్వరం కడతామన్న నాడు అయిన నాటికి చూద్దామని గేలి చేశారని, ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీరు వస్తున్నాయని, గోదావరి నీళ్ళు పొలాలల్లో పారుతున్నాయని, ఇది ప్రజలు చూస్తున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు.  తాము ప్రవేశపెడుతున్న పథకాల ఆలోచన గతంలో ఏ ప్రధానికి, ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతావనిలో ఒక్క నాయకుడు కూడా ఈ ఆలోచన ఎందుకు చేయలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. నేను పథకం ప్రకటించిన్నో లేదో కిరికిరి గాళ్ళు ఒకడు కా అంటే మరొకడు కీ అంటూ గోలగోల చేస్తున్నారని విమర్శించారు. దళితులు బాగుపడవద్దనే వాళ్ళ ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. 

పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయి

రాజకీయాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ పథకాలు మాత్రం నిరంతరాయంగా అమలు జరగాలె. నేను పెట్టిన పథకాలు ఎవ్వరూ తీసెయ్యలేరు. నేనుపోయి మరో ముఖ్యమంత్రి వచ్చినా ఈ పథకాలను తీసెయ్యలేడని స్పష్టం చేశారు. అందుకే బలమైన పునాదులను నిర్మిస్తున్నం. చావు అంచులదాకా పోయి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దీన్ని కళకళలాడంగ చూడాలన్నదే బలమైన కాంక్ష అని కేసీఆర్‌ పేర్కొన్నారు. అందుకే మరెక్కడా జరగని ఆవిష్కరణలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు. తాను తెలంగాణ భవన్‌ నిర్మించినపుడు దాని ప్రారంభానికి తమిళనాడు పిఎంకే అధ్యక్షుడు రాందాసు వచ్చి ప్రారంభించారు. అప్పుడు ఈ జాగా ఎంత అని అడిగితే ఎకరం అని చెప్పిన ఎకరం జాగలనే ఇంత మంచిగా భవనం నిర్మించినవు నీకు తెలంగాణ ఇస్తే ఇంకెంత మంచిగ చేస్తువు అన్నాడు. పది సంవత్సరాల తరువాత మళ్ళీ పిలుస్తాసార్‌ రండి వచ్చి చూడండని చెప్పిన అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని, ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ పోతున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నా దళిత జాతిని నూరు శాతం విజయతీరాలవైపు నడిపిస్తానని భరోసా ఇచ్చారు. 

దళిత రక్షణ నిధి

దళితబంధు పథకానికి అనుబంధంగా ‘దళిత రక్షణ నిధి’ పేరిట మరో నిధిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఎవరైనా దురదృష్టవశాత్తు ఇబ్బందులపాలైతే వారికి అండగా నిలవడానికి ఈ నిధి ఉపయోగపడుతుందని తెలిపారు. దళితులకిచ్చే రూ. 10 లక్షల నుంచి రూ. 10వేలు తీస్తామని, అలాగే ప్రభుత్వం నుంచి మరో రూ. 10వేలు కలిపి మొత్తం రూ. 20వేలు చేస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 25వేల దళిత కుటుంబాలు ఉంటే ఈ విధంగా ప్రతి కుటుంబం రూ. 20వేల చొప్పున మొత్తం 50 కోట్ల రూపాయలు జమ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏ కుటుంబంలో ఏదైనా ఆపద వచ్చినా ఈ నిధి ద్వారా ఆదుకుంటారన్నారు. ఇలా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ దళిత రక్షణ నిధి ఏర్పాటవుతుందని సీఎం తెలిపారు. ఇలా పేదరికం మీ దరిదాపుల్లోకి రాకుండా కాపాడుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధిగా ఈ పథకం అమలు చేయబడుతుందని, ఇది విజయవంతమై దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తుందని కేసీఆర్‌ దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

పథకాన్ని విజయవంతం చేస్తాం : సీఎస్‌ హామీ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ మొదట మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో ఈ పథకం విజయవంతానికి కృషి చేస్తారని సభా ముఖంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు హామీ ఇచ్చారు. మా ఉద్యోగులంతా పథకం అమలుకు ఉత్సాహంగా ఉన్నారని, మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అహర్నిశలూ కృషి చేస్తారని అన్నారు. ఇది నూటికి నూరుపాళ్ళు విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

చెక్కుల పంపిణీ

కేసీఆర్‌ ప్రసంగం అనంతరం 15మంది దళిత కుటుంబాలకు సీఎం దళితబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొట్టమొదట చెక్కు అందుకున్న కొత్తూరు రాధమ్మతో కేసీఆర్‌ ముచ్చటించారు. ఈ డబ్బుతో ఏ వ్యాపారం చేస్తావని అడుగగా డైరీఫాం పెట్టుకుంటానని ఆమె సమాధానమిచ్చింది. డైరీఫాం పెట్టి బాగా డబ్బులు సంపాదించాలని, నేను మీ ఇంటికి వచ్చి చాయ్‌ తాగుతానని ఆయన కొత్తూరు రాధమ్మతో అన్నారు. 

నా భార్య ప్రోత్సహించింది

నా భార్య శోభ దళితబంధు పథకం విషయంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించిందని కేసీఆర్‌ తెలిపారు. దళితబంధు ఉద్యమం చేపడుతున్నాను నువ్వు ఏమంటావని ఆమెను అడిగితే, దళితుల పరిస్థితి అన్యాయంగా ఉంది, మీరు ఏదైనా పట్టుదలతో పనిచేస్తారు, ఇది కూడా ముందుకు తీసుకుపోండి విజయం సాధిస్తారని ప్రోత్సాహాన్నిచ్చి పంపిందని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నా భార్య ఉద్యమానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడు మంచిదేనని ఉత్సాహపరిచిందన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దళితబంధు విజయవంతమై తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.

అంబేద్కర్‌, కేసీఆర్‌ చిత్రాలతో ఉన్న చిత్రపటాన్ని బహూకరించిన దళిత ప్రజా ప్రతినిధులు

సభ ముగిసిన అనంతరం సభాస్థలి నుంచి వెనుదిరుగుతున్న కేసీఆర్‌కు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అంబేద్కర్‌, కేసీఆర్‌ చిత్రాలతో ఉన్న చిత్రపటాన్ని బహూకరించారు. అభినవ అంబేద్కర్‌ కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. కాగా సభా ప్రాంగణమంతా ప్రజలతో కిక్కిరిసి పోయింది. కేసీఆర్‌ ప్రసంగం సాగుతున్నంత సేపు ప్రజల నుంచి ఎంతో ఉత్సాహం కనిపించింది. కేసీఆర్‌ ప్రసంగానికి పలుమార్లు కరతాళధ్వనులతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సభ విజయవంతం కావడంతో ప్రభుత్వ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైంది.