గోండుల దండారి పండుగ

By: శ్రీ సుమనస్పతి రెడ్డి

(గత సంచిక తరువాయి)

దివాడి (దీపావళి) కాలంలో వారం, పది రోజులు జరుపుకునే దండారి పండుగ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, దానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర విదర్భ ప్రాంత జిల్లాలల్లో ఉండే గోండు, కొలాం, ఇంకా వారి కథాగాయకులైన పర్ధాన్‌, తోటి జాతుల వారికి ఏడాదిలో వచ్చే అత్యుల్లాసవంతమైన సమయం.

దండారి పండుగకూ, గుసాడి వేషానికీ అవినాభావ సంబంధం!
దండారి పండుగలో జరిగే కార్యక్రమాలను అతి క్లుప్తంగా చెప్పాలంటే ఒక ఊరి కోలాటం ఆడే వారు, గాయకులు, వాయిద్యాలు వాయించే వారు, గుసాడి వేషధారులు, పోరిక్‌లు (అమ్మాయిల వేషధారులు) అంతా మగవారే, ముఖ్యంగా యువకులు, పిల్లలు తమ ఊరి నుండి బయలు దేరి ఒక మిత్ర గ్రామానికి వెళ్లి, ఆ ఊరి స్త్రీ పురుషులందరి ఆదరణభరితమైన ఆహ్వాన సత్కారాలను పొంది, తమ దరువులు, నృత్యాలు, పాటలు, హాస్య ప్రదర్శనలతో వారిని ఓలలాడిరచి, ఆ ఊరి వారి సంగీత, నృత్య ప్రదర్శనలను కూడా చూసి, విందులారగించి మళ్లీ తమ ఊరికి తిరిగి రావడం. ఇట్లా రెండు మూడు గ్రామాలకు పోవడం, రెండు మూడు గ్రామాల వారు మన ఊరికి రావడం జరుగుతుంది వారం రోజుల్లో. ఆడవాళ్ల దండారి సంప్రదాయం కూడా ఉంది కొన్ని గ్రామాల మధ్య.

మరి గోండులకు ఈ గొప్ప పర్వసమయం ఎట్లా వచ్చింది అంటే దాన్ని వివరించే ఎంతో ఆసక్తికరమైన, వారి స్వంత పౌరాణిక గాథలు ఉన్నాయి.

ఒక కథ ప్రకారం ఆది గోండులను నాలుగు గోత్రాల వారిగా పహండి కుపార్‌ లింగు అనే గురువు స్థిరంగా ఏర్పఱచిన కొంత కాలం తరువాత ‘‘మన జీవితాల్లో ఇప్పుడు సిరి సంపదలకు కొదవ లేదు. కాని అంతా స్తబ్ధుగా, వెలితిగా ఉంది. ఈ లోపం తీర్చే ఆటా పాటా వినోదాలూ మనకు లేవు. ఎవరు తీసుకు రాగలరో?’’ అని తర్కిస్తున్న సందర్భంలో అందరిలో చిన్న వాడైన కొట్క పిట్టె జుంగాల్‌ రావుడ్‌ తాను ప్రయత్నిస్తానని చెప్పి, గోదావరీ తీరంలో ఇప్పటి దండేపల్లి మండలం గుడిరేవు వద్ద ఉన్న పద్మల్‌ పురి కాకో (కాకో అంటే అమ్మమ్మ) దగ్గరికి వెళ్లి మార్గం చెప్పమని కోరుతాడు. ‘‘సముద్రాల అవతల సింగార్‌ దీప్‌ (ద్వీపం)లో జల గురువు బిడ్డ యేత్మసూర్‌కు ఆట బాగా తెలుసు. ఆమెను వెతికి కనుక్కో!’’ అని కాకో చెప్తుంది. రావుడ్‌ పడవ మీద ప్రయాణం చేస్తూ, సముద్రాలు వెతకగా వెతకగా, తలపై కంకాలీ కిరీటము, మెడకు రుద్రాక్షలు, నడుముకు వడ్డాణం, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం రోకలి (దుడ్డు) ధరించి, నీటిపై మనోహర నృత్యం చేస్తూ యేత్మసూర్‌ కనిపిస్తుంది. ఆమె నృత్యాన్ని దగ్గరి నుండి చూద్దామని రావుడ్‌ ఊర పిచ్చుక రూపం ఎత్తి ఆమె కిరీటం పైన వెళ్లి కూర్చుంటాడు. నృత్యం చేసి అలసిపోయిన యేత్మసూర్‌ కు నీటిలోకి తొంగి చూసినప్పుడు పిచ్చుక కనిపించి ఆశ్చర్యపోతుంది. తనతో పాటు నృత్యం చేయమంటుంది. అతని నృత్య చాతుర్యానికి అచ్చెరు వొంది అతనితో కలియుగ భూలోకానికి రావడానికి ఒప్పుకుంటుంది. కాని తిరిగి వెళ్లడానికి రావుడ్‌ మళ్లీ మానవ రూపం తీసుకునే సరికి, ఆమె తన ఆలోచన మార్చుకొని, రావుడ్‌కు తన ఆభరణాలు అన్నీ ఇచ్చి వాటిని ఊరూరా యేత్మసూర్‌గా స్థాపించుకొని సంగీత నృత్యాలతో ఉత్సవాలు చేసుకోమని చెప్తుంది. అట్లా యేత్మసూర్‌ అనే దేవతా స్త్రీ ఇచ్చిన ఆభరణాలతో పురుషులు ధరించే గుసాడి వేషం ఏర్పడింది. తరువాత పహండి కుపార్‌ లింగు నేతృత్వంలో దండారి సమయంలో మాత్రమే వాడే గుమేలా, పర్ర అనే వాయిద్యాలు, కొహడల్‌ (దేవతా ముఖాకృతి కవచం), టప్పాల్‌ (పులి ముఖాకృతి కవచం)లను నాలుగు గోత్రాల వారికి ఇవ్వడంతో దండారి యేత్మసూర్‌ లేక ‘ఆకడ’ దేవత పూర్తి అవుతుంది. ఆ తరువాత నాలుగు గోత్రాల వారు ఒకరి తరువాత ఒకరు తమ దండారి బృందాలతో పద్మల్‌ పురి కాకో దగ్గరికి బయలు దేరి వెళ్తారు. దుందె రావుడ్‌ గుసాడి నృత్యానికి మోహితురాలైన కాకో మనుమరాలు మాడ్కో అతన్ని వరించి వివాహం చేసుకోవడంతో గోండుల చరిత్రలో మొదటి పెండ్లి జరుగుతుంది.

ఇదే కథ, మరో రూపంలో, యేత్మసూర్‌ దగ్గరికి వెళ్లి వచ్చిన దుందె రావుడ్‌ (జుంగాల్‌ రావుడ్‌ అన్న) తనను తాను తన జాతి కోసం బలిదానం చేసుకుంటూ తన శరీరం వివిధ భాగాలను గుమేలా (మెడ నుండి), పర్ర(పొట్ట), గంగారాం సోట / రోకలి (కాళ్లు), కోలలు (చేతి వేళ్లు), కొహడాల్‌ (ముఖం), టప్పాల్‌ (చేతులు) తయారీకి, దండారి మొదలవడానిక బలిదానంగా సమర్పించుకుంటాడు. మరో కథలో జటాశంకర్‌ వ్యాస్‌ అనే గొప్ప తపస్వి అయిన గురువుకు దేవలోకంలో ఇంద్రుడి ఆస్థానంలోని నర్తకి ఊర్వశితో జరిగిన వివాహోత్సవంలోని అద్భుతమైన సంగీత, నృత్య హేలలు, సుగంధ, పరిమళ, భోజన వైభోగాలను చూసిన ఆది గోండులు (వారే గోండుల ముఖ్య దైవాలైనారు) తమకు కూడ ఆ ఉత్సవ వైభవం కావాలని కోరినప్పుడు ఆయన తన అలంకృత రూపాన్నీ (కిరీటం, గడ్డం, మాలలు, పులి చర్మం, జోలె, గజ్జెలు, బూడిదతో శరీర అలంకరణలు వగైరా), సంగీత వాయిద్యాలనూ దుందె రావుడ్‌ కు ఇచ్చి గుసాడి నృత్యాన్ని నేర్పి, ఊర్వశి చెల్లెలు యేత్మసూర్‌ దేవతను తెచ్చుకొని కోలాటం నృత్యాలతో దండారి పండుగను రూపొందించు కోమంటాడు. భూలోకానికి వచ్చిన నాలుగు గోత్రాల ఆది గోండులు బిరుద్‌ పంక్‌ మహాబాగ్‌ గురువు సహాయంతో ఓం గురువు చిన్న కూతురైన యేత్మసూర్‌ ను అడిగి తెచ్చుకొని గుసాడి వేషానికి జోడుగా ఉండే కోలాటం నృత్యాలను సృష్టించుకుంటారు.

పూర్వం అందరికీ తెలిసిన, ఇవ్వాళ దాదాపు ఎవరికీ తెలియకుండా పోయిన ఇటువంటి ఐదారు మూల కథలను కలిపి చూసి విశ్లేషిస్తే గాని దండారి పండుగలోని వరుస ఆచారాలు, తంతులు, అనేకమైన సంగీత గాన నృత్య విన్యాసాలలో దాగి ఉన్నవిలువైన గూఢార్థాలు, సూచ్యార్థాలు (symbolic meanings) వాచ్యంగా బోధ పడవు.

ఈ నేపథ్యంలో దండారి పందుగలోని ఇతర అంశాలను వదలి కేవలం గుసాడి నృత్యాన్ని, ఆ వేషం ప్రాధాన్యాన్ని మనం ఎలా చూడాలి? గోండు సమాజంలోకి వారి ఆదిమ కాలంలో కాళీగా, నిశ్శబ్దంగా సంబురమేమీ లేని కాలంలో సమ్మోహకమైన సంగీత, నృత్య సందోహాన్నీ, మైమరపించే సౌందర్యాన్నీ తెచ్చి, ఇంకా కేవలం మగవారే ఉన్న కూటముల్లోకి, అమ్మాయిలను పెళ్లి చేసుకొని తెచ్చుకొని కుటుంబాలూ, చుట్టరికాలూ, గ్రామాలూ, విస్తృత ఆవాస ప్రాంతాలూ, ఒక విశిష్ట సంస్కృతినీ పెంపొందించుకున్న ప్రాచీన, పౌరాణిక ప్రస్థానాన్ని గుర్తుకు తెచ్చి, దానినే ఏడాదికేడాది రెండూర్లమధ్య చుట్టరికపు పిలుపులూ, ప్రయాణాలూ, ఆతిథ్య వినోదాల ఒక ఉల్లాసకరమైన సంబురంగా చేసేలా చేస్తూ, తోడుగా తానూ ఉంటూ, ఆదివాసీ గూడాల మధ్య ప్రేమలనూ,పరస్పర మర్యాదలనూ పెంచీ, భద్రతనూ, నమ్మకాన్నీ ఇచ్చే ఒక సమగ్ర ఆనంద దేవతా స్వరూపంగా గుసాడి వేషాన్ని చూడాలి.

ఈ కోణాలన్నీ కూడా ఆదివాసీ గ్రామాల్లో సంప్రదాయ దండారి పండుగ సమయంలో గుసాడీలు చేసే నృత్యాల్లోనూ, ఇతర విన్యాసాల్లోనూ జాగ్రత్తగా చూస్తే గమనించవచ్చు. ఉదాహరణకు దండారి నృత్యాలు జరిగే గుండ్రని స్థలంలో మధ్యలో ఆడుతూ పాడుతున్న వారి చుట్టూ గుసాడీల బృందం ఎప్పుడూ ఒక రక్షణ వలయంలా ఆడుతూ తిరుగుతుంది. నటరాజ స్వరూపంతో పోల్చదగిన లాస్య గాంభీర్యం గుసాడి అడుగుల్లోనూ, శరీర విన్యాసంలోనూ కనిపిస్తుంది. దండారి స్థలంలోకి గుసాడీల ప్రవేశం, చివరన వెళ్లి పోవడం కూడా విడిగా, చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. గుసాడీల కాళ్లు కడిగి ఆరతులు పట్టి, వారి చేతుల్లోని రోకళ్లకు కుంకుమ బొట్లు పెట్టి భక్తితో పూజించడం, రోగాలు, కష్టాలకు వారి రోకలి లేక చేతిలో ధరించిన తోలు ఆశీర్వాదం కోరడం, వారి పలకరింపులకు ఆనందించడం, వారి పరాచికాలు, అల్లరిని భరించడంలో, వారిని ‘డగుర్‌ గురు’ (పెద్ద గురువు)గా భావించడం కనిపిస్తుంది.

గుసాడి వేషం ఒక వారం రోజుల కఠిన దీక్ష. ఆ వారంలో కాలకృత్యాలకు కూడా నీటిని వాడకూడదు. గుసాడి వేషానికే ప్రతీక వంటి చేతి రోకలిని దాదాపు ఎప్పుడూ వదలి ఉండకూడదు. గుసాడీలు, పోరిక్‌లు కలిసి ఒక కూటమిలా స్నేహ భావంతో గడపాలి, ఒకే కంచంలో తినాలి.